మీరు ఎప్పుడు ఎక్కడ ఆర్తి పొందుతారో అప్పుడు అక్కడ ఆ భగవంతుడు సాక్షాత్కరిస్తాడు. ఆయన శరీరధారిగా అంటే సాకారముగా రావాలని మీరు తపించినట్లయితే ఆయన అదే విధంగా వస్తాడు. మీ కోరికను అంగీకరించటానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. కాకపోతే మీరే ఆయనను మీ హృదయంలోకి ఆహ్వానించటానికి సిద్ధంగా లేరు. మీరు మీ హృదయంలోని అసూయ, ద్వేషము, అసహ్యములనే ముళ్ళను తొలగించి హృదయాన్ని పరిశుభ్రంగా ఉంచటం లేదు. పాలు త్రాగినక పాపాయి ఏడుస్తుంటే బాధపడనవసరం లేదు. అది అరగటానికి చాలా మంచిది. అలాగే మీరు ఏడవండి, దాని వల్ల మీరు భగవంతుణ్ణి తెలిసి కొనటం అనే ఆనందాన్ని అరిగించుకోగలుగుతారు. ఆనంద బాష్పాలు పొంగి పొరలే విధంగా ఏడవండి. మీకు కన్నీటిని ఇచ్చింది ఇతరుల యెదుట చేతులు జాపి దీనంగా ఏడవటానికి కాదు. కృతజ్ఞతా పూర్వకంగా భగవంతుని శ్రీచరణములపై ఆనంద బాష్పాలను ఎడవటం కోసం.
(వ. 61-62 పు. 172)