ఈనాడు నరక చతుర్దశి, దుఃఖముతో కూడినటువంటి దానిని నరకమంటారు. న... ర.. క.. "క" ఇది దుర్గణములకు లక్షణము. నరకు అనగా దుర్గుణములతో కూడిన నరత్వము అని, నరకమునకు గొని పోయే మానవత్వము అని, అలాంటి దానిని ఏవిధంగా సాధించాడు కృష్ణుడు? అసలు కృష్ణుడనగా ఎవరు? దేవకీ దేవుని కుమారుడని, యశోద కుమారుడని భావిస్తున్నాం ఇదికాదు. "కర్షతీతికృష్ణః" అనగా ఆకర్షించే టటువంటి దివ్యత్వం! అట్టి ఆకర్షించేటటువంటి దివ్యత్వం ఏమిటి? అదియే Magnet (ఆయస్కాంతం) మాగ్నెట్ అంటే ఏమిటి? ఆది పరిశుద్ధమైనటువంటి శక్తి, తేజస్సు. అదియే శక్తి తరంగములు. అట్టి శక్తి తరంగములు సర్వత్రా వ్యాపించి ఉంటున్నాయి కనుక అట్టి Vibration (కంపనము) యే నిజమైనటువంటి కృష్ణతత్వము. ఆ వైబ్రేషన్ యే ప్రాణ సమానం. ఆ ప్రాణ సమానమైనటువంటి వైబ్రేషన్ దివ్యత్వమునకు కళంకం కలగకుండా చూస్తుంది. అదియే ప్రజ్ఞానం బ్రహ్మ ఆదియే రేడియేషన్ (ప్రకాశం) ఆ రేడియేషన్, వైబ్రేషన్ రెండూ చేర్చి ఈ దేహమును కదిలింపజేసి, పోషింపజేసి, ఈ దేహమును జగత్తులో నివసింపజేస్తుండాలి. ఇదియే "ఓం భూ ర్భు వః స్సుః" " ఇదియే గాయత్రీ మంత్రమునందు ఉండిన అంతరార్థము. కనుక మనయందు ఈ వైబ్రేషన్, ఈ రేడియోషన్ ఈ మెటిరియలైజేషన్ - ఈ మూడు ఏకమైనటువంటి జీవితమే మానవ జీవితము. కనుక మనలో నున్నటువంటి దురణములు, దురాలోచనలు, దుశ్చింతనలు అనేటటువంటి ఈ నరకాసురుని చంపాలి. ఈ దుర్గుణాలను చంపడానికి కృష్ణుడు సత్యభామను సహాయం తీసుకున్నాడు. సత్యభామ అంటే ఏమిటి? భామ అనగా, భరించేటటువంటిది. సత్యముతో భరించేటటువంటిది. కనుక సత్యమును ఆధారం చేసుకొని ఈ దుర్గు ణములను హతమర్చాడు శ్రీకృష్ణుడు. సత్యమును ఆధారము చేసుకొని అసత్యము, అనిత్యమై నటువంటి దుర్గుణములను నిర్మూలనం చేశాడు. కనుక మనం ఈనాడు సత్యమును ఆధారం చేసుకోవాలి. "సత్యం నాస్తిపరో ధర్మః". ఈ సత్యము కేవలం ఒక రాష్ట్రమునకు, ఒక దేశమునకు, ఒక వ్యక్తికి మాత్రమే సంబంధించినటువంటిది కాదు. సర్వులకూ సంబంధించి నటువంటిది, కాలాతీతమైనటువంటిది సత్యం. సత్యము పైననే ఈ జగత్తు ఆధారపడి ఉన్నది. కనుక సత్యమే దైవము (Truth is God) కనుక సత్యమార్గమునే అనుసరించు సత్యమును పలుకు, అదియే నీ ప్రధానమైన సాధన.
రాక్షసగుణములను ఈనాడు మనం నిర్మూలనం గావించాలి. దైవచింతన చేసి, మనలోనున్న దుర్గుణములను దూరం గావించుకొని నేను మానవుడననే సత్యాన్ని నిలపాలి. అంతేగాని మానవజన్మ ఎత్తి, పశుపక్ష్య మృగాదులవలె జీవించటం కాదు. ఎంత సంపాదించినా, మనం ఏమి తీసుకొని వెళుతున్నాం? కీర్తి అనే ఒక దానినే మనం సంపాదించాలి మంచివాడు అనే పేరును సంపాదించాలి. ఆ ఒక్క పేరు మాత్రమే శాశ్వతంగా నిలిచిపోతుంది. కనుక ధర్మము, కీర్తి - ఈ రెండింటిని కాపాడుకునే నిమిత్తం మన జీవితంలో ప్రతిక్షణమునూ వినియోగించుకోవాలి. కనుక ఈ సత్యమార్గంలో ప్రవేశించి, దుర్గుణములను దూరం గావించిన దినమే ఈ నరకచతుర్దశి.
ఈనాడు దీపావళి... దీపావళి.. అని పటాసులు కొట్టి, శబ్దాలు వాయించి, మతాబులు కాల్చి ఆనందాన్ని అనుభవిస్తున్నాం. ఆనాటి దేవతలు ఏవిధంగా అనుభవించారంటే దుర్మార్గుడైన నరకాసురుని హతం చేయటం చేతనే, ఈనాడు చాలా ఆనందమని భావించి, మందు సామానులు కాల్చి ఆనందంతో ఉప్పొంగి పోయారు. ఇంతియేగాక ఈ పటాసులు కొట్టటంలో కూడా మరొక అర్థం ఉన్నది. ఇప్పుడు వర్షాకాలం అనేక విష క్రిములు అభివృద్ధి అవుతుంటాయి ఈ మతాబుల వాసన చేత విషక్రిములు నశించిపోతాయి. వ్యాపించే రోగములు నివారణ అయిపోతాయి. ఆనందాన్ని కూడా కలుగజేస్తాయి. కేవలం మతాబులు కాల్చి ఆనందించడం కాదు. మనలోనున్న దుర్గుణాలు పోవాలి. అప్పుడు సహజంగా మనకు ఆనందం ప్రాప్తిస్తుంది. అటులకాకుండా దుర్గుణాలు లోపల పెట్టుకొని, ఎన్ని విధములైన సాధనలు చేసినా ప్రయోజనం లేదు. మొట్ట మొదట ఆ దుర్గుణాలను దూరం చేయాలి. అది చేయటానికి దైవచింతన కావాలి. ఆ దైవచింతన చేయాలి. వినాలి. అనుభవించాలి కనుక శ్రవణం చేయండి! భజనలు చేయండి!మననం చేయండి!
(శ్రీన.95 పు.77/78)