ఒకానొక సమయంలో త్యాగరాజ రామ విగ్రహమును కోల్పోయి చాల బాధలను గురియైనాడు. అన్ని వైపుల వెతికాడు. కానీ, ఎక్కడా రామ విగ్రహం కనిపించలేదు. అప్పుడు తనలో తాను అనుకున్నాడు. "అయ్యో, ముందు వెనుక యిరుప్రక్కల ఉన్న భగవంతుడు లేడని అనుకోవటం నా తప్పు కదా! భగవంతుడు నా వెంటనే ఉన్నాడు, నా ఇంటనే ఉన్నాడు; నీ హృదయమందే ఉంటున్నాడు. నా నుండి ఎప్పుడూ దూరంగా లేదు". అతనిలో ఒక్కతూరి విశ్వాసం వచ్చేసింది. తక్షణమే కావేరీ నదికి పోయి స్నానం చేశాడు. కాలికి ఏదో గ్రుచ్చుక్నుట్లయింది. ఏమిటిదని చూస్తే రామ విగ్రహం!
రారా మా ఇంటిదాకా
రఘువీర సుకుమార నే మ్రొక్కద
రారా మా ఇంటిదాకా
రా రా దశరథ కుమారా నన్నేలుకోరా నే తాళలేరా
రారా మాయింటి దాకా
దిక్కు నీవనుచు తెలిసి నన్ను బ్రోవ గ్రక్కునను రారా
"నిన్నే నమ్ముకున్నాను. రా రా మా యింటిదాకా"
అని పాత స్నేహితుణ్ణి పిలిచినట్లు పిల్చాడు.క్రొత్త స్నేహితుడు ఎవరైనా మన ఇంటికి వస్తే "రండి దయచేయండి " అని కుర్చీ వేస్తాం. అవన్నీ పైపై మర్యాదలేగాని, హృదయంలో అతనికి స్థానం లేదు. క్రొత్త స్నేహితుణ్ణి పదములలో మాత్రమే గౌరవిస్తాముగా అతనితో సన్నిహిత సంబంధం ఉండదు. కానీ, పాత స్నేహితునితో హృదయ సంబంధముంటుంది. కనుకనే రారా, పోరా అంటాం. త్యాగరాజుకు రామునితో అట్టి సన్నిహిత సంబంధం అధికంగా ఉండటం చేత "రారా మాయింటిదాకా.." అని ఎంతో స్నేహంగా ఎంతో స్వేచ్ఛగా, ఎంతో పవిత్రంగా, ఎంతో ఆర్తిగా పిలిచాడు. పాత స్నేహితునితో స్వేచ్చగా సంచరించవచ్చును. పాత స్నేహితుడు గౌరవ మర్యాదలను ఏమాత్రము ఆశించడు. కనుక, భగవంతుణ్ణి మీ పాత స్నేహితునిగా భావించాలి, అనేక జన్మల నుండి మీ వెంట వచ్చేవానిగా విశ్వసించాలి. భగవంతుడు అన్ని జన్మలలోను
మీ ఇంట యింట వెంట ఉండి కంటికి రెప్పవలె చూచుకుంటాడు. ఆ హక్కును మీరు కోరాలి. అదియే నిజమైన భక్తుని తత్త్యం. భక్తులు భయం, భయంగా ఉంటే ప్రయోజనం లేదు. పరిపూర్ణ స్వేచ్చలో ఉండాలి. దివ్యత్వాన్ని పొందాలనుకుంటే, మీయందున్న ప్రకాశ తత్త్యమును మీరు చూడాలనుకుంటే నిజమైన హక్కులో ఆ దైవత్వాన్ని ప్రార్థించాలి. ప్రేమచేతనే, స్వేచ్చ చేతనే దైవాన్ని పట్టాలి. భయభక్తులతో ఉండినంత వరకు దైవం లభ్యంకాడు. పాపభీతి ఉండాలిగాని, దైవభీతి ఉండకూడదు. భగవంతునిపై ప్రేమ ఉండాలి. అప్పుడే మీకు భగవంతుడు ప్రాప్తిస్తాడు.
(సా.శు.పు.59/61)
(చూ॥ అంగహీనుడు)