త్వమేవ మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ త్వమేవ విద్యాద్రణం త్వమేవ త్వమేవ సర్వం మమదేవ దేవ, జగత్తంతయు భగవంతుని స్వరూపమే. ప్రతి అణువునందు, ప్రతి కణము నందు ఉన్నది బ్రహ్మయే. కనిపించు పర్వతములు, గాలిని వీచు వృక్షములు, పారాడే పురుగులు, తినే తిండి, పీల్చేగాలి. ఎగిరే పక్షులు సర్వము బ్రహ్మస్వరూపమే.
చుక్కలన్నియు బ్రహ్మ సూర్యుండు అది బ్రహ్మ
చంద్రుడన్నను బ్రహ్మ జలము బ్రహ్మ
స్వర్గమన్నను బ్రహ్మ వైకుంఠమది బ్రహ్మ
తల్లియున్నను బ్రహ్మ మరి తండ్రి బ్రహ్మ
భాగ్యమన్నను బ్రహ్మ వాల్లభ్యమది బ్రహ్మ
జీవరాసులు బ్రహ్మ జీవిబ్రహ్మ
పుట్టించునది బ్రహ్మ పోషించునది బ్రహ్మ
గిట్టించునది బ్రహ్మ గృహిణి బ్రహ్మ
కర్మలన్నియు బ్రహ్మ కాలంబు బ్రహ్మ
ప్రకృతంతయు బ్రహ్మ మన ప్రేమ బ్రహ్మ
సర్వమును బ్రహ్మ ఈ మహాసభయు బ్రహ్మ
సత్యమును దెల్పునట్టి ఈ సాయి బ్రహ్మ
ఇంతకంటెను వేరెద్ది ఎరుకపరతు
సాధు సద్గుణ గణ్యులౌ సభ్యులార!
భగవంతుడు శక్తిమయుడు. ఆ శక్తియే ప్రకృతి యొక్క ప్రతిబింబము ప్రకృతి యందున్న సమస్త శక్తులు ప్రకృతిలో జీవించే ప్రతి మానవుని యందు ఉంటున్నది. కనుక భగవంతుడు, ప్రకృతి. జీవుడు ఈ మూడు బ్రహ్మతత్వములే. జీవుడు వేరు దేవుడు వేరు కాదు. జగత్తు వేరు జగదీశ్వరుడు వేరు కాదు. సర్వం విష్ణుమయం జగత్. విష్ణు పురాణము. ప్రకృతి కార్యము. కార్యకారణ స్వరూపుడే భగవంతుడు. భగవంతుని అన్వేషించుటకు ఎట్టి సాధనలు చేయనక్కరలేదు. మనిషి యందు సమస్త శక్తులు యిమిడి ఉన్నది. అజ్ఞాతమైన స్థాయిలో యిమిడి ఉంటున్నది. అజ్ఞాతమనగా ఏమిటి? తెలియని స్థితియే. పాండవులు పన్నెండు సంవత్సరములు అరణ్యవాసముచేసి ఒక సంవత్సరము అజ్ఞాత వాసము చేశారని, అజ్ఞాత వాసమనగా ఎవరికి తెలియకుండా జీవించటమే. అటులనే సమస్త శక్తులు మానవుని యందు అజ్ఞాత వాసము చేస్తున్నాయి.
(శ్రీస.పు.72/73)