ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన
మహానీయులను గన్న మాతృభూమి
పాశ్చాత్య వీరుల పారద్రోలించియు
స్వాతంత్ర్యమును గన్న సమర భూమి
పాండిత్యమున చాల ప్రఖ్యాతి గాంచియు
ప్రతిభ చూపించిన భరతభూమి
సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యల
ధీశక్తి చూపిన దివ్య భూమి
చిత్రకళల తోడచిత్రమైయున్నట్టి
భరత భూమి యందు జనన మొంది
భరతమాత ధర్మ భాగ్యంబు కాపాడ
బాధ్యతంతయు మీదె భక్తులారా! భరతీయులారా!
భారతదేశము యొక్క పవిత్రమైన ఖ్యాతిని కాపాడ వలసిన భారతీయులే ఈనాడు సత్య ధర్మములను చేతులారాకోల్పోతున్నారు. ప్రాచీన ఋషులు, మునులు కూడబెట్టిన ఆధ్యాత్మిక సంపత్తికి వారసులైన భారతీయులే అసత్యమును, అధర్మమును పోషిస్తున్నారు. నేడు మానవతా విలువలను పోషించుకోవలసిన బాధ్యత భారతీయులపై ఏంతేని ఉన్నది. యుగ యుగముల నుండి భారతీయుల సాధించి నటువంటి సిరిసంపదలు మానవతా విలువలే. ఇట్టి పవిత్రమైన భారత దేశములో జన్మించి కూడను భారతదేశము యొక్క విశిష్టతను, భారతీయ సంస్కృతిని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. మానవతా విలువలు గ్రంథపఠనంవల్ల అలవడేవి కావు. గురువులు అందించేవి కావు. ఇవి మీ హృదయము నుండి ఆవిర్భవించేవే. హృదయమునందు పవిత్రమైనప్రేమను నింపుకున్నప్పుడు మీ నోటి నుండి వచ్చే ప్రతి పలుకు సత్యంగానే ఉంటుంది. మీరు చేసే ప్రతి కర్మ ధర్మమయంగానే ఉంటుంది. మీ జీవితమే ప్రేమమయమైనదిగా ప్రకాశిస్తుంది. కనుక, మీ హృదయాన్ని ప్రేమచేత నింపుకొని జీవితాన్నే ప్రేమమయంగా మార్చుకోవాలి. దీనికంటే మించిన సాధన మరొకటి లేదు.
(స.సా.ఆ.99పు.261/262)
మీతల్లి కురూపియని ఆమెను త్యజించి అందంగా ఉన్న పరాయి స్త్రీని తల్లియని పిలవడం ఎలాంటిదో ధన వ్యామోహంలో మాతృదేశాన్ని విస్మరించి విదేశాలకు వెళ్ళడం అలాంటిదే. ఈనాడు అనేక మంది విద్యార్థులుభారత దేశం బీదదేశమని భావిస్తున్నారు. ఇదే మన పిల్లల్లో ఉన్న పెద్ద బలహీనత, భారత దేశం బీదది కానే కాదు. భారతదేశంలో లేనిది ఏ దేశంలోను లేదు. సమస్త శక్తులు భారత దేశమునందే ఉంటున్నాయి. ఇది త్యాగభూమి, ఇది యోగ భూమి, ఇది కర్మభూమి. ఇలాంటి భూమిని కొందరు భోగభూమిగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనకు భోగమే వద్దు. భోగం రోగానికి దారి తీస్తుంది. త్యాగమే యోగాన్ని చేకూర్చు తుంది. కాబట్టి, త్యాగభావంతో మీ సర్వస్వాన్ని సమాజానికి అర్పితం చేయండి. నడుం వంచి పనిచేయండి. చేతి నిండుకు పని చేయాలి. మనస్సు నిండుకు మంచిభావము లుండాలి. అలాంటివాడే నిజమైన మానవుడు. అట్టి మానవునికోసమే భగవంతుడు వెదకుతున్నాడు. భగవంతునికోసం మానవుడు వెదకనక్కర్లేదు. ఎందుకంటే, భగవంతుడు ఎక్కడ చూసినా ఉన్నాడు. కాబట్టి, మీరు దైవాన్వేషణకోసం ప్రయత్నించకండి, మంచి మనస్సుకోసం ప్రయత్నించండి. మీరు మంచివారు కావాలిగాని, గొప్పవారు కానక్కర్లేదు. గొప్పవారివల్ల లోకానికి జరుగుతున్న ఉపకార మేమిటి? ఏమీ లేదు. ఉపకారానికి బదులు ఎక్కువగా అపకారమే జరుగుతున్నది..
(స.సా..3.మే2000పు.153/154)
ఒక నాణ్యానికి రెండుపక్క లున్నాయి. పరమాత్ముడు ధర్మస్వరూపుడు. సత్యస్వరూపుడు కూడ. అధర్మమును సత్యమును అలక్ష్యం చేస్తే భారతదేశము భారదేశమై పోయింది. భగవంతుని పై భగవద్విషయముపై రతికలవాడే భారతీయుడు. యెవరెవరి కర్తవ్యమును వారు నిర్వహించాలి. అనుష్టానానికి తగిన నిష్టవుండాలి. యిదే ధర్మము యొక్క గురుతు, మానసిక శాంతి ధర్మాచరణములోనే దొరికేది. దీనిని మానవుడు మరచి విషయవాసనల లోబడి అసత్యము. అక్రమము అనాచారము పెరిగినపుడు పరమాత్ముడే మానవరూపములో అవతరిస్తాడు.
(సు.పు.154/155)
"భారతదేశము వేదాల పట్టుకొమ్మ
యజ్ఞయాగాది క్రతువుల కాటపట్టు
పెక్కు అవతారముల గన్న పెద్దతల్లి
నీతి నియమాల యోగి యీ త్యాగభూమి"
(యు. సా.పు9)
భారతదేశమునకు హిమాలయము శిరోభూషణము; కన్యాకుమారి పాదములు. బొంబాయి నగరము ఉదరభాగము. ఉదర మెప్పుడు సరిగా పనిచేయదో, శరీరము శిరమునుండి పాదమువరకు బాధపడుతుంది. ఉదరమును నిర్మలమైన ఆరోగ్యకరమైన ఆహారముతో నింపి, సవ్యముగా పనిచేయునట్లుగావించినచో, శరీరము ఎటువంటి రోగబాధలు లేకుండా, చక్కగా పనిచేయగలదు.
(స.సా.జ.75 పు.108)
ఒకానొక సమయంలో 20 సం||లకు పూర్వం మున్షి ఒక పెద్ద సభను ఏర్పాటు చేసాడు. అతడు చాలా తెలివితేటలు గలవారినందరిని చేర్చాడు. ఈనాడు తెలివితేటలు గలవారికే అనేక అనుమానాలు కూడా! అసలు తెలివిగలవార మనుకునే వారికి తెలివే ఉండదు!అది కేవలం అహంకారము యొక్క ప్రభావము. ఆ సమావేశంలో అందరూ చేరారు. తెలివితేటలు గలవారి సమావేశం ఎట్లా విఱ్ఱవీగుతున్నారు.
"దీన్ని చదివాం, దాన్ని చదివాం, ఇన్ని రకములైన ప్లాన్లు వేసాం.." అంటూ వర్ణిస్తూ కూర్చున్నారు. నేను ఆ సభకు ప్రధాన అధిపతిని. నా ప్రక్కన మున్షి కూర్చున్నాడు. "స్వామీ! ఈ ఆధునిక యుగంలో తెలివి గలవారికి ఆధ్యాత్మికము పైన, ధార్మికము పైన అనేక అనుమానా లుంటున్నాయి. వాటిని మీరు తప్పక తీర్చాలి అని కోరాడు. ఇంక వారు స్వామిని అనేక ప్రశ్నలు అడిగారు. వాటికి చక్కగా సూటిగా హృదయానికి హత్తుకునేటట్లుగా జవాబులు చెప్పాను. తదుపరి గొప్ప తెలివితేటలు గలవాడు లేచాడు. "రష్యా గొప్ప ట్యాంకులను, బాంబులను తయారు చేస్తున్నది. ఇంక ఆమెరికాకు చూస్తే దాని శక్తిసామర్థ్యాలకు సాటి లేదు. కాని, భారతీయులు ఎట్టి అస్త్రశస్త్రములనూ తయారు చేయటం లేదు. మరి మన భారతదేశం గతి ఏమౌతుంది?! ఈ సందేహమును మీరు తీర్చాలి. మన భారతీయులు కూడా అస్త్రాలను, ట్యాంకులను తయారు చేయాలి" అన్నాడు. "పిచ్చివాడా! తినడానికి తిండి, ఉండడానికి కొంప, కట్టడానికి బట్ట - వీటిని ప్రజలకు అందించాలి. ఇదే గొప్ప శక్తి. ఈనాడు రష్యాలో కావలసినంత ఆయుధ సామాగ్రి ఉంటున్నది. కాని, తినడానికి తిండి లేదు. ప్రజలకు తగిన అనుకూలములను సమకూర్చకుండా బాంబులు పెట్టుకొంటే ఏమి ప్రయోజనం? ఆయుధాల కొరకు కోట్లకొలది ధనమును వ్యర్థం చేస్తున్నారు. దీనికి నేనేమాత్రమూ అంగీకరించను" అన్నాను. "మరి మనపై పరాయివారు దండెత్తి వచ్చినప్పుడు వారిని ఏవిధంగా ఎదుర్కోవాలి?" అని ఇంకొకరు ప్రశ్నించారు. అప్పుడు నేను చెప్పాను, "మన దేశముపేరేమిటి? భారతదేశము. కనుక, భారతదేశమునకుభారతమే ప్రధానము. ఈ భారతములో ముఖ్యులెవరు? ధర్మజ భీమార్జున నకుల సహదేవులు. భారతమునకుప్రధాన కర్తలు ఈ ఐదు మంది. ఇందులో అర్జునుడు గొప్ప శక్తి వంతుడు, గాండీవమును సాధించినవాడు. ఇతని బిరుదులు పద్మశ్రీ పద్మ విభూషణ్ వంటివి కావు, "అర్జున ఫల్గుణ పార్థివ కిరీటి శ్వేతవాహన భీభత్స సవ్యసాచి ధనుంజయ" - ఇలాంటి టైటిల్స్ కల్గినవాడు. ఇన్ని శక్తి సామర్థ్యాలు కల్గిన అర్జునుడు అన్న మాటను ధిక్కరించక శిరస్సు వంచుతున్నాడు. ఇంక భీముని చూస్తామా....ఇతనికి గొప్ప భుజబలము, బుద్ధిబలము ఉంటున్నది. ఒక పెద్ద వృక్షమునైనా ఎడమ చేతితో కదిలించి పెకిలించి శక్తి గలవాడు. ఐతే, ఇతడు కూడా అన్న ఆజ్ఞను శిరసావహిస్తున్నాడు. ఎందుకోసం? మీరు చక్కగా గుర్తించండి. అస్త్రశస్త్రములను సాధించి గొప్ప శక్తి సామర్థ్యములు గల అర్జునుడు అమెరికాలో సమానము: భుజబలము, బుద్ధిబలము గల భీముడు రష్యా వంటివాడు. ఐతే, ఈ ఇరువురూ ఎవరి శరణాగతి పొందుతున్నారు? ధర్మజుడనే వానికి శరణాగతులౌ తున్నారు. కనుక, ఈనాడు మనం ధర్మాన్ని పోషించినప్పుడు ఈ రెండూ స్వాధీనమైపోతాయి. ఎంతటి శక్తి సామర్థ్యములు కల్గినవాడైనా ధర్మము ముందు అణుమాత్రంగానే ఉంటాడు. కనుక, భారతీయుల ప్రధానప్రాణము ధర్మము" అని నేను చెప్పాను. ఈ జవాబు చెప్పేటప్పటికి ఒక నిమిషము కాదు, రెండు నిమిషములు కాదు. 15 నిమిషములు అందరూ Claps (చప్పట్లు) కొడుతూ వచ్చారు. నేను చెప్పాను - "Claps కొట్టినంత మాత్రమున ప్రయోజనం లేదు. మీ మనస్సు Taps త్రిప్పి దుర్భావాలను విసర్జించండి. అందరూ ధర్మమార్గంలో ప్రవేశించండి " అన్నాను.
(స.సా.డి.94.పు.313/314)
విద్యార్థులారా! మొట్టమొదట నేషనాలిటీని తీసుకోండి. భారతదేశమునకు ఏమని పేరు? HINDU అని పెట్టారు.
H-humility,
I-individuality,
N-nationality,
D-divinity.
U-unity ఉండాలి.
Divinity ఉండాలి nationality. ఉండాలి individuality ఉండాలి. అన్ని చేరినప్పుడే భారతదేశము. వీటన్నింటికి humility ఉండాలి. ఇది లేకపోతే రెండవది ఏ మాత్రము లేదు. Humility లేక individuality ఎక్కడ నుండి వస్తుంది? మొట్టమొదట వినయము. అప్పుడే కట్టకడపటికి Unity వస్తుంది.
(భ.మ.పు. 15)
భారతదేశము చెత్త భూమిగా విశ్వసిస్తూ విదేశములకు ప్రయాణమై వెళ్ళుతున్నారు. "యన్న భారతే ఉన్న భారత " భారతదేశములో లేనిది ఏ దేశము లోను లేదు.
"భవ్య భావాలు కల్గిన భారతీయ
దివ్య సంస్కలిత తత్వంబు తెలుసుకొనగ
భారతీయులు యత్నింపనేరరైరి
ఇంతకంటెను దౌర్భాగ్యమెమికలదు?"
కర్మభూమి, యోగభూమి. అయిన భారతదేశమునందు పుట్టిన యువకులైన మీరు భారతీయ సంస్కృతినే గుర్తించటానికి ప్రయత్నించలేక పోవటం చేత ఈ విధమైన అవస్థలకు గురియై పోతున్నారు. ఇట్టి విశిష్టమైన సంస్కృతిని గుర్తించాలి. విచారించాలి. దీనిని ప్రబోధించే పెద్దలుగాని పండితులు గాని తల్లితండ్రులుగావి లేకపోవటమే దీనికి మూలకారణము.
(బృత్ర.పు. గం)
ప్రతికర్మకూ ఒక ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు. త్వరలోనే పవిత్రమైన ఫలితం కూడా వస్తుంది. ముఖ్యంగా భారతదేశానికి చాలా శుభం కలుగుతుంది. ఈనాడు అనేకమంది భయభ్రాంతులతో కుమిలిపోతున్నారు. ఏ నిముషంలోయుద్ధం వస్తుందో! అని భయపడుతున్నారు. ఏ నిముషంలో పాకిస్థాన్ కు, ఇండియాకుయుద్ధం జరుగుతుందో! అని భయపడుతున్నారు. ఏమీ జరుగదు.భారతదేశము పవిత్రమైనది. ఇది సుక్షేమంగానే ఉంటుంది. ఏవో చిన్న చిన్నవన్నీ జరుగుతునే ఉంటాయి. నలుగురున్న కుటుంబంలోనే కలహాలు వస్తుంటాయి. కోట్ల కొలదీజనాభా వున్న దేశంలో చిన్న చిన్న లడాయిలు రాకుండా ఉండవు. కాని యుద్ధం అనేది రాదు. ఈ రెండు దేశాలవారు ఏకమైపోయి సోదరులలాగే జీవిస్తారు. "లోకాస్సమస్తా స్సుఖినోభవంతు" అని మీరు కూడా ప్రార్థనలు చేయండి. లోకమంతా సుఖంగా ఉండాలని మనం ఆశించాలి. ఈ లోకాన్ని బట్టి మనం జీవిస్తున్నాం. లోకమే లేకపోతే నీవు ఎవరవు? నీవే లేకపోతే లోకమెక్కడ? కనుక నీకు, లోకానికి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉండాలి. కాబట్టి భగవన్నామ స్మరణ చేస్తూ, లోకక్షేమాన్ని ఆశిస్తూ, సంఘ క్షేమాన్ని కోరుకుంటూ, సేవలలో పాల్గొంటూ మీ జీవితాలను సార్ధకం చేసుకోండి!
(శ్రీ. ఫి. 2002 పు.32)
జీవ, బ్రహ్మలయందు ఐక్యసాధనా సంపత్తి భారతదేశము. జీవ, బ్రహ్మఐక్యాను సంధానమునకు భారత దేశమే ఒక ఆట పట్టు. భారత" అనగా కేవలం ఒక దేశమునకు గాని, ఒక వ్యక్తికి గాని ఒక కాలమునకుగాని సంబంధించినది కాదు. అనేక పురాణముల యందు వివిధ రీతులలో భారతదేశాన్ని ప్రకటించినప్పటికిని, కేవలము వారివారి భ్రాంతులనే చెప్పవచ్చును.
భారతదేశం సంపన్న దేశము నైతిక, ధార్మిక ఆధ్యాత్మిక, సంపత్తి కి మూలస్థానం. ఈ దేశము లౌకిక జీవితమునకు అన్నపూర్ణ వంటిది. ఇట్టి పవిత్రమైన దేశమునకు ఈనాడు పేదదేశముగా భావించుకోవటం ఇది కేవలం ఒకభ్రాంతియే. మనది పేద దేశముకాదు. ఇది సంపన్నదేశము. ఇది సంపన్నదేశము కాకుండిన - మొగలు చక్రవర్తులు, తురుష్కులు, ఐరోపావారు ఈ దేశముపైన ఎందుకు దండెత్తి వస్తారు. సంపద ఉండినప్పటికిని దానిని మనము సంరక్షించుకోలేక పోతున్నాము. కారణము ఏమిటి? సర్వసంపదలు ఉంటున్నవి గాని భారతీయులయందు ఐకమత్యము క్షీణించింది. స్వాతంత్ర్యమును సాధించారు కాని ఐక్యతను సాధించలేదు. ఐకమత్యము లేకపోవుట చేతనే భారతదేశం ఇన్ని అనర్థములకు మూలకారణమైనది. ఇటువంటి సంపన్నదేశమునందు మనము జన్మించినప్పటికీ, ఇందుగల గుణములను, భావములను మనము ఆవిర్భవింప చేసికొనలేకపోవుట ఇది కేవలం ఒక దురదృష్టకరమైన విషయం. ఏకార్యము చూచినప్పటికీ, స్వార్థము, స్వప్రయోజనము, విలయతాండవ మాడు చున్నవి. స్వార్థమును త్యజించి ఐక్యమత్యమును చేపట్టాలి. అప్పుడే మనము దేశము యొక్క ఐక్యతలోని ఆనందమును అనుభవించగలము. అట్టి ఆనందమునే అనుభవించాలి. వాస్తవముగా భారత దేశము ఎంత పవిత్రమైన దేశమన్నది మీరు గుర్తించవలసిన అవసరం ఏంతేని యున్నది. ఇట్టి పవిత్ర దేశమునందు లేనిది ఏ ఒక్కటి కూడను లేదు. ఈ దేశము నందు లేనటువంటి వస్తువులుగాని, సాంప్రదాయములుగాని సంశక్తులుగాని మరి ఏ ఇతర దేశములందు చూడలేము. ఇటువంటి భారతదేశము నందు సర్వశక్తులు ఉండినప్పటికి నిశ్శక్తులుగా మనము భావిస్తున్నాము. ఇది కేవలము మన భ్రాంతి మాత్రమే. ఈ భ్రాంతిని దూరము చేసినప్పుడే మనకు నిజమైన ఆత్మానందము లభ్యమవుతుంది. భ్రమను దూరము చేసినప్పుడే బ్రహ్మ మనకు సాక్షాత్కారవుతుంది.
సర్వము భారతదేశమునందు ఆవిర్భవించి యున్నది. మీరంతా భారతీయులై పుట్టినందులకు భారతమాత యొక్క ధర్మమును కాపాడవలసిన బాధ్యత మీపైననే నిలిచియున్నది. భక్తులారా! ఈ భారతదేశము యొక్కభాగ్యమును కాపాడుతానని ప్రతి భక్తుడు కంకణము కట్టుకోవాలి.
(స. సా.డి.1990 పు.310/311)
భారతదేశమ్ము నారింజపండు:
కనగ జాతులు మతములు తొనలుగానే
భిన్నతెగలు వృత్తులు ఎన్నియున్న
భారతదేశాన్ని పుట్టుట భాగ్యమగును.
ఐకమత్యంబు జ్ఞానంబు నందజేయు
దివ్యజ్యోతిని వెలిగించి దేశమిదియె!
(సా.పు. 428)
అనాది కాలమునుండి మన భారతదేశం ఎంతో పేరుప్రఖ్యాతులు గాంచినది. భారతదేశానికి ఉత్తరదిశన హిమాలయ పర్వతములు ఎల్లలుగా ఉన్నవి.హిమము తెల్లవైనది, చల్లనైనది. కనుక, హిమాలయములు పవిత్రతకు, ప్రశాంతతకు చిహ్నములు. భక్తిజ్ఞానవైరాగ్యములకు ప్రతీకలైన గంగాయమునాసరస్వతులు ఈ పవిత్రమైనభారత దేశమునందు ప్రవహిస్తున్నాయి. ఇంతియేకాదు. రామాయణ, భారత, భాగవతములనే పవిత్ర గ్రంథాలను లోకానికి అందించనదీ దేశం. ప్రపంచంలో సర్వవ్యాపకమైన ఏకత్వాన్ని ప్రబోధించే భగవద్గీత ఆవిర్భవించిన పుణ్య భూమి ఈ భరతభూమి. "అహింసా పరమో ధర్మః" అని ప్రబోధించిన బుద్ధుడు జన్మించిన పవిత్రభూమి ఇది.భారతదేశ చరిత్ర ఎంత గొప్పదో, ఎంత దివ్యమైనదో మీరు గుర్తించాలి. అనాది కాలము నుండి భారతదేశము ఆధ్యాత్మికతత్వ ప్రచారంచేత అన్ని దేశములూ శాంతిభద్రతలను అందిస్తూ వచ్చింది.
ప్రేమస్వరూపులారా! భారతదేశంలో పుట్టడమనేది ఎంతో గొప్ప అదృష్టం. భారతదేశంలో జీవించడం మరింత గొప్ప అదృష్టం. కాని, భారతదేశం యొక్క గొప్పతనాన్ని భారతీయులే మరచిపోతున్నారు. "నేను భారతీయుడను" అని మీరు సగర్వంగా చాటుకోవాలి. ఇదే మీకున్న గొప్ప డిగ్రీ, భారతీయుడనే పదము యొక్క అంతరార్థమును మీరు గుర్తించి వర్తించాలి. భారతీయులారా ! మీరు ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి ఆనందాన్ని అనుభవించి, ఆ ఆనందాన్ని అన్ని దేశములవారికి అందించడానికి తగిన కృషి చేయాలి. ప్రాచీన కాలము నుండి మానవతా విలువలను ఆచరించి, ప్రపంచానికి ఆదర్శాన్ని అందించిన మహనీయులెందరో మన భారత దేశంలో జన్మించారు. ఆ మహనీయుల యొక్క ఆదర్శాలను, వారి పవిత్రమైన చరిత్రలను మీరు మరువకూడదు. ఏదో పాతపురాణాలని వాటిని ప్రక్కన పెట్టకూడదు. వాటిలో ఉన్న మహత్తరమైన విషయాలు మీకు అంత సులభంగా అర్థం కావు. మీరెంతో కాలము నుండి రామాయణమును చదువుతున్నారు. కాని, సుమిత్ర యొక్క సద్భావములను, ఊర్మిళ యొక్క పవిత్రతను ఏమైనా అర్థం చేసుకోగలిగారా? లేదు.
రామాయణంలో నిగూఢమైన అంతరార్థములున్నాయి. కాని, భారతీయులు కూడా వాటిని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు. రామాయణమంతా చదివిన తరువాత ఒక వ్యక్తిని రాముని భార్య ఎవరని అడిగితే మిసెస్ రామ" అని చెప్పినాడట! అంతటి అజ్ఞానంలో మునిగియున్నారు భారతీయులు: ఆధునిక నాగరికతపైమోజు పెంచుకొని ప్రాచీన చరిత్రను, సంస్కృతిని విస్మరిస్తున్నారు. తమ ప్రవర్తనచేత దేశం యొక్క పేరు ప్రఖ్యాతులను కూడా పాడుచేస్తున్నారు. మనకున్నది ఒకే మిత్రుడు, అతడే భగవంతుడు. మనకున్నది ఒకే గ్రంధము. అదే భారతదేశ చరిత్ర. దానినే మనం చదవాలి.పిచ్చిపిచ్చినవలలను చదివి మీ హృదయాన్ని పాడుచేసుకోవద్దు. హృదయాన్ని పరిశుద్ధం గావించుకున్న వ్యక్తికే పవిత్రమైన భావములు కల్గుతాయి.
ప్రేమస్వరూపులారా! ఈ నూతన సంవత్సరం నుండి మీరు పవిత్రమైన రామచరిత్రలో ఉన్న ఆదర్శప్రాయులైన స్త్రీపురుషుల సద్గుణాలను మీ హృదయంలో నిల్పుకొని, వారి అడుగుజాడలలో నడవడానికి ప్రయత్నించండి.భారతదేశం యొక్క పవిత్రతను ప్రపంచానికి చాటిచెప్పండి. భారత దేశం మన మాతృభూమి. ఇట్టి పవిత్రభూమిని మీరెప్పటికీ మరువకూడదు.
(స.సా..మే. 2002 పు. 152/153)
సమస్త విద్యలు, సంగీత సాహిత్యములు కూడను భారతదేశమునందే లభ్యమైనాయి. భారతదేశమునందు లభ్యము కానిది ఎక్కడ కూడను మనకు లభ్యం కాదు. కనుక, “యన్న భారతే తన్న భారత”. భారతదేశములో లేనిది ఇంక ఎక్కడా మనం పొందలేము. భగవంతుని ప్రార్థించి, మెప్పించి మరణించిన వ్యక్తులనుకూడను బ్రతికించుకొన్న సాధ్వీమణులు, పతివ్రతామ తల్లులు ఎందరో ఈ భారత దేశములో ఉద్భవించి భరతభూమికి వన్నె తెచ్చారు.
గతజీవుడగు .పతిన్ బ్రతికించుకొన్నట్టి
సావిత్రి భారత సతియె కాదె
తన సత్యమహిమచే దావాగ్ని చల్లార్చి
చంద్రమతి పవిత్ర పడతి కాదె
కులసతీత్వమునకై గుండాన దూకిన
సీ త భారతధరాజాత కాదె
కినిసి దుర్మద కిరాతుని బూదిగావించె
దమయంతి భారత రమణి కాదె
సత్వసాగర పరివేష్టితోర్వితలము
భరతజాతి పాతివ్రత్య ప్రవిమలంబు
భావసంపదకిది మహాపంటభూమి
అఖిల దేశాలకిది ఉపాధ్యాయి కాదె. (రామాయణ దర్శనము వేసవి తరగతులు 2002 పు16)