"తరతి శోకమాత్మ విత్” అన్నారు. అనగా శోకమున దాటే మార్గము ఒక్క ఆత్మజ్ఞానముచేతనే లభిస్తుంది. అన్యమార్గములచేత శోకమును నివారణ చేసుకోవటానికి వీలుకాదు. శోకమును తప్పించి ఆనందమును చేకూర్చేది ఆత్మ విద్య. అదే ఆధ్యాత్మిక విద్య. కనుకనే యీ ఆత్మవిద్యకు ఎవరు అర్హులు అనే విషయాన్ని చారించాలి. దీనికి బాలురా వృద్ధులా స్త్రీలా పురుషులా యింకే తెగకు సంబంధించినవారు అని విచారణ చేస్తే ఆత్మజ్ఞానమును వెలిగించుటకు అందరూ అర్హులే. లౌకిక విద్యలచేత కీర్తి, ప్రతిష్ట గౌరవములను అందుకోగలరు; కానీ ఆత్మవిద్య చేత దైవానుగ్రహమునకే పాత్రులై దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని పొందే అవకాశముంటుండాది. ఇట్టి విద్యను పొందుటకు లౌకికవిద్యలయందుగాని, లౌకిక ధనకనక వస్తు వాహనాదుల యందుగాని, కులమత, సౌఖ్యములందు గాని యేమాత్రము అవకాశము లేదు.
“వాల్మీకి యెవ్వని వంశమందలివాడు
నందుండు ఏ పల్లెయందు పుట్టె
ధర కుచేలుం డెంత ధనము గలిగియుండె
గజరాజు ఏవిద్య కల్గియుండె
వసుధ ధ్రువుండెంత వయసు గలిగియుండె
తిన్నని కెంతటి తెలివి యుండె?"
ఈ విధముగా మీరు విచారణ చేస్తే జాతి మత కుల ధనకనక వస్తు వాహనాదులతో దైవత్వమునకు ఎట్టి సంబంధమును లేదు. "భక్తి కల్గినవానికి వశుడవగుట సత్యమేని నీవు నా యీ తులసీదళముతో తూగుదువు గాక" అన్నది రుక్మిణి. ఈ భక్తి మానవత్వములో ఒక విశిష్టమైన స్థానమును ఆక్రమించినట్టిది. “యో మద్భక్తః సమే ప్రియః" నన్ను భక్తితో కొల్చే వానియందే నాకు ఆధికమైన ప్రేమ అన్నాడు భగవంతుడు.
(శ్రీ.గీ.పు.2,3)
ఒకానొక సమయమున జనకమహారాజు తన రాజ్యము లోపల యెవరైనా పండితులుగాని, ఋషులు గాని, యోగులు గాని, జోగులు గాని, బైరాగులు గాని, విరాగులుగాని, యెవరైనా సరే, నాకు ఆత్మజ్ఞానమును బోధించాలి అని అందరికి వర్తమానము పంపాడు. గుఱ్ఱమును యెక్కి ఒక రికాబులో కాలుపెట్టి రెండవ రికాబులో కాలు పెట్టేలోపలనే ఆత్మానందము చేకూర్చాలి: బ్రహ్మప్రాప్తి చేకూర్చాలి అన్నాడు. ఈ విధముగా యెవరు చేయరో అలాంటి పండితులనుగాని అలాంటి వేదాంతులనుగాని, అలాంటి యోగులనుగాని నా రాజ్యములో వుంచుకోను. వారిని రాజ్యమునుండి బయటకు తరుముతాను అన్నాడు. ఈ పండితులకు, ఋషులకు, యోగులకు భయమేర్పడినది. ఇది మన విద్యకు పరీక్షా ఘట్టమనుకున్నారు. కాని యెవరూ దీనికి సాహసించలేదు. అష్టావక్రుడు ఆ రాజ్యములోప్రవేశించాడు. మిథిలాపురము దాటుకొని ప్రయాణము చేస్తున్న సమయములోపల వూరిబయట పండితులు యోగులు విచారముగా కూర్చొన్నారు. అష్టావక్రుడు మీ విచారమునకు కారణమేమిటి అని ప్రశ్నించాడు. వారు జరిగిన విషయము చెప్పారు. అతను నేరుగా జనక మహారాజు ఆస్థానములో ప్రవేశించాడు. రాజా! నీకు ఆత్మజ్ఞానమును బోధించటానికి నేను సిద్ధముగా వున్నాను. ఆత్మజ్ఞానబోధ ఈ రాజభవనములో చేయటానికి వీలుకాదు. ఈ రాజభవనమంతా రజోగుణతమో గుణములతో నిండివుంటున్నాది. నేను నిన్ను శుద్ధ సాత్వికములో ప్రవేశపెట్టాలి. కనుక నావెంట రమ్మన్నాడు. అతనితో తీసుకొని వెళ్ళాడు. రాజు వెంట గుఱ్ఱములు, సైన్యములు. అంతా వెళ్ళింది.. పరివారమునంతా ఒక చోట నిలబెట్టాడు.జనకమహారాజుఅష్టావక్రుడుమధ్యఅరణ్యములోపలప్రవేశించారు. అప్పుడు అష్టావక్రుడు జనకమహారాజాను కోరాడు. రాజు నేను యిప్పుడు ఆత్మజ్ఞానము బోధించేవాడను. నీవు వినేవాడవు, వినేవాడు శిష్యుడు, బోధించేవాడు గురువు. ఇది నీకు ఒప్పుకొనదగిన విషయమేనా అన్నాడు. దీనిని నీవు అంగీకరించుటే నిజమైన గురుదక్షిణ. నాకు ఒకటి యివ్వు. గురుదక్షిణ యిచ్చిన తరువాతనే వుపదేశము ప్రారంభించాలి అన్నాడు. “నాకు కావలసినది బ్రహ్మ ప్రాప్తి. కనుక యేదైనా యివ్వటానికి నేను సిద్ధముగా వుంటున్నాను. సర్వమూ నేను త్యజించివేస్తాను" అన్నాడు జనకమహారాజు,”నాకు యేమి అక్కరలేదు. నీమనస్సు నివ్వు అన్నాడు అష్టావక్రుడు. “ఇచ్చినాను. ఇది నా మనస్సు కాదు, తమ మనస్సు" అన్నాడు జనకుడు. అష్టావక్రుడు జనకుని గుఱ్ఱమును రప్పించాడు. అక్కడ నిలబెట్టాడు. రాజాను కొంచెము సేపు కూర్చోమన్నాడు. మహారాజును తన రాజ్యములోనే దారి మధ్యన కూర్చోబెట్టాడు. అష్టావక్రుడు రాజాను మధ్యమార్గములో కూచో పెట్టి తాను అరణ్యములోకి వెళ్ళిపోయాడు. ఒక చెట్టు క్రింద ప్రశాంతముగా కూర్చున్నాడు.
ఈ సిపాయిలందరు యెంత సేపో చూశారు. మహారాజుగాని, అష్టావక్రుడు గాని రాలేదు. ఏమైపోయారో యేమోనని ఒక్కొక్కరు బయలుదేరి వచ్చారు. వచ్చేటప్పటికి గుఱ్ఱము నిలచివుంది. మహారాజు రోడ్డుపై కూర్చున్నాడు. కన్నులు మూసుకున్నాడు. కదలటం లేదు, మెదలటం లేదు. అష్టావక్రుడు అసలే లేడు. అయ్యోయీ మహారాజునకు యేమంత్రమో, తంత్రమో, యంత్రమో యేమి వేశాడో మారాజు స్తంభించి పోయాడని చాలా దిగులుపడ్డారు. ప్రధానమంత్రి దగ్గరకు వెళ్ళారు. ఆయన వచ్చి మహారాజా! మహారాజా! అని యెంతో పిలిచాడు. ఏమీ జవాబు లేదు. కన్నులు తెరువలేదు. నోరు తెరువలేదు. ఏమాత్రము కదలలేదు. అందరూ యోచించారు. చాలా భయపడి పోయారు. మహారాజుకు యేదో కొంచెము మధ్య మధ్య పానీయం, ఏదో కొంచెము తిండి వేయవచ్చు కదా! మహారాజుకు యింత సమయమైనప్పటికి కించిత్ ఆహారము అందించలేక పోతున్నామే యని బాధపడ్డారు. తెల్లవారి పోయినవారు యిక సాయం సమయమైపోతుండాది. ఇంక విధి లేక మంత్రి అంతఃపురమునకు రథమును పంపించాడు. రాణులు కూడా వచ్చారు. వారేమన్నా పిలిస్తే పలుకుతాడేమోనని మంత్రికి భ్రమ. మహారాణి వచ్చింది. రాజా! రాజా!అని పిలిచింది. రాజా లేదు రౌతు లేదు. ఏమీ జవాబు లేదు. ఈ లోపల అష్టావక్రుడు ఎక్కడకు వెళ్ళాడని సైనికులు అరణ్యమును శోధించి వచ్చారు. ఒక చెట్టు క్రింద ప్రశాంతముగా కూర్చున్నాడు అష్టావక్రుడు, మహారాజాగతి యేవిధముగా వుంటుందో చూడమని అతన్ని పట్టి తెచ్చారు. అష్టావక్రుడు చిరునవ్వు నవ్వుతూ మహారాజు కేమి? క్షేమముగానే వున్నాడు అన్నాడు. నివే వచ్చి చూడమని పిలుచుకొని వచ్చారు. ఇంతవరకు మంత్రులు, రాణులు, యింకా సమీపులు అయిన వారందరు పలుకరించినప్పటికిని ఒక్క పలుకైనా పలుకలేదు. కక్నైనా తెరవలేదు.కానీ అష్టావక్రుడు వచ్చి రాజా! అని పిలిచాడు. కన్ను తెరచి స్వామీ! అని జవాబు యిచ్చాడు. మహారాణులు వచ్చారు. మంత్రులు వచ్చారు. - సిపాయిలు వచ్చారు. పరివారమంతా వచ్చారు. నీ వెందుకు యింతకాలము మాట్లాడలేదు? అని అష్టావక్రుడు ప్రశ్నించాడు.
వాక్కాయములు మనసుతో చేరినవి. మనసు తమకర్పితము చేసిన తరువాత తమ ఆజ్ఞ కావాలికదా వారితో మాట్లాడటానికి! నాకీ మనస్సు మీద అధికారము యేమీ లేదు. తమ కర్పితము చేశాను. ఇది తమ మనస్సు అన్నాడు. తమ ఆఙ్ణ లేకుండాయేదీచేయుటకు వీలుకాదు’ అన్నాడు. అప్పుడు అష్టావక్రుడు నీవు యిప్పుడు అమనస్కుడవు. మవోనాశము అయినప్పుడే నీకు మహత్తరమైన బ్రహ్మ ప్రాప్తి చేకూరుతుంది. మహారాజా! ఎక్కు. రికాబులో కాలు పెట్టు. ఒక రికాబులో కాలు పెట్టాడు. రెండవ రికాబులో కాలు పెట్టే లోపలనే ఆత్మానంద ప్రాప్తి కలిగింది. మనోవాక్కామయులు అర్పితము గావించినప్పుడు యింక తన కేమాత్రము అధికార ముంటుండదు. అదేవిధముగ కృష్ణుడు అర్జునుని,
"సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచ"
నీ సర్వస్వ ము నాకు ధారపోయి. నీ సర్వ ధర్మములు నాకర్పితము చేయి. మోక్షమును నే నిస్తానని అన్నాడు. ఇక్కడ సర్వధర్మాన్, అన్ని రకములైన ధర్మములు అనగానైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక అన్ని రకములైన లౌకికమైన ధర్మములు నాకర్పితము చేయమన్నాడు.
((శ్రీ.గీ.పు 266/269)
మానవుడు గుర్తించలేని ఆత్మశక్తిని, ఆత్మ జ్ఞానమును చిత్తశుద్ధి చేత గుర్తింపగలుగుతున్నాడు.
వివిధ శాస్త్ర చయము వేదవేదాంగముల్
జీవి మనసు తెరను చీల్చలేవు
తెరకు యీవల జీవి, దేవు డవ్వల నుండు
కార్య మివల, ఆవల కారణంబు
మనస్సుకు యీవలనుండి చూచినంతవరకు మనకు జగత్తే గోచరిస్తుంది. మనసు దాటి ఆవల చేరితిమా ఆత్మ గుర్తింపబడుతుంది.మనముఅనుభవించే జ్ఞానములు,అనుభవించేఅనుభూతులుసర్వముమనస్సుకుయివ్వల నుండియేఅనుభవిస్తున్నాము.మనస్సుకుఆవల చేరలేవు. సముద్రములో చేరిన నదికి ప్రత్యేక రూపనామములుండవు. ఎప్పుడు సముద్రములో చేరిపోయెనో అప్పుడు తన రూప నామములు కోల్పోతుంది. సముద్రము ఒక్కటే నిలుస్తుంది. అదియే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి బ్రహ్మతత్వము కనుగొనుటకు బ్రహ్మజ్ఞానమే కావాలి. ఆత్మ తత్వమును ఆర్థము చేసుకోవటానికి ఆత్మజ్ఞానమే కావాలి.
(బృత్రపు౧౩౪ )
కోరికలన్నియు నశింపగనే ఆత్మజ్ఞానము కలుగును. మనస్సును అరికట్టనిదే కోరికలు అణగవు, కోరికలు, అణగనిదే మనస్సును అరికట్టుట సాధ్యము కాదు. మనస్సు కోరికలు, విత్తనము చెట్టు, వంటివి. ఆత్మజ్ఞానము కలుగకుండు నంతవరకు మనస్సు, దాని చంచలత్వము నశింపవు. కాన ఈ మూడునూ, అనగా కోరిక, మనస్సు, ఆత్మజ్ఞానము ఒకదానిపై ఒకటి ఆధారపడి యున్నవి.
(జ్ఞావా.పు.7)
జ్ఞానియొక్క ఘనత వర్ణించుటకు వీలుకానిది: ఊహించుటకు కూడా వీలుకానిది: “బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మవిత్ పరం ఆప్నోతి " అని శ్రుతులు ఘోషించెను; అనగా, బ్రహ్మను తెలిసికొనువాడు బ్రహ్మ అగుచున్నాడు. బ్రహ్మతత్వమును పొందినవాడు ఉత్కృష్టు డగుచున్నాడు అని అర్థము.
ఎట్లు అన్ని రకములైన బుడగలు నీరుతప్ప మరేమీకావో అట్లే అన్ని విధములైన నామరూపములుగల ఈ ప్రపంచము బ్రహ్మము తప్ప మరేదియును కానేరదు. ఇదే జ్ఞానియొక్క విశ్వాసము. అతని అనుభవము కూడా ఇదియే.
నదులన్నియు సముద్రమున కలియునట్లు అన్ని కోరికలు జీవన్ముక్తుని ప్రశాంతమందు లయమగుచున్నవి. అదియే ఆత్మ సాక్షాత్కారము. ఆత్మకు మృత్యువు అనునది లేదు కదా! జనన మొందని ఆత్మకు సద్గుణము లెక్కడనుండి వచ్చును? రాను వీలేకాదు; అందుకనే శ్రుతులు ఆత్మను ఆ (అనగా జననము లేనిది). "అజరా" (వార్ధక్యము లేనిది). "అమర" (మృత్యువు లేనిది). "అవినాశి" (నాశము లేవిది) అని ఘోషించినవి.
కావున షడ్వికారములన్నియూ నశించు దేహమునకేకాని ఆత్మకు ఉండవు. వాటికి షడ్భావ వికారములు అని పేరు. అనగా, ఉండుట, జన్మించుట, పెరుగుట, మార్పు చెందుట, క్షీణించుట చివరకు మరణించుట, ఆత్మకిట్టి షడ్భావ వికారము లుండవు. అతడు కూటస్థుడు; కాలపరిస్థితులవలన కలుగు: మార్పు లన్నింటిని సాక్షీభూతునిగా గమనించుచూ, తామరాకుపై నున్న నీరువలె గాలిలోని ప్రాణవాయువువలె,అంటకుండ,ఆత్మనిస్సంగుడుగా నుండును.
మనస్సు యొక్క పోకడలనుండి విముక్తి బ్రహ్మజ్ఞానము వలన సంభవించును. అట్టి విముక్తికే నిజమైన స్వరాజ్యము, లేక మోక్షమని పేరు. ఎవరు ఈలోకమున యదార్థమును గ్రహించి అసత్య మనెడి దృష్టితో చూచెదరో వారికి వాసన లన్నియు మాయమగును. అజ్ఞానము పటాపంచలగును. ఆధ్యాత్మిక రత్నమును దొంగిలించినది మనస్సే! కాన, మనస్సనెడి దొంగను శిక్షించనచో ఆ రత్నము దొరుకును. వెంటనే బ్రహ్మస్థాన మలంకరింపవచ్చును.
అట్టి ఆత్మజ్ఞానమునొందిన మహాత్ములను పూజించి, అనుభవముల తెలిసికొని ఆనందించుటే సాధకుల లక్ష్యము; అట్టి సాధకులు పరమ పవిత్రులు. అందరునూ ధ్యాన సాధనలవలన పొందవలసిన స్వరాజ్యము ఇదియే; ఇదియే బ్రహ్మరహస్యము, ఆత్మజ్ఞానము.
(జ్ఞావాపు.13/14)
ఒకానొక సమయమున ఏదో మాటల సందర్భములో లోకానుభవ నిమిత్తమై వసిష్ఠమహర్షి శ్రీరామచంద్రునితో ఈ క్రింది రీతిగా తెలిపెను.
ఓ పరాక్రమ రామా! జీవుడను వృషభము సంసార మనెడి అరణ్యము నందుగల పెద్ద ఛాయగల చెట్టుక్రింద మోహమనెడి నీడలో నిద్రించుచున్నాడు. కోరికలనెడి త్రాళ్ళచేత బంధింపబడి యుండుటవలన వ్యాధులనెడి క్రిమికీటకాదులు కరచుచున్నవి. అజ్ఞానమనెడి అంధకారములో కళంక భూయిష్టమగు విషయాసక్తులచేత తన్న బడుచూ ఇంద్రియభోగము లనుభవించుట కొరకై పాపకర్మలనెడి బురదయందు పొరలుచున్నాడు. అట్టి సమయమున వివేకవంతులు సజ్జనులైన విజ్ఞానుల సహవాసమువలన సంసారమను ఘోోరారణ్యము దాటగలుగుచున్నారు. కాన వివేక విచారణచే విజ్ఞానమును సాధించి విజ్ఞానముతో యదార్థమును గ్రహించుటే ఆత్మసాక్షాత్కారమనియు, ఆత్మజ్ఞానమనియు పిలువబడుచున్నది. అట్టి ఆత్మ జ్ఞానమే జీవితమునకు అంత్యము, ఆదియే తురీయాతీతము.
(ఙ్ణా.వా.పు 24/25)
(చూ||క్షేత్రజ్ఞుడు, గుణములు, దైవబలము, నన్నేపొందుదుర,బ్రహ్మచింతన, మనసు, రాజబాట, సాక్షాత్కారము, సాథకుడు)