అసూయ భావమును నిర్మూలము చేసుకోవాలి. నీవు పరిశుద్దాత్మ స్వరూపుడవు. ఇదే వేదము. "శృణ్వంతు విశ్వే అమృతస్యపుత్రా:" నీవు అమృత పుత్రుడవు నాయనా అని వర్ణిస్తుంది. కనుక నీవు విశాల భావమును అభివృద్ధి పరచుకో. ఈ ఇంద్రియములను అదుపులో పెట్టుకో. తద్వారా మానసిక శుద్ధి ఏర్పడుతుంది. అప్పుడే త్రికరణ శుద్ధి కలిగిన మానవుడుగా తయారవుతావు. మనసునందున్న మాలిన్యమును, అంతఃకరణమునకు పట్టిన మాలిన్యమును, సత్కర్మలు సద్బుద్ధి సదాలోచన సచ్చింతన చేత, సత్కర్మలచేత నిర్మూలించి పరిశుద్ధము చేసుకోవచ్చు. కనుకనే చెడ్డను చూడవద్దు. మంచిని చూడు అన్నారు. చెడ్డను వినవద్దు మంచివి వినుమన్నారు. ఈ విధమైన భావాలు మనము అభివృద్ధి పరచుకోవాలి.
(బ్బ.త్ర పు.౯౦)
దైవమునందు కూడను దోషములు కనిపెట్టటం అసూయకు ఒక ప్రధానమైన గుణమన్నారు. అసూయకు ప్రధానగుణములు కొన్ని వుంటున్నాయి. తమకంటే అధిక కీర్తిని సంపాయించేవారి పైన అసూయ కలుగుతుంది. తనకంటె అధికసంపద కలిగినవాని పైన అసూయ కలుగుతుంది. తనకంటె అందముగా వున్నవాని పైన అసూయ కలుగుతుంది. తనకంటె అధిక మార్కులు తీసుకొనేవాని పైన అసూయ కలుగుతుంది. తనకంటే యే విషయమునందైనా అందమునందు కాని, అధికారమునందు గాని, సంపదయుందుగాని, గౌరవమునందుగాని, ప్రతిష్ఠయందుగాని అధికమైనచో అసూయ కలగటం మానవుని బలహీనత. అసూయ మానవునిలోపల ప్రవేశించగనే ఎంతో కాలమునుండి సాధించి, సంపాదించుకున్న సద్గుణములు భస్మమైపోతుంటాయి. ఈ అసూయ వూరికే వదిలేది కాదు. మానవునియందున్న సమస్తసద్గుణములు నాశనము చేస్తుంది. రాక్షసత్వాన్ని అభివృద్ధి పరుస్తుంది. మానవత్వాన్ని మాయం చేస్తుంది. పశుత్వాన్ని బలపరుస్తుంది. ముందు వెనుక యోచన చేయదు.
అసూయ ఉంటే మన సమస్తమును నాశనం చేస్తుంది. పరులను మాత్రమే నాశనం చేయుట కాదు. తనను తాను నాశనం చేస్తుంది. అసూయాపరునకు సుఖముగాని నిద్రగాని ఉండవు. కంటినిండ నిద్ర కడుపునిండ తిండి ఉండవు, ఏవిధమైన రోగము లేకపోయినప్పటికిని అసూయ మనిషిని క్షీణింపచేస్తుంది. అంతఃక్షయమని దీని పేరు. క్షయరోగము దేహాన్ని క్రమక్రమేణ కనపించే రీతిగా తగ్గిస్తుంది. కానీ ఈ అసూయ లోపల చేరి అనేక విధములుగా భస్మము చేస్తుంది. ఇది మహాఘోరమైన వ్యాధి. మనము తక్కువ స్థాయిలో వుండినా, ఎక్కువ స్థాయిలో వుండినవారిని చూచి ఆనందపడితే దైవము మనలను అనుగ్రహిస్తాడు. మనకు లేదని వున్నవారిని చూచి అసూయపడితే తనయొక్క స్థితి మరింత దిగజారిపోతుంది. ఇది యీనాడు కలియుగములో సర్వత్ర వ్యాపించి వుంటుండాది. యోగియందు,భోగియందు,జోగియందు.విరాగియందు. బైరాగియందు, సర్వులయందు యీ ఆసూయ అనే వ్యాధి వ్యాపించి వుంటుండాది.
అసూయచేతనే మానవుడు ఆశాంతికి గురియైపోతున్నాడు. ఆసూయ మానవుని అనేక విధములుగా హింసిస్తుంది.
(శ్రీ. సగీపు. 216/218)
ఏ సమయంలో యెక్కడ అసూయ అహంకారము వుంటుందో, అక్కడ ఏ రూపములో దేవుడు వచ్చి సరిదిద్దటానికి ప్రయత్నిస్తాడో చెప్పుటకు వీలుకాదు. కనుక మొట్టమొదట అసూయ, ద్వేషము, అహంకారములకు అవకాశము యివ్వకుండా చూచుకోవాలి.
అసూయ అనేది గ్రంథపఠనముచేత నాశము చేసుకోవటానికి కాదు. స్వప్రయత్నముతో సాధనలు సలిపి, హృదయమునందు పరివర్తన గావించుకొని, పరిపూర్ణమైన ప్రేమతో, దైవార్పితమైన బుద్ధితో అసూయను హతమార్చుకోవాలి. అసూయ వుండినంతకాలము మనలను యేమాత్రము రాణింపచేయదు. అది మనలోని సమస్తసద్గుణములను హతమార్చివేస్తుంది. మానవునియందు అసూయ లేకుండా చేసుకోవటము ప్రధాన లక్షణమని గీత బోధించింది.
“ఒకరి మేలును చూచి ఓర్వలేకున్నావు
ఈ అసూయాగుణంబు నీకెందుకయ్యా?
ఒకరి సంపద చూసి ఓర్వలేకున్నావు
ఈ ఈర్ష్యబుద్ధి నీకెందుకయ్యా?
ఒకరి పదవి చూచి ఓర్వలేకున్నావు
ఈ నీచబుద్ధి నీకెందుకయ్యా?”
అసూయ అనేది ఒక తీరని రోగము. దేహానికి క్యాన్సర్ ఎటువంటి రోగమో మనస్సుకు అసూయ అటువంటి రోగము. ఒక్క దైవానుగ్రహంవల్లనే క్యాన్సర్ క్యాన్సిల్ అవుతుంది. అట్లే ఒక్క దైవప్రేమచేతనే అసూయారోగం నివారణ కాగలదు. “సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం” ఇదే దైవప్రేమను సంపాదించుకోవడానికి తగిన మార్గం. (సనాతన సారథి, అక్టోబరు 2022 పు 6)