ప్రాణము వదులుటకు ప్రాణము పుట్టుటకు కూడనూ పవిత్రకాలము ప్రామాణము. ప్రధానము బావా ! యోగులు పవిత్ర కాలము వచ్చు నపుడే ప్రాణము వదలుదురు. అందుకనే "మంచివారికి మరణమే సాక్షి"అని అందురు, మరణమునకు కూడా మంచికాలము అవసరము. ఇట్లు వచించిన శ్రీకృష్ణుని మాటలనే ఆధారముగా చేసుకుని అర్జునుడు క్రింద ప్రశ్న అడిగినాడు.
"కృష్ణా! యే కాలమున దేహమును వీడిన పునర్జన్మము ఉండదో, యే కాలమున ప్రాణము విడచిన పునర్జన్మము కలుగునో దానిని నాకు తెలుపుము," పార్థా! నీవు అడిగిన ప్రశ్న, ఈ సమయమున చాలా అవసరమైనది. ఒక్కొక్క సమయమున నీ తెలివితేటలు నాకే ఆశ్చర్యమును ఆనందమును కలిగించును. మరొక సమయమున అసహ్యమనిపించును. అజ్ఞానమని తలంచును. దీనికి కారణము నీ అభిమాన మమకారములే అజ్ఞానపు గుర్తులు. పోనీ! తిరిగి ఆ విషయము చూచుకొందుము.
నీ ప్రశ్నకు జవాబు వినుము. నిష్కామకర్మయోగులు, ఉపాసకులు, అగ్ని జ్యోతిస్సు, పగలు, శుక్లపక్షం, ఆరునెలలు ఉత్తరాయణ కాల మార్గమున ప్రయాణము చేస్తూ బ్రహ్మమును పొందుదురు. వీరికి మొదటి మజిలి అనగా మొదటి స్థానము అగ్ని. దీనినే దేవయాని మనికూడ అందురు. ఈ అగ్నినే వేదములలో అర్చి అంటారు, అర్చి రాది మార్గమని కూడనూ అంటారు. వీరు ప్రకాశములో ప్రారంభమై ప్రకాశములోనే ప్రయాణము సలిపి ప్రకాశ మందే చచ్చుదురు. వీరు తిరిగి జన్మమెత్తరు. ఇట్టివారికే బ్రహ్మప్రాప్తి.
“ఇక రెండవవారు సకామ కర్మయోగులు; దేహమును వదలి ధూమము, రాత్రి, కృష్ణపక్షం. ఆరునెలలు దక్షిణాయనము, ధూమాది మార్గమున ప్రయాణము సలిపి, స్వర్గలోకం చేరి భోగములు అనుభవించి పై చెప్పిన విధముగా ఆ పుణ్యము నశించగనే పునర్జన్మ మెత్తుచున్నారు. అయితే ఈ యిద్దరినీ యోగులనే చెప్పవచ్చును. ఈ రెండు మార్గములు అనాదికాలము నుండీ వచ్చుచున్నవి. జగత్తునందు ఇవి శాశ్వతముగా నిలిచి యుండును. ఎంతవరకని? నీకు సంశయము రావచ్చును. బావా! ఉపాసకులు, కర్మాధికారులు ఈ లోకమున యెంతకాలం ముందురో ఈ మార్గములు కూడమా అంతకాల ముండును" అన్నాడు కృష్ణుడు.
ఇచ్చట మనము కొంత యోచించ వలసి వచ్చును. ఏమన, శుక్లపక్ష దేవతా అనుగ్రహము కాని, కృష్ణపక్ష దేవతా అనుగ్రహము కాని ఉన్నదని యెట్లు తెలియును? ఈ రెండు పక్షములకూ మధ్య లోను, రెండు వేళలకూ సంబంధములేని కాలములోను, దేహమును వీడిన వారికి యేలోకము? వారిగతేమి? స్థితేమి? అని సంశయము సరియైనదే, సర్వులకూ ఇది తెలిసికొన వలసిన విషయమే. ఇపుడు శుక్లపక్షమన్న యేమో విచారింతము. చంద్రుని యొక్క ప్రకాశము, దిన దినమునకు వృద్ధిపొందు కాలమును శుక్లపక్షమని అందురు. అట్లయిన దానికిని మానవుని మరణమునకూ ఎట్టి సంబంధ మని సంశయింతురేమో! చంద్రునకూ మనసునకూ ఎట్టి సంబంధమని సంశయింతురేమో! చంద్రునకూ మనసునకు సన్నిహిత సంబంధము కలదు. చంద్రుడు మనసునకు సంకేతం చంద్రమా మనసోజాతఃచక్షో సూర్యో అజాయత: , అన్నట్లు మనము అంతరార్థమును విచారించిన స్థూల చంద్రుని ప్రకాశము దిన దినమునకు వృద్ధి కాంచి నటులనే, మనసులోని పవిత్రమైన దైవీభావములు దిన దినమునకు వికసించి అంత్యకాల మప్పటికి, అనగా దేహమును విడచునప్పటికి పూర్ణత్వము నొందినవైన అట్టి పవిత్రమైన కాలమును శుక్లపక్ష దేవల యొక్క అనుగ్రహమనే తలంచవచ్చును.
అది బాహ్యరూపమున ఏ కాలమైననూ కావచ్చును. అది పవిత్ర కాలమే; అందులో సందియము లేదు. దేహమునకు పవిత్ర కాలము స్థూల చంద్రుని ప్రకాశము, మనస్సుకు పవిత్రకాలము దైవభావన వికాసమే సరియైన ప్రకాశము. ఈ స్థూల సూక్ష్మ సంబంధమైన భావముల రెండింటినీ యోచించుట సాధకులకు సరియైన భావము. అభివృద్ధికిని అది చక్కని మార్గము.
తరువాత ఉత్తరాయణమని కూడనూ అందురు. దానికి అర్థమేమో విచారించిన ఆ సందియం తీరును! విషయం తెలుసు. తెలిసిచేయు పూజ, తెలిసి చేయు సాధనా హృదయమును శుద్ధిచేయును. సంశయమను బద్ధకమును వీడును. ఉత్తరాయణ మన్న నిర్మల ఆకాశమని అర్థము. అనగా ఆకాశమున మేఘములు, మబ్బులు, మరేవిధమైన ధూమములు లేక, రాక, సూర్యుడు స్పష్టంగా ప్రకాశించే సమయమునే ఉత్తరాయణమని అందురు. ఇది స్థూలార్ధము. అనగా దేహసంబంధమైన కాలనిర్ణయం.
ఇక సూక్ష్మమైన అంతర్భావ మెట్టిదని విచారించిన, మానవహృదయమే అంతర్ ఆకాశము. ఆ హృదయా కాశమున అజ్ఞాన, అభిమాన, మమకార మేఘములు లేక, జ్ఞాన సూర్యుడైన బుద్ధి ప్రకాశించు చుండుట. అనగా నిశ్చలమైన బుద్ధియే ప్రకాశించు చుండుట. అనగా నిశ్చలమైన బుద్ధియే ప్రకాశ సూర్యుడన్న మాట. అట్టి శుద్ధబుద్ధి మమకార అజ్ఞానములకు చిక్కుపడక నిర్మల హృదయమున స్థిరమగుటే, ఉత్తరాయణమని తలంచ పలెను. అది యేకాలమైననూ సరే, అట్టి సమయమున దేహమును వీడిన వారు ఉత్తరాయణ కాలమున దేహమును వీడినవారే అనవచ్చును.
జ్ఞానమునే సూర్యుడని అందురు. జ్ఞానభాస్కరుడని శుద్ధిబుద్ధికి పేరు. ఈ విధమైన స్థితిలో ప్రయాణము చేసిన వ్యక్తికి పునర్జన్మము లేదు. దీనినే అర్చిరాది మార్గమని కూడా అందురు. ఇట్టివారు బ్రహ్మమును చేరిపోదురు. ఇక దక్షిణాయన మన్న పై రెండింటికి పూర్తి విరోధమైనది. అనగా, ఆకాశమందు దట్టమైన మబ్బులూ మేఘములూ సంచరించుచు ధూమముతో ఆకాశము కప్పబడి, సూర్యుడు స్పష్టముగా కనుపించక, ప్రకాశించక యుండుట. ఇక కృష్ణపక్షమన్న చంద్రుడు దిన దినము నకు క్షీణించు కాలము.
దీనినే సూక్ష్మరీతిగా తెలుపవలెనన్న మనసునందలి దైవీభావములు దిన దినమునకు క్షిణించుచుండుట. అంత్యకాలమప్పటికి అమావాస్య చంద్రునివలె హృదయాకాశమున కనుపించక ధూమముతో చీకటితో అనగా పూర్ణ అజ్ఞానస్థితియందున్న సమయము. దీనినే కృష్ణపక్షమని అందురు. అట్టి సమయమున దేహమును వీడిన వానికి ధూమమార్గమే అనగా తిరిగి జననమరణ ప్రాప్తి యే సిద్దించును.
(గీ.పు.154/158)
ఉత్తరాయణ మార్గము పవిత్రమైన జ్ఞాన ప్రకాశమగుటచే దానిని శుక్లమార్గ మనియుము దక్షిణాయన మార్గము తమోమయమై జ్ఞానప్రకాశము కాక అంధకార మయమైనదగుటచేత దానిని కృష్ణ మార్గమనియును చెప్పబడినది. మొదటి మార్గమైన శుక్లమార్గమున పయనము చేసినవారు అనగా, (శరీరమును వదలి వెళ్ళినవారు)జనన మరణములేక అనగా (తిరిగి దేహములు ధరించక) బ్రహ్మానంద నిలయమైన మోహరహితమైన స్థానమగు మోక్షమును పొందగల రనియు, రెండవ మార్గమయిన కృష్ణ మార్గమున ప్రయాణ మయిన వారికి, (దేహమును వీడిన వారికి) తిరిగి జనన మరణ కారణమగు దేహము ప్రాప్తించుననియు తెలిసికొనవలెను.
జ్ఞానమైన స్వబోధమగు ప్రకాశముతో దేహమును విడిచిన వారు ఉత్తరరాయణ మార్గ ప్రయాణీకులనియు, ఆత్మజ్ఞానము లేక మూఢత్వముగా దేహమును విడచినవారు పితృయాన మార్గమున వెళ్ళిన వారనియు తెలియదగును. సత్యగుణమును నిర్మలమైన, ప్రకాశమైనదిగను, తమోగుణము అంధకారమును, కృష్ణవర్ణమును కూడినదనియు తలంచవలెను.
మరియును ఇడా, పింగళ అను రెండు నాడులు కలవు; కుడి ప్రక్కనుండినది పింగళ అనియు, ఎడమ ప్రక్కన నుండు దానిని ఇడానాడి యనియును పిలుతురు. యోగి అయిన మహానుభావులు తమ యోగశక్తితో సూర్య మార్గమయిన పింగళవాడి మార్గమున వెళ్ళుదురు. యోగ శక్తిలేక సామాన్య స్థితి గలవారు చంద్రమార్గ మనబడు ఇడానాడి మార్గమున వెళ్ళుదురు. ఇదియునూ మరొక అంతరార్థము.
(గీ.పు. 159)
(చూ: హిమాచలం)