హనుమంతుడు రామాజ్ఞను శిరసావహించి, లంకలో ప్రవేశించి, సీతయొక్క క్షేమవార్తను తెచ్చి రామునికి అందించాడు. రాముడు వానర సైన్యంతో కూడి లంకలో ప్రవేశించి, రావణుని వధించాడు. అప్పుడు హనుమంతుడు సీత వద్దకు వెళ్లి, "అమ్మా!రామునికి విజయం చేకూరింది. రావణ సంహారం జరిగింది. నీకు బంధవిమోచన జరిగింది" అని చెప్పాడు. సీతాదేవి ఆనందంతో ఉప్పొంగిపోయి హమమంతుణ్ణి అనేక విధాలుగా వర్ణించింది. "రఘుపతి కార్యం బీడేర్చిన కపిరాజు శిఖామణి నీవయ్యా! రామముద్రిక గొని సముద్రము దాటిన భద్రపరాక్రముడవీవయ్యా! " అని హనుమంతునికి ఎన్నో టైటిల్స్ (బిరుదులు) ఇచ్చింది. హమమంతా! నీవంటి గుణవంతుడు, బలవంతుడు ఈ జగత్తులో కానరాడు" అని ఎంతో గొప్పగా వర్ణించింది. కానీ ఈ వర్ణనలు విని హనుమంతుడు కృంగిపోయాడు. తలవంచుకున్నాడు. ఈ సత్యాన్ని గుర్తించిన సీత "అయ్యో! ఈ వర్ణనలు హనుమంతునికి ఏమాత్రము ఆనందము నందించలేదే! ఇతనికి ఆనందము కల్గించే విషయ మేమిటి?" అని బాగా లోతుగా యోచన చేసి "హనుమంతా! సర్వకాల సర్వావస్థలయందు నీవు రామ ప్రేమను పొందుదువుగాక!" అన్నది. ఈ మాటలు వినేటప్పటికి హనుమంతుడు ఆనందంతో ఎగిరి గంతేసాడు. "తల్లీ! రామ ప్రేమను మించినది ఈ జగత్తులో లేదు కదా! అది లేకుండా ఈ జగత్తునంతా నా హస్తమునందుంచినా నాకు ఆనందం కలుగదు. రాముని ప్రేమకిరణములు నాపై ప్రసరించితే నా జన్మ ధన్యమైపోతుంది" అన్నాడు. చూశారా! బలవంతుడు, గుణవంతుడు, పరమ భక్తుడైన హనుమంతుడు రామప్రేమను తప్ప మరి దేనిని ఆశించలేదు. ప్రేమలోఈ లోకము. ప్రేమయే సర్వస్వము. కానీ మానవుడు ప్రేమమయమైన ఈ జగత్తునందు ఉద్భవించి, ప్రేమను కోల్పోయి, ద్వేషము, అసూయ, క్రోధము మున్నగు దుర్భావములను హృదయంలో నింపుకుంటున్నాడు.
(స.పా.మా. 99పు 68/69)