కాలం ప్రచండ మారుతం వలె కదలి పోతున్నది. జీవిత ప్రమాణుo మంచుగడ్డ వలె కరిగిపోతున్నది. కర్తవ్యాన్ని గుర్తించకమునుపే కాయమును వదిలి పోతున్నారు. ఇంక మానవుడై పుట్టినందుకు ఫలితమేమి?
ఆహార నిద్రా భయ మైధునాని
సామాన్యమే తత్పశుభి ర్నరాణాం
జ్ఞానం నరాణా మధికం విశేష:
జ్ఞానేన శూన్య: పశుభి స్సమానః
ముఖ్యంగా జ్ఞానమే లేకపోతే పశువుతో సమానము. విద్యార్థులైన మీరు ఆదర్శవంతమైన జీవితాన్ని అనుభవించాలి. మీరే భవిష్యత్తుకు నాయకులు. కనుక మీ భావములను సున్నిత ముగను, పవిత్రముగను, నిర్మలముగను నిస్వార్థముగను తీర్చి దిద్దుకోవాలి. ఈ విధమైన దివ్య సంస్కృతిని ఆచరించి ఆనందించి అందించడానికి ప్రయత్నించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను.
(స.సా.జ.87 పు.24)
అనేక దోషములు చేయటము I am human అనటం ఎంత పొరపాటు! ఎంత పాపము! I am a human being కాబట్టి తప్పులు చేయటము నాస్వభావము అని సమర్థించు కుంటున్నాడు. నీవు మానవుడైనందుకు తప్పులు చేయకూడదు. పశువైతే తప్పులు చేసినా ఫరవాలేదు. అది దీని ప్రవర్తన. నీవు మనిషివై తప్పులు చేయకూడదు. పశువుగా ప్రవర్తించటము ఎంత విరుద్ధము! కనుక నీవు మనిషిగా ప్రవర్తించు.
(బృత్ర.పు 51/52)
(చూ॥ విద్య)