మాటలు

ఈనాడు చూచేది మాటలలో Cooperation చేతలలో Operation.

(భ.ప. పు.2)

 

ఇనుమునైన కూడ యిమ్మారు ముమ్మారు

కాల్చి అతుకవచ్చు కమ్మరీడు

మనసు విరిగెనేని మరి పెట్టగలరయా?

 

మనసును విరిగించటానికి గాని, మనసును అరిగించటానికి గానీ, అతికించటానికిగాని మాటనే కారణము. మాటాడే మాటలు పరులను బాధ పెట్టకుండ పరులకు యే విధమైన కష్టము కలుగకుండ వుపయోగ పెట్టాలి. కాలు జారితే కలుగదు నష్టము నాలుక జారితే నరకమేరా!" కాలు జారి పడినామంటే గాయము కనిపిస్తుంది. డాక్టరుకు చూపించి దానికి కట్టు కట్టి మాన్పించుకోవచ్చును. కాని మాటచేత మనస్సుకు కలిగినగాయము కంటికి కన్పించదు. ఈ గాయమును మాన్పే డాక్టరు యీ జగత్తులో యెవ్వరూ లేరు. కనుక యితరుల మనస్సును నొప్పించే మాటలు యే మాత్రము పుపయోగించరాదు. ఏనాటికైనా మనమాటే మనకు బ్రహ్మాస్త్రముగా వెనుకకు తిరుగుతుంది. కనుక మంచి మాటలను వుపయోగించుకో!

(శ్రీ.1.54)

 

మాటలకున్న విలువ యిట్టిది. అట్టిది అని వర్ణించుటకు వీలుకాదు. మాటల చేతనే మానవుడు సంపద సాధించ గలుగుతున్నాడు. మాటలచేతనే రాజ్యమును కూడా కోల్పోవుచున్నాడు. మాటలచేతనే బంధుమిత్రులను సంపాదించుకొంటున్నాడు. మాటల చేతనే శత్రుత్వమును పెంచుకుంటున్నాడు. కనుక, మాటలు మధురమైనవిగా హితకరమైనవిగా, ప్రీతికరమైనవిగా ఉండాలి.సత్యమైనప్పటికీ కటువుగా మాట్లాడకూడదు. మాటలు మృదువుగా, శాంతంగా సౌమ్యంగా ఉండాలి. అతి భాష లేకుండుట, అనృతమాటకుండుట. చాడీలు చెప్పకుండుట, పరులను దూషించకుండుట, కఠినోక్తుల వాడకుండుటయే గాక, మధురమైన పలుకులు, మాధవస్మరణలో వాక్కులను పవిత్రము చేయుచుండుట ఇట్టి మనో వాక్కాయములను ఉత్తమమైన మార్గమున వినియోగించిన ఆది నిజమైన తపస్సనబడును.

(శ్రీ భ. ఉ..పు.14)

(చూ|| ఆచరించాలి, భద్రము, స్వేచ్ఛ)

 

పరోపకారార్థ మిదమ్ శరీరమ్ శరీరమును పరోపకారములో ప్రవేశపెట్టాలి. మానవుని మాటలలోని అమృతత్వమునకు మించినది మరొ క్కలు లేదు. మాటలకు మనస్సే ఆధారము.మంచి మాటలకు విలువ ఎక్కువ. మాటల ద్వారానే దివ్యత్వాన్ని గుర్తించవచ్చును. ఒకానొక సమయములో విదురుడు ధృతరాష్ట్రునకు చెప్పాడు. ధృతరాష్ట్రా! తీక్షణమైన గొడ్డలిచేత కొట్టబడిన చెట్టు అయిననూ చిగురించును. కాని మాటలతో చెడిపోయిన కార్యాన్ని సాధించలేము.

 హృదయములేని మాటలకంటే మాటలులేని హృదయము మేలు 
మాటలకంటే మించినవి చేతలు. తెలుగువారిలో ఒక సామెత ఉంది. ఎముకలు అరిగేటట్లుగా పనిచేస్తే, దంతములు అరిగేటట్లుగా తినవచ్చు. ఈనాడు మనకు తినడానికి తిండి లేదంటే ఎముకలు అరిగేటట్లుగా పనిచేయకపోవడమే కారణము. రెండుచేతులతో పనిచేసేవానికే తిండి తినడానికి అధికారముంది. పనిచేయనివానికి తినే అధికారము లేదు. అలాంటి సోమరులు ఈనాడు విపరీతముగా పెరిగిపోతున్నారు. వారివల్లనే భారతదేశము ఈ దుస్థితికి వచ్చింది.

మనము చేతులనిండుగా పనిచేస్తూ, హృదయము నిండుగా ప్రార్థనలు చేయాలి. ప్రార్థనలనగా మాటల పరిశ్రమ కాదు. హృదయములోని దివ్యత్వమును మేల్కొల్పేందుకు పడే బాధే, ప్రార్థన. ప్రేమస్వరూపులారా! హృదయములేని మాటలకంటే మాటలు లేని హృదయము మేలు.

గడిచినదేదో గడచిపోయింది. రేపటినుండి నూతన జీవితాన్ని గడపండి. ఈ జగత్తును అపవిత్రముగా భావించక ఈశ్వరత్వముగా భావించండి. యచ్చ కించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివా అని ఉపనిషద్ వాక్యము. అనగా నీవు వినేది, చూచేది సర్వమూ దైవస్వరూపము. అంతర్ బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణస్థితః .
((మా భ గు చ పు. 61/62)

 

(నా మాటలే)
మీరంతా ఎంతకాలం ఈ దేహాన్ని అనుసరిస్తూ, ఆరాధిస్తూ ఉంటారు? ఈ దేహం ఏనాటికైనా వెళ్ళిపోవలసినదే, అందువల్ల ఈ దేహం ముఖ్యం కాదు, నా మాటలే మీ అందరికీ చాలా ప్రధానం. ఇది గుర్తు పెట్టుకోండి (స.సా. 2022 సె 2022 పు 24)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage