అయోధ్య అనగా ఏమిటి? విరోధులు చొరబడ లేని ప్రదేశమే అయోధ్య అదే హృదయము. ఈ దేహము దశేంద్రియములతో కూడిన రథమువంటిది. కనుక, దేహమే దశరథుడు. ఇతనికి కౌసల్య, సుమిత్ర, కైకేయి అని ముగ్గురు భార్యలు, ఈ ముగ్గురిని వరించినవాడు దశరథుడు. దేహధారియైన ప్రతి మానవుడు సత్వరజస్తమో గుణాలను వరించాడు. సాత్విక గుణమే కౌసల్య, రజోగుణమే కైక, తమోగుణమే సుమిత్ర. ఈ ముగ్గురికీ నల్గురు బిడ్డలు పుట్టారు. ఆ నల్గురు బిడ్డలే నాల్గు వేదములు. ఋగ్వేదమే రాముడు, యజుర్వేదమే లక్ష్మణుడు, సామవేదమే భరతుడు, అథర్వణ వేదమే శతృఘ్నుడు. ఈ నాలుగు వేదములే నల్గురు పిల్లలుగా పుట్టి దశరథుని ఇంట్లో ఆడుకున్నాయి. ఇలాంటి పవిత్రమైన అంతరార్థాన్ని గుర్తించినప్పుడే మీయందు భక్తి ప్రపత్తులు అభివృద్ధి అవుతాయి.
(స.సా. మే 2000 పు. 143)
వ్యక్తి ధర్మమును, సంఘధర్మమును, కుటుంబధర్మమును రాముడు నిరూపిస్తూ వచ్చాడు. ఈ ధర్మత్రయ త్రివేణి సంగమమే రామచరితము. ఈ త్రివేణీ సంగమము నందు స్నాన మాచరించిన వారికి పాపములు పరిహారమౌతాయి. శాపములు నిర్మూలమౌతాయి. ఈ దివ్యచరితమును ప్రతి మానవుడు స్మరించాలి. వరించాలి. తరించాలి. రాముని చరిత్ర ఇట్టిది, అట్టిది అని వర్ణించుటకు వీలుకానిది. సముద్రములోని తరంగములనైనా లెక్కించవచ్చును కాని, రాముని గుణగణములను ఎవ్వరూ లెక్కించలేరు. రాముడు అయోధ్యను పరిపాలించాడు. అయోధ్య అనగా ఏమిటి? యోధులు, విరోదులు చేరరానటువంటి ప్రదేశము. అదే మానవ హృదయం. అక్కడే రాముడుంటున్నాడు. ఈనాటి మానవహృదయంలో క్షణక్షణమూ ఏదో ఒకవిధమైన ఆవేదనలు ఏర్పడుతున్నాయి. మొట్ట మొదట మానవహృదయం అయోధ్యగా మారాలి. నిర్మలమైనదిగా, నిశ్చలమైనదిగా, కలతలు లేనిదిగా ఉండాలి. అప్పుడే రాముడు అందులో ప్రవేశించి సరియైన మార్గాన్ని చూపుతాడు. రాముడు తాను దేవుడైనను సామాన్య మానవునివలె సంచరించాడు. కనుక ఈనాడు సామాన్య మానవుడు రామునివలె సంచరించాలి. అప్పుడే నిజమైన భక్తి ప్రపత్తులు అభివృద్ధి కాగలవు.
(స.. సా.మే.97, పుట.128/129)
(చూ॥ రాముని జన్మస్థానము)