ప్రేమస్వరూపులారా! నిన్నటి దినము మీరు డ్రామాలో చూశారు - భస్మాసురుడు తాను చేయి పెట్టిందల్లా భస్మమై పోవాలని ఆశించాడు. కానీ, కట్టకడపటికి ఏమైంది? తన హస్తం తననే భస్మం చేసింది. అదేరీతిగా, ఎవరి దుర్గుణాలు వారినే బాధిస్తాయి; భస్మం చేస్తాయి. కనుక, మీరు పరులలోని దుర్గుణాలను గురించి యోచించకూడదు. పరులను దూషించేవాడు పాపి; పరులను గౌరవించేవాడే పుణ్యుడు. "సర్వ జీవ నమస్కారం కేశవం ప్రతి గచ్ఛతి". అట్లే, “సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి," ఎవరిని విమర్శించినా మీ దేవుల్లో మీరు విమర్శించినట్లే; ఎవరిని గౌరవించినా మీ దేవుణ్ణి మీరు గౌరవించినట్లే. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు, దేహమే దేవాలయం, జీవుడే ఇందులోని దేవుడు. కనుక, మానపుడు ఏదేహాన్ని చూసినా దేవాలయాన్ని చూసినట్లుగా భావించి గౌరవించాలి. అప్పుడే తన జీవితం సార్థకమౌతుంది. ఇతరులు కూడా తనను గౌరవిస్తారు. కాని, ఈ నాటి మానవునిలో అట్టి విశాల భావాలు అడుగంటి పోయాయి. తాను ఇతరులను గౌరవించడుగాని, తనను అందరూ గౌరవించాలని ఆశిస్తున్నాడు. ఇది అసాధ్యం.
(స. సా. అ. 2000 పు.299/300)
దయ్యంగాని భూతంగాని ఈ జగత్తులో సృష్టింపబడలేదు. వీటిని మానవుడు తనకు తానే సృష్టించుకొంటున్నాడు. దీనికి ఒక చిన్న ఉదాహరణ: పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో కృష్ణుడొకనాడు వారి యొక్క స్థితిగతులను గురించి, యోగక్షేమాలను గురించి తెలుసుకోవాలని అరణ్యానికి వెళ్ళి వారిలో ఒక రాత్రి గడిపాడు. పాండవులు తమమధ్య పాంచాలి కూడా ఉండడంచేత ఆమెను సంరక్షించే నిమిత్తమై ప్రతి రాత్రి ఒక్కొక్కరు ఒక్కొక్క గంటసేపు తాము ఉన్నటువంటి పర్ణశాల చుట్టూ పహారా చేస్తూ వచ్చారు. మాటల సందర్భంలో కృష్ణుడు ధర్మరాజుని ద్వారా ఈ విషయం తెలుసుకొని "బావా! ఈ రాత్రి నాకు కూడా ఒక గంట సేపు ఈ డ్యూటీ చేసే అవకాశం ఇస్తావా? అని ఆడిగాడు. ధర్మరాజు నవ్వుతూ "కృష్ణా! సర్వ లోకములను రక్షించే మీకు ఈ విధమైన వాంఛ ఎందుకు కల్గిందో నాకు అర్థం కావటం లేదు. పైగా, ఈ అడవిలో ఒక భయంకరమైన దయ్యం ఉన్నది. దానిని ప్రతి రాత్రి నేను చూస్తున్నాను. నా సోదరులు కూడా చూస్తున్నారు. అది మాతో యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నది. మీరు గనుక వెళ్ళినట్లుయితే అది మిమ్మల్ని కూడా బాధించవచ్చు. మీరు మా యోగక్షేమాలను చూసే నిమిత్తమై ఇక్కడకు వచ్చారు. కాబట్టి మీరు క్షేమంగా, ఆనందంగా నిద్రించండి" అని కోరాడు. అప్పుడు కృష్ణుడు "ధర్మజా! ఇంతకాలమైనప్పటికీ నన్ను ఇంత మాత్రమేనా తెలుసు కున్నావు! ఒకవైపున నన్ను నేను రక్షించుకోలేనటువంటి అబలునిగా భావిస్తున్నావు. ఆ దయ్యం నన్ను ఏవిధమైన బాధలకు గురి చేస్తుందో అని భయపడుతున్నావు. ఏ దయ్యంగాని, ఏభూతంగాని నన్నేమీ చేయలేవు. కనుక మీరందరూ చేస్తున్నట్లుగా ఈ పర్ణశాలను సంరక్షించడానికి నేను కూడా ఒక గంట డ్యూటీ తీసుకుంటాను" అన్నాడు. సరే, కృష్ణునికి కూడా డ్యూటీ ఇచ్చారు. కృష్ణుడు ఆ ఒక్క గంట పర్ణశాల చుట్టూ తిరిగాడు. తరువాత అర్జునునివంతు వచ్చింది. కృష్ణుణ్ణి ఆ దయ్యం ఎన్ని బాధలు పెట్టిందో ఏమిటో అని భయపడుతూ అర్జునుడు కృష్ణుని వద్దకు పరుగెత్తుకొని వెళ్ళాడు. కానీ కృష్ణునికి ఏ బాధలూ లేవు: ఒక రాతి పైన కూర్చొని చిరునవ్వులు చిందిస్తూ కనిపించాడు. అర్జునుడు పరుగెత్తుకొని పోయి కృష్ణుని పాదాలపై పడి. "స్వామీ! ఆ దయ్యం మిమ్మల్ని ఎంత బాధ పెట్టిందో ఏమిటో! అయితే దానిని మీరు హతమార్చినారు కాబోలు కనుకనే ఇంత సంతోషంగా కనిపిస్తున్నారు" అన్నాడు. అప్పుడు కృష్ణుడు "అర్జునా ! నా సృష్టిలో దయ్యాలు, భూతాలనేవి లేవు. వాటిని నేను సృష్టించలేదు. సృష్టిలోనే లేని దయ్యం ఈ అడవిలో ఏవిధంగా ప్రవేశించగలదు? ప్రతి రాత్రి మీకు కనిపించేది దయ్యం కాదు. మీయందున్న క్రోథమే మీకొక దయ్యంగా కనిపిస్తున్నది. దానిని చూసి మీ క్రోధం మరింత పెరిగిపోతున్నది. మీ క్రోధం బలపడే కొలది ఆ దయ్యం కూడా తన స్వరూపాన్ని పెంచుకొంటున్నది" అన్నాడు. మానవునియందున్నటువంటి దుర్గుణములు, దురాచారములు దుర్భావములే దయ్యము, పిశాచము వంటి రూపాలను ధరించి మానవుణ్ణి బాధ పెడుతున్నాయి, భక్షిస్తున్నాయి. ఇవన్ని ఇమేజినేషనే. నా సృష్టియందే ఈ దయ్యాలు, భూతాలు లేవు. ఇవన్నీ మీ భావములు సృష్టించుకొన్న స్వరూపములే" అన్నాడు కృష్ణుడు. ఆ మాటలచేత అర్జునుడు చక్కగా ధైర్యం తెచ్చుకున్నాడు. ఈ తరువాత అతనికి ఎక్కడా ఏ దయ్యమూ కనిపించలేదు. "కృష్ణా! ఈ దయ్యాలు, భూతాలు మా భావాల యొక్క ప్రతిబింబాలేనన్న సత్యాన్ని మాకు ప్రబోధించే నిమిత్తమే మీ రీనాడు మావద్దకు వచ్చారు. ధన్యులం, ధన్యులం" అని కృష్ణుని పాదాలకు నమస్కరించాడు.
(స.సామా 99 పు57/58)
మనుజుడైన వాడు, మంచిగా తనలోని
దుర్గుణములు మొదట త్రుంచవలయు !
పశుగుణంబులు వీడి, పశుపతి కావలె
సత్యమైన బాట సాయి మాట.
(సా. పు. 583)
(చూ॥ ధనము, భగవదన్వేషణ, రావణుడు)