శంకరులవారు కాశీ క్షేత్రంలో విశ్వనాథుని దర్శించి, "స్వామి! నేను మూడు విధములైన పాపములను చేశాను. వాటి పరిహారార్థమై నీ దర్శనానికి వచ్చాను" అన్నారు. శంకరులవారు ఏ పాపం చేశారు? ఎవరిని చంపారు? ఎవరి సొత్తును అపహిరంచారు? ఏమీ లేదే! మరి అలాంటప్పుడు తాను పాపినని ఎట్లా చెప్పారు? “స్వామీ! యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా” అని నేనే చెప్పాను. నిన్ను వాక్కుచేత గాని, మనస్సు చేతగాని వర్ణించుటకు సాధ్యం కాదనినేనే అన్నాను. అలాంటి నేనే ఇక్కడకు వచ్చి ఈశ గిరీశ నరేశ పరేశ..." అని నిన్ను వర్ణిస్తున్నాను. నేను చెప్పినది ఒకటి, చేసినది ఒకటి. ఇది పాపం కాదా? ఈ పాపమును క్షమించు" అని ప్రార్థించారు. "భగవంతుడు హృదయవాసి” అని,ఎక్కడ చూసినా ఉన్నాడని ఇతరులకు బోధించాను. కానీ నిన్ను దర్శించడానికి ఇప్పుడు కాశీ క్షేత్రానికి వచ్చాను. అన్ని చోట్ల ఉన్న నిన్ను చూడటానికి ఇంతదూరంరావడమెందుకు? నేను బోధించిందొకటి, ఆచరించిందొకటి. ఇది కూడా పాపమే కదా!" అన్నారు. ఇంక మూడవ పాపం ఏమిటి? "మానవునకు పాపం లేదన్నాను. “నపుణ్యం నపాపం నసౌఖ్యం నదు:ఖం..." అన్నాను. అలాంటి నేను తిరిగి పాప పరిహారార్థం నిన్ను ప్రార్థిస్తున్నాను. ఇదే పెద్ద పాపం" అన్నారు. దీని అంతరార్థ మేమిటి?
మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః
మనస్సన్యత్ వచస్సన్యత్ కర్మణన్యత్ దురాత్మనః
మానవుడు చెడిపోవడానికి కారణ మేమిటి? మనో వాక్కాయకర్మలు ఏకం కావటం లేదు. మనస్సులో ఒకటి, మాటలో మరొకటి, క్రియలో ఇంకొకటి - ఇదే పెద్ద పాపమని బోధించారు శంకరులవారు.
(స.సా.మా.99పు.75/76)
పరుల బాధను చూచి, ఆనందించువారు మహా పాపులు. రాక్షసులు. పరుల సంతోషమును కోరువారు పరుల ఆనందము నపేక్షించువారు పవిత్రులు.
(రా.వా.మొ.పు.195)