పదహారు కళలు మనము ఎక్కడో సంపాదించేవి కావు. పంచభూతాలు, పంచ ప్రాణాలు, పంచజ్ఞానేంద్రియాలు, మనస్సు. వీటన్నింటిని కలిపితే మొత్తం పదహారు కళలవుతాయి. ప్రతిమానవుని యందు ఈ పదహారు కళలు నిండియున్నవి. ఈ షోడశ కళలను పరిపూర్ణంగా అనుభవించి, పరిపూర్ణమార్గములో ప్రవేశపెట్టి, పరిపూర్ణత్వమును పొందిన వాడే "పురుషోత్తముడ”ని పిలువబడతాడు. దేహమును ఆధారముగా చేసికొని వ్యక్తిత్వాన్ని అనుభవిస్తూ, ఈ దేహమనే పురమునందు నఖశిఖ పర్యంతం సంచరించే చైతన్యశక్తికే "పురుషుడు"ని పేరు; సమిష్టిస్వరూపములోపల సమత్వంగా ప్రకాశించి, జగత్తునందు ప్రకటింపబడే దివ్యశక్తికే "పురుషోత్తముడ”నిపేరు. అనగా, వ్యష్టిస్వరూపుడు పురుషుడు; సమిష్టిస్వరూపుడు పురుషోత్తముడు.
(స.పా.ఆ.91.పు.274)
పురుషుడు ఈ శరీరము నందే హృదయాకాశమున నున్నాడు. అతనివలననే షోడశకళలుత్పన్నములగుచున్నవి. అతనియందే లయమగుచున్నవి. మైలురాళ్ళవలె ప్రధానముగా గాన్పించు పృథివి, ఓషధులు, అన్నము, పురుషుడను నాలుగు తత్త్వములు వరుసన నొకదాని నుండి మరియొకటి యుత్పన్నమగువట్లు తైత్తరీయ ద్వితీయాను వాకమున బేర్కొనబడినది. ఓషదాది పురుషాన్తమగు సృష్టి ప్రక్రియ ఇచట స్పష్టముగా కనుపించక పోయినను పురుషావయములగు జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ సృష్టి చెప్పబడుటచే తదంగమగు పురుషుని సృష్టికూడా చెప్పినట్లే అగును. నదులన్నియు సముద్రములోనికి ప్రవహించి తమ తమ రూప నామములను గోల్పోవుచున్నవి. సముద్రమున ప్రవేశించిన నదులన్నియూ సముద్ర మనియే పిలువబడుచున్నవి. పురుషుడొక్కడు మాత్రము సముద్రమువలె మిగులుచున్నాడు. అతడు సర్వ కళావిహితు డు, మృత్యురహితుడు అయి యున్నాడు. వేద్యమగు పరబ్రహ్మమును గూర్చి నాకింతవరకు తెలుసును. ఇంతకంటే వేరేమియు లేదు."
(ఉ.వా.పు.47/48)
పురుషుడన్నను, క్షేత్రజ్ఞుడన్న చేయమన్నను,వక్కటియే. పురుషుడనగా జీవుడని, ప్రకృతి అనగా దేహమనియు నెరుంగుము. పురుషుడనగా ఆ దేహమును తెలుసు కొనువాడు. ఈ దేహమునకే అనేక నామములు కలవు. జీర్ణమయి శిధిల మయ్యేది కనుక శరీరమనియు, దహింపబడేది కనుక దేహమనియు అందురు. ఇందులో చైతన్య స్వరూపుడైన దానిస్థితిని సంపూర్ణముగా తెలుసు కొనువానినే జీవుడనికూడనూ అందురు."
(గీ పు.200)
(చూ|| అర్ధనారీశ్వరుడు, గృహలక్ష్మి, ధృవుడు).