నీవు భగవంతుని సమీపించడానికి వేసే ప్రతి ఒక్క అడుగుకు, భగవంతుడు కూడా నీవైపు పది అడుగులువేసి ముందుకు వస్తాడు. ఈ తీర్థయాత్రలో ఆగడమనేది లేదు. ఇది నిరంతర ప్రయాణము. రాత్రింబవళ్ళు, లోయల గుండా, ఎడారుల గుండా, కన్నీళ్ళతో, చిరునవ్వులతో, జనన మరణాలతో గర్భకోశం నుంచి సమాధుల వరకు సాగే ప్రయాణం. రోడ్డు చివరకు వచ్చి, గమ్యం చేరుకొన్నప్పుడు, యాత్రికుడు తన నుంచి తనలోనికే పయనించినట్లు తెలుసుకొంటాడు. ఆ దారి సుదీర్ఘం, ఒంటరి ప్రయాణం, కాని ఆదారిలో నడిపించిన భగవంతుడు అంత సేపు తనలోనే ఉన్నాడు, చుట్టూ ఉన్నాడు. తనతోనే ఉన్నాడు. తన ప్రక్కనే ఉన్నాడు!
(ప. పం. ద. పు. 65)
జీవితం ఒక తీర్థయాత్ర. దానిపై మానవుడు కాళ్ళీడ్చుకొంటూ మెఱక పల్లాలు ఉన్నా ముళ్ళపొదలున్నా ఆదారిలో పయనిస్తుంటాడు. భగవన్నామం పెదవులపై ఉంటే దప్పిక అనేది ఉండదు. భగవంతుడి రూపం మనసులో ఉంటే మార్గాయాసం ఉండదు. పవిత్ర మూర్తుల (సహకారం) సహవాసం ఉత్తేజాన్ని కలిగించి ఆశను, నమ్మకాన్ని కలుగజేస్తాయి. పిలుపు నందుకొనేటంతలో భగవంతు డున్నాడు అనే ఆభయం, ఎల్లప్పుడు దగ్గరనే ఉన్నాడనే భావం రావడానికి ఆలస్యం కాదనే విషయం, కరచరణాలకు బలం చేకూరుస్తాయి. కళ్ళకు ధైర్యాన్నిస్తాయి.
(అ. ప.పు. 32)
(చూ|| నదీస్నానం)