వస్తువులను తెలియచేయుట ప్రకాశమునకు స్వభావము. అట్టి ప్రకాశస్వభావము ఒక ఆత్మకు కలుదు, సూర్యుడు, అగ్ని, ఇతర వస్తువులను తెలుపుచున్నవే కాని రాత్రులందు ప్రసరించునట్టి అంధకారమును అని తెలుపలేకున్నవి. వాటి ప్రకాశమునకున్ను అంధకారమునకున్ను వైరుథ్యముండుటయే దానికి కారణము.
అయితే ఆత్మ ప్రకాశమునకు అట్టి విరోధము లేదు. అది సర్వ పదార్థమునకు, సర్వరూపమునకు అనుకూలమైనది. ఆది అన్నింటిని ప్రకాశింపచేయును. కనుకనే ఆత్మస్వరూపము. "తం దేవా జ్యోతిషాం జ్యోతిః" ఆ పరమాత్మను జ్యోతిస్సులకు జ్యోతిస్సగువాడని దేవతలు స్తుతి చేయుచుందురు. జ్ఞానత్వమే దీని ఆకారము; దేహము అటువంటిది కాదు. ప్రతి దేహమును పరస్పరము ఆకారమునందు మారుచుండును. ఆత్మ అట్లుకాక సర్వత్ర సమానమైన ప్రకాశించుటచేతను, ఆనందస్వరూపు డగుటచేతను, చైతన్య స్వరూపుడగుటచేతను, బ్రహ్మమే ఆగుచున్నది. ఇట్టి నిశ్చయమే స్థానమని చెప్పబడును.
(ప్ర.వా.పు.62)