మనోనాశనము వలన కలిగిన మౌనమనేది విజమైన జ్ఞానము. ఈ జ్ఞానము తెలివితేటల వల్ల గాని లేక బుద్ధి కుశలత వలన గాని మరియే విధమైన ఆదర్శము వల్లగాని లభించేది కాదు. ఇది సహజము. ఇది కొత్తగా మనము సంపాదించుకొనే వస్తువు కాదు. నిగురు గప్పిన నిప్పువలె పాచికప్పిన జలమువలె, పొరకప్పిన కన్నువలె, మడినో భ్రాంతి కప్పిన ఆత్మగా నుండుటచేతనే యీ జ్ఞానమును మనము గుర్తించలేకపోతున్నాము. ఈ నివురు నిప్పు పైన ఎట్లా వచ్చింది? ఎక్కడ నుండి వచ్చింది? నిప్పు నుండి వచ్చింది? జలము పైన కప్పిన యీ పాచి ఎక్కడ నుండి వచ్చింది? జలము నుంచే వచ్చింది. మనకంటిలో పుట్టిన పొర బయట నుంచి వచ్చిందా? లేదు. మన కన్ను నుండియే ఆవిర్భవించింది. కప్పిన పొరను తీసివేస్తే స్వస్వరూపమైన తత్వము సాక్షాత్కరిస్తుంది.
జ్ఞానము గ్రంథాలవల్ల లభించేది కాదు. గురువులు ప్రసాదించేది కాదు. పరమాత్ముడు అందించేది కూడా కాదు. తానే పరమాత్మ, తానే జ్ఞానము తానే ఆత్మ.
(బృత్ర.పు, ౧౩౩ )
తమ నిమిత్తము తాము ఆచరించే కర్మలు, కర్మజీవులు ఆచరించే కర్మలు, లోక కళ్యాణ నిమిత్తమై ఆచరించకర్మలు జ్ఞానానికి సంబంధించినవి. జ్ఞాన జ్ఞానముల సమన్వయమును మనము చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి. దేహాభిమానము త్యజించి, ఆత్మాభిమానమును అభివృద్ధి పరచుకొని, అహంకారమును నిర్మూలనము చేసికొనడమే నిజమైన జ్ఞానము - ఇది సంసారికి గాని, సన్యాసికిగాని, సహజమైనదే. విత్తనము మొక్కై, వృక్షమై, అది ఆకులు, కొమ్మలు, పువ్వులు, కాయలు మొదలయిన వివిధ నామ రూపములుగా గోచరించినప్పటికిని, అన్నియు విత్తనము నుంచే ఆవిర్భవించినవియే. ఇదే సత్యము ఇదే నియమము ఇదే తత్త్వమసి.
(సాపు. 382)
"జ్ఞానేన హీనాః పశుభిస్సమానాః?" అనగా జ్ఞానహీనులయిన వారు పశువులతో సమానము అనబడుచున్నారు. జ్ఞానమే సర్వానర్థ నివృత్తికరమైన శాశ్వతానందమోక్షమని కూడా వేదము ఒప్పుకొనుచున్నది. అట్టి స్థానమునకు అనేక మార్గములున్ననూ, భక్తి ముఖ్యసాధనమై వెలసియున్నది. అందుకనే వశిష్ట, నారద, వ్యాస, జయదేవ, గౌరాంగ, ఇత్యాది మహాపురుషులు, మహానీయులు కూడ ఆ మార్గమును అవలంబించిరి.
(జ్ఞావా పుట 33)
జీర్ణకోశాలు దేహాన ఎవరు చేర్చి
జనన మరణాలు ఎవరిచే కలుగు చుండు
వాని నెరుగంగ నేర్చుటే జ్ఞానమగును
ఉన్న మాట తెలుపు చున్న మాట.
(భ.స ప్ర పం పు.18)
తనకంటే భగవంతుడు అవ్యముగా యెక్కడో ఉన్నాడను భావమే పరోక్షజ్ఞానము. సర్వవ్యాపి అయిన పరమాత్ముడు నాలోనే ఆత్మ స్వరూపమున ఉన్నాడను భావమే అపరోక్షజ్ఞానము. సర్వకర్మలు భగవత్పరముగా నొనర్చినవారికి చిత్తబుద్ధి కలుగునని తెలిపెను. భగవంతుని జన్మకర్మలు దివ్యములని తెలిసి కొమ్మనెను. అయితే మహనీయులు మాత్రమే దివ్యకర్మ జన్మలను గుర్తెరుగుచున్నారు. అందరికీ సాధ్యమయ్యేది కాదు. అట్లని అంతటితో ప్రయత్నమును మానకూడదు. ధ్యమైనంతవరకు ప్రయత్నలోపము లేకుండా రాకుండా చూచుకొనవలెను.
(గీ.పు. 65)
జ్ఞానమును తండ్రిలాగా గౌరవించండి. ప్రేమను తల్లిలాగా ఆరాధించండి . ధర్మమును సోదరునిలాగా భావించి కలిసి మెలగండి. దయను ఆప్తమిత్రునిలాగా విశ్వసించండి. శాంతమును మీ అర్ధాంగిని చేసుకోండి. సహనమును మీ ప్రియపుత్రునిగా తలచండి. ఇవే మీకు నిజమైన బంధు వులు. వాళ్లతో కలిసి మెలిసి కాలం గడపండి. ఈ బంధువులను వదల కండి. నిర్లక్ష్యం చేయకండి.. ((శ్రీ సత్య సాయి వచనా మృ తము 1963 పు 120)