ఈనాడు మానవునియందుండవలసిన మానవతా గుణములు శూన్యమైపోతున్నాయి. ప్రేమ అనేది ఎక్కడా కనిపించడం లేదు. సత్యమనేది ఎక్కడా వినిపించడం లేదు. ధర్మమును ఎవరూ ఆచరించడం లేదు. ఇంక, శాంతి ఏరీతిగా లభిస్తుంది? బంగారము లేక నగలు తయారు కావడానికి వీలుకాదు. అదేవిధంగా, భగవంతుడు లేక మీకు సత్యంగాని, ధర్మంగాని శాంతిగాని ప్రాప్తించవు. ఇవన్నీ భగవంతుని ద్వారా లభించేవే! భగవంతుడు హిరణ్యగర్భుడు, బంగారం వంటివాడు. కనుక, భగవంతుడనే బంగారాన్ని మీ హృదయంలో పెట్టుకుంటే, ఆ బంగారంచేత సత్యము, ధర్మము, శాంతి అనే నగలను చేయించుకోవచ్చును.అందరియందు హిరణ్యగర్బు డున్నాడు. దీనిని దృష్టియందుంచు కొనే నేను అందరినీ బంగారు! బంగారు!" అని పిలుస్తుంటాను. అందరి యందు భగవంతుడున్నాడనే సత్యాన్ని గుర్తించాలి. మీయందు భగవంతు డున్నాడని విశ్వసించి నప్పుడే మీకు సర్వ సుఖములు చేకూరుతాయి. హృదయమందున్న దైవత్వాన్ని విస్మరించి, బాహ్యమైన ఫలితాల కోసం ప్రాకులాడితే ప్రయోజనం లేదు.
(స.సా.జ. .2000పు 4)
కంచునందు మ్రోత ఘనముగా నుండును
కనకమందు మ్రోత కానరాదు
అల్పులయందుండు ఆడంబరము మెండు
మేలి పూత లేల భక్తులకును?
కంచు, కనకము కంటికి ఒకే మాదిరి కనిపిస్తాయి. కాని, కంచు మ్రోగినట్లు కనకము మ్రోగదు. అట్లే, అల్పునియందు ఆడంబరము మెండుగా ఉంటుంది. నిజమైన భక్తుడు బంగారంవలె ఉంటాడు. బంగారం మట్టిలో పడినా చెడిపోదు. ఆగ్నిలో పడినా ఆపరంజిగా ప్రకాశిస్తుందే కాని విలువను కోల్పోదు. భక్తుడు కూడా బంగారమువలె కష్టనష్టాలవల్ల సంస్కరింపబడి ఉన్నత స్థాయికి చేరుకుంటాడు. మీరు బంగారం వంటివారుగా తయారు కావాలనే నేను మిమ్మల్ని బంగారూ! బంగారూ!" అని పిలుస్తుంటాను. మీరందరూ గోల్డ్ మాదిరి తయారు కావాలి. ఎలాంటి గోల్డ్? రోల్డ్ గోల్డ్ కాదు, ప్యూర్ గోల్డ్ గా తయారు కావాలి.
(ప.3.ఆ.96పు.262)
ఒక బంగారు ముద్దను మనము చేతిలో పెట్టుకొంటే మనకు అందం లేదు. ఆనందంలేదు. కాని, దానికి వెలఉంటున్నది. ఆ వెల ఉండినప్పటికి ప్రయోజనమేమిటి? మనకు ఆనందం రావాలంటే - ఆ బంగారు ముద్దనుముక్కలుగా కొట్టి, నిప్పులో వేసి కరిగించి, సుత్తితో కొట్టి కోసినప్పుడే అది ఒక అందమైన హారం గా తయారౌతుంది. అట్టి చక్కని హారాన్ని మనము మెడలో వేసికొని ఆనందించవచ్చును. ఈ విధంగా బంగారానికి ఈ కష్టాలను అందించకుండిన, అది అందముగా తయారు కాదు, మనం ఆనందాన్ని అనుభవించలేము. ప్రతి మానవుడు బంగారం వంటివాడే అందుచేతనే, అందరినీ నేను - "బంగారు! బంగారు!" అని సంబోధిస్తుంటాను. అనగా, నీవు చాలా విలువైనవాడవే. కాని, కొన్ని కష్టాలను, దుఃఖాలను కొంతవరకు శాంతముగా భరించుకోవాలి. అంతేగాని, మనకు కష్టాలు సంభవించినాయని మన మనస్సును మార్చుకోరాదు. ఒక ఉక్కుగుండును, ఎండుటాకును రెండింటిని ఒక చోట పెట్టినప్పుడు, గాలి ఎక్కువగా వీచనంత వరకు రెండూ నిశ్చలంగానే ఉంటాయి. కాని మలయమారుతం వస్తే, ఎండుటాకు ఏడుమైళ్ళు ఎగిరిపోతుంది. కాని ఉక్కుగుండు మాత్రం అక్కడే ఉంటుంది. మనం ప్రకృతమైన కష్టాలను దు:ఖములను భరించుకుంటూ భగవంతుని పై విశ్వాసం పెంచుకొన్నప్పుడు ఉక్కు గుండువలె ఉండవచ్చును. అట్టి విశ్వాసము లేనివాడు ఎండుటాకువలె ఎగిరిపోతాడు. కనుక, మొట్టమొదట విశ్వాసాన్ని పెంచుకోవాలి. ప్రజా క్షేమాన్ని ఆశించి మనము జగత్తులో సరియైన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఈ అహంకారమమకారములను పూర్తిగా త్యజించాలి.
(సపాఫి.మా.92పు 37/38)