భక్తి, జ్ఞానము వేరు వేరని తలచరాదు. మానవునికి బోధపడుటకు వేరువేరు మాటలతో చెప్పుకొందురు. భక్తియే జ్ఞానముగా మారును, సుగుణ నిర్గుణ సంబంధమే, - భక్తి జ్ఞాన సంబంధము, కర్మయనునది, భక్తియనునది, జ్ఞానమనునది వేరువేరునుట నేనొప్పుకొనను. వాటిని వేరువేరు చేసిన కూడా నా కిష్టములేదు. కర్మ భక్తి జ్ఞానము సముచ్చయవాదమును కూడా నేనంగీకరింపను. కర్మయే భక్తి, భక్తియే జ్ఞానము మైసూరుపాకు ముక్క మాధుర్యమూ,దాని ఆకారము. దాని బరువు మూడునూ వేరు వేరెట్లగును? మనము నోటిలో వేసుకొన్న వెంటనే దాని ఆకారమును తినివేసినాము. దాని బరువును జీర్ణించినాము. అందులోని మాధుర్యమును రుచి చూచితిమి. ఆ మూడు పనులూ కలిసి యొక సారే జరిగినవి కదా? ఒక కణమున ఆకారము, ఒక కణమున బరువూ, మరొకకణమున మాధుర్యమూ లేదు. ఆవిధముగనే జీవుడూ, ఆత్మ పరమాత్మ వేరువేరు కాదు. కానేరదు, ప్రతి కార్యము సేవామయము, ప్రేమమయము, స్థానమయము కావలెను. జీవితము యొక్క విభాగము లన్నింటిలోనూ కర్మ, భక్తి జ్ఞానములు నిండియుండవలెను. ఇట్టి వానినే పురుషోత్తమయోగ మందురు.
(ప్రే.వాపు 28/29)