భగవంతునికి భర్త, సంభర్త అని రెండు పేర్లున్నాయి. సంభర్త’అనగా ప్రకృతిని ఆధారం చేసుకొని సృష్టిని గావించేవాడు. ‘భర్త’ అనగా సృష్టించిన పదార్థములను రక్షించేవాడు. భర్త అంటే తెలుగువారు Husband అని అనుకుంటారు. కాని, భర్త అనగా యజమాని, సంరక్షకుడు అనేదే సరియైన అర్ధం. ఒక పర్యాయం నారాయణుడు నారదుణ్ణి ఉద్దేశించి "నారదా! నేను సృష్టించిన పంచభూతములలోఏది గొప్పది?" అని అడిగాడు. "స్వామీ! భూమి చాలా గొప్పది" అన్నాడు నారదుడు. "భూమి గొప్పదే. కాని, భూమిలో మూడు భాగములు సముద్రము మ్రింగివేసిందే! కనుక, సముద్రము గొప్పదా? భూమి గొప్పదా?" అని అడిగాడు. "అవును, సముద్రమే గొప్పది" అన్నాడు నారదుడు. "అంత గొప్ప సముద్రాన్ని అగస్త్యుడు ఒక్క గుటకలో మ్రింగినాడు. కాబట్టి సముద్రం గొప్పదా? అగస్త్యుడు గొప్పవాడా? అని అడిగాడు. అగస్త్యుడే గొప్పవాడన్నడు నారదుడు. "అంతటి గొప్పవాడైన అగస్త్యుడు ఆకాశంలో ఒక చిన్న చుక్కగా ఉన్నాడే! కనుక, అగస్త్యుడు గొప్పవాడా? ఆకాశము గొప్పదా?" అని అడిగాడు. నారదుడు ఆకాశమే గొప్పదని అన్నాడు. "అంత పెద్ద ఆకాశాన్ని భగవంతుడు వామనావతారంలో ఒక అడుగుతో ఆక్రమించాడు. కనుక, భగవంతుడు గొప్పవాడా? ఆకాశము గొప్పదా?" అని అడిగాడు. భగవంతుడే గొప్పవాడన్నాడు. నారదుడు. "అంతటి గొప్పవాడైన భగవంతుణ్ణి భక్తుడు తన హృదయంలోబంధించాడు. కాబట్టి. భగవంతుడు గొప్పవాడా? భక్తుని హృదయం గొప్పదా ? అని అడిగాడు. భక్తుని హృదయమే చాల గొప్పదని అంగీకరించాడు నారదుడు. అప్పుడు విష్ణువు ”నారదా! నేను భక్తుల హృదయమునందు బంధింపబడి యున్నాను. నాకు స్వతంత్రమే లేదు. భక్తుల ఇష్టానుసారమే వర్తిస్తాను" అని చెప్పాడు.
(స.సా.డి.99పు.349/350)
"నీవే భగవంతుడవు" అని నేను అనేక పర్యాయములు చెపుతుంటాను. ప్రతి మానవుడు భగవత్స్వరూపుడే. ఆ రోజులలో జనాభా తక్కువగా ఉండటంచేత ముక్కోటి దేవతలనే పదము వాడుకలోకి వచ్చింది. దేహమొక దేవాలయం. అయితే, ఇది అనుభవంలోకి రావాలి. కాని, దేహపరమైన భౌతిక జ్ఞానంవలనగాని, మనోగతమైన సుజ్ఞానంవలనగాని ఇది అనుభవంలోకి రాదు. ఆత్మసంబంధమైన, హృదయగతమైన ఆత్మజ్ఞానము లేక, ప్రజ్ఞానముతోనే అసుభవంలోకి వస్తుంది. "దేవుడు" "దేవతలు" ఈ రెండింటి గురించి యోచించు. దేవుడు ప్రధానమంత్రిలాంటివాడైతే, దేవతలు కేబినెట్ మంత్రులవంటివారు. ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క మంత్రి నియమితుడైనట్లు పంచభూతాలను కూడా దేవతలుగా భావించారు. అందుచేతనే భూమిని భూమాత అని, వాయువును వాయుదేవుడని, జలమును వరుణదేవుడని, అగ్నిని అగ్నిదేవుడని పిలుస్తూ ఆరాధిస్తూ వచ్చారు. నీవు ప్రైమ్ మినిస్టర్ కు ఉత్తరం వ్రాస్తే అది నేరుగా ఆయనకి చేరిపోతుంది. అలాకాకుండా ఫైనాన్స్ మినిస్టర్ కో లేక, హామ్ మినిస్టర్ కో వ్రాస్తే అది వారికే చేరుతుంది. ఆ డిపార్ట్మెంట్ వారు నీకు సేవలందిస్తారు. యజ్ఞయాగాదు లిట్టివే. మరొక ఉదాహరణ: టెలిఫోన్లో రెండు రకాలైన Calls ఉంటాయి. ఒకటి Number Call రెండవది Particular Person Call. Number Call చేస్తే ఎవరైనా సమాధానం చెప్పవచ్చు. "అనిల్ కుమార్ ఉన్నాడా?" అని అడిగితే, నీ భార్యగాని, బిడ్డగాని ఫోన్ అందుకొని సమాధానం చెప్పవచ్చు. ఇట్టి Number calls లాంటివే దేవతల నుద్దేశించి చేసే పూజలు, వ్రతాలు. కాని, Particular Person Call చేస్తే ఫోన్ నువ్వే అందుకొని మాట్లాడాలి. దేవుని ఉద్దేశించి చేసే ప్రార్థన, ధ్యానము ఇలాంటివే. అవి నేరుగా భగవంతునికి చేరిపోతాయి. సంకీర్తనలో అన్ని నామాలు పలుకవచ్చు. ఇవన్నీ Number Calls వంటివి. ధ్యానంలో ఇష్టదైవాన్ని స్మరించు. అది Particular Person Call.
(స. సా.మే2000పు. 160)
ఐశ్వర్యం, ధర్మం, పూర్ణత్వం, యశస్సు, జ్ఞానం, వైరాగ్యం - ఈ ఆరుగుణములకు భగము అని పేరు. ఈ భగమును కల్గినవాడు కనుకనే పరమాత్మునికి "భగవాన్" అని పేరు. భగవంతుని నామములన్నీ ప్రత్యక్ష ప్రమాణములతో కూడినవేగాని కేవలం భక్తుల ప్రేమోన్మాదము చేర ఉచ్చరించినవి కాదు. భగవంతుడు నాల్గు విధములైన విభూతులతో ఆత్మస్వరూపుడుగా భావిస్తున్నాడు. ఇతనికే . "చతురాత్మ" అని పేరు 1.వాసుదేవ, 2. సంకర్షణ. 3. అనిరుద్ధ. 4. ప్రద్యుమ్న. వీటి యందు మొదటి మూడు తత్త్వాలను చక్కగా గుర్తించుకుంటే, నాలుగవదైన ప్రద్యుమ్న తత్త్వం మనకు సులభంగా అర్థమౌతుంది.
మొదటిది: వాసుదేవ. "ఈశావాస్య మిదం జగత్" జగత్తులో అంతటా నివసించినవాడు వాసుదేవుడు. ఈ జగత్తునంతయు తన వశం చేసుకొన్నవాడు వాసుదేవుడు. కనుక, వాసుదేవుడనగా - సర్వభూతము లందు ఆత్మస్వరూపుడుగా ఉంటున్నవాడు. కేవలము అందరి యందు మాత్రమేగాక సర్వత్రా వ్యాపించిన వాడు వాసుదేవుడు. అందుచేతనే - "అంతర్బహిశ్చ తత్సర్వ వ్యాప్య నారాయణ స్థితః" అన్నారు. మన లోపల, వెలుపల, సర్వత్రా ఉండినవాడు ఈ వాసుదేవుడే. సర్వత్రా వసించినవాడు కనుకనే ఇతనికి "వాసుదేవుడు" అని పేరు.
రెండవది: సంకర్షణ. సర్వజీవులను తనవైపు ఆకర్షింపజేసుకొనే వాడే - సంకర్షణుడు. అంతేగాక, ఇతడుసర్వజీవులను తన నుండియే ఆవిర్భవింపజేసి నటువంటివాడు. సంకర్షణ అనే పదంలో సం అనగా పవిత్రత కనక, సంకర్షణుడనగా . పవిత్ర తను ఆకర్షించేవాడు అని అర్థము. అంతేగాక, ఈ సంకర్షణతత్వం సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుజ్య తత్త్వములకు సంబంధించినది.
మూడవది: అనిరుద్ద సర్వశక్తిమయుడు. సర్వవ్యాపకుడైన తత్త్వానికే - "అనిరుద్ధత్వము" అని పేరు. ఇతని అనుగ్రహం చేతనే ఇతనిని సాధించవచ్చునుగాని, వేరొక మార్గంలో ఇతనిని సాధించుటకు ఎవ్వరికీ వీలుకాదు.
ఇంక, నాల్గువది: ప్రద్యుమ్న.అనంతమైన ఐశ్వర్యం కలిగినవాడు - ప్రద్యుమ్నుడు భగవంతుని ఆశ్రయించినవారికి, ఆరాధించినవారికి, ప్రేమించినవారికి సర్వ సుఖములను, ఆనందములను అను గ్రహిస్తూ, వారి అభీష్టములను నెరవేర్చుతుంటాడు. ఈ ఐశ్వర్యము అనగా, ధన కనక వస్తు వాహనాదులు మాత్రమే కాదు. ఆరోగ్యం, విద్య బుద్ధి, గుణం ఇవన్నీ ఐశ్వర్యములే, కనుక, ఇతడు సకలైశ్వర్యస్వరూపుడగుట చేత ఇతనికి "ఈశ్వరుడు" అని మరొక పేరు కలదు.
(స.పా.ఫి.మా.92పు. 42/43)
భగవంతుడు భక్తవత్సలుడు భక్తపరాధీనుడు. భక్తుల యొక్క క్షేమనిమిత్తమై తాము ఎన్ని విధములైనటువంటి కష్టములకైనా గురియవటానికి సిద్ధంగా వుంటాడు. తనను దూషించినప్పటికిని తాను ఏమాత్రమూ లెక్క పెట్టడు; బాధపడడు. కాని, తన భక్తులను దూషించినపుడు, తాను చాలా బాధపడు తుంటాడు. కాని, తాను గుణములకు అతీతమైనటువంటి వాడు కనుక, ఆ బాధను లెక్కచేయడు. అతడు సర్వవ్యాపకుడు. అయినను, ఉపాధిని ధరించటంచేత, కొన్ని కొన్ని కాలములయందు, కొన్ని కొన్ని స్థానముల యందు మాత్రమే అతడు పరమాత్ముడు అని గుర్తించి కొంతవరకు మనము విశ్వసిస్తూ వస్తున్నాము. -
(ఆ.రా.పు.138/139)
సాధు సత్పురుషులూ మహర్షులు ఆర్తితో నిరీక్షించినప్పుడు భగవంతుడు అవతారం ధరిస్తాడు. సాధువులు ప్రార్థించారు. నేను అవతరించాను. నా కర్తవ్యాలు మూడు. వేద రక్షణా ధర్మ రక్షణా పర్యాయ పదాలు కనక రెండు అనవచ్చు. వేదరక్షణ, భక్తరక్షణా నా ఆశయాలు .
(వ.1963 పు.10)
భగవంతుడు కలడని విశ్వసించినప్పుడు ఇది మూఢ విశ్వాసమని ఎవరెన్ని విధాలుగా విమర్శించినా ఆ విమర్శను ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలను మనం సంపాదించుకోవాలి. దేవుడు లేడని వాదించే వానికి మనమేమి జవాబు చెప్పాలి? లేదని నీవంటున్నావు. ఉన్నాడని నేనంటున్నాను. నీకు లేకపోవచ్చు. నాకు ఉన్నాడు. నా దేవుడు లేడని చెప్పడానికి నీవెవరు? నా దేవుడు లేడనడానికి నీకు అధికారము లేదు. ఈ విధమైన వాదాన్ని ఎదుర్కొనడానికి ధైర్యాన్ని, విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఈనాడు లోకంలో మూర్ఖవాదం ఆధికమై పోతున్నది. వారికి విషయం తెలియదు, విశ్వాసము లేదు, వాదనకు మాత్రం సిద్ధం.
నిజంగా దేవుని చూడాలని ఉంటే అనుసరించు, విశ్వసించు, ప్రయత్నించు. సాధన ద్వారా దేవుని తప్పక చూడగలవు,
(ప.పు.214)
భగవంతుని ద్వేషింపవద్దు ఎవ్వరిని అవమానించ వద్దు. చిన్నచూపు చూడవద్దు. సాయి అందరి హృదయములలో నున్నాడు. అందుచే ఎవ్వనికైనా హానిచేస్తే సాయికి హానిచేసినట్లే. ఎవరినైనను అవమానపరుస్తే సాయిని ఆవమానపరిచినట్లే. వారు ఆహంకారులైతే వారే అనుభవిస్తారు. నేను కరుణా స్వరూపుడను. నేను ప్రేమస్వరూపుడను. అందరిని ప్రేమతోనే చూడు. .
(సా.పు.435 )
అంతటను వున్న దేవుని వెదికే దెక్కడ? కొందరు "ఎన్నో సాధనలు చేస్తున్నాము. భగవంతుడు మాత్రము కనిపించటం లేదు అని అంటారు. భగవంతుని వెదికేవారు అన్వేషణ సలిపేవారు కోట్లకొలదిగా కనిపిస్తూ యుంటారు.కాని ఇది కేవలం వెర్రితనము. ఎక్కడ చూస్తే అక్కడ యున్న భగవంతుని వెదికేదెక్కడ. చాలపారపాటు పడుచున్నారు. ప్రజలు, సాధకులు భగవంతుని వెదుకుచున్నారా? లేక భగవంతుడే సాధకుని వెదుకు చున్నాడా? యోచించాలి. సంపూర్ణ శరణాగతుడైనవాడు లోకంలో ఎక్కడా కనిపించడం లేదు. భక్తుని నిమిత్తమే భగవంతుడు వెదుకుచున్నాడు. కాని భతవంతుని మీరు వెదకనక్కరలేదు.
(సా పు.649/650)
ధ ర్మం, ప్రపంచ జీవకోటి యెక్క మనుగడకు ఆ ధారభూతం.స్వార్థకాలిక సత్యం.
భగవంతుడు ధర్మదేవత ధర్మప్రియుడు, ధర్మపాలకుడు, ధర్మ స్థాపకుడు, ధర్మ స్వరూపుడు. .
(ధ వాపు 1)
అన్నింటికీ దైవమొకడు ఆధారంగా ఉన్నాడు. అతని ఆధారం లేకుండా ఏదీ జరగటానికి వీలులేదు. అతడు ఎట్టి వాంఛలు లేనటువంటివాడు. అతనినే గుణాతీతుడు అన్నారు. అయితే, ఈ గుణాతీతుడు సర్వత్రా వ్యాపించి యున్నాడనుటలో అర్ధమేమిటి? దీనికి సాక్ష్యమేమిటి? దీనికొక చిన్న ఉదాహరణ. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులనే పంచగుణములతో చేరినదే ఈ ప్రకృతి.ఈ ఐదుగుణములు పృధ్యియందున్నాయి. ఐతే జలములో శబ్ద, స్పర్శ, రూప, రసములనే నాలుగు గుణములే ఉన్నాయి. గంధము లేదు. కనుకనే, ఇది విశాలంగా రూపొందింది. కాని, అగ్నిలో శబ్ద, స్పర్శ, రూపములనే మూడు గుణములు మాత్రమే ఉండుట చేత, ఇది మరింత విశాలంగా రూపొందుతూ వచ్చింది. ఇంక గాలిలో, శబ్ద, స్పర్శ అనే రెండు గుణములే ఉంటున్నాయి. మిగిలిన మూడు గుణములూ లేవు. ఈ విధముగా గుణములు తగ్గడం వలన గాలి, స్పర్శ, రూప, రస, గంధాదులు లేవు. కనుకనే, ఆకాశం మరింత విశాలంగా రూపొంది యున్నది. అనగా గుణములు తగ్గే కొలది రూపము విశాలమై పోతుంది. భగవంతునికిగుణములు లేవు. అతడు గుణములన్నింటికీ అతీతుడుగా ఉన్నాడు. కాబట్టి సర్వత్రా వ్యాపించి యున్నాడు. ఇట్టి విశాల తత్వాన్ని గుర్తించడానికి ఏ సైంటిస్టు అక్కరలేదు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? ఏ విధంగా ఉన్నాడు? అనే విషయాన్ని నాటి నుండి నేటి వరకు ఆస్తికులు అనేక విధాలుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అయితే, ఆస్తికులు కాని, నాస్తికులు కాని ఎవ్వరూ ఈ విషయాన్ని విపులంగా వివరించలేకపోయారు. ఈ నిజమైన స్వస్వరూపాన్ని గుర్తించే విధానం మానవుని యందే ఉన్నది. కానీ, గ్రంధములలో గాని, గురువుల యందు గాని లేక ఇతర సాధనల యందుగాని ఏమాత్రము కనిపించదు. కన్నులో ని దృష్టివలె, కర్ణములోని వినికిడివలె, నాలుకలోని రుచివలె చైతన్యము మనస్సునందు సర్వత్రా వ్యాపించి యున్నది. కంటిలోని చూపును ఎవరైనా గుర్తించగలుగుతున్నారా? చూపును వినియోగించు కుంటున్నారే కాని, ఈ చూపు యొక్క నిజమైన తత్వాన్ని ఎవరూ విచారంచటం లేదు. ఇది చైతన్యం యొక్క ప్రభావమే. భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నప్పటికీ ఆలాంటి సమీపత్వాన్ని గుర్తించుకోలేక మానవుడు అనేక విధములైన సాధనలు సలిపి వ్యర్ధుడవుతున్నాడు.
“కనిపించెడి జగత్తులో కానరాక
అందు వెలుగొందు చైతన్య మాత్వరూపు .
మణుల యందలి సూత్రము మాదిరిగను
విశ్వమంతా నిండెను విశ్వవిభుడు."
భగవంతునికి పుట్టుకా లేదు. చావూ లేదు. ఈ జగత్ సృష్టికి భగవంతుడు సూత్రధారి. అయితే, తాను కూడా పాంచభౌతికమైన దేహాన్ని ధరించినప్పుడు ఈ విశ్వనాటక మందు తాను కూడా నటన చేయాలి. అప్పుడు తాను కూడ ఒక పాత్రధారిగా ఉంటాడు. అంత మాత్రము చేత భగవత్ తత్వాన్ని అనుమానించకూడదు. కారణమేమనగా ఆయాకాలములకు ఆయా పరిస్థితుల ప్రభావమును పురస్కరించుకొని తాను నటన చేయవలసి వస్తుంది. ఒక వ్యక్తి డ్రామాలో నటిస్తున్నప్పుడు అందులో తనవ్యక్తిగతమైన శక్తి ఒకటి, ప్రాకృతమైన ఆకారశక్తి మరొకటి ఈ రెండింటి సత్యాన్ని గుర్తించిన వాడే దైవాన్ని చక్కగా అర్థం చేసుకోగలడు. భగవంతుడు మానవాకారాన్ని ధరించి ఈ విశ్వనాటకరంగమందు తన వేషాన్ని ప్రకటిస్తున్నాడు. కనుక, ఏ సమయంలో దేనిని ప్రకటించాలో దానినే ప్రకటించాలి.
(శ్రీ భ.ఉ.పు.144/146)
నీవు భగవంతుడవు మనుష్యులంతా భగవంతులే. జీవమున పదార్థము, జీవము లేని పదార్ధము భగవంతుడే. నేను భగవంతుడను. నేను భగవంతుడని నాకు తెలుసు. తెలుసుకోనక్కరలేదు. ఎందుకంటే నేను సర్వకాల సర్వావస్థలయందు భగవంతుడినే కనుక. నేను అవతారమూర్తిని. నేను ఎప్పుడూ అవతార మూర్తినే.
(సా.పు.334)
భగవంతునకు ఎట్టి విధమైన భావములు లేవు. కాని వ్యక్తియొక్క చర్యలను, పూజలను భావములు ప్రార్థనలు పురస్కరించుకొని తాను దీనికి తగినట్లుగా నటిస్తుంటాడు. భగవంతునికి అగ్రహము లేదు, అనుగ్రహము లేదు. ఇష్టములేదు. అయిష్టములేదు. ప్రతి ఒక్కటే నీ ప్రతి బింబము యొక్క స్వరూపములే. దేహమును ధరించటంచేత అవతారములందు కూడను ఇలాంటి కొన్ని Reactions, Reflections, Resounds వుంటాయి. జగత్తు నందు ఆదర్శవంత జీవితమును అందించే నిమిత్తమై యీ రకమైన చర్యలు చెయ్యాలి. భగవంతునికి ఇతడు బ్రాహ్మణుడు, యితడు క్షత్రియుడు, యితడు వైశ్యుడు ఇతడు శూద్రుడు యీమె స్త్రీ. యితను పురుషుడు, యితడు బాలుడు, యితను వృద్ధుడు అనేభేదములు లేవు. ఇవి లౌకిక జగత్తునకు సంబంధించినవి గాని భగవంతునికి ఎట్టి సంబంధము లేదు. రాముడు మా క్షత్రియ వంశములో పుట్టినాడు, కృష్ణుడు మాయాదవ కులములో పుట్టినాడు. సాయిబాబా మాక్షత్రియవంశములో పుట్టాడు. ఈ విధముగా అనుకోవటం కించిత్ భావములే. భగవంతునికి అట్టి భేదములు ఏనాడు లేవు, ఎప్పుడు రావు. దివ్యత్వమైన ఆత్మ తత్వము చక్కగా అర్థముచేసుకుంటే యీ సంకుచితమైన మార్గమునకు ఏమాత్రము అవకాశము ఇవ్వరు. ఇవన్నీ సంకుచితమైన తత్వములు, సంకుచితమైన భావములు.
(బృత్ర, పు. 152)
భగవంతుడు నీవే. నీతత్వమే భగవత్ శక్తి. దీనినే ఎనర్జీ అన్నారు.
(బ్బత్ర పు.119)
ఆజ్ఞ ఇచ్చిన భగవంతుడు శక్తినికూడా తానే ఇవ్వగలడు.
(బృత్ర.పు.120)
భాగవతుల యొక్క చరిత్రలు మనం చక్కగా లోతునకు దిగి విచారిస్తే ఇంత మధురమైనవి, ఇంత జ్ఞానమయమైనవి, ఇంత ఆనందమయమైనవి ఇంత ధర్మమయమైనవి ఎక్కడా కనుపించవు. భక్తిశక్తి దగర దైవశక్తి చాలా అల్పంగా ఉంటుంది. ‘భక్తులకు నేను అధీనుడనుగాని భక్తుడు నా ధీనుడు కాదు. నేను నా భక్తులకు దాసుడను. భక్తుల పూజాగృహములందు సింహద్వారము దగ్గర కాచుకొని ఉంటున్నాను. ఎందుకోసం కాచుకొన్నాను? ఆ దేవాలయములో నా భక్తుడు ఏమి కోరతాడో, కోరిన దానిని వెంటనే తీర్చే నిమిత్తము నేను దాసుని వలె ఉంటున్నాను. నేను అధికారిని కాదు. సర్వాధికారి భక్తుడే. భక్తికి మించినది మరొకటి లేదని నిరూపిస్తూ వచ్చాడు భగవంతుడు. భక్తి అనేది ఆల్పంగా భావించుకొని, సామాన్యంగా లోకములో జరిపే సాధనలుగా మనము భావించరాదు. భగవదనురక్తే భక్తి. ఈ భక్తి లోపల అన్ని చేరి ఉంటాయి. భుక్తి, రక్తి, యుక్తి, అనురక్తి, ముక్తి - అన్నీ అందులో చేరి ఉంటున్నాయి. భక్తి అనే పదము ఎక్కడ నుండి వచ్చింది.? అనేక మంది పండితులు భుక్ అనే పదము నుండి వచ్చిందంటారు. కానీ అది కాదు. మానవునికి మొట్టమొదట కావలసింది. భుక్తి, ఆహారము కావాలి. కర్మ నాచరించుటకు ఆహారము ఉండాలి.
భుక్తిలో కి రక్తి - కోరిక కావాలి. క్తి రక్తిలో ప్రధానమైనది. ఈ ప్రపంచములో ఏ విధముగా బ్రతకాలి అనే యుక్తిని పొందాలి. యుక్తిలోని క్తి తరువాత అనురక్తి. అందరినిప్రేమించాలి. అనురక్తిలోని క్తి తరువాత విరక్తి, విరక్తిలోని క్తి ముక్తి, ముక్తిలోని క్తి భగవంతునిలోని భ" వీటి అన్నింటిలో చేరిన క్తి రెండు చేరితే భక్తి అయింది. భగవంతుడనగా ఎవరు? నీకు భుక్తి, రక్తి, యుక్తి, అనురక్తి విరక్తి, ముక్తి, అన్నింటిని ఇచ్చేవాడు.
(భ.స.మ.పు.86/87)
“నీ ప్రయత్నము నీవు చేయక. భారము నీదేరా! అని భగవంతుని మొరలిడిన, భగవంతునికి ఏమివేరే పనిలేదా? భగవంతుడు మీతో చేయించి, ఆనందాన్ని అందించి కాపాడుతాడు. అహంకార రహితులై, ఆనందమతులై సేవను చేబట్టండి! భగంతుడు వెంట, జంట, ఇంట ఉండి కంటి రెప్ప వలె కాపాడును”. (సాలీత పు168)
భగవంతుడు కొండ, లోయ, పుట్ట, గుట్ట, చెట్టు, చేమ మున్నగు వాని యందును, మనుజ పశు పక్షి క్రిమి కీటకాది సర్వ ప్రాణుల యందును, అంతర్యామియై యున్నాడని తెలిసికొనుడు. అట్టి దృష్టి ఏర్పడినపుడు ఆనందముతో మీ యొడలు నిజముగా పులకరించును. అది వారు చేయు పనిని తేలిక పరచి, భగవంతునికి చేయు పూజ వలె మీకు సంతుష్టిని కలిగించును. వారిధికి వారధి కట్టుటకు వానరులు, గండశిలలను, కొండలను కూడా రామనామము గానము చేసికొనుచు, ఆ యానందముతో అవలీలగా మోసికొని రాగలిగిరి. నామస్మరణ - మహిమ చేత ఆ కొండలు వారికి చెండుల వలెను, బెండుల వలెను తేలికయైనవి. వానరులా శిలల మీద రామ నామము వ్రాసి కడలిలో పడవేసిరనియు, అందువలననే అవి నీటి మీద తేలినవనియు చెప్పుదురు. కాబట్టి మీరు నామస్మరణ మభ్యాసము చేసికొనుడు. ఈపని సులువై ఆనందము నిచ్చును. ఇదే మీకు నా ఉపదేశము. (నా.వి. పు 20)
ఒకరోజు సాయంకాలం కొందరు మనుష్యులు వచ్చి అరవంలో మాటలాడితే, (పాత) మందిరంలో అప్పుడు ఉన్నవారంతా తెలుగువారు కావడంచేత వారికి అర్థంకాక, వెనుక భాగానికి వెళ్ళండి, అక్కడ తమిళం వచ్చినవారున్నారు - అని చెప్పి పంపించారు. వారు వచ్చి అమ్మతో మాటలాడారు. మీరు ఎందుకు వచ్చారని వారిని అమ్మ ప్రశ్నించారు. “మేము రమణ మహర్షి శిష్యులం. ఆయనకు క్యాన్సర్ వ్యాధి వచ్చిందని తెలిసి వారి దర్శనం చేసుకొనేందుకు తిరువణామలై వెళ్ళాం. మహర్షి దర్శనం చేసుకున్నాం. ఆయన మమ్మల్ని చూసి, ఇక్కడికెందుకు వచ్చారు? భగవంతుడు ఆంధ్ర దేశంలోని ఒక పల్లెలో అవతరించియున్నాడు. అక్కడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకొండి పొండి, అన్నారు”. అని సమాధానం చెప్పారు.
ఓహో! అలాగా! అయితే ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఏమి చేయవలసిందిగా మహర్షి ఆజ్ఞాపించారు?” అని వారిని అమ్మ అడిగారు. అప్పుడు వారు అమ్మా! మేముకూడా మా గురువుగారిని ఇదే ప్రశ్న అడిగాం. ఏమీ చేయనక్కరలేదు. శ్రీవారితో కలిసి భజనలో కూర్చుంటే చాలన్నారు, అని బదులు చెప్పారు. ఆ మాటవిని అమ్మ చాలా సంతోషపడ్డారు. స్వామితో కలిసి కూర్చొని భజన చేయడం ఎంత మహత్వపూర్ణమైన విషయమో తనకు తెలియపరచేందుకే మహర్షి తమ శిష్యులద్వారా పంపించిన సందేశమా ఇది!... అనుకొని అమ్మ ఆశ్చర్యపోయారు. అక్కడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకొండి అన్నదే మహర్షి యొక్క ముఖ్యసందేశమని తరువాత బోధపడింది.
రమణమహర్షి శిష్యులు స్వామి దర్శనం చేసుకొని, భజనలో కూర్చొని ఆనందించారు. వారి భోజన వసతి సౌకర్యాలన్నీ స్వామియే స్వయంగా చూసి అపారమైన ప్రేమను వారిపైన వర్షించారు. తమగదిలో వారితో ప్రత్యేకంగా సంభాషించి సంతృప్తిపరచి సాగనంపారు. (శ్రీ సత్య సాయి ఆనందసాయి పు 87-88)