వేదము భగవంతునికి అమోఘుడు అని పేరు పెట్టింది. అమోఘుడనగా శాశ్వతమైన వాడు, వర్ణనాతీతమైనవాడు అని అర్థం. "నేను ఆమోఘమైన ఆనందాన్ని అనుభవించాను." అంటారు కొంతమంది. అమోఘమైన ఆనందమంటే అంత్యం లేని ఆనందమని అర్థం. భక్తుల మనోభీష్టములను నెరవేర్చడానికి తాను నిరంతరం సంసిద్ధంగా ఉంటాడు. కాబట్టి, భగవంతునికి’ సిద్ధః అని కూడా పేరు పెట్టారు. కాని, భక్తుల ప్రార్థనలు సక్రమంగా లేకపోవడంచేత ప్రయోజనం లేకపోతున్నది. పరిపూర్ణ భక్తితో భగవంతుణ్ణి ప్రార్థించినప్పుడే మీ సర్వాభీష్టములు నెరవేరగలవు. భగవంతుడు సర్వజీవులయందు, సర్వత్ర ఉంటున్నాడు. అతనికి కావలసింది ఏమీ లేదు. అతనికి ఎలాంటి కోరికలూ లేవు. అతడు ఏది కోరినా, ఏది సంకల్పించినా భక్తుల శ్రేయస్సు నిమిత్తమే. భగవంతునికి నిరుపేద మొదలు చక్రవర్తి వరకు అందరూ సమానమే. సర్వ మానవులకు నిజమైన స్నేహితుడు భగవంతుడొక్కడే. సర్వమానవులకు సమానమైన ప్రాపర్టీ (ఆస్తి) భగవంతు డొక్కడే; దివ్యత్వాన్ని అనుభవించడానికి అందరికీ సమానమైన హక్కు ఉంది. అయితే అందుకు తగిన హృదయ పవిత్రతను మానవుడు అభివృద్ధి పర్చుకోవాలి. కంపేషన్ (దయ)తో నిoడినదే హృదయము. కాని, ఈవాడు ఫ్యాషన్ తప్ప కంపేషన్ అనేది కనిపించడం లేదు. మనస్సున్నవాడే మానవుడు. సంకల్పము లెలా ఉండాలి? సత్యసంకల్పములుగా ఉండాలి. సత్యసంకల్పములు లేనివాడు మానవుడే కాదు.
(స. సా. జూ. 2000 పు. 163)