ఉద్దవుని ఉపదేశం విని గోపికలు హేళనగా నవ్వినారు. "కృష్ణుడు సర్వత్ర ఉన్నాడని మాకు చెపుతున్నావుగాని, మొదట నీవు అనుభవిస్తున్నావా? నీవు మాత్రం సగుణ సాకార స్వరూపుడైన కృష్ణుని సామీప్యాన్ని తనివితీర అనుభవిస్తూ మాకు నిర్గుణ నిరాకార తత్త్వాన్ని బోధిస్తున్నావు. నీవు చెప్పేదంతా అనుకూల వేదాంతమే గాని, అనుభూతికి సంబంధించినది కాదు. నీ వేదాంతము మాకు అక్కర్లేదు. ప్రత్యక్ష దైవమైన కృష్ణుడ్డి మాకు చూపించు, చాలు" అన్నారు. అయితే, వారు ఉద్ధవునివైపు చూడటం లేదు, అతనితో నేరుగా మాట్లాడటం లేదు. వారి హృదయాలు కృష్ణునికి ఏనాడో అర్పితమైపోయాయి. పరపురుషుల్లో కన్నెత్తి చూడటంగాని. అతనితో మాట్లాడటంగాని వారికి ఇష్టం లేదు. కనుక, ఒక తుమ్మెదను మధ్యవర్తిగా పెట్టుకుని, ఆతుమ్మెదను సంబోధిస్తూ మాట్లాడుతున్నారు. "కృష్ణుడు మా హృదయాలను అపహరించాడు. మాకున్నది ఒకే మనస్సు, అది కృష్ణునితోపాటు ఏనాడో మధురకు వెళ్ళిపోయింది. ఇప్పుడు నీ ఉపదేశాన్ని వినడానికి మావద్ద మరొక మనస్సు లేదు. మా కన్నులకు కృష్ణుని రూపం కనిపిస్తే చాలు; మా కర్ణములకు కృష్ణుని మురళీ నాదం వినిపిస్తే చాలు. కృష్ణునికోసం ఏడ్చి ఏడ్చి మా కన్నులు కాయలు కాసినవి: మాహృదయాలలోని నీరు ఇంకిపోయినది. నీరు లేని మా హృదయాలలో కృష్ణుని సందేశమనే పడవను ఎలా నడవడానికి వీలవుతుంది? ఇసుకలో పడవను నడపగలవా? కనుక, నీ పడవను తీసుకుని వచ్చినదారినే తిరిగి వెళ్ళు. మాకు నిరాకార నిర్గుణ బ్రహ్మం అక్కర్లేదు. సగుణ సాకార బ్రహ్మమే మాకు కావాలి" అన్నారు. అప్పుడు ఉద్ధవుడు తెలివి తెచ్చుకొని "నేను గొప్ప జ్ఞానినని భావించాను. కాని, నేను పరమ అజ్ఞానిని" అని అనుకొని, "గోపికలారా! దీన్ని మీరు చదవండి. అంతేచాలు" అని కృష్ణుడు ఇచ్చిన లేఖను వారికి ఇవ్వబోయాడు. కాని, వారు దానిని స్వీకరించక "అయ్యా! మేమున్నది పట్టణంలో కాదు. కుగ్రామంలో నివసిస్తున్నాము. కనుక, మాకు అక్షర జ్ఞానం లేదు. మా జీవితమంతా అక్షర స్వరూపుడైన కృష్ణ పరమాత్మకు అంకితమైపోయింది. అక్షర జ్ఞానమే లేనివారము ఈ లేఖను ఏరీతిగా చదవగలము? కాబట్టి, ఈ లేఖ మాకు అక్కర్లేదు" అన్నారు. "ఇదేమి ఈ గోపికలు కృష్ణుని లేఖను కూడా తిరస్కరిస్తున్నారే!" అని ఉద్ధవునికి కొంత ఉద్రేకం కల్గింది. అది గుర్తించిన గోపికలు "అయ్యా! మేము కృష్ణుని లేఖ వద్దన్నది, దానిని చదవడం ఇష్టం లేక కాదు. మాకు చదువు రాదు. ఒకవేళ అంతో ఇంతో అక్షరజ్ఞానం కలిగినవారు మాలో ఉన్నప్పటికీ, మేము కృష్ణుని లేఖను చదవలేము. ఎందుకంటే, ఆ లేఖను చూసినప్పుడు మేము కన్నీరు ఆపుకోలేము. మాకన్నీరు ఆ లేఖపై పడి అందులోని అక్షరములు చెదరిపోవచ్చును అంతేకాదు, కృష్ణ వియోగంచేత మా హృదయం దగ్ధమైపోతున్నది: మా శరీరం వేడెక్కిపోయింది. కనుక, మా హస్తములలో ఆ లేఖను ముట్టుకుంటే అది భస్మమైపోవచ్చును. నీవు మా అవస్థను అర్థం చేసుకోలేక పోతున్నావు" అన్నారు. అక్కడున్న తుమ్మెదను సంబోధిస్తూ వారు కృష్ణునికి ఒక సందేశాన్ని పంపారు.
"తుమ్మెదా! ఒకసారి కన్నెత్తి చూడమని
చెప్పవే మా మాట శ్రీ కృష్ణునకు
మబ్బు గ్రమ్మిన మాదు మానస వీధిలో
కృష్ణభానుని తేజము నిలుపుమనుము
ఎండబారిన మాదు జీవిత వృక్షమునకు
చెదరిపోయిన మాదు జీవిత సుమమాల
చెల్వా ర కూర్చి ధరియించమనవే"
చివరికి రాధిక ప్రార్థించింది: "కృష్ణా! నీ చింతనలో మేము మరణిస్తాం. అయితే, నీవు ధర్మసంస్థాపనకై తిరిగి ఈ లోకంలో అవతరించినప్పుడు మమ్మల్ని కూడా నీవెంట తీసుకొనిరా!"
"వృక్షంబువై నీవు వర్ధిల్లుచుండిన
వల్లికనై నేను అల్లుకొందు
పుష్పంబువై నీవు పాలు పొందుచుండిన
తుమ్మెదనై నేను తిరుగుచుందు
అనంతమైనట్టి ఆకాశ మీవైన
చిన్ని చుక్కగ నేను చెలగుచుందు
నిండు సముద్రుడే నీవయి యుండిన
వాహినియై నేను ఐక్యమగుదు
మేరు పర్వత భవ్య మేదిని నీవైన
సెలయేటినై నేను చెలగుచుందు"
ఇదే నిజమైన భక్తి. వ్యష్టి సమిష్టియొక్క ఏకత్వాన్ని గుర్తించమని బోధిస్తున్నది వేదాంతము. వ్యక్తి జీవత్వము, సమిష్టి - దైవత్వము. అందరియందు దైవత్వమున్నదనే విశ్వాసాన్ని పెంచుకోవాలి. అంతా దైవస్వరూపమే. గోపికలు చెప్పారు - "ఉద్ధవా! నేను. "నేను" అని నీవు పలుకుతున్నావు. ఈ నేను అనే భావం నీలో ఉన్నంత వరకు నీకు దైవత్వం ప్రాప్తించదు. మాకు నేను అనే భావమే లేదు. నేను అనేది ఉన్నప్పుడు "నీవు అనేది బయలుదేరుతుంది. నేను , నీవు అనే భేదం ఉన్నచోట ప్రపంచమంతా చేరిపోతుంది. కనుక, మాకు అనేకత్వము అక్కర్లేదు, ఏకత్వమే కావాలి. అదే సత్యము, నిత్యము",
(స.సా.జూ.. 2000 పు. 10/12)
(చూ: అన్యభావనలేని భక్తి, భాగవతము)