పుట్టపైన మర్ధించిన పాము మరణమోందునా?
తనువును తాదండించిన విషయభోగములడుగునా?
ఆకలిదప్పులు మానినంత ఆత్మజ్ఞాని తానగునా?
తానెవరో తెలియకున్న తత్వజ్ఞానమెటు కుదురును?
తత్వజ్ఞానము కుదురవలెనన్న తానెవరో మొట్టమొదట గుర్తించ ప్రయత్నించాలి. మానవుడంటే యేమిటో అర్థము చేసుకోవాలి. ఎన్ని జన్మలు ఎత్తినప్పటికి దేహము నూతనముగానే వుంటుంది. మానవత్వము. దివ్యత్వముతో కూడిన ఆత్మతత్వమనియిది నిరూపిస్తుంది. విచారణ సల్పినప్పుడే దీని నిజస్వరూపము మనకు గోచరమవుతుంది. స్వస్వరూపసంధానమే దీనినిష్ట - ఇట్టి నిష్ఠనే జ్ఞానమునకు సరియైన ద్రష్ట ఈ ద్రష్ట యొక్క సందర్శనమే భక్తి ప్రభావము. ద్రష్టాధారము చేతనే దృష్టిని అభివృద్ధి పరచుకొని సృష్టిని అనుభవించాలి. అంతేకాని ఆకారము కూడినంత మాత్రమున మానవత్వమని అనుకోవటం అవివేకము.
(బ్బత్ర పు. 28, 29)
ధర్మవిరుద్ధ కామ, క్రోధ, లోభములు కూడనూ భగవత్ స్వరూపములని కృష్ణ పరమాత్మ అన్నాడు. కానీ, వేయేటికి, "సర్వభావములు, సర్వరూపములు, సర్వవస్తువులూ, నా అపరా పరాకృతివల్ల సంభవించినవే" అని అన్నాడు. కానీ ఉపాసకునకు ఉత్తమ భావన లేర్పడుటకోసం మొట్టమొదటిది, ఉత్తమభావం, ఉత్తమరూపం, ఉత్తమ భూతంలో నా స్వరూపమని తెలిపెను. ఇంత మాత్రమునకే మంచిది మాత్రము భగవత్ స్వరూప లక్షణములనియూ, తతిమావన్నియూ కాదనియూ తలంచుట తత్త్వజ్ఞానము కాదు. త్రిగుణములయిన రాజసిక, తామసిక, సాత్విక వస్తువులు, భూతములు, భావములూ భగవంతునియందే ఉద్భవించినవని స్థిరము చేసుకొనుటకు విచారణా, ప్రయత్నమూ జరుపవలెను. ఇట్టు ఆ భగవంతుడే స్వయముగా తెలిపెను.
“అర్జునా! అన్నియూ నాయందే పుట్టి, నాయందే వుండును. కాని నేను మాత్రము వాటి ఆధీనమందుండక వాటితో ఏ సంబంధమూ లేనివానివలె యుందును". ఇచ్చట రెండు దృష్టులు కలవు. ఒకటి జీవదృష్టి, రెండవది భగవత్ దృష్టి, జీవదృష్టిలో చూచినపుడు మంచి చెడ్డలను ద్వంద్వాలు కలవు. భగవత్ దృష్టిలో చూచినపుడు ద్వంద్యములు లేక సర్వమూ భగవంతుడే. మరేమీ లేదని సర్వ భూతాంత రాత్మ తత్వమును బోధించును.
(గీ.పు. 108/109)
తత్త్వజ్ఞాన దర్శనము - మోక్షాపేక్ష దృష్టి తప్ప మరేమీ లేకుండట.
(గీ.పు.214)