వేదములన్నీ ద్వైతములే. వేదాంతము ఒక్కటే అద్వైతము. వేదములందు అది కావాలి. ఇది కావాలి అనే ఆశలుమెండుగా వుంటున్నాయి. చిన్న ఉదాహరణ: నాకు గాలి కావాలి. గాలికూడా ఎట్లావుండాలి నాకు అనుకూలమైన గాలిగా ఉండాలి. వత్తిడి పెట్టే గాలిగా వుండకూడదు. హింసింప చేసే గాలిగా ఉండకూడదు. నాకు అవసరమైన గాలి మాత్రమే కావాలి. అది ఒక కోరికే. వేదములన్నీ వాంఛలతో కూడినవే. ద్వైతముతో కూడినవే. కనుక మనం యజ్ఞము చేసే సమయంలో మొదటి ఆరు దినములు వేదము పఠిస్తారు. ఏడవదినము ఉపనిషత్తులుప్రారంభిస్తారు. ఉపనిషత్తులే అద్వైతము. ఏమిటి అద్వైతము. ఒక్కటే దర్శనము. "అద్వైత దర్శనం జ్ఞానం" అన్నారు కట్టకడపటికి, జ్ఞానమే అద్వైతము. "జ్ఞానాదేవతు కైవల్యం", తద్వారా ఎంతైనా పొందవచ్చు. (ద.సి.స.పు,68)
ప్రాచీన వేదములను తూలనాడకండి. అవి నాగురించిన సత్యాన్ని స్థిరపరచుకోవటానికి మీకు అధికారికమైన ఆధారాలు. వాటిని చదవటం ద్వారా మీరు భగవంతుని దివ్య వైభవం గ్రహించవచ్చు. మీ భక్తి మరొక రూప నామములమీద ఉన్నప్పటికీ విష్ణువును లేక శివుణ్ణి నిందించకండి. అంతెందుకు? మీరు ఒక వ్యక్తిని అగౌరవించినాసరే మీరు నన్ను అగౌరవించినట్లే. కారణం అతనిలోను నేను ఉన్నాను కాబట్టి! అతనిలో ఉన్న ఆత్మను గౌరవించండి. మీ తత్త్యం కూడా ఆత్మతత్త్యమే. అందువల్ల మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. ఈ ప్రాథమికమైన సత్యాన్ని అవమానపరచే పని యేదీ చేయకండి. (వ.61-62 పు.169)
వేదములు అనంతములు "అనంతో వైవేదః" కానీ వీటి అన్నింటిలోని సారమును గైకొని నాలుగుగా విభజించి, లోకకళ్యాణ నిమిత్తము ప్రచారము జరిగెను. అవే ఋగ్వేదము, యజర్వేదము, సామవేదము, అధర్వణ వేదములని ఇవి నాలుగు భాగములుగా మానవులను తరింపజేసి ధర్మమును నిలబెట్టి సత్యమును చాటి ఆరాధనలతో, అర్చనలతో, గానముతో అస్ర శస్త్రములతో జగత్కల్యాణమును గావించినవి. సమస్త మానవులకు నిత్య జీవితములో ఆదర్శవంతమును నిరూపించినవి. ఏ కార్యము జరిగిననూ భారతీయులకు అది తెలిసిననూ, తెలియకపోయిననూ, యేదో ఒక విధముగా అది వేద ప్రమాణము నమసరించే యుండును. పెండ్లి మొదలు శ్రాద్ధమువరకు భారతీయులు వేద ప్రమాణమునే అనుసరించుచున్నారు. అట్టి ఆధార ప్రమాణరూపమైన వేదమును విస్మరించుట భారతీయుల లక్షణముకాదు. ద్వైతముననో, అద్వైతముననో, లేక విశిష్టాద్వైతముననో భారతీయులు తమ జీవితమును ప్రమాణబద్ధముగానే అనుభవించుచున్నారు. అయితే తెలిసి అనుసరించిన, ఆచరించిన, దాని ఫలము మరింత అధికమగును. ఆనందము లభించును.
"వేత్తి ఇతి వేదః" అనగా మానవుడు తన కర్మకాండను, జ్ఞానకాండను వేదబలమునుండే గ్రహించగలడు. వేదములు మానవుని పుట్టుక నుండీ మరణము వరకు అతని కర్తవ్యమును బోధించుచున్నవి. అనగా మానవుని అన్ని ఆశ్రమములను గురించి వివరించుచున్నవి. ఈవేదసార గ్రహణార్థము కాలానుక్రమముగా వేదాంగములు, పురాణ, ఇతిహాసములు ఏర్పడెను. కనుక మానవులు యదార్థమగు మానవత్వమును గ్రహించ వలెనన్న వేదవేదాంగముల ప్రాబల్యమును ముందుగా తెలుసు కొనవలెను. కనుకనే ప్రాచీన కాలమున భారతీయులైన పూర్వీకులు, వేదాధ్యయనమునకు ముందుగా వేదాంగము లను గురుకులములలో నిర్బంధముగా బోధించెడివారు. అనగా ఆ కాలములో భారతీయులు చతుర్ధశ విద్యలను అభ్యసించెడివారు.
ఆనాటి వేదాధ్యయనములో కంఠస్థీకరణ, విద్యకు అధికప్రాముఖ్యత నిచ్చిరి. వేదాధ్యయన మొనర్చినవానిని "జడము" అని పిలుచుట అలవాటు ఆనాడు. అనగా అతనికి ఏమీ రాదని కానీ, తెలియదని కాని అర్థము కాదు. అనుకోరాదు. వేదాధ్యయనము చేసినవానికి సర్వము అవగత మగునని దీని అర్థము. వేదాధ్యయనముచే మానవుడు సర్వజ్ఞుడు అని చెప్పబడెను. కాగలడని నుడువబడెను. కావున నరుడు తన జీవిత సాఫల్యమునకై వేదాధ్యయన మొనర్చుట యెంతైననూ అవసరమరనియూ వేదప్రమాణములే భారతీయుని నిత్యజీవిత ప్రధానములని భారతీయ పరమార్ధ వాహిని తెలుపుచూ వచ్చెను.
ఇందులో మొదటిది ఋగ్వేదము. ఇది పది మండలములుగా విభజించబడినది. మొదటి నవమండలములో అగ్ని, ఇంద్రుడు, మరుత్తు, ఉషస్సు మున్నగు దేవతలను గురించిన సూక్తులున్నవి. చరిత్రకారులు ఈ ఋక్కులు యెట్లు ఏర్పడినవి అను విషయమును కొన్ని ప్రమాణములతో చెప్పిరి. ఆనాటి ఋగ్వేద మానవులు తమకంటే అగ్ని, వాయువువంటి దేవతలను ప్రత్యేకంగా భావించిరి. మానవులకన్నా ఈ విశిష్ట దేవతలు, విశిష్టశక్తి కలవారని గుర్తించిరి. అందువలననే దేవతల గుణములను గురించి విశేషముగా వర్ణించిరి. ఇక రెండవది యజుర్వేదము. ఇందులో కృష్ణయజుర్వేదమనియూ, శుక్ల యజుర్వేదమనియూ రెండు శాఖలున్నవి. ఈ వేదములో గంగానదీ తీరముకూడావర్ణింపబడినది. ఈ వేదములోనే ఉత్తర మీమాంస విషయములు కూడా విశదముగా చెప్పిరి...
ఆనాటికే మానవులు అరణ్యము. గ్రామము అని విభజించిగ్రామములలో నివసించిరి. ఇట్లు యజుర్వేదమును విభజించుటకు మరొక ప్రమాణము కూడా వున్నది. యజుర్వేదమును సప్తకాండగా విభజించి దానిలో అరణ్యమని అనగా అరణ్యములోనే అభ్యసించవలసినదని చెప్పుటచే, పై చెప్పిన గ్రామము, ఆరణ్య విభజనము వ్యక్తము అగుచున్నది.
మూడవదైన సామవేదము. ఈ వేదములో ఋగ్వేదములో చెప్పబడిన అనేక ఋక్కులు, సస్వరముగా చెప్పబడినవి. అందువలననే సామవేదము స్వర ప్రధానమైనది. ఈ వేదము ఋగ్వేద, యజుర్వేదములకన్నా అర్వాచీనము. ఋగ్వేదకాలములో సింధూరమున నివసించిన ఆర్యులు, యజుర్వేద కాలమునకు గంగాతీరమునకు తరలివచ్చిరి.
సామవేద కాలములో భారతదేశము యొక్క మధ్య భాగమునకు వ్యాపించిరని అభిప్రాయపడిరి. ఈ సామ వేదమునకు గానవేదమని కూడా పేరు. లోకములోని అన్ని విధములైన సంగీతము ఈ సామగానమును ఆధారము చేసుకునే అభివృద్ధి గాంచెను. గానమునకు మూలము సామవేదము. సమస్త స్వరములూ దీనిలో యిమిడి యుండును.
నాలుగవది అధర్వణ వేదము. అనేకమంది అనేక విధముల దీనిని వర్ణించిరి, తెలిపిరి. కొందరు దీని వేదత్వము నంగీకరించలేదు. మరి కొందరు మిగిలిన వేదములలోని శేషమే ఈ అధర్వణ వేదమని నుడివిరి. మిగిలిన వేదములలో దేవతలయొక్క శక్తి సామర్థ్యములే చెప్పబడినవి. కానీ యోగాభ్యాసముచేత మానపుడు కొన్ని అద్భుత కార్యములను తన శక్తి సామర్థ్యములచేత చేయవచ్చునని చెప్పుట ఈ అధర్వణ వేదము యొక్క వైలక్ష్యము, అష్టయోగము, హఠయోగము, తిరస్కరణి విద్య ఇత్యాదులు ఈ వేదమువల్లనే సిద్ధించినవి. దేవతా ప్రసాదముచే అసాధ్యమైన కార్యములను కూడాసాధింపగలడు. కానవేదాలు చాలా ముఖ్యమైనవనియూ, వానిలో అన్ని విషయములు చెప్పబడినవనియూ భావించ వలెను. వేదములే భారతీయ సంస్కృతికి మూలములు. ఈ వేదములు అపౌరుషేయములు, స్వయంభువములు. (స.వా. పు. 62/65)
ఈ జగత్తును ఎవడు సృష్టించెనో, ఎవడు కాపాడెనో ఎవని లోనికిది నియమితకాల పరిణామానుసారముగా లయించునో, మరల కొంత కాలమునకు ఈ అద్భుత జగద్రూపమున గోచరించుచుండునో ఆ ఈశ్వరుని తెల్పునది వేదము. (స.వా. పు. 30)
వేదములనగా మంత్ర ద్రష్టలైన మహర్షుల యొక్క సత్యవాక్యముల సముదాయము. పరమేశ్వరుని యొక్క ఉచ్చ్వాస నిశ్వాసములే వేదము. త్రిలోకములందు, తిరుగులేని సత్యమును ప్రబోధించినదే వేదము. త్రిలోకవాసుల యోగ క్షేమములను పురస్కరించుకొని శాంతి సౌఖ్యములనందింప చేయునదే వేదము.
వేదము -విత్. అనే ధాతువు నుండి పుట్టి నటువంటిది. ఇదియే జ్ఞాన స్వరూపము. ఇష్టసిద్ధిని గావించుటకుగానీ, అయిష్టములను దూరము గావించుటకుగాని, తగిన ఉపాయములను ప్రబోధించునదే వేదము. "అనంతో వై వేదః" అని అఖండమైన, అనంతమైన ఈ వేదమును మానవులభ్యసించడము చాలా కష్టతరముగా ఉండేటటు వంటిది. పూర్వము వేదము ఒక్కటిగా మాత్రమే ఉండేది. దీనిని అధ్యయనము చేయుటకే కాలమంతా వ్యర్థము గావించి ఆచరణయందు విచారణయందు అనుభవించుటకు అసాధ్యమని తలంచి, వ్యాసులవారు దీనిని విభజిస్తూ వచ్చారు.
అమోఘమైన వేదమునుండి ఋక్కులను వేరు చేసి దీనిని ఋగ్వేదమనియు, యజున్ లను వేరుచేసి యజుర్వేదమనియు, సామములను వేరు చేసి సామ వేదమనియు, మూడు విధములుగా విభజిస్తూ వచ్చారు. మంత్రములకు సంహితమని ఒక పేరు. కనుకనే వీటికిఋగ్వేద సంహితము, యజర్వేద సంహితము, సామవేద సంహితము అని పేర్లు పెట్టారు. ఇందులో ఋగ్వేదము దేవతాస్తుతి స్వరూపము. ఈ స్తుతి స్వరూపమైన ఋగ్వేద మంత్రములను అనంతమైన దివ్య భావము చేత స్మరిస్తూ వచ్చారు. ఆనాటి ఋషులు, యజుర్వేదము మంత్ర స్వరూపమైనటువంటిది, దేవతా స్వరూపమును పూజిస్తూ రావటము. ఈ యజుర్వేదమంత్రము లను యజ్ఞ, యాగాది క్రతువుల యందు, దాన ధర్మాది సత్ కర్మలందు ప్రవేశ పెట్టుతూ వచ్చారు.
ఒక్కొక్క వేదమును మూడు భాగములుగా విభజిస్తూ వచ్చారు. దీనినే బ్రాహ్మణములు (మంత్రములు), అరణ్యకములని, ఉపనిషత్తులని అన్నారు. అయితే, ఈ మంత్ర సంహితము నందు పరిపూర్ణ మంత్రములే ఇమిడి ఉండేవి. ఈ బ్రాహ్మణములలో ఎక్కువగా కర్మకాండ మాత్రమే కాకుండా దీనికి అనుచరణకు మంత్ర, ఉపదేశ, జ్ఞాన యజ్ఞములను అనుసరించుటకు మార్గములను అవలంభిస్తూ వచ్చింది. బ్రాహ్మణములలో మరి మూడు విధములుగా అభివృద్ధి గావించుకొంటూ వచ్చింది. తైత్తిరీయ, ఐత్తిరీయ, శతపథ బ్రహ్మణమని, ఇవన్నీ మంత్ర స్వరూపమైనవి. ఈ విధమైన మార్పులు చేత, దేశ కళ్యాణము, మానవోద్ధారణ, యోగ క్షేమ ములకే విభజిస్తూ రావడము జరిగింది.
యజ్ఞ, యాగాది, క్రతువులవల్ల లోక క్షేమము ఏర్పడుతుంది. దీని ప్రభావము వలన సకాల వర్షములు సంభవిస్తాయని, సుభిక్షముతో జీవిస్తారని నమ్మకం. ఇవన్నీ కర్మకాండలతో కూడిన వగుటవల్ల యజ్ఞ, యాగాది, క్రతువులవల్ల వర్షము సంభవించటము, సస్యశ్యామలము అభివృద్ధి గావటం, పంటలు అభివృద్ధి గావటము, తద్వారా మానవ జీవితమునకు, తిండి తీర్థాదులకు లోటులేకుండా సుఖ జీవనము గడపటము, ఇత్యాది ఫలితములను అనుభవిస్తూ వచ్చారు.
అరణ్యకములు: గృహస్థాశ్రమము అనుభవించిన తర్వాత ఏకాంతముగ అడవులకో, సమీప వనములకో వెళ్లి భగవత్చింతనము గావించుకుంటూ వారు స్మరించినటువంటి భావములను మంత్రములచేత అభివృద్ధి చేసుకుంటూ వచ్చినారు. భావోద్రేకముతో ఆవిర్భవించిన ఈ భావములను మంత్రములుగా చేకూర్చుచూ, వానినే నిరంతరము స్మరించుకుంటూ, చింతించు కుంటూ రావటముచేత వీనికి అరణ్యకములని పేరువచ్చినది. అరణ్యకములన్నియు ఎక్కువ భాగము కర్మకాండతో కూడి ఉంటున్నవి, చివర మాత్రము బ్రహ్మకాండగా రూపొందుతుంది. ఈ బ్రహ్మకాండనే యజ్ఞ యాగాదులకు ఉపయోగపడుతూ వచ్చినది.
యజ్ అనే ధాతువునుండి ఆవిర్భవించినది యజుర్వేదము,ఇది పరిపూర్ణముగా దేవతా స్వరూపాన్ని చింతించటమే, స్మరించటమే. పూజించటమే. ఈ యజుర్వేదమును రెండు విధములగా విభజించినారు. ఇవే కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదము. వీటికి రెండు సిద్ధాంతాలున్నాయి. బ్రహ్మసాంప్రదాయమొకటి, ఆదిత్య సాంప్రదాయము రెండవది. బ్రహ్మ సాంప్రదాయమే శుక్ల యజుర్వేదము. ఆదిత్య సాంప్రదాయమే కృష్ణ యజుర్వేదము. కృష్ణయజార్వేదము దక్షిణ భారతదేశమునందు. శుక్ల యజర్వేదము ఉత్తర భారతదేశమునందు అభివృద్ధి అవుతూ వచ్చినవి.
వేదముల పేర్లు : ఈ వేదము తొమ్మిది పేర్లతో పిలువబడుతూ వచ్చినది. శృతి, అనుస్వర, త్రయీ, అమ్నాయము, సమామ్నాయము, ఛందస్, స్వాధ్యాయ, గమ, ఆగమ అనునవి. కారణము లేకుండా ఈ పేర్లు అభివృద్ధికి రాలేదు.
శృతి: గురువు చెప్పినట్లుగా శ్రద్ధతో విని, ఆశబ్దమును అదేరీతిగా ఉచ్చరించి, అధ్యయనము చేసి వేదమును అభివృద్ధి గావించటము. అనగా వినికిడిచేతనే దీనిని అధ్యయనము చేయటము. అధ్యయనము చేసిన దానిని మననము చేసి స్మరిస్తూ పోషించుకుంటూ పోవడము అనుస్వర అన్నారు.
త్రయీ: పూర్వము ఋగ్వేదము, యజుర్వేదము,సామవేదము ఈ మూడు వేదములు మాత్రము అపౌరుషేయములని అనే వారు. యజుర్వేదము నుంచి తీసి వేరు చేసిన మంత్రములు అధర్వణ వేదము. కనుకనే ఈ మూడు వేదములకు త్రయీ అని పేరు వచ్చినది. అమ్నాయము: "న్నూ" అనే ధాతువుకు నిరంతరము చింతించటము, అభ్యాసము చేయుటము అని అర్థము. అభ్యాసము వల్ల ఇది అభివృద్ధి అవుతుంది కనుక దీనికి అమ్నాయము, సమామ్నాయము అని పేర్లు వచ్చినవి. ఛందస్సు : కప్పిపుచ్చి, వ్యాప్తి గావించటమనేది ఒక అర్థము. వేద మంత్రముల కన్నిటికి చందస్సు అని పేరు. సామవేదము అంతయూ ఛందస్సులో నిండి ఉంది.
స్వాధ్యాయము: ముత్తాతలు, తాతలు తండ్రుల ద్వారా సాంప్రదాయంగా వేదము అభివృద్ధి గావించటముచేతనే దీనికి స్వాధ్యాయమని పేరు. కేవలము గ్రంథములలో పరిచయ మయేటటువంటిది కాదు. గురు శిష్య పరంపర చేతనే, శ్రవణము చేతనే అభివృద్ధి గావించబడినది. పరంపరంగా స్వాధ్యాయం గావించడము వల్ల వచ్చింది కనుకనే స్వాధ్యాయమని పేరు వచ్చినది.
గము, ఆగము: భగవంతుని ఉచ్చ్వాస నిశ్వాసముల నుంచి ఏర్పడినదికనుకనే గము, ఆగము అని పేర్లు వచ్చింది. ఏతావాతా వేదము లన్నియూ భగవంతుని ఉచ్చ్వాస నిశ్వాస స్వరూపములే. మంత్రద్రష్టులైన మహర్షులు దీనిని అష్ట అక్షరములతో శ్రవణము చేసినారు- ఆకచటతపయశ అనే ఎనిమిది అక్షరముల చేతనే వేదము లన్నింటిని అనేక విధములైన స్వరములు వేసి అనేక కోట్ల అక్షరములుగా అభివృద్ధి గావించుతూ వచ్చినారు. మహర్షులు వీటిని అనేక విధములుగా పోషించుకుంటూ వచ్చినారు.
ఈ వేదములకు అనేక శాఖలు, ఉప శాఖలు ఉండేటటువంటివి. ఋగ్వేదమునకు 20 ప్రధాన శాఖలు, 21 ఉపశాఖలు కానీ దురదృష్టవశాత్తు, కాలగర్భములో కలిసిపోయి ఇప్పుడు 3 శాఖలు మాత్రమే నిలిచి పోయినాయి. యజుర్వేదములో 96 శాఖలు ఉండేవి.కానీ 2 శాఖలు మాత్రమే ఇప్పుడు నిలిచిపోయినాయి.సామవేదము 1000 శాఖలలో ఉండేటటువంటిది. అది కూడా ఇప్పుడు 3 శాఖలతో నిలచి పోయింది. ఈనాడు మిగిలిన ఇంత తక్కువ శాఖలలోనే ఇంత ఆనంత జ్ఞానము ఇమిడి ఉండగా గతించిన శాఖలన్నీ ఉండివుంటేభారతీయులు ఎంత ప్రజ్ఞావంతులై ఉండేవారో? వేదములను అలక్ష్యము చేస్తూ రావటముచేతనే భారతీయుల ప్రజ్ఞాన విజ్ఞానములు కూడా క్షీణిస్తూ వచ్చినాయి. సంకుచిత భావములు పెరుగుతూ వచ్చినాయి. విశాలమైన విశిష్టతలు క్షీణిస్తూ పోయినాయి. ఈనాడు వేదములంటే అయిష్టపడేవాళ్లు, అసహ్య పడేవాళ్ళు విరివిగా పెరుగుతూ పోతున్నారు. అసలు ప్రధానమైన బ్రాహ్మణులయందు ఈ విధమైన భక్తి శ్రద్ధలు తగ్గిపోతూ వచ్చినాయి.
బ్రాహ్మణులనగా ఎవరు? బ్రహ్మ అనగా మంత్ర స్వరూపము. మంత్ర స్వరూపములైన అర్థములను నిరంతరము స్మరిస్తూ రావడము చేత వారు బ్రాహ్మణు లనబడినారు. ఈనాడు ఆట్టి బ్రాహ్మణులే ఆట్టి మంత్ర స్వరూపమైన దైవమును విస్మరిస్తూ వచ్చినారు. ఆధునిక విద్యలు అభివృద్ధి గావటము చేతనూ, ఆశలు పెరిగి పోవటము చేతనూ, ఉత్తమ భావములు క్షీణించుట వల్లనూ, సంకుచిత భావము పెరగటము వల్లనూ, తమ దివ్యత్వాన్ని తామే కోల్పోతూ వచ్చినారు. కనుకనేయోగక్షేమములు క్షీణిస్తూ వచ్చినాయి, శాంతి భద్రతలు కోల్పోతూ వచ్చినారు.
వేదములంటే ఏమిటి? ఎరుక అని ఒక అర్థము, తెలివి అని మరొక అర్థము, వివేకమని మరొక అర్థము. తెలివి కావాలనేవారు, వివేకవంతులు కావాలని కోరుకొనేవారు, వేదాన్ని అభ్యసించేవారు. ఈనాడు మేధాశక్తి పెరిగి పోతున్నా కృత్రిమముగా పెరుగుతూ పోతున్నది. ఏ విధముగా పదవులు పొందాలి? ఏ విధముగా ధనమును అభివృద్ధి గావించుకోవాలి? ఏ విధముగా భోగభాగ్యము అనుభవించాలి? ఏ మార్గమున శాంతి భద్రతలు పొందాలి? అనేటటువంటి ఆశలు మాత్రమే. కానీ సద్గుణవంతులుకావాలి, సదాచార సంపన్నులుగా మారాలి. దివ్యమైన మార్గములో ప్రవేశించాలి. బ్రహ్మ పాదాన్ని పొందాలి అనేటటువంటి ఉన్నత భావాలు ఈనాడు సన్నగిల్లిపోతూ వచ్చాయి. వీరి తెలివితేటలన్నియూ, ఆల్పమైన మార్గములో స్వార్థ స్వప్రయోజనములైన మార్గములలో ఉపయోగ పరుస్తూ వస్తున్నారు. మానవత్వమును మరచిపోతూ వున్నారు. మానవాకారము మాత్రమే నిలిచింది. కానీ మానవత్వము లేని మానవుని వల్ల లోకానికి కలిగే ఉపయోగమేమిటి? కనుకనే వేదములన్నియూ, ఆకార మానవునివల్ల లోకానికి ఉపయోగము లేదు, ఆచార మానవులు కావాలి, ప్రచార, విచార మానవులు కావాలని ప్రబోధిస్తూ వచ్చింది.
ఈనాడు అనేకులు వేదమంత్రము అధ్యయనము చేస్తున్నారు. వల్లె వేస్తున్నారు. కానీ అర్థము తెలిసి వల్లె వేయటము చాలా తక్కువగా ఉంటున్నది. అర్ధములు తెలిసి మంత్రములు ఉచ్చరించుటచేత మరింత పరిపూర్ణమైన ఆనందమును అనుభవించవచ్చు. తినుబండారముల పేర్లు విన్న, పుస్తకములో చదివిన దాని యొక్క రుచిగాని, పుష్టిగాని, ఆనందముకాని ఏర్పడదు. దానిని భుజించిన తర్వాత కలిగే మధురానందము, చదివినా, విన్నా, లభ్యముకాదు. అటులనే మంత్రములను పఠించిన, వల్లించిన మాత్రమున దాని పరిపూర్ణ దివ్యత్వము అర్థము కాదు. దాని అంతరార్థము గుర్తించి, వర్తించినప్పుడే దాని యొక్క పరిపూర్ణ స్వరూపము సాక్షాత్కరిస్తుంది. వేదము విశాలమైన భావముతో, వివేకమైన తలంపులో, విజ్ఞానమైన భావముతో, విశ్వవ్యాప్తి అయినదే కాని సంకుచితంగా నిలిచిపోలేదు. ప్రతి విషయము నందు సమత్వాన్ని ప్రభోధిస్తూ వచ్చింది. ఏకత్వాన్ని అభివృద్ధి గావించుకుంటూ వచ్చింది. కష్ట సుఖములందు సమత్వాన్ని నేర్పుతూ వచ్చింది.
కానీ ఈనాటి మానవుడు మంత్రములను ఉచ్చరిస్తూ ఉన్నా, అందులోని పవిత్రతను గుర్తించుకోలేక పోతున్నాడు. ఒక్క మంత్రమును అర్థం చేసుకున్నా చాలు. శాంతిమంత్రములో - సహనావవతు" అని నిత్యము పఠిస్తూ వస్తున్నారు. ఎంత విశాలమైన మంత్రమును సంకుచితంగాభావించి తద్వారా బేధము లను అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు. ఆనాటి సమత్వము, ఏకత్వములో వెయ్యింటిలో ఒక భాగము కూడా కల్పించడము లేదీనాడు. వేదము యొక్క అర్థము పరిపూర్ణమైనది. ఈ నాటి మానవుని భావములు మరింత దిగజారి పోవటముచేత భిన్నత్వము అభివృద్ధి అయి పోతూ వచ్చింది. వారికి అర్థము తెలియక పోతే ఊరకుండుటే ఎంతో మేలు కానీ నానార్థాలు పెంచి అనర్థాలు తెచ్చుకుంటున్నారు. అనర్థాలు పెరుగుతూ యధార్థాలు మునిగిపోతూ వచ్చాయి.
యజ్ఞయాగాది క్రతువులయందు, మంత్రముల యందు ఋగ్వేదములో అనేక దేవతలను వర్ణిస్తూ వచ్చారు. ఇందులో 33 ప్రధాన దేవతలుగా నిరూపిస్తూ వచ్చారు. ఇందులో సూర్యుడు ప్రధానము. మానవులవలె దేవతలు అనేక అంగములతో ఉండేవారు. సూర్య తత్త్వము జగత్ వ్యాప్తి గావించినటువంటిది. సూర్యునికి ఋత్విక్ అని ఒక పేరు, హోతా అని, బ్రహ్మ అని పేర్లు,అర్పితము అయినవన్నీ దేవతలకందించేది అతని పని.
అగ్ని దేవతా స్వరూపము, సూర్య ప్రతిబింబమే. అగ్నికి రూపమున్నదని నిరూపిస్తూ వచ్చినారు. అగ్నికి తల్లి తండ్రు లు- అరణి, అన్ని పుట్టిన వెంటనే తల్లితండ్రులను భస్మము చేస్తాడట. పైకర్ర తండ్రి, క్రింద కర్ర తల్లి. అగ్నికి రూపముంటున్నది. జ్వాలలన్నియూ నాలు కలవలె, కిరణములన్నియూ శిరస్పుల వంటివి. "సహస్ర శీర్షా పురుష, సహస్రాక్ష సహస్రపాత్" అనే మంత్రముతో వర్ణిస్తూ వచ్చారు. ప్రతి ఒక్కరియందు అగ్ని తత్వము ఇమిడి ఉంటున్నది. ప్రతి జీవికూడా భగవత్ స్వరూపమే " దీనియొక్క అంతరార్థము. ఈ విధములైన మంత్రములను ఉచ్చరించి భగవదర్పితము గావించటము చేత ఇవన్నీ భగవంతునికి చేరి, తద్వారా శాంతి ప్రసన్నము గావించటము చేతనే లోక కళ్యాణం ఏర్పడుతూ వచ్చింది. (స.సా.న..89పు.285/289)
వేదములన్నియు ప్రవృత్తి మార్గమునే బోధిస్తూ వచ్చాయి. రసాయన, వృక్ష, పదార్థ, గణిత సంగీత శాస్త్రములన్నియూ వేదముల నుండి వచ్చినవే. కానీ, ఇవన్నీయూ ప్రవృత్తి మార్గమునే బోధిస్తూ వచ్చినవి. కనుకనే వేదములను ద్వైతములని చెప్పుతూ వచ్చారు. ఉపనిషత్తులు మాత్రమే నివృత్తి మార్గమును బోధిస్తూ వచ్చినవి. మానవుని చతుర్విధ పురుషార్థములలో ధర్మ, అర్థ, కామములను బోధిస్తూ వచ్చాయి వేదములు. ఉపనిషత్తులు కేవలము విద్యవల్లనే గుర్తించడానికి వీలవుతుందని బోధించినాయి. (సపా.స.89 పు. 291)
వేదములు అనంతములైనను, ఇప్పటికి మిగిలినవి ఆచరణలో న్నున్నవి నాలుగే. అవియే ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదములు. ఒక్కొక్క వేదమును అనేక ఉపనిషత్తులుగా విభజించిరి. అట్లు విభజించినవిమొత్తము (1180) వేయి నూట యెనుబది ఉపనిషత్తులు కలవు. కానీ కాలపు మార్పు చేత ఉపనిషత్తులు క్రమేణా తరుగుతూవచ్చి (108) నూటయెనిమిదికి దిగినవి. మిగిలినవి కనుపించకున్నవి. వానిలోనైనా నేడు ఆచరణలో నున్నవి, విచారించగా పది మాత్రమే తేలినవి.
ఇందులో ఏ యే వేదమునకు ఎన్నెన్ని ఉపనిషత్తులో వ్యాసమహర్షియే విభజించెను. ఋగ్వేదమునకు ఇరువది ఒక్క శాఖలు, ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క ఉపనిషత్తును; యజర్వేదమునకు 109 శాఖలను అందుకూడా ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క ఉపనిషత్తు అనగా నూట తొమ్మిది ఉపనిషత్తులును, అథర్వణ వేదమునకు ఏబది శాఖలు, కనుక దానియందు ఏబది ఉపనిషత్తులును; సామవేదమునకు వేయి శాఖలు కనుక ఒక్కొక్క శాఖకూ ఒక్కొక్క ఉపనిషత్తును; ఈ రీతిగా నాలుగు వేదములకూ ఎన్ని శాఖలో అన్ని ఉపనిషత్తులుగా విభజించబడినవి. అన్నియు కలిసి వేయునూట యెనుబది ఉపనిషత్తులు (1180) కలవు.
అవి అన్నియూ మరుగునపడగా సర్వోపనిషత్సారమునూ చేర్చి శంకరులవారు పదిగా ఆచరణలో నిలిపిరి.అపుడుఅవి దశోపనిషత్తుల ఆధారముతోనే ఈ ధర నిలిచి యున్నది. అవి కూడా ఏనాడు మరుగున పడి ప్రళయము సంభవించునో ఆను భయము ఆస్తికులకూ వేదపండిలు లకూ లేకపోలేదు. కాని పరమాత్మ అట్లు ఏనాడు చేయడు: అందు నిమిత్తమే భగవంతుడు అనేక రూపములతో అవతరించి వేదములనూ, ధర్మములను ఉద్దరించు చున్నాడు. కాన ఆస్తికులకు అట్టి భయము అవసరములేదు. వేదమునకు హాని రాదు. కనుక, ఈ దశోపనిషత్తులనైనా లోకమునకు అందించుటకు పండితులు, ఆస్తికులు -కంకణము కట్టవలెను. అవియే ఈశ, కేన, కఠ, ప్రశ్న, మండక, మాండూక్య, తైత్తిరీయ, ఐతరేయ, ఛాందోగ్య, బృహదారణ్యకము లనబడును. (ఉ.వాపు.4/5)
మనసునకు అతీతమైన స్థాయినుండి ఆవిర్భవించినప్పుడు సత్యవాక్కుగా రూపొందుతుంది. ఆ సత్య వాక్కునే వైబ్రేషన్ అన్నారు. భూర్-అనగా ఈ శరీరమునందు, సర్వత్రా వ్యాపించే భువః, ఆవైబ్రేషన్ ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి అనే వైబ్రేషన్ ఎక్కడనుండి ఆవిర్భవిస్తున్నది? సువః - ప్రజ్ఞనుండి ఆవిర్భవిస్తుంది. కనుక radiation నుండి vibration, vibration నుండి materialisation.ఈ విధంగా సంబంధము ఏర్పడుతున్నది. దీనినే భూర్భువస్సువః అన్నారు. ఈ వేదమును ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అని మంత్రాలతో మనము ఉచ్చరిస్తున్నాము. ఋగ్వేదము అనగా ఏమిటి? వాక్కే ఋగ్వేదము. ఋగ్వేదము వాక్కునుండి ప్రారంభమవుతుంది. ఈ వాక్కు ఏవిధంగా వస్తున్నది. అంతర్భావమైన మూలాధారమైన నాభినుండి వస్తున్నది. దీనినే ఋగ్వేదమన్నారు.మనసునే యజర్వేదమన్నారు. ప్రాణమునే సామవేద మన్నారు. ప్రాణములు ప్రణవోపాసనచేత ఒక విధమైన శ్వాసము ప్రారంభమవుతుంది. ఈ శ్వాసము సుస్వరము తో కూడినదై వుంటుంది.ఇది నిజమైన సామవేదము. సామగానమనగా ఏమిటి?ప్రాణోపాసనచేత ఆవిర్భవించిన శ్రవణానందమే సామము. గోనానందమే సాధన. ఈసామము యొక్క గుణము సుస్వరమైనదిగా ఉండాలి. సుస్వరముగానిది ఏమాత్రము సామగానము కాదు. యజుర్వేదము - యజ్ఞయాగాది క్రతువులందు మంత్రస్వరూపమైనది. తేజోమయమైనది. ఈ ప్రపంచము నందు మనకు కానవచ్చే సమస్త తేజస్సును ఒక స్వరూపముగా నిరూపణవేసి భగవంతుడు తేజో మయుడని ఈ ఋగ్వేదము ప్రపంచానికి చాటుతూ వచ్చింది. సామాన్యంగా మన భారతీయులంతా భగవంతుడు కోటి సూర్యుల కాంతితో వెలుగుచున్నాడు ఉచ్చరిస్తున్నారు. అనగా తేజస్వరూపమే ఋగ్వేదము. మంత్ర స్వరూపమే యజుర్వేదము. గానస్వరూపమే సామవేదము. మానవునికి ఈ మూడూ అవసరమే. భగవంతుని తేజోమయముగా నిర్మించుకొని, భగవంతుని మంత్రముతో ఉచ్చరించి గానముతో ఆనందించమని కోరింది. కాబట్టి ఈ ఋగ్వేద, యజుర్వేద సామవేదములన్నీ దివ్యత్వమును అనుభవించటానికి వచ్చినవే. కాని కంకణాలు, రుద్రాక్షాలు ధరించటానికి కాదు. ఋగ్వేదము - తేజోమయమైన భగవంతుని, యజుర్వేదము - మంత్రపూర్వకమైన ఆరాధనచేత, సామవేదము - గానముచేత లీనము కావాలి. గానముచేత తప్ప మరొకదానిలో లీనము కావడానికి లేదు. చాలామంది పద్యాలు చెప్తూవుంటారు. మాటలు చెప్తూ వుంటారు. మాటలచేతను, పద్యాలచేతనూ హృదయం ఆకర్షింపబడదు. ఒకడు రాముని ముందుకు పోయిరామా నన్ను కాపాడు అని అంటే యీ మాటలతో హృదయము ఏమాత్రము కరగదు.రామా నన్ను కాపాడు-పద్యముతో చెప్పితే ఇది కూడా ఏమాత్రమూ కరిగించదు. "రామా నన్ను కాపాడు" అని గానంచేస్తే అదే - హృదయాన్ని ఆకర్షిస్తుంది. గానములో యీ విధమైన లీనముంటుంది. ఈ లీనతత్వమును అర్థము చేసుకోలేని వ్యర్థ జీవులంతా గానాన్ని కొంతవరకూ వినలేకపోతున్నారు. అది ఏమైనా కొంత ఆపస్వరమైపోతే భ్రష్టుపట్టిస్తుంది. ఏకాగ్రతను చెడగొట్టుకుంది. మనము పాడే సమయములోపల సుస్వరంగా పాడేటట్టువుంటే మైకు ముందు కూర్చోవాలి.లేకపోతే మైకు కు దూరంగా వుండి శ్రవణం చేస్తే మంచిది. అపస్వరముతో పాడే భజనలు అపస్వరముతో చేసే గానము మన హృదయాన్ని కొంతవరకూ చలింపజేస్తు వున్నాయి. నీకు ఇష్టముగావుంటే ఒంటరిగా ప్రాక్టీసు చేయి. తరువాత మైకుముందు వచ్చి కూర్చో, భగవంతుని ఆకర్షింపజేసేది, హృదయాన్ని రంజింపజేసేది గానము. ఇదే శబ్ద ప్రమాణము. ఈ న్యాయ దర్శనములో ఇంకా ఎన్నో విధములైనవి మానవత్వానికి అవసరమైనవి ఉంటున్నాయి. మానవుని సంశయము లను తీర్చి మానవ హృదయాన్ని ఉప్పొంగింప చేసి, వికసింపజేసి ప్రకటిజేసి, ఆనందింపజేసేవి. ఈ న్యాయములో చాలా ఉంటున్నాయి. ఈన్యాయ, వైవేషిక, సాంఖ్య, యోగ, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస ఈ ఆరు దశలను ఒక్క తూరి మనము విని చక్కగా అర్థము చేసుకుంటే ఇంక మానవత్వములో మనము చేయవలసిన సాధన ఏమీలేదు. ఈ దర్శనములే సృష్టియొక్క రహస్యాన్ని నిరూపించి, ప్రబోధించి ప్రచారము సల్పి ఆనందము నందించునని. (స .ది.పు.114/115)
వేద వేదాంగములు వల్లెవేసియున్న
గద్య పద్యములను కూర్ప గలిగి యున్న
చిత్త శుద్ధియు లేకున్న చెడును నరుడు
ఇంత కన్నను వేరెద్ది ఎరుకపరతు. (సా.పు.410)
అనంతో వై వేదః" అని అందురు. అయితే వేదముమొదట ఒక్కటే. తదుపరి మూడుగా, ఆతరువాత నాలుగుగా విభజింపబడెను.
ఇది అనంతమైనది. కనుక అధ్యయనము చేయుట సామాన్య మానవులకు కష్టమయ్యెడిది. అంతేకాదు ఈ వేదమును నేర్చుకొనుటకు ఎంతో కాలము పట్టెడిది. కనుక నేర్చుకొనువారు దిగులొంది వేదాధ్యయనము చేయుటకు అంత అభిరుచితో ముందుకు వచ్చెడి వారు కాదు. ఈ కారణమును పురస్కరించుకొని, అందరికీ అనుకూలముగా ఉండునట్లు ఈ వేదములో ఉన్న ఋక్కులన్నింటినివేరుచేసి బుగ్ సంహితములని, యజుస్సులను కూర్చియజుస్సంహితములని, సామములన్నింటినీ కూర్చి సామసంహితములని, అధర్వ మంత్రాలను వేరుగ చేర్చి అధర్వ సంహితములని విభజించిరి.
ఈ విధముగ విభజించిన వారు నారాయణాంశ సంభూతుడగు వ్యాసుడు పరాశర మహర్షి కొమారుడు. సమస్త విద్యల మూట. ఆమూటకు మారు పేరు వ్యాసుడు. ఇతను మహర్షి, సమస్త వేదశాస్త్ర పారంగతుడు, సమన్వితుడు, సమర్థుడు. లోకకళ్యాణార్ధమై అతను వేదములను విభజించి ధర్మమును ఆచరించుటకు అనుకూల పరచెను. వేదములను నాలుగుగా విభజించి ఐదు సంహితులుగా ఏర్పరచెను. కృష్ణ యజుర్వేద సంహిత, శుక్ల యజురర్వేద సంహిత అని రెండు. యజుర్వేదమును రెండుగాను, మిగిలిన మూడు వేదములను ఒక్కొక్కటిగనే విభజించుటచేత ఐదు అయినవి. అంతేకాదు, ఒక్కొక్క సంహితను తిరిగి మూడు భాగములుగ విభజించెను. ఇవన్నియు వారివారి స్థితి గతులకు తగిన రీతిగా అందరినీ తరింప చేయగోరి చేసినవే. వారి వారి యోగ్యతలను పురస్కరించుకొని, సంఘ శ్రేయస్సు కోసం చేసినవే. అంతేగాని వీటిలో ఏ మాత్రము భేదములు లేవు. సంహిత భాగములు - బ్రహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు - అని మూడు.. (లీ.వాపు 5/6)
ఒక్కొక్క వేదము అనేక శాఖలు కలిగి యున్నది. ఆ శాఖల యొక్క పరిపూర్ణతను కూడా అనుభవింపవలసి వచ్చును. - (లీ.వా.పు.9)
వేదమునకు ఎన్నియో పేర్లున్నవి. పృశ్నిఅనియు, ప్రథమజా అనియు, ఇంకా ఆయా సందర్భమును పురస్కరించుకొని అనేక పేర్లు ఉన్నవి. (లీ.వా.పు.13)
భావ శుద్ధితో అర్థభావముతో వేదమును ఉచ్చరించువారికి సకలైశ్వర్య జ్ఞానమగు బ్రహ్మవిద్య లభ్యమగును. ఏనామమైనా, యేమంత్రమైన భావశుద్ధితో, ఆత్మ శుద్ధితోఉచ్చరించిన అట్టివారికి సకలైశ్శర్య స్వరూపుడగు బ్రహ్మ, అనుగ్రహముతో బ్రహ్మ విద్య, ప్రాప్తి నందించును. "వేదం పరమేశ్వరం. వేదయతీత వేదస: వేదస్త్వమ్" శుభప్రాప్తి సాధనమై అర్థింపబడునది అగుటచే ధనాధికము అర్ధః అని చెప్పబడుచున్నది. సుఖరూపుడై అందరిచే అర్థింపబడువాడగుటచే పరమేశ్వరునకు అర్థః అని పేరు. అట్టి పరమేశ్వరుని కొరకు వినియోగింపబడే తత్ప్రాత్తి సాధనమగు ధనము లేక ఆరాధకునకు, ఆరాధ్యుడగు దైవమునకు తృప్తిని కలిగించునని శ్రుతియే తెలిపినది. వేద వాక్కుచే వేద విహితధర్మాధ్యాచరణముచే సిద్దించెడి ధనమే వేదః అగుననెడి అర్థము వేదతార్పర్యము, కావుననే ఇట్టి ధనమును‘శ్రుత్యమ్ అని ఋగ్వేదము కీర్తించుచున్నది. (లీ. వా.పు.17/18)
ఈ ప్రపంచములో మిక్కిలి ప్రాచీనమైనది. వేద సాహిత్యము. ఇది విజ్ఞానరాశి. మానవుని సర్వతోముఖుని గావించినది. ఈ వేదము. మానవుని చరిత్రకుమొట్టమొదటి పాఠ్యగ్రంథము వేదమే. మానవ సంస్కృతికి, - సర్వశక్తికి మూలాధారము పుట్టినిల్లు ఈ వేదము "సర్వం వేదాత్ ప్రసిధ్యతే" అన్నాడు మనువు. సమస్త విద్యలు వేదమునుండి ఆవిర్భవించినవే. సర్వగుణముల సర్వ ధర్మములు వేదమునుండి యే ఆవిర్భవించినవి. "అనంతోవై వేదా:" వేదము అనంతము, అగాధము, అప్రమేయము, ఆనందమయము. విద్ జ్ఞానే అనే ధాతువు నుండి పుట్టినది వేదము. ఈశ్వర జ్ఞానమే వేదము. ఆత్మజ్ఞానమే వేదము. బ్రహ్మజ్ఞానమే వేదము అద్వైతజ్ఞానమే వేదము విజ్ఞానమే వేదము. ఇవన్ని ఆత్మజ్ఞానమునకు పర్యాయపదములు. ఇట్టి పవిత్ర వేదమును సామాన్యులు అర్థము చేసుకొనలేరు. అర్థము చేసుకొన్నను చేసుకొనక పోయినను వేదము యొక్క దివ్యత్వమే సర్వత్ర వ్యాపించి ఉంటున్నది. ఇది శబ్దబ్రహ్మము. "శబ్ద బ్రహ్మమయీ, చరాచరమయీ, జ్యోతిర్మయీ, వాఙ్మయీ, నిత్యానందమయీ, పరాత్వరమయీ, మాయామయీ, శ్రీమయీ" ఇదియే ప్రజ్ఞాన మయమైన బ్రహ్మము; కాన్ స్టెంట్ ఇంటి గ్రెటెడ్ అవేర్‌నెస్. ఇది ఒకకాలమునకు కాని, ఒక స్థానమునకు కాని, ఒక వ్యక్తికి గాని సంబంధించినది కాదు: యావద్విశ్వమునకు సంబంధించినది. ఇట్టి వేదమును సామాన్య ప్రజలు గుర్తించటం కాని, వర్తించటం కాని సాధ్యముకాదని తెలుసుకొని వ్యాసులు వారు దీనిని నాలుగు విధములుగా విభజించినారు. వేదము త్రికాండలలో కూడి జగత్తునకు ఆచార రూపమైన ప్రచారము గావిస్తూ వచ్చింది. (బృత్ర.పు.180)
వేదము సనాతన శాస్త్రము : శాస్త్రమనగా అజ్ఞాత జ్ఞాపకము: అనగా. లోకసిద్ధము కాని అతీంద్రియములైన అర్థముల దర్శింప జేయుటకు ప్రవృత్తమైనది. పురుష బుద్ధికి గోచరము కానిదగుటచే, "పరమంవ్యోమ, పరమం పదమ్, అక్షరమ్, తత్, సత్" యీరీతిగా ఋగాది శ్రుతులన్నియు తెలిపెను.
ఒక వేదమును తెలియజేయుటకై అనేక వేదము లావిర్భవించెను. వేదశబ్దము మొదట సర్వజ్ఞుడగు పరమేశ్వరునకు వాచకమగుచు, (వేత్త తీతి వేదః) తరువాత తత్స్వరూప నిరూపణపరమై (వేదయతీతి వేదః) సర్వజ్ఞ కల్పమగు ఋగాది శబ్దరాశికినీ వాచకమైనది. తరువాత తదనుగుణముగ ప్రవృత్తములయ్యెడి. ధర్మ, అర్థ, కామములకు సుపలక్షకమగుచున్నది. మొదట (సర్వ ద్రష్ట) యగు పరమేశ్వరుని బోధించుచు, తరువాత ఆ పరమేశ్వరుని దర్శింపజేసెడి (దర్శనాత్) ఈ వేదము, ఋషి శబ్దరాశికి కూడా వాచకమై వరలినది. తరువాత ఋషులు దైవ వేదములను ఆరాధించి తనను గ్రహముచే ద్రష్టలయి వెలసి, ప్రసిద్ధములైరి.
దీనిని పురస్కరించుకొని పరమేశ్వరునకు "మహర్షి" అని కూడా నామము ప్రసిద్ధమైనది. బ్రహ్మసూత్రమున "మహర్షి! ముఖ్యర్షి: శివ:" అని కూడా సహస్రనామముల కలవు. పరమేశ్వరుని దర్శింపచేయునదగుట చేత, వేదమునకు ఋషి అనియు నామము సార్థకము. బ్రహ్మ అనివేదమునకు నామము. అందుచే బ్రహ్మము పొందుటకై చేయు ఫలత్యాగ కర్మలకు. బ్రహ్మయజ్ఞమని, ఋషియజ్ఞమని కూడా చెప్పుతూ వచ్చిరి. శుద్ధ, శుభ, సాత్విక, నిస్స్వార్థ కర్మలన్నియూ యజ్ఞములే.
ఈ విధములైన ఫలత్యాగ కర్మలలో, పదే పదే స్వాహా అనుచు అర్పితము గావించుచుందురు. ఈ స్వాహా శబ్దసాంప్రదాయములకు గతములైన శబ్దముల అర్థములను చూతము. కేశవాయ స్వాహా, ప్రాణాయ స్వాహా, ఇంద్రాయ స్వాహా, ఇత్యాది స్వరములయందు స్వాహ పదమునకు సామాన్యముగ "హవిస్సు సుహూతమగు గాకా” అని అర్థము చెప్పుదురు. .
సుహూతో మన వేమి? అన్నియందు విడువబడిన యజ్ఞాది ద్రవ్యములు దగ్ధమను గాక, జీర్ణమగుగాక, అని. ఇక్కడ ఒక సందేహము కలుగవచ్చు. అగ్నిలో వేసిన సమస్త పదార్థములు. సహజంగానే దగ్ధమగును. జీర్ణమగును కదా. ఇక స్వాహాకారము చేయుటచేత కలుగు ప్రత్యేకత ఏమి?స్వాహూతిఅనగా వస్తువులను దగ్ధము చేయుట, జీర్ణము చేయుట మాత్రమే శృతితాత్పర్యము కాదు. దగ్ధ మగుట ప్రత్యక్షగోచరము మాత్రమే: వైదిక దృష్టివేరు. కుమార సంభవ కావ్యమందు. కాళిదాసు, హిమాలయమును వర్ణించుచూ "దేవతాత్మ" అని అన్నాడు. అనగా, దేవతా శరీరము, భౌతిక శరీరము అని ప్రతిదానికి రెండు శరీరములు కలవు. ఇది శ్రుతి సమ్మతము. దేవతా శరీరము అతీంద్రియం. భౌతిక శరీరం ఇంద్రియములతో కూడినది. దేవతా శరీరమున అగ్ని ప్రాణాగ్ని అగుచున్నది. అందులో ఆహుతి హవిస్సు అగుచున్నది. ఆహుతి యొక్క స్వరూపమును శ్రుతియిట్లు వివరించుచున్నది. అత్తా, అద్యము అనగా భోక్త, భోగ్యరూపమగు ఈ జగుత్త ఏకీభూతమయినప్పుడు, రెంటినీ కలిపి అత్తా అనియే అనగా భోక్త అనియే వ్యవహారము. ఆ భోక్త యెవరు? అదే అగ్ని,అది దైవికముగ అదిత్యుడు, ఆధ్యాత్మికముగ ప్రాణము. అట్టి ప్రాణాగ్ని యందు సమంత్రముగ నుంచబడెడి అన్నాది హవిస్సులకు"అహితయః" అని పేరు. స్వాహా శబ్దము కేవలము హామ సూచకమైన సాంకేతిక పదము మాత్రమే కాదు, స్వార్థకమగు వాజ్మయము.
ఛందయతి:ఆహ్లాద, చాదనమనగా బలవంతుడగుట, ప్రాణశక్తి వంతుడగుట, అచ్చాందించుట. ఇట్టి ధర్మబలముండుటచేతవే వేదములకు చందస్సులని పేరు. ఇట్టి వేదము నాచ్చాదించు వారలను సుశక్తి వంతులను తైత్తరీయ శృతి యెంతయో విపులపరచినది. ఇట్టి క్రతువు ఒక వ్యక్తికే కాక లోకోత్తరాహ్లాదమునే కలిగించునదై యున్నది. "యజ్ఞాంగ: యజ్ఞ వాహన: వృషరథ:" ఇత్యాది నామములు శృతి. స్మృతులయందు పరమేశ్వరునకు చెప్పబడినవి. హిరణ్యగర్భుడు సువర్ణ ఛందోమయుడు, సువర్ణ మనగా గరుత్మంతుడు. ఛందోమయమను గరుడని వాహనముగా స్వీకరించినవాడు.
వృష అనగా ధర్మస్వరూపము. ధర్మమునే వాహనముగా చేసుకొనుట. విష్ణు ఆలయములందు గరుడ, శివాలయములందు వృషభం స్తంభములను ద్వారముల ముందు యుంచి యుండుటలో ఇదే అంతరార్థము. ఛాదనమనగ సంసారవృక్ష రక్షణము. ఫలకాములై కర్మల యందు చరించు వారికి తత్త్యము నాచ్చాదించి, ధర్మనిష్ణు గావించి, సంసార వృక్షమును రక్షించుచుండును. కర్మిష్టులన ధర్మరూపమృత్యువునుండియు జ్ఞానులను సంసారరూపమృత్యువునుండియు నాచ్ఛాదించి రక్షించును. అట్లు రక్షించునట్టి వానినే ఛందస్సులనియు, అవే వేదములనియు చెప్పబడెను. "ఛాదనాత్ ఛందాసి!" మృత్యువునుండి రక్షించగలుగునదని ఛందస్సులు శర్మ హేతువులు. యజ్ఞము దేవతలనుండి తొలగిపోయి కృష్ణమృగరూపమై సంచరించుచుండ దేవతలు వెన్నంటి, కడకు దాని చర్మమును గ్రహించగల్గిరి. యజ్ఞశరీరమే కృష్ణాజినము, దానియందలి శుక్ల, కృష్ణ, బబ్రువర్గములు ఋగ్వేద, యజు:సామముల యొక్క రూపములు. కనుక కృష్ణాజినము ఋగ్, యజుర్, సామవేదస్వరూపమనే నిర్ణయము గావించిరి. దీనిని త్రయీ విద్యారూపమనిరి.త్రయీ విహిత కర్మ సాధ్యమగుటచే యజ్ఞముకూడా త్రయీస్వరూపము. ఇట్టి కృష్ణాజినమును గ్రహించుట చేతనే, యజ్ఞదీక్షితుడగు యజమానుడు, ఛందస్సుల ప్రేరేపించును.
శుక్ల, కృష్ణ బబ్రు వర్ణములకల కృష్ణాజినము లోక త్రయీరూపము. కాన కృష్ణాజినము ధరించి యజమానుడు లోకత్రయ దీక్షితుడగు చున్నాడు. దీక్షితుడైన యజమాని గర్భస్థ శిశుతుల్యుడు,గర్భస్థ శిశువు యేరీతిగ వ్రేళ్ళుముడిచి గుప్పిలిపట్టి మాత్రు శరీరచ్చాదితుడై యుండునో యజమానుడును అట్లే గుప్పిలి పట్టి త్రయీ విద్యారూప ఛందోమాతృ శరీరచ్ఛాదితుడై కృష్ణాజినధారుడై యుండవలెను.
కృష్ణాజినము మానుషదృష్టిలో చర్మము. అది దేవతా ప్రీతికర మైనదగుటచేత, యజ్ఞకర్మల యందు శర్మమగుచున్నది. అందువలన యేయజమానుడు, యజ్ఞసమయమున "నీవు శర్వస్వరూపివి, నాకు శర్మ నిమ్ము" అని సంబోధించును.
శర్మమనగా సుఖము, ఆనందము, ఆనంద స్వరూపుడు విష్ణువు. విష్ణువు యజ్ఞస్వరూపుడు. "యజ్జోవై విష్ణుః" ఆ విష్ణు త్రయీ విద్యాస్వరూపుడు. (స. సా..వా.ఉ.167/171)