అహంకారముతో కలుషితం కానటువంటి కానుకలు భగవంతుడు సంతోషంగా అందుకుంటాడు. గర్వంగా దర్పంగా ఇచ్చే కానుకలు ఆయన నిరాకరిస్తాడు. ఎంతో పరిమళం వెదజల్లే పుష్పాలు ఆయన పాదాల వద్ద నివేదించినప్పటికీ దుర్భర దుర్గంధ పూరితమైన చందంగా వాటిని తిరస్కరిస్తాడు.
(వ. 1963 పు. 54/55)
ఈ పుట్టిన రోజున స్వామికి ఇవ్వవలసిన కానుకను గురించి మీరాలోచించాలి. తోటి మానవులను ప్రేమించి వారి బాధలలో భాగం వహించి వారికి సేవలందించినప్పుడే స్వామికి మీరు సరియైన కానుక లిచ్చినట్లవుతుంది. నేను మీ నుండి దేనినీ ఆశించటం లేదు. అడగటం లేదు. ప్రేమను పెంచుకోండి. చాలమంది నాకు హ్యాపీ బర్త్ డే అని చెపుతున్నారు. నేను విచారంగా ఉన్న క్షణం లేదు; నాకు అనంతమైన ఆనందం ఉన్నది. కనుక, హ్యాపీగా లేనివారికి సంతోషాన్నివ్వండి. స్వామి సైన్యంలో మంచి ధీరులైన, సుశిక్షితులైన యోధులుగా మారి జయభేరి మ్రోగించండి. రామకృష్ణాద్యవతార సమయంలో బ్రతికి యుండియు అవతార రహస్యాన్ని తెలియలేక, వారిని పూజించక జీవితాన్ని గడిపినవాళ్ళ కన్న మీ అదృష్టం ఎంతో గొప్పది. భగవంతుడనే భావంతో మీరు దర్శన స్పర్శన సంభాషణ అవకాశములను పోగొట్టుకొనకుండా ఆ భావంతోనే పూజిస్తున్నారు. కదా! అది మీ భాగ్య విశేషమే!
(స.సా.శ. 99 వెనుక కవరు)
ప్రేమ స్వరూపులారా! ఇది ఈ దేహం యొక్క పుట్టిన రోజేగాని, నాకు పుట్టిన రోజు లేదు. నేడు స్వామి మీకు అందించే సందేశం ఏమంటే, స్వామియే మీరు, మీరే స్వామి. స్వామి ప్రత్యేకంగా లేడు. మిమ్మల్ని ఇక్కడికి ఎవరు ఆహ్వానించారు? స్వామిపై వున్న ప్రేమచేతనే మీ రిక్కడకు వచ్చారు. మీకు, నాకు మధ్య గల ప్రేమచేతనే ఇన్ని వేల మంది ఇక్కడకు చేరారు. I am always ready. నేనెప్పుడూ సిద్ధంగానే ఉన్నాను, తీసుకొని పొండి. ఎవరు హృదయ పూర్వకంగా ప్రేమిస్తారో వారి సొత్తునే నేను. | want only love, నాకు కావలసింది ప్రేమ ఒక్కటే. కనుక, ప్రేమచేత జీవితాన్ని గడపండి. ప్రేమలో మీ జీవితాన్ని లీనం చేయండి. ఇదే మీరు స్వామికి ఇవ్వవలసిన కానుకగా భావించండి. ఎవ్వరినీ ద్వేషించకండి. ఎందుకంటే, ఎవరిని ద్వేషించినా దైవాన్ని ద్వేషించిన వారౌతారు. మంచిగాని, చెడ్డగాని మీ సర్వస్వమును దైవానికి అర్పించండి.
(స. సా. డి. 99 పు. 354)