“శరీరమాద్యం ఖలు ధర్మ సాదనమ్" ఈ శరీరం ధర్మాచరణ నిమిత్తమై అందించిన వరప్రసాదం. కనుక ఈ శరీరమును పవిత్రమైన కర్మలచేత పవిత్రం గావించుకోవాలి. ఈ శరీరమునకు ఆరోగ్యం పునాది వంటిది. ఈ ఆరోగ్యమును కోల్పోయిన యెడల మనం అనేక విధములైన బాధలకు గురికావల్సివస్తుంది. మానవ జీవితంలో ఆరోగ్యమునకు మించిన మహాభాగ్యం మరొకటి లేదు. అన్ని అంగములు చేరికే ఈ శరీరము. కనుక పరిపూర్ణమైనటువంటి ఈ శరీరమును పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి. ప్రతి అంగమును పవిత్రమైన కర్మములో ప్రవేశపెట్టాలి. అప్పుడే ఈ శరీరము పుష్టిని సంతుష్టిని అందుకుంటుంది. శరీరము ఆరోగ్యముగా లేకుండిన మనసు ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండదు. ఆరోగ్యమైన దేహము నందే ఆరోగ్యమైన మనసుకూడా ఉంటుంది. ఆరోగ్య శరీర మనసుల యొక్క పరిస్థితిని పురస్కరించు కొనియే ఆత్మ తనవ్యక్తిత్వాన్ని పోషించుకుంటుంది. కనక మానవ శరీరము సర్వ ధర్మములకు, సర్వకర్మలకు మూలాధారం. ధర్మ అర్థ కామమోక్షాణాం ఆరోగ్యం మూలముత్తమమ్ ధర్మ అర్థకామమోక్షములనే పురుషార్ధములకు కూడా ఆరోగ్యమే ప్రధానమైన పునాది. కనుక నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక లౌకిక మార్గములలో ఈ శరీరమును ప్రవేశ పెట్టటానికి ముందుగా ఆరోగ్యమును కాపాడుకోవాలి.
ఆసలు ఈ ఆరోగ్యము చెడటానికి మూలకారణములను మనం విచారించాలి. అమితమైన ఆలోచనల చేతనూ, అమితమైన చింతలచేతన, అమిత మైన చదువుల చేతనూ - ఈ ఆరోగ్యమును మనం కోల్పోతున్నాం. అధికంగా చదవటంచేతనూ ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రతిదానికి ఒక నియమం ఉంటుండాలి. ప్రతికర్మకు ఒక పరిమితం ఉంటుండాలి.
గ్రీసు వేదాంత అరిస్టాటిల్ జీర్ణకోశము మీద అనేక పరిశోధనలు చేస్తూ వచ్చాడు. నిరంతర పరిశోధనల చేత, కట్టకడపటికి అతనికి కూడా అనారోగ్యం ఏర్పడి, అజీర్ణ వ్యాధికి గురియై మరణించాడు. అదే విధముగనే ‘ఫెరిన్’ అనే డాక్టర్ గుండెజబ్బుల మీద అనేక పరిశోధనలు చేస్తూ వచ్చాడు. కట్టకడపటికి గుండె వ్యాధి తోనే అతను మరణించాడు. కనుక మనం ఏవిషయము నందైనా అమితంగా విచారించ కూడదు. శరీరము కొన్ని పరిమితులతో ఏర్పడినటువంటిది. ఈ పరిమితమై నటువంటి దేహమునకు పరిమితమైనటువంటి పనినే చెప్పాలి. పరిమితమైనటువంటి పనులు చేస్తూ పరిమితమైన ఆనందాన్ని పొందాలి.
ఈనాడు మానవతా విలువలను గురించి బాల బాలికలకు బోధిస్తున్నాం. కాని ఆ పిల్లల స్థితిగతులను విచారించి, వారికి బోధించటానికి ప్రయత్నం చేయాలి. బలహీనులైన బిడ్డలకు బలమైన విషయాలు అమితంగా వారిలో ప్రవేశపెట్టటానికి ప్రయత్నించకూడదు. మొట్టమొదటి బలహీనులైన బిడ్డలను బలమైన వారిగా చేయటానికి కొన్ని ప్రయత్నములు చేయాలి. శారీరకంగా, మానసికంగా వారిని అభివృద్ధి చేయాలి. మొట్టమొదట వారికి Health is Weath (ఆరోగ్యమే మహాభాగ్యము) ను గురించి బోధించాలి. తరువాతనే ఈ విద్యావిధానమును వారిలో ప్రవేశపెట్టాలి.
(శ్రీ డి. 98 పుట.5)
ఆరోగ్యమును మనం కాపాడుకుంటే మానవతా విలువలను అది పోషిస్తుంది. ఏ అంగమూ ప్రధానం కాదు. అన్ని అంగముల ఏకత్వమే ఈ శరీరము. కనుక అన్ని అంగములయందు ఐకమత్యం అత్యవసరం.
((శ్రీ డి. 98. పు,97)
(చూ॥ రోగం)