మనసు / మనస్సు

ఈనాడు మానవుడు మనసు (Mind) పదార్ధము (Matter) యొక్క తేడాను గుర్తించలేకపోతున్నాడు. మనసును గుర్తించినవాడే మహనీయుడు. ఈ మనసు యొక్క స్వరూపమేమిటి? ఇది ఎక్కడ నుంచి ఆవిర్భవించింది? దీని యొక్క Nature ఏమిటి? అని విచారణ చేస్తే, ఆత్మకు మూడు శక్తులు ఉన్నాయి. 1. మనసు 2. బుద్ధి, 3. సంకల్పం. మనోబుద్ధుల సంకల్పముల స్వరూపమే ఆత్మ . కనుక ఆత్మ నుండి ఆవిర్భవించినదే ఈ మనసు ఈ మనసు యొక్క విశాలతను వర్ణించుటకు సాధ్యము కాదు. దీనినే సంస్కృతము నందు

"సర్వతః పాణిపాదం తత్సర్వతోక్షి శిరోముఖమ్

సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి "

దీనిని సంకల్పించిన మనసు ఎంత దూరమైనా క్షణంలో ప్రయాణం చేస్తుంది. సర్వత్రా క్షణములో వ్యాపించి పోతుంది. ఈ మనసు యొక్క శక్తిని ఎవ్వరూ గుర్తించలేదు, విచారించలేరు. దీనిని వర్ణించుటకు భాషయే చాలదు. కనుక మనసు యొక్క శక్తి ఇట్టిదీ, అట్టిదీ అని చెప్పుట సాధ్యం కాదు. మనసు అనే శక్తి లేకుండా, ఏ చిన్న కార్యాన్నయినా సాధించలేము. ఈ మనసుకు రూపం లేదు. మనసు చేసేదంతయూ, ఆత్మ శక్తి ద్వారానే చేస్తుంటుంది. లోపలనున్న ఆత్మ. ఈ మనసు ద్వారా, ప్రపంచంలో సర్వకర్మలన ఆచరిస్తూ వస్తున్నది. ఈమనోవికారములు, మనో వికాసములు గుర్తించవలెననిన ఎన్ని సంవత్సరములు అయినా చాలదు. కొన్ని యుగములకైనా వీలుకాదు.

 

రెండవది బుద్ధి. ఇది ప్రకాశవంతమైనటువంటిది. వికాసవంతమైనటువంటిది. విచారణ చేయటమే ఈ బుద్ధి యొక్క సత్యం . ఆ Discrimination లోపల కూడనూ, స్వార్థస్వప్రయోజనములకు ఏమాత్రం స్థానం లేకుండా చేయగలదు ఈ బుద్ధి.

 

మూడవది సంకల్పము. ఈ సంకల్పములు ఈ జన్మలో చేసినవేగాక, వచ్చే జన్మలో కూడా ఇంకా ఎన్నియో దీని ఫలితములను అందిస్తూ వస్తుంటుంది. ఇది సంస్కారవంతమైనది. సంస్కారమనగా ఏమిటి? చెడును దూరం చేసి మంచిని పోషించటమే. నిత్యజీవితంలో మనం ఏ కర్మల నాచరిస్తుంటామో, ఆ కర్మల యొక్క దోషములను నిర్మూలనం గావించి, దోషరహితమైన కర్మలుగా తీర్చిదిద్దుకోవటమే సంస్కారం.

(శ్రీ. ఫి. 2002 పు. 28)

 

మనస్సు నిన్ను పీడించడం లేదు. సమస్తము దాని వినియోగంపై ఆధారపడియున్నది. మనస్సు సర్వత్ర వ్యాపించింది. దీనిలో చేరితే ఆ రూపాన్ని పొందుతుంది. మనస్సుకు మరణం లేదు. అందువల్లనే "మనో మూల మిదం జగత్" అన్నారు. అట్టి మనస్సు నాశనం కాదు. కనుక, మనోనాశనమన్న పదం సరియైనది కాదు. నీవు కోరవలసింది మనోనాశనం కాదు, మనోలయాన్ని కోరాలి. నది సముద్రంలో కలుస్తుంది. అదేరీతిగా మనస్సు ఆత్మలో లయం కావాలి. పరమాత్మలో లీనం కావాలి. ఇదీ మనోలయమంటే! మాధవునికి అర్పితమైన మనస్సు రామదాసుగా మారి పూజార్హమౌతుంది. వానరమూర్తియైనఆంజనేయస్వామి రామదాసుగా వాసికెక్కి పూజలందు కుంటున్నాడు. కాని, మానవుడు మనస్సుని కామదాసునిగా చేసి పతనమౌతున్నాడు. మనస్సు కలిమి, బలిమి, చెలిమిలపై ప్రసరించకూడదు. భగవంతునిపై నిలిచి తన్మయం కావాలి.

(స. సా...2000పు.190)

 

మనస్సు ఒకకోతి. దీనికి విషయవాసన అనే మద్యముత్రాపిన తరువాత, ఇంక గుణములలో ఉన్నటువంటి రౌద్రములనే తేళ్ళు కుట్టిన తరువాత దీనికి ప్రపంచ వ్యామోహమనే పిచ్చికూడను పడుతుంది. కనుక ఈ పరిస్థితియందు మానవుడు ఏరీతిగా మనస్సును అరికట్టడం? దేహమునకుగాని, ఈ మానవత్వమునకు గానీ విమోచన లేదా?

 

ఈనాటి యువకులకు ఒక ఘోరమైన వ్యాధి పట్టింది. అది ఏదనగా యవ్వనసన్నిపాతము. ఇది మానవత్వములో ఉన్నటువంటి దివ్యత్వమును మరిపింపచేస్తుండాది.

(ఆ.రా.పు.102)

 

 

మనసును కోతి కుక్క అని తిట్టరాదు. అది చెప్పినట్లు వింటుంది. సాధనలక్షణాల్ని పట్టి గురువుపదేశాన్ని బట్టి, మంచి రోడ్డులో తీసుకొని వచ్చి దివ్యత్వమనే సింహ ద్వారానికి చేరుస్తుంది. లేకపోతే సందుగొందులకు తిప్పి ముళ్లలో పడవేస్తుంది. మనస్సును చక్కచేస్తే అదే మంచి మార్గమును చూపిస్తుంది. "మనయేవ మనుష్యాణాం, కారణం బంధమోక్షయోః ...బంధనానికి మోక్షానికి రెండింటికి మనసే కారణం. దీనికి కృతజ్ఞతను చూపించ వలయును.

(సు.పు.50)

 

మనసును ఆయుధంబునిదె మానవ జాతికి యిచ్చెతొల్లి ఆ

మనసుని శిక్షలో నిల్పు మానవుడే విజయుండు భూమిపై

మనసుకు దాసుడైనమహి మానవుడెన్నడు శాంతి సౌఖ్యముల్

కనుగొనజూచినట్లు వినిపింపగ గలదు స్వప్నమందునన్.

ప్రేమస్వరూపులారా! మానవజాతికి మనస్సనే ఒక పదునైన కత్తి అందించబడినది. ప్రప్రథములో మానవుడు ఈ మనస్సు యొక్క తత్వాన్ని గుర్తించి వర్తించినప్పుడే మానవత్వము సార్థకమవుతుంది. మనస్సు బలవత్తర మరైనది. మనస్సు చాలా వేగముగా పరిగెట్టేటటువంటిది. మనస్సు ఆకాశము కంటే తేలికైనది. విద్యుచ్ఛక్తి కంటే సూక్షమయినది. ఇట్టి మనస్తత్వాన్ని మానవుడు గుర్తించుకొనలేక మనస్సును పెడమార్గములలో ఉపయోగపెట్టి అనేక విధములైన దుఃఖములకు విచారములకు గురియగుచున్నాడు. మనస్సు ప్రకాశము కంటే అతి వేగముగా పరిగెట్టుకుంది..

(శ్రీ.స.ది.పు59)

 

ఈ మానవత్వంలో పలనే నాలుగు విధములైన మార్పులు ఉంటూన్నయి. 1. Super Mind. 2. Higher Mind 3. Illumination Mind 4.Over Mind. ఈ నాల్గవ స్థితిని పొందుతుంది. దీనికి పూర్వం Ilumination Mind ఇది కరెంటుతో సంబంధమైనటువంటిది. మానవదేహమంతా కరెంటులోనే ఉంటంది. ఈ దేహమే ఒక పెద్ద జనరేటర్. కనుక ఇది చాలా శక్తివంతమైనది. దీనికి పూర్వం Higher Mind. ఇది పంచభూతములకు అతీతమైనది. అట్టి స్థితికి రావాలంటే మొట్టమొదట Super Mindలో ప్రవేశించాలి. అసలు ఈ Super Mind అంటే ఏమిటి? Body Consicousness దేహమునందు వుండినటువంటి ఆత్మతత్త్వమే Consicousness. కాన్షన్నెస్ అనేటటువంటిది దేహంలో సర్వత్రా వ్యాపించి ఉంటున్నది. కనుకనే దీనిని Body Consciouness అన్నారు. క్రమక్రమేణ ఆది Higher Mind కు పోయేటప్పటికి, Body Consciouness ను కేవలం Thought Consciousness అంటారు. దగ్గరగా వున్నప్పుడు దేహమును ఎవరైనా రెండు కొట్టవచ్చును. ఆది Personal Connection గా ఉంటుంది.కాని Thought Consciousness అనేది ఎంత దూరమైన ప్రయాణం చేస్తుంది. కనుక ఇది Higher Mind కు సంబంధించినటువంటిది. తరువాత Illumination Mind. దీనిలో కాలిగోళ్ళ లోపల, తలవెంట్రుకలలో కూడా కరెంటు ఉంటుంది. ఒక్కొక్క పర్యాయం కాలి వేళ్ళగోళ్ళు తీస్తుంటే, షాక్ కొట్టినట్లుగా ఉంటుంది. అయితే ప్రాకృతమైన భావములలో ఇమిడినటువంటివానికి ఇది ఏమీ తెలియదు. కనుకనేప్రాచీన ఋషులు గోళ్ళు పెంచుకునేవారు. అందులో కరెంటు ఇమిడి ఉన్నది. వారి హృదయములన్నీ పవిత్రమైన ఆలోచనలలో అభివృద్ధి అవుతూ వచ్చాయి. వారి చింతనభగవత్ చింత. వారి భావన భగవత్ భావనే. వారు చేసే సర్వకార్యములు భగవత్ కర్మలే. అందువలనే వారిలో శక్తివంతమైన కరెంటు వుండేది. అలాంటివారి వెంట్రుకలయందు కూడనూ కరెంటు వుంటుంది. ఆ వెంట్రుకలు ముట్టినా షాక్ కొడుతుంది. సామాన్యమైన మానవునియందు కూడనూ ఈ కరెంటు ఉంటుంది. ఈ విద్యుచ్ఛక్తి లోపల ఉన్నది. Heart అనేది పంపు సెట్టు వంటిది. ఆది పంపుకొడుతుంటే శరీరమంతా కరెంటుప్రాకుతుంటుంది. ఊపిరితిత్తులు (Lungs) ఉన్నాయి. ఇవే Thoughts (ఆలోచనలు) కు ప్రధానమైనటువంటి పంపు. దీనిని డాక్టర్సు మరొక రీతిగా భావిస్తుంటారు. దేహములోని రక్తము ఊపిరితిత్తులలోనికి వెళ్ళి అక్కడ ఆక్సిజన్లో పరిశుభ్రంగావించబడి, తరువాత దేహమంతా పంపుజేయు బడుతుందని డాక్టర్లు అంటారు. అది కాదు. ఊపిరితిత్తుల యందున్న ప్రాణశక్తి, వైబ్రేషన్ ద్వారా ఆ సంకల్పశక్తి చేత కరెంటుగా మారిపోతుంది. ఆ కరెంటు అనేది ఎంత దూరమైన ప్రయాణం చేస్తుంది. ఇక్కడ జనరేటర్ పెట్టి ఆడిస్తే, దూరంగావున్న బల్బులు కూడా వెలుగుతాయి. అదే విధముగానే, హృదయము నందు అనగా గుండెయందు,లేక ఊపిరితిత్తులయందు ఆ పవిత్రమైన భావములు, జెనరేటర్‌వలె, ఊపిరితిత్తులు పంపు కొట్టినటువంటివి గుండెకు చేరుతాయి. హార్ట్ పంపు కొట్టినప్పుడల్లా, రక్తము 12వేల మైళ్ళ దూరం ప్రయాణం చేస్తుంది. అనగా ఒక్క తూరి పంపుకొడితేచాలు, 12వేల మైళ్ళు రక్తం ప్రయాణం చేస్తుంది. మన దేహములోవున్న చిన్న నరాలు, పెద్ద నరాలు అన్ని ఒకదానికొకటి కలుపుకుంటూపోతే 12వేల మైళ్ళు పాడవు ఉంటాయి. పంపు కొట్టినప్పుడల్లా, రక్తం 12 వేల మైళ్ళు ప్రయాణం చేస్తుంది. కరెంటు జనరేటర్తో సమానమైనటువంటిది మన గుండె (Heart. దీనినే Illumination Mind అన్నారు. దీనిలో వున్న ఆత్మశక్తి, దివ్యశక్తిగా మారుతుంది.

 

దేహము అన్నమయప్రాణము. మనసు, ప్రాణము, బుద్ధి - ఇవన్ని సూక్ష్మమైన ప్రాణము. సర్వదుఃఖములను, బాధలను, కష్టములను, సుఖములను అన్నింటిని అనుభవించేది అదే. ఈ దేహము కేవలం జడమైనటువంటిది. llumination Mind వద్దకు వచ్చేటప్పటికీ Mind అంతా మారిపోతుంది. దీనిని సూక్ష్మమైన ప్రాణము అన్నారు. దీనిలో మూడు ఉంటున్నాయి. 1. ప్రాణశక్తి 2. మనోశక్తి 3. ఆత్మ శక్తి. ఈ మూడింటి యొక్క ఏకత్వంచేతనే, విజ్ఞానమనేది మనస్సును ప్రాణంగా మార్చివేస్తుంది. ఇది ఏ డాక్టర్ కు గాని, ఇంజనీర్ కు గాని అర్ధం కాదు. ఈ దేహములో ఏ భాగమునకైనా మనం విశ్రాంతి (Rest) నివ్వవచ్చును. కాని Heart కు మాత్రం యిచ్చేవారు ఎవరూలేరు. దీనికి విశ్రాంతిలేదు. నిద్రపోతున్నా, నడుస్తున్నా ఆ గుండె ఆడుతునే ఉంటుంది. దీనిని ఏ డాక్టర్ కని పెట్టాడు? ఏ సైంటిస్ట్ కనిపెట్టాడు? ఏ ఇంజనీరు కనిపెట్టాడు? ఇంతేకాదు, మన కన్నులయందు 13 లక్షల నరములుంటున్నాయి. ఇన్ని నరములు ఈ కంటిలో వుండటానికి కారణమేమి? వీటిని యిక్కడ ఎవరు చేర్చారు. ఇదంతా భగవంతుని సృష్టియే. భగవంతుని సృష్టిలోపల చిత్రవిచిత్రము లెన్నియో ఉన్నాయి.

 

చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు

భవలతాల విచిత్రంబులు సన్మిత్రంబులు

మునిజనవన చైత్రంబులు

విష్ణుదేవు చారిత్రంబుల్

 

సర్వమూ మానవునియందే ఇమిడి ఉంటున్నాయి. కన్నులు తెరచినప్పుడు ఎన్నో వేలమంది కనిపిస్తారు. కన్నులు మూసుకున్నప్పుడు, అంతర్ దృష్టిగా మార్చుకున్నప్పుడు అంతా శూన్యమైపోతుంది. కనుక కన్నులయందుండి నంతా కూడనూ ఆంతర్ దృష్టికోసం పెట్టారేగాని, బహిర్ దృష్టికోసం కాదు. దేవాలయానికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవాలని ఆశిస్తుంటారు. కాని దేవాలయం వరకు వెళ్ళుతారు. దేవుని దగ్గరకు వెళ్ళటంతోనే కండ్లు మూసు కుంటారు. కండ్లు మూసుకోవటానికి దేవాలయానికి ఎందుకుపోవాలి? బయటనుంచి దేవాలయానికి పోవాలి!పోవాలి! అని వస్తారు. దేవుని విగ్రహం ముందునుంచొని కండ్లు మూసుకుంటారు. కారణమేమిటి? దీని అంతరార్థమేమిటి? భగవంతుని చర్మచక్షువులతో కాదు చూడవలసింది. జ్ఞానచక్షువులతో చూడాలి. కర్మచక్షువులను మూసుకో? అప్పుడు జ్ఞానచక్షువులు అభివృద్ధి అవుతాయి. అందు వలననే ధ్యాన సమయమందు కన్నులు మూసుకొని ధ్యానం చేస్తారు. ఆ పవిత్రరూపమును నీవు లోపల భద్రపరచు కోవాలి. బయట చిత్రములంతా Reflection, Reaction, Resound. అయితే ఈనాడు తనతో కూడినదానిని ఆశిస్తున్నాం. Real (యదార్థమును) దానిని మనం చూడటం లేదు. కనుక Illumination Mind అనేటటువంటిది కరెంటుతో సమానమైనటువంటిది. అదియే జ్ఞానశక్తి.

 

దేహము అన్నమయప్రాణము. మనసు, బుద్ధి, చిత్తముఈ మూడూ చేరినప్పుడు అది సూక్ష్మమయప్రాణంగా మారుతుంది. కారణం దేహము నిజమైనటువంటి Illumination. దీని యందు ఏరూపనామములుగాని, అవస్థలుగానీ, ఒక్కటీ మనకు తెలియవు. ఇది ఎట్లాగనగా "రాత్రి మనం పడుకునేముందు అన్నీ చూస్తాము. అన్ని పనులు చేస్తాము. కాని నిద్రవచ్చేటప్పటికీ దేనినీ చూడలేము, ఏపనుములు చేయలేము. అప్పుడు ఈ మనసు ఎక్కడ ఉన్నది? స్థితినే Illumination Mind అంటారు. అది అన్నింటిని సృష్టిస్తుంది. అన్ని స్థానములకు ప్రయాణిస్తుంది. అన్ని పనులు చేస్తుంది. ఎట్లా చేస్తుంది? మనకు నిద్రలో స్వప్నాలు వస్తుంటాయి. నీవు ప్రశాంతి నిలయంలో ఉన్నావు. కాని కలలో నీవు అమెరికాలో వుండినట్లుగా కనిపిస్తుంది. అమెరికాకు పోయింది ఎవరు? నీ దేహము యిక్కడనే ఉన్నది గదా! ఈ భావమును illumination Mind అంటారు. ఇది ప్రపంచమంతా చుట్టి వస్తుంది. దీనికి ఒక రూపము. నామములేదు. అన్ని పనులూ చేస్తుంది. కాని దానికి ప్రాకృతమైన బుద్దులు లేవు, అరిషడ్వర్గములు ఏమాత్రం దానిలో కనిపించవు. కనుకఈ Illumination Mind కు  Thoughts Mind నుంచి మనం ప్రయాణం చేయాలి. ఈ ప్రాకృతమైన ఆలోచనలను మనం అరికట్టుకున్నప్పుడే Illumination Mind కండ్లు తెరుస్తుంది. ఈ Thoughts (ఆలోచనలు)ను మనం అరికట్టుకోవాలంటే Super Mind లో మనం ప్రవేశించాలి

 

Super Mind అంటే ఏమిటి? Super Mind మనసుకు ఆతీతమైనటువంటిది. మనం ఒక పుస్తకమును చదువుతున్నాం. చదువుతున్నప్పుడు, దానిలోని విషయాలన్నీ లోపల చేరుతాయి. కాని కాగితములలో చదివినదంతా, నీమనసులో చేరిపోతాయి. కనుక ఇది ఒక ఆకారము లేనటువంటిది Super Mind దీనికొక ఆచారములేదు. దీనికి మొట్టమొదట ఆధారమేమిటి? Fundamental ఏమిటి? Super Love ఒక్కటే. అనగా ఎట్టి వాంఛలూ లేనటువంటి ప్రేమయే దీనికి ప్రధానం. కనుకనే Love is God, Live in Love అన్నారు. మానవుడు లేచిన దగ్గర నుంచి పడుకునేంతవరకు ప్రేమలోనే జీవిస్తున్నాడు. కనుకనే నేను ఎప్పుడూ చెబుతుంటాను.

 

Start the Day with Love

Fill the Day with Love

End the Day with Love

This is the way to God.

 

మనం మొట్టమొదట ఈ ప్రేమను కొంతవరకు దేహరీతిలో అనుభవించాలి. లేస్తూనే ఏ చింతనలూ చేయకుండా, నిర్మలమైన ప్రేమతో లేవండి. దీనికి కారణమేమిటి? తల్లి యొక్క భావములే దీనికి మూల కారణం. తల్లిదండ్రులు లేస్తూనే తిట్టుకుంటూలేస్తుంటే,

పిల్లలు కూడనూ కొట్టుకుంటూ బయలుదేరుతారు. కనుక ఇట్టి దృశ్యములు కూడనూ పిల్లల మీద ప్రభావం చూపుతుంటాయి. పుట్టిన బిడ్డకు ఎట్టి తలంపులూ, ఎట్టి వాంఛలూ ఉండువు. ఎట్టి ఆశలూ ఉండవు. కాని పెరుగుతున్న కొద్దీ ఈ కోరికలు అభివృద్ధి అవుతుంటాయి. మానవుడు బంధనలలో పడిపోతున్నాడు. కనుక మన Mind అనేటటువంటిది భగవత్ ప్రేమతో ప్రారంభం కావాలి. అన్ని చింతనలనూ మరిచిపోయి క్రమక్రమేణా దీనిని ప్రాక్టీస్ చేయాలి."

 

"శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్, జ్ఞానాధ్యానం విశిష్యతే, ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగేనైకే అమృతత్వ మానశుః?"ప్రతి దానికి ప్రాక్టీస్ ఉండాలి. Walking Practice, Talking Practice, Eating Practice ఉండాలి. అన్నింటిలో Practice ఉండాలి. కనుకనే ఈ ఆధ్యాత్మికమును ప్రేమతో మనం ప్రారంభించాలి. ఆ ప్రేమను పెంచుకుంటూ పోవాలి.

ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకుంటూపోతే ఏకాత్మభావం ఏర్పడుతుంది. వసుధైక కుటుంబంగా మారిపోతుంది.

ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకుంటూపోతూ, తరువాత Thoughts Mind కు పోవాలి. బహిరముఖంగా చేసేటటువంటివి నిలబెట్టుకొని, Thoughts లో వాటిని అభివృద్ధి పరచుకోండి. ఈ Thoughts Mind నుండి క్రమక్రమేణా Illumination Mind కుపోవాలి. అందులోనికి పోయేటప్పటికీ Thoughts కూడా ఉండవు. ఏదీ ఉండదు. కరెంటు ఇనుమును కూడా ముద్ద చేస్తుంది. అదే విధంగా మంచి చెడ్డలనన్నింటిని భస్మం చేస్తుంది. దానినే ఆధ్యాత్మికంలో సమాధి స్థితి: అన్నారు. సమాధి అనగా సమ+అధి=సమాధి. మంచి చెడ్డలను రెండింటిని ఏకం చేస్తుంది. ఏకాత్మభావమును అభివృద్ధి పరుస్తుంది. కనుక మనం ఇప్పుడు చేయవలసింది ఏమిటి? ప్రేమతో అందరికీ సేవ చేయండి. ఎవరికి చేసినా అది భగవంతునికి చేసినట్లుగా భావించండి. భేదభావములకు చోటివ్వకండి. నేను ధనవంతుడను, వాడు పేదవాడని భావించకండి. ఎవరు ధనవంతుడు? ఎవరు పేదవాడు? He, who has much Desires is a Poor Man. He who has much more satisfaction is the Richest Man. తృప్తిగలవాడు ధనవంతుడు. వాంఛలు పెంచుకుంటూ పోయేవాడు బీదవాడు. కనుక వాంఛలు క్రమక్రమేణా తగ్గించుకుంటూ పోండి. Less luggage more comfort make travel a Pleasure. మన ఈజీవన ప్రయాణం లోపల కోరికలు అనే సామానును తగ్గించుకోవాలి. కనుకనే దీనికి సమాధి అని పేరు వచ్చింది. కోరికలు ఎంత తగ్గుతాయో, అంతమనోశక్తి అభివృద్ధి అవుతుంది. అన్నింటికీ చావు ఉన్నదిగాని Mind కు చావులేదు. అన్నింటికీ మనసే మూలకారణం. ఆ మనసే ఆత్మగా మారిపోతుంది. అయితే లౌకిక వాంఛలతో చేరిన మనసు, అది మనసే కాదు. దానిని సరియైన దారిలోనికి తెచ్చుకోవటం లేదు. కనుక దీనిని క్రమక్రమేణా అభివృద్ధి పరచుకొని, ఉత్తమమైన భావములతో పెంచుకోవాలి. పవిత్రమైన భావములతో నింపుకోవాలి. నిర్మలమైన, నిశ్చలమైన భావములను పెంచుకోవాలి. అప్పుడే మనం Illumination Mind ను అభివృద్ధి పరచుకోగలుగుతాం. దీనిని చేరుకున్నప్పుడు అవి Over Mind అయిపోతుంది. ఇది మనసుకు అతీతమైనది. దీనినే "అమనస్కము" అన్నారు వేదాంతములో.

 

అమనస్కమనగా మనసు లేనటువంటిది. కనక ఇలాంటి మనసు లేనటువంటి స్థితికి మనం చేరాలి. ఇట్టి స్థితిలో ఒక్క ఆత్మ మాత్రమే మనకు కనిపిస్తుంది. దీనినే కాన్ ష స్ నెస్ అన్నారు. ఎలాంటి కాన్ షస్నెస్ . ఇది Super Consciousness. Divine Consciousness కాదు. ఇది ఎప్పుడు వస్తుంది? కాని Over Mind అనేది Super Consciousness. కనుక మనం ఎంతటి స్థాయి వరకైనా చేరవచ్చును. ఆ శక్తి మానవుని యందుంటున్నది. సాధనలలో దేనినైనా సాధించవచ్చును. సాధనల వలన పనులు సమకూరు ధరలోన" ఒక చిన్న చీమ నడుస్తూ, నడుస్తూ ఎంత దూరమైనా ప్రయాణం చేస్తుంది. పెద్ద రెక్కలు గల గ్రద్ద, ప్రయత్నం చేయకపోతే అక్కడనే పడి ఉంటుంది. అసలు రెక్కలే లేకపోతే అసలే ఎగురలేదు. కనుక ప్రేమ, సేవలు రెండు రెక్కలు మనకు. ఈ రెండు రెక్కలను మనం భద్రంగా పోషించుకుంటూ, ఎంత దూరమైనా ప్రయాణం చేయవచ్చును. ఈ రెండు భద్రం చేసుకొని, నిస్వార్థమైన సేవలుచేసి, నిరహంకారమైనప్రేమను పెంచుకొనినప్పుడు, మనం ఎంతటి ఉన్నత స్థితికైనా చేరుకోవచ్చును. ఎందరో మహానుభావులు ఇలాంటి పవిత్రమైన సేవలు చేసి సద్గతిని పొందారు. కానిమనం ఈనాడు కొన్ని నిమిషాలు కూడా కూర్చోలేక పోతున్నాము. ప్రాచీనులు కూర్చుంటే, ఎన్ని వత్సరాలైనా కదలకుండ కూర్చొనేవారు. ఈనాడు మనం నరముల వలన, రక్తం వలన ఈ దేహం కదులుతున్నదనిభావిస్తున్నాం . ఆ illumination Mind దగ్గరకు వచ్చేటప్పటికి రక్తప్రసరణ కూడా ఆగిపోతుంది. రక్త ప్రసరణ ఆగినప్పుడు, దేహం పాడైపోతుందని భావిస్తుంటారు. కాదు.... కాదు...... (Super Blood) వచ్చేస్తుంది. అదే దీనిని అంతా కదలించి వేస్తుంటుంది. ఈ సూపర్ బ్లడ్ అంతా సుపీరియర్ గానే ఉంటుంది. దీనిని పురస్కరించు కొనియే వేదమునందు రసోవైసః అన్నారు. రసము మంచి రసమే వస్తుందిగాని, నీ రసం రాదు. ఏది చూచినా, ఏది చేసినా ఏది అనుభవించినా అంతా రసస్వరూపమే. పానకంలో అంతా పంచదారవేసే మూర్ఖుడు ఎవడైనా ఉంటాడా? ఆ పానకం అంతా పంచదారలోనే నిండి ఉంటుంది. పంచదార లేకపోతే పానకమే (Syrup) కాదు. కాబట్టి ఈ పానకంలో పంచదార ఉంటుంది. అదియే దివ్యశక్తి. ఆ శక్తి వుండటంచేతనే సర్వత్రా దివ్యశక్తిగా మారిపోతున్నది. అయితే మానవుని ఏ శక్తిలేని బలహీనునిగా భావిస్తున్నాం. తెలియనటువంటివాడే ఈ విధంగా బలహీనుడుగా భావిస్తాడు. సర్వమూ తనయందే ఉన్నదనే సత్యాన్ని గుర్తించిన వ్యక్తి ఎంతైనా ఆనందాన్ని అనుభవిస్తాడు.

 

ప్రేమకు ఒక రూపంలేదు. ప్రేమకు ఒక్క నామం మాత్రమే ఉన్నది. ఈ నామమే సర్వమునూ అభివృద్ధి పరుస్తుంది. మనకు మనమే రూపములను కల్పించుకుంటున్నాం. ఆలాంటి రూపరహితమైనటువంటి తత్త్వానికి మనమే రూపములను కలిపించుకొని ఊహిస్తున్నాం. దైవమునకు ఎట్టి భావమూలేదు. ఎట్టి రూపమూలేదు. కాని నీ తృప్తి నిమిత్తమే ఒక ఆకారము కావాలి. అదియే అవతారం. వచ్చి, ఆ విధంగా బోధిస్తూ వస్తుంది. సృష్టించేదితానే, రక్షించేదితానే, శిక్షించేదితానే. కాని మనం పుట్టుకకు ఒక మంత్రిని పోషణకు ఒక మంత్రిని, చావుకు ఒక మంత్రిని, పెట్టుకుంటున్నాం. కానీ ఇవన్నీ భగవంతునికి అధీనంలోనే ఉంటుంటాయి. కనుక మనం ఒక్క భగవంతునికి అర్పితం చేస్తే చాలు, సర్వదేవతలకూ వర్తిస్తుంది. అదేవిధంగా నీవు చేసే సేవలన్నీ భతవంతునికి చేస్తున్నా మనుకుంటే, అదే భగవత్ స్వరూపంగా మారిపోతుంది. ఎవరికి సేవ చేస్తున్నా, భగవంతునికి చేసే సేవయని భావించండి. ఎందుకంటే ఈశ్వరస్సర్వభూతానాం . అన్ని భూతములయందూ దేవుడు ఉంటున్నాడు. నీకు కనిపించనటువంటి దేవుడుగా ఒకటి ప్రత్యక్షం, మరొకటి పరోక్షము. ఇది బింబము. అది ప్రతిబింబము. ఇది Action. అది Reaction. అన్నింటి యందునూ ఆ విధంగా వస్తుంటుంది. రెండులేనే లేవు. కాని కలిపించేది మాత్రం అట్లా కనిపిస్తుంటుంది. ఒక సినిమాలో తెర వుంటుంది. ఆ తెరలో పెద్ద పర్వతాలు మండిపోతున్నట్లుగా కనిపిస్తుంది. అదే విధముగ బాహ్యదృష్టికి అన్ని కనిపిస్తున్నాయిగాని, Illumination Mind కు మాత్రం అది కనిపించదు. దానినే "దివ్యశక్తి అన్నారు. ఆ దివ్యశక్తి సర్వులయందూనూ ఉంటున్నది. ఇది లేనటువంటి వ్యక్తే మనకు కనిపించడు. కాని ఆ సత్యమును గుర్తించుకోలేక పోవటం వలన. ఎక్కడెక్కడో వెదుకుతున్నాం. కొంత కాలం దీనిని ప్రేమలోనే ప్రాక్టీస్ చేయాలి. అందరినీ మనం ప్రేమించాలి. అప్పుడు అందరూ నీవే అందరుగా మారిపోతావు. ఏకత్వంలో అనేకత్వం, అనేకత్వంలో ఏకత్వం కనిపిస్తుంది.

 

ప్రేమస్వరూపులారా!

మీరందరూ ప్రేమస్వరూపులే. మీయందున్నదంతా ప్రేమయే. అందరియందునూ వున్నటువంటి ప్రేమనే భగవంతుని ప్రేమ. మానవుడు భగవంతుని అంశ మాత్రమే. కారణమేమిటి? దేహములు వేరుగా ఉండటంచేత, కనుక అంతా చేరి ఒకటిగానే ఉంటుంది. కనుక నేటి నుండి ఎవరికి సేవచేసినా భగవంతుని సేవగానే భావించుకోండి. ఎలాంటి పనినైనా చేయటానికి సిద్ధంకండి. దేహాన్ని అనుసరించకండి. పరిస్థితులనుగురించి విచారించకండి. అందరిని ఏకంగా చూచుకోండి, సమానంగా చూచుకోండి. ఆందరియందు వున్నటువంటిది ఒకే దివ్యశక్తి అని భావించుకోండి. అప్పుడే నిజమైనటువంటి illumination కు చేరుకోగలరు. కనుక మొట్టమొదట Super Mind లో ప్రయాణించండి. నేను వేరు, అతను వేరుగా ఉన్నాడని భావించటం, ఇదే Dualism. దీనితో ప్రారంభం చేయండి. ఆ Dualism కూడా సత్యము కాదు. A man with Dual Mind is Half Blind. Half Blind లో నీవు పోతున్నావు. అక్కడప్రారంభించి క్రమక్రమేణా అదే Higher Mind కు పోతుంది. ఈ Higher Mindకు పోయిన తరువాత నీ తత్త్యము నీకు రుచింపచేస్తుంది. ఈ రుచిని మరిగిన తరువాత నీవు క్రమక్రమేణా Illuminationకు చేరుకోగలవు. ఇక్కడ ఏకత్వాన్ని పూర్తిగా గుర్తించిన తరువాత Over Mindలో చేరిపోతావు. అదియే నీ గమ్యము. అదియే నీ సర్వము. దానిని చేరటానికే నీవు చేసే సాధనలు. దేహముతో చేసిన సాధనలు ప్రధానము కాదు. ఇది కేవలం కసరత్ వంటివి. ఈ కసరత్తులు దేహమును అభివృద్ధి పరచుకోవటానికి గాని, మనసును కాదు. కాని ఇప్పుడు మనసు అభివృద్ధి కావాలి. మనసు నిర్మలత్వం కావాలి. Mind లోపల Mind Illumination రావాలి.

(శ్రీ.జ.01పు 24/30)

 

ప్రేమస్వరూపులారా! మనస్సు యొక్క తత్త్వమును వర్ణించడం కష్టం. ఒక నిమిషంలో పిచ్చికోతివలె ప్రవర్తిస్తుంది, మరొక సమయంలో దివ్యమైన భావాలలోప్రకాశిస్తుంది. ఒకానొక సమయంలో మనిషిని చూచి కోతి నవ్విందట. "మనిషీ! నీవు సర్వశక్తిమయుడవని భావిస్తున్నావు. విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములకు నీవే మూలాధారమని గర్విస్తున్నావు. ఈ విధంగా నీవు గర్వించవద్దు. ఎందుకంటే, నేనునీ యందు మనస్సునై ఉన్నాను. నీ జీవితం నా పై ఆధారపడి ఉన్నది. నేను కొంత పెడ మార్గం పడితే నీ జీవితమే పెడమార్గం పడుతుంది.నేను సక్రమమైన మార్గంలో నడచినప్పుడే నీ జీవితం సవ్యంగా సాగుతుంది. నేను కోతి నైనప్పటికి రామనామ స్మరణ చేస్తూ, రామసేవలో పాల్గొని, రామకార్యమును విజయవంతం గావించాను" అన్నదట. ఈ విధంగా, మనస్సు సక్రమమైన మార్గంలో ప్రవేశించినప్పడే దైవసన్నిధిని, దైవపెన్నిధిని అనుభవిస్తుంది. మనస్సు పెడ మార్గమున ప్రవేశిస్తే జీవితమును అధఃపతనం గావిస్తుంది. అప్పుడు మనస్సును Monkey Mind అంటారు. అందుచేత Mankind కావాలిగాని, Monkey mind కాకూడదు. దివ్యత్వమును స్మరించవలెనన్న, పవిత్రతను అనుభవించవలెనన్న మనస్సే ఆధారం. మనసే లేక మనిషే లేడు. మనస్సును సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి. Start Early. Drive Slowly, Reach Safely. చిన్నతనము నుండియే మనస్సును సక్రమమైన మార్గంలో ప్రవేశపెడితే మీరు చాల దివ్యమైన స్థానమును పొందుతారు.

(సా.శు.పు.52)

 

మాను దిద్ద గలరు. మరి వంపు లేకుండ

దిద్దగలరు రాయి తిన్న గాను

మనసు దిద్దగలర? మరి వంపు లేకుండ

చక్కనైన మాట సాయి మాట!

(సా .పు. 484)

 

మనస్సు ఒక గూర్ఖా కాపలాదారు వంటిది. గూర్ఖా తన యజమాని స్నేహితులనే భవనంలోనికి ప్రవేశపెడతాడు. అటులనే మనస్సు తన అధిపతికి భద్రత కలిగించే తలంపులను, భావాలను చేర్చుకోవాలి. అంతేకాదు ఎవరు లోపలికి వస్తున్నారు? ఎవరు బయటకు పోతున్నారన్న విషయాన్ని కాపలాదారు ఏ విధంగా జాగ్రత్తగా పరిశీలిస్తుంటాడో, అదే విధముగ మనస్సులోనికి చెడు తలంపులు, దుర్భావములు ప్రవేశించకుండ జాగ్రత్త వహించాలి.

(భ.ప్ర.పు.40)

 

గాలి యందున జ్యోతి కదలుచుండు

గాలిలేని జ్యోతి కదలకుండు

గాలి వంటి ఆశ కట్టివేసిన యంత

నిశ్చలంబైన మనసు నిలిచియుండు!

(సా.పు.12)

 

మనస్సునకు రెండు విధములైన స్థితులు ఉంటాయన్నది.మొదటిది శుద్ధము. రెండవది అశుద్ధము. కోరికల తోకూడిన మనస్సు అశుద్ధము. అవి లేని మనస్సు శుద్ధము, బంధమోక్షములకు మనస్సే కారణం. మనస్సు ఒక క్షణమైనా ఒక స్థితియందుండదు. తటాకము నందు ఎడతెరిపి లేకుండా రాళ్ళురువ్వుతూ వుంటే ఏ విధముగా అది ప్రశాంతిగా యుండగలదు? ఏనాడు యీ రాళ్ళు రువ్వడం మానెదుమో ఆనాడే ప్రశాంతి పరిస్థితిని పొందుతుంది. అదేవిధముగా మానవ సరోవరమునందు, ఎడతెరిపి లేకుండా కోరికలనే రాళ్ళు రువ్వుతున్నప్పుడు ఈ మనస్సు ఏవిధంగా ప్రశాంతి పొందగలదు. మానసిక శాంతి కావాలంటే, భక్తులు, వ్యక్తులు కోరకలనే రాళ్ళను మానసికమునందు ప్రవేశించకుండా చూచుకొన వలయును.

(సా.పు.240)

 

వేద శాస్త్రములు వివరించి బుధులచే

చదివించవచ్చు తాచదువ వచ్చు!

యజ్ఞయాగ తపంబులు అధికార జనులచే

చేయించవచ్చు తా చేయవచ్చు.

ఇల లోనగల తీర్థములకేగ అన్యులకు

బోధించవచ్చు తాబోవవచ్చు.

అష్టాంగు విద్యలు తానన్యులకు

ఉపదేశించవచ్చు తాసాధించవచ్చు.

కాని దేహేంద్రియములను అరికట్టి

మనసు నిల్ప అంతర్ముఖము చేసి,

అనవతరము నిశ్చల, సమాన చిత్తులై నిలువలేరు.||

(సా .పు 990)

 

ఇనుప పాత్రయైన హేమ పాత్రంబైన

నీటి తేటవలన మే టికెక్కు

మనస్సు మంచిదైన తనువులు మాటేమి

ఉన్న మాట చెప్పుచున్నమాట!

(సా.పు.175)

 

మనసు ఎట్లు పారిపోతే అట్లు పారిపోనీ, నీవు మాత్రము దాని వెంట ఎక్కడ పోతుందా అని చూచుకుంటూ పోవద్దు. నీవు ఉన్నచోటే ఉండు. మనము ఇష్టమొచ్చినట్లు తిరిగి తిరిగి కడకు అలసి నీ చెంతకే వచ్చును. మనసు ఏమియు తెలియని పసిబిడ్డవంటిది. తల్లి పిల్చే కొలదీతాను కూడను దూరముగా పోవుచునే యుండును. అట్లు కాక, ఆ బిడ్డవైపు చూడక, తల్లిపాటికి తల్లి వెనుకకు తిరిగిన బిడ్డతన పాటికి తానే పరుగెత్తుకొని తల్లి చెంతకు వచ్చి చేరును. నీ నియమము ప్రకారం నీ ఇష్టనామ ధ్యానములను ఆచరించు మనస్సును లక్ష్యపెట్టకు. తప్పక ధ్యానము ఏకాగ్రత ఫలించును. నీవు శుచి, అశుచి అనే మాటనే మనసులోనికి చేరనివ్వవద్దు.ప్రపంచమున ఆశుచి పదార్థమంటూ లేనేలేదు. సర్వాంతర్యామిగా పరమాత్ముడు ఉన్నప్పుడు అశుచి ఎక్కడిది? బాహ్య దృశ్యమునకూ అనుభవమునకూ అశుచి అనుకున్ననూ దానికి పరమాత్మనామము సోకగనే శుచిగా మారును.

(స. సా. జూ.1989 చివరిపుట)

 

సకల విద్యలుచేర్చి సభ జయించగవచ్చు

శూరుడై రణమందు పోరవచ్చు

రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు

హేమగోదానముల్ ఈయవచ్చు

గగనమందున్న చుక్కలు లెక్క గొనవచ్చు

జీవరాసుల పేర్లు చెప్పవచ్చు

అష్టాంగ విద్యలు అభ్యసించగవచ్చు

చంద్రమండల యాత్ర సలుపవచ్చు

కానిదేహేంద్రియాదుల కట్టిపెట్టి

మనసునంతర్ముఖముచేసి యనవరతము

నిశ్చలసమాన చిత్తుడై నిలువలేడు.

(బృత్ర.పు.47)

 

మనసు కారణంబు మరియెందు నుండిన

ఇండ్లు అడవి ముక్తి నియలేవు

మనసు లేనివాడు మందిరమున నున్న

కాననమున నున్న కార్యమొకటి.

 

మనో మూల మిదం జగత్ జగత్తంతయు మనసు పైననే ఆధారపడి ఉంటున్నది. సుఖదుఃఖములు, పాపపుణ్యములు సత్యాసత్యములు అన్యాయ అక్రమములు అన్నీ మనసునందే జరుగుతున్నవి. అన్నింటికిని మనస్సే కారణము. మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయో: బంధమోక్షములకు మనసే కారణము. ఈ మనస్సు శుద్ధమైన అద్దమువంటిది. మనస్సుకు స్వతస్సిద్ధమైన శక్తిలేదు. మనస్సు ఇంద్రియములను ఆశ్రయించి వుంటున్నది. ఇది నేత్రముల ద్వారా చూస్తున్నది. స్వతంగా తాను చూడలేదు. కర్ణముల ద్వారా వింటున్నది. స్వతంగా తాను వినలేదు. ఇదేవిధముగనే అన్ని యింద్రియముల ద్వారాను యీ మనస్సు కార్యములు సలుపుతున్నది. ఇంద్రియములు చేసి దోషములన్నియు మనస్సనే అద్దము పైన చిత్రింపబడు తున్నవి. ఇంద్రియములు సంకల్ప వికల్ప కాత్మమైన తత్వములో కూడి ఉంటున్నది. ఇందులో దోషము ఎవరిది? ఇంద్రియములదా? లేక మనస్సుదా? మనస్సు నందు స్వతస్సిద్ధమైన దోషములు లేవు."

(బృత్ర, పు. 79/80)

 

మనసే హేతువు మనుజుని

మనుగడకును బంధమునకు మాన్యతకును(తా)

మనసే ముక్తికి ముఖ్యము

మనసే నరకంబు దెచ్చు మైమరపించున్.

(బృత్ర.పు.68)

 

మనస్సుకు కూడను కొన్ని రంగులు ఉన్నవి. భేదభావములతో కూడిన మనస్సు ఎర్రని రంగుగా, స్వార్థభావముతో కూడిన మనస్సు గోధుమరంగుగా, అహంకారముతో కూడిన మనస్సు కమలాపండు రంగుగా, భగవదర్పితమైన మనస్సు తెల్లగా ఈ వస్త్రం వలె శుద్ధమైనదిగా ఉంటుంటాది. మనస్సుకు అనేక విధములైన రంగులను మనమే వేసుకుంటున్నాము. ఇది కూడను ఇతరుల ప్రభావము కాదు. మన సంకల్పములే మనకు ఈ దుర్గతిని సద్గతిని చేర్చుతున్నాయి. సంకల్పములనుసరియైనవిగా ఎన్నుకున్నప్పుడే, అభివృద్ధి పరచుకున్నప్పుడే మన జీవితము శాంతి భద్రతలతో ఉండగలదు.

(బృ. త్ర.పు.71)

 

మనస్సును మాయలమారి అని, మాయ అనికూడనూ పిలుస్తూ వచ్చారు. ఇది ఒక మార్జాలము వంటిది.

(బ్బ.త్ర.పు.75)

 

జగత్తునందు “ఏకం సత్" ఉన్నది ఒక్కటే. రెండవది ఉంటేకదా ఫ్రీడమో బంధమో అనేది కనుపిస్తున్నది. ఈ బంధము స్వాతంత్ర్యము అనేది మనఃకల్పితాలు. సూర్యుడు లేనప్పుడే చంద్రునకు మనము విలువ నిస్తున్నాము. సూర్యుడుండినప్పుడు చంద్రుని ఎవరు చూడరు. సూర్యుడు లేనప్పుడు చంద్రునికి దేనివల్ల విలువ ఇస్తున్నాము? చంద్రుడు స్వతః ప్రకాశకుడు కాదు. సూర్యుని యొక్క కిరణములు చంద్రునిమీద పడినప్పుడే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. అదే విధముగనే ఆత్మాన్వేషణ లేని సమయమునందే చంద్రుడనే మనస్సుకు మనము విలువ యిస్తున్నాము. "చంద్రమా మనసో జాతః చక్షుస్సూర్యో అజాయతఈ మనస్సునకు చంద్రునకు ఉండిన బింబ ప్రతిబింబముల సంబంధమును వేదము ఈ రీతిగా నిర్ణయించింది. కనుక మనము ఆత్మ విచారము లేనంతవరకు మనస్సునకు చంద్రునకు ఉండిన బింబప్రతిబింబముల సంబంధమును వేదము ఈ రీతిగా ఎక్కువ బలమును, ఎక్కువ సమయమును, ఎక్కువప్రాధాన్యమును ఇస్తున్నాము. ఈ మనస్సనేది స్వతస్సిద్ధమైన ప్రకాశము కాదు. మనస్సుండినవానికే స్వాతంత్ర్యము, బంధన. మనప్పుండిన వానికే ఆధ్యాత్మికము పారమార్ధికము, లౌకికము మనస్సుండిన వానికే ప్రకృతి పరతత్వము. మనస్సుండినవానికే స్త్రీ పురుషుడు అనే భేదము. సర్వ ద్వంద్వములు ఈ మనసు వల్లనే ఏర్పడినవి.

(బృత్ర.పు. 144)

 

మనస్సు దేహాన్ని ఆశ్రయించివుంటున్నది. ఈ దేహమున కుండిన కన్ను ముక్కు చెవులు నోరు వీటి ద్వారానేమనస్సు యీ పంచభూతములన్నింటిని అనుభవిస్తుండాది. మనస్సు దేహము యొక్క నేత్రముల ద్వారా చూస్తుండాది. దేహము యొక్క కర్ణముల ద్వారా వింటున్నది. మనస్సుకు రూపము లేదు. మనస్సే మాయ. మనసే కోరిక, మనసే ప్రకృతి, మనసే ఆవిద్య. మనసే ప్రాకృతమైన భ్రాంతి. ఇట్టి భ్రాంతితో కూడిన మనస్సు ద్వారా సత్య నిత్యమైన బ్రహ్మతత్వమును మనము ఆర్థము చేసుకోవటము చాలా కష్టము. ఏది నిజమైన జ్ఞానము? మనస్సుచేత ఇంద్రియము లను స్వాధీనపరచుకొని ఇంద్రియ నాశనము గావించిన తరువాత మనస్సుకూడను అంతర్థానమవుతుంది. ప్రశాంతమైన మౌనతత్వము ఏర్పడుతుంది. ఈ మనోనాశనము వలన కలిగిన మౌనమనేదే నిజమైనజ్ఞానము.

(బృత్ర.పు.132/133)

 

మనస్సుండినంతవరకు కోరికలు తప్పవు. కోరకలుండి నంతవరకు అభమానమమకారములు వదలవు. అభిమాన మమకారము లుండినంతవరకును అహంకారము పోదు. అహంకారము పోయేంతవరకు ఆత్మజ్ఞానము కలుగదు. ఆత్మజ్ఞానముగాని ఆత్మానందముగాని ఆత్మదర్శనము గాని మనోనాశనము చేతనే సంభవిస్తుంది. అన్య మార్గములో లభ్యముకాదు.

(బ్బ.త్ర.పు.124/125)

 

మనసు నిర్మలంబు మంచికి మార్గంబు

మనసు నిర్మలంబు మహితశక్తి

నిర్మలంపు మనసె నీరధిముత్య మౌ

మరచిపోకు డిట్టి మంచిమాట.

(బృత్ర.పు. 92)

మనసును ఆయుధంబునిదె మానవ జాతికి యిచ్చెలొల్లి ఆ

మనసుని శిక్షలో నిల్పు మానవుడే విజయుండు భూమిపై

మనసుకు దాసుడైన మహి మానవుడెన్నడు శాంతి సౌఖ్యముల్

కనుగొనజాచినట్లు వినిపింపగ గల్లదు స్వప్నమందునన్.

 

ప్రేమస్వరూపులారా! మానవజాతికి మనస్సనే ఒక పదునైన కత్తి అందించబడినది. ప్రప్రథములో మానవుడు ఈమనస్సు యొక్క తత్వాన్ని గుర్తించి వర్తించినప్పుడే మానవత్వము సార్ధకమవుతుంది. మనస్సు బలవత్తర మైనది. మనస్సు చాలా వేగముగా పరిగెట్టేటటువంటిది. మనస్సు ఆకాశము కంటే తేలికైనది. విద్యుచ్ఛక్తి కంటే సూక్ష్మమయినది. ఇట్టి మనస్తత్వాన్ని మానవుడు గుర్తించుకొనలేక మనస్సును పెడమార్గములో ఉపయోగ పెట్టి అనేక విధములైన దుఃఖములకు విచారములకు గురియగుచున్నాడు. మనస్సు ప్రకాశము కంటే అతి వేగముగా పరిగెట్టుతుంది.

(స.ది.పు.59)

 

"యత్ర యత్ర మనస్ఫూర్తి

తత్ర తత్ర జగత్రయాం

యత్ర యత్ర మనోనాస్తి

తత్ర తత్ర నకించనా"

 

ప్రేమస్వరూపులారా !

ఎక్కడెక్కడ మనస్సు స్ఫూరించుచున్నదో, అక్కడంతా ముల్లోకములు నిండి ఉంటాయి. ఎక్కడ మనస్సులేదో అక్కడ ఏమియునూ లేదు. ఈనాటి సమస్యలకు, కష్టములకు దుఃఖములకు, విచారములకు మూలకారణం మనస్సే. మనస్సు నిర్మూలనం గావించుకొనవలెననిన వాంఛలను అదుపులో పెట్టుకోవాలి. ,

(శ్రీ ఆ.1999పు.7)

 

“గాలిలోన జ్యోతి కదలాడుచుండును
గాలి లేని చోట కదలకుండు
ఆశయనెడు గాలి నణగదొక్కినయంత
మంచిదౌను మనసు మరుగు విడిచి” 
శ్రీసత్యసాయి విద్యార్థి వాహిని పు 155)

 

మనసు కారణం బు మరి యెందునున్నను
ఇల్లు అడవి ముక్తి నీయలేవు
మనసు లేనివాడు మందిరమున ను న్న
కాననమున నున్న కార్యమేమి?
(శ్రీసత్యసాయి విద్యార్థి వాహిని పు 168)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage