ప్రేమస్వరూపులారా! అహంకార, ఆడంబరములను వదలి, ప్రేమను పెంచుకున్నప్పుడే ఐకమత్యం సాధ్యమౌతుంది. మీరు రెండు చేతులను జోడించి భగవంతునికి నమస్కరిస్తారు కదా! నమస్కారమంటే ఏమిటి? ఐదు కర్మేంద్రియములను, ఐదు జ్ఞానేంద్రియములను చేర్చి భగవంతునికి అర్పించడమే నిజమైన నమస్కారం. "నా అహంకారం పోయింది" అని చెప్పడానికి గుర్తు నమస్కారం. ’న మ" అనగా నాది కాదు", అని అర్థం. మానవునిలో ఇట్టి భావం కల్గినప్పుడే ఐకమత్యం సాధ్యమౌతుంది. కాని, అందరూ నాది అనే భావాన్ని పెంచుకుంటున్నారు.
(గీ.ప.3.2.2000 పు.184)
ఎవరికి నమస్కారం చేసినా ఎవరికి చేయక పోయినా తాము చేసే కర్మలకు మాత్రం నమస్కారం చేయాలి! మానవుని జీవితమంతా కర్మపైనే ఆధారపడి ఉన్నది.
కర్మమున పుట్టు జీవుడు,
కర్మముననే వృద్ధిపొంది కర్మమున చనున్,
కర్మమె నరునకు దైవము,
కర్మ మె సుఖ దుఃఖములకు కారణమిలలోన్
అని బోధిస్తుంది భాగవతము. కనుక మనము చేసే ప్రతి కర్మకు మొదట నమస్కరించి ఓ కర్మా! ధర్మ రహితము కాని ఉత్తమ కర్మలు ఉపకారమైన పవిత్ర కర్మలు మాత్రమే నాచేత చేయించు - అని ప్రార్థించాలి. కర్మచేత దైవ సన్నిధిని కూడా పొందుటకు అవకాశమున్నది. ఉత్తమ స్థితిని పొందుటకు గాని అధమస్థితికి దిగజారుటకుగాని కర్మలే కారణము. కర్మనే మానవునకు జన్మనందిస్తున్నది. ఎట్టి కర్మ లాచరిస్తామో అట్టి జన్మలను పొందుతాము. ఎట్టి స్థానమును పొందుతామో అట్టి ఫలాన్ని అనుభవిస్తాము.
(స. సా.. జ.87 చివరిపుట)
ఈనాడు లోకంలో ఆనిత్యమూ, ఆశాశ్వతమైనటు వంటి వాటికి కూడా ఎన్నో ఆరాధనలు సలుపుతుంటారు. ఎవరెవరి కర్మకు వారు నమస్కరిస్తుంటారు. అదియే ఉపనిషత్తు యొక్క సారము. చిత్తస్యశుద్ధయే కర్మః! . ఒక డ్రయివరు కారులో ఎక్కి మొట్టమొదట స్టీరిం గ్ కు నమస్కారం చేసి, కారును స్టార్ట్ చేస్తాడు. నర్తకి నాట్యంచేసేముందు కాలి అందాలకు నమస్కారం చేసి, వాటిని కాళ్ళకు కట్టుకొని నాట్యం చేస్తుంది. గీతను చదవడానికి ముందు, దానిని తెరచి మొట్టమొదట నమస్కారం చేసి, దానిని చదవటం మొదలు పెడుతారు. దీని అంతరార్థమేమిటి? ఈ సంప్రదాయములు ఎందుకు పెట్టారు? దేని నిమిత్తమై వీటిని ఆచరిస్తూ వచ్చారు? ప్రారంభమునకు పూర్వమే భగవంతునికి తన మనసును ఆర్పితం చేయాలని, భగవంతునికి నమస్కరించి కార్యములో మనం పాల్గొనాలనే పవిత్రభావం వారిలో ఉండడమే, విజ్ఞానరహితులైనవారే ఈ విధంగా ప్రవర్తిస్తుంటే విజ్ఞానవంతులమని చెప్పుకొనే సైంటిస్టులకు మాత్రం ఈ జ్ఞానం లేకుండా పోతున్నది. ఈనాడు జ్ఞాని... జ్ఞాని... అని భావించుకుంటున్నాడో, వాడే పరమ అజ్ఞానిగా తయారవుతున్నాడు. మనం నడుస్తుంటే, మన నీడ మనం ప్రక్కనే నడుస్తూ వస్తుంటుంది. ఆదేవిధముగనే మనం జ్ఞానవంతులమని విర్రవీగుతుంటే, మన ప్రక్కన అజ్ఞానము అనే నీడ నడుస్తునే ఉంటుంది. జ్ఞాన అజ్ఞానముల రెండింటే చేరికే మానవత్వం. కనుక నేను గొప్ప జ్ఞానిని అనుకోవటం చాలా పొరపాటు. జ్ఞానము ఎంత ఉందో, అంత అజ్ఞానము కూడా వెంట వస్తూనే ఉంటుంది. మనం ఏది చేస్తున్నా, ప్రక్కన అజ్ఞానం ఉంటూనే ఉంటుంది. దీని నుండి తప్పించుకొని పోవాలంటే, సర్వమునూ జ్ఞానమయంగా భావించుకోవాలి.
(శ్రీ.అ.. 2000 పు. 10)
(చూ॥ మైలురాళ్ళు )