ఆహార విహారముల వలన ఆరోగ్యము చెడునని వైద్యులందరూ హెచ్చరించుచున్నారే కాని, ఆహార మంటే ఏమిటో వారు విశదముగా తెలుపరు. పంచేంద్రియముల ద్వారా అనుభవించే, అందుకొనే, అన్నియూ ఆహారములే. నోటిలో స్వీకరించినదానిని మాత్రము ఆహారమందురు; అయితే, చూచే చూపు, వినే విషయములు, తీసుకొనే వాసనలు, అనుభవించే స్పర్శములు, అన్నియూ ఆహారములే. అవి కూడా దేహరోగ్యమునకు మూలకారణములే! కొన్ని దృశ్యములను చూచినపుడు కడుపు త్రిప్పినట్లు వాంతి వచ్చును; కొన్ని విషయములను విన్నప్పుడు తక్షణమే షాక్ కొట్టినట్లయి మనిషి పడిపోతాడు: వాసనలు, స్పర్శములు, వీటివలన అజీర్తి బయలుదేరును అని డాక్టర్లు చెప్పుచున్నారు. ఆరోగ్యవంతమైన దేహము ఆరోగ్యవంతమైన మనస్సుకు యెంత ముఖ్యమో, ఆరోగ్య వంతమైన మనస్సు కూడ దేహారోగ్యమునకు అంత ముఖ్యము. ఆహారములు నోటికి రుచికరముగానూ సంతృప్తి సంతోషములను కలుగచేయునట్టివిగానూ వుండవలెను; అతి కారముగాన అతి ఉప్పుగానూ వుండకూడదు. దేహమును ఎందు నిమిత్తమూ భగవంతుడు అనుగ్రహించినాడో సదా గమనించుకొనవలెను; జీవిత లక్ష్యాన్ని మరువక, జాగ్రత్తగా గట్టు చేరువరకూ దానిని పోషించి పరిపాలించుకొనవలెను. రాజసతామస ఆహారములకన్న, సాత్వికాహారమే సాధకుల కత్యగత్యము. సృష్టి రహస్యము అతి విచిత్రమైనది. గోచరించు పదార్థముల మంచి చెడ్డలను మాత్రము మానవులు నిర్ణయించుకొనగలుగుచున్నారు. కానీ, అగోచరమైన వాటి యొక్క గుణదోషములను నిర్ణయించజాలక పోవుచున్నారు. ఒక విషయమును మీరు ముఖ్యముగా తెలుసుకొనవలెను. ప్రతి పదార్థము నుంచి కూడ, అతి సూక్ష్మమైన రేణువులు అణువులు అలల రూపములో యెల్ల కాలములందు బయలుదేరుతూ వుంటాయి. ఒక సూది మొనయంత చిన్న బిందురూపము నుండి కొన్ని లక్షల అణువులు బయలు దేరును; ఇవి అతి సూక్ష్మములు కాబట్టి, చూడలేక పోతున్నారు.
ఒక కర్పూరపు ముక్కను ఒక డబ్బాలో పెట్టి, మూత వేసినా కూడ, కొంత కాలమునకు అది పూర్తిగా శూన్యమగును. కదా? దీనికి కారణమేమి? దాని నుంచి సతతము ధారావాహినిగా బయలుదేరుచున్న అణువులే దాని నాశనమునకు కారణమయ్యెను. పరుల దేహముల నుంచి వెలువడే అణురేణువులు గాలిలో చేరి, మీరు పీల్చుకోనే గాలితో మీ దేహములందు ప్రవేశించును. మీ దేహమునుండి కూడ అదే విధముగా, లక్షలాది అణురేణువులు బయలుదేరుచున్నవి. ఈ రీతిగా విసర్జించటము స్వీకరించటము అనే రెండు క్రియలను అందరూ ఎల్లప్పుడూ చేయుచుందురు. దేహము యొక్క పటుత్వము ఆరోగ్యము క్షీణించుటకు తరుగుటకు పెరుగుటకు అన్నిటికీ ఈ రెండు క్రియలే మూలకారణములు.
మలమూత్ర విసర్జనము దంత ధావనము స్నానాదులు, వీటివలన కొన్ని ప్రదేశములందు రోగముల నభివృద్ధిజేయు రేణువులు అధికముగా అభివృద్ధియగును. అక్కడంతా కోట్లకొలది రేణువు లుద్భవించి, ఆ ప్రదేశములలో తిరుగువారియందు ప్రవేశించి వారి ఆరోగ్యమును క్షీణింపజేయును. ఇటువంటి మలిన ప్రదేశములు, మురికి నీరు ప్రవహించే స్థలములు. అనారోగ్యమునకు పుట్టినిళ్ళుగా వుండును.
ఈ రేణువులను నిరోధించుటకై పూర్వ కాలమందు ఐదు రకముల స్నానములను నియమించినారు. మొదటిది, మృత్తికాస్నాము. మట్టిని దేహమంతా పూసుకొని, తరువాత స్నానమాచరించిన, అణువులన్నీ దానిలోనే ధ్వంసమై దేహము పరిశుద్ధమగును దానికే ”మృత్తికే హర మే పాపం" అనే ప్రార్థన కూడ బయలుదేరినది. రెండవది : ఆతప స్నానము; దీనిని ... అంటారు. ఇది సూర్యకిరణములను దేహమందు సర్వత్రా ప్రసరింపజేయును. సూర్యుని ప్రకాశము క్రూరమైన రేణువులు ధ్వంసమగుటకు బాగా సహాయమొసగును. మూడవది : వారి (నీటితో) స్నానము : పైభాగమునందు చేరిన రేణువులు లోపలి ఉద్భవించే రేణువులు రెండూ పుణ్య తీర్థములందు భక్తి భావముతో స్నానమాచరించుట వలన మాయమగును. నాలవది : వాయు స్నానము : చల్లని గాలి దేహముపై వీచటము వలన రేణువులు నశించటానికి సహాయకారిగా వుంటుంది. ఐదవది : నగ్నస్నానము : దేహంతా విభూతి రాసుకొనిన, ఆ విభూతిలోనే ఆరోగ్యమును చెడిపే అణురేణువులు వదలిపోయి ఆరోగ్యము రక్షింపబడునని ఋషులు బోధించినారు.
ప్రాచీనకాలమందు ఋషులు శౌచమునాచరించి నిత్యము స్నానమును చక్కగా చేసేవారు! దీనిని ఈ నాటి విద్యావంతులు అనాగరికమని హేళన గావించుచున్నారు. ప్రాచీనులు తమ నెవ్వరైనా ముట్టినప్పుడు, యేదైనా తాకినప్పుడు స్నానమాచరించి దేహ నైర్మల్యమును మనశ్శాంతిని సంపాదించేవారు! “మడి" అనే సంప్రదాయము కూడ ఆరోగ్యము నిమిత్తమై చేసే కర్మ కాని వేరు కాదు. వీరిని ఆధునికులు హేళన చేయు సమయమున, శౌచవాదులు ఎదిరించి, సమర్థించుటకు దురదృష్ట వశమున అసమర్థులై పోవుచున్నారు. వారు కూడ కేవలము బాహ్యమునందు మాత్రమే మడి ని ఆచరించుచున్నారే కాని, దాని ఉద్దేశమేమిటి, ఫలితమేమిటి, సక్రమముగా దానిని పాలించు విధానమేమిటి అని నిర్ణయించుటకు వారు అసమర్థులు! అయితే, పూర్వీకుల ఆచారములందు అంతరార్థము లేకపోలేదు. పురుషాయస్సు ఎంత కాలమో అంత కాలము జీవించి, తమ ఆశలు ఆశయములు అన్నింటిని పూర్తి గావించుకొనుటకు వీలుండవలెననునదే వారి వాంఛ! ఆహార విహారములలో చక్కని మార్గము సమసరించితే ఆయుస్సు వృద్ధియగును, శాంతి సంతోషములు చేకూరును అని వారు నిశ్చయించుకొనిరి. పరాధీనములో పడక, ఆయుష్కాలమంతా సుఖ సంతోష సంతృప్తులతో గడిపి, అనాయాసముగా మరణమును పొందుటకు ఋషులు యుక్తాహార విహారములను విధించిరి. ఆహార పదార్థములందున్న స్థూలభాగము మలముగా విసర్జింపబడును; వాటి యొక్క సూక్ష్మభాగము మాంసము కండరములు రక్తము మొదలగు పదార్థములుగా మారును. సూక్ష్మాతి సూక్ష్మమైన కారణ భాగము మనస్సును తీర్చిదిద్ది, భావములలోని మంచి చెడ్డలను నిర్ణయించును. దీనివలననే, పెద్దలు ఆహారము వలన ఆరోగ్యము ఆరోగ్యమువలన ఆధ్యాత్మికాభిరుచి, అభిరుచివలన సాధన, సాధనవలన సంకల్పము, సంకల్పమువలన ఫలసిద్ధి లభించునని ఘోషించిరి.
అయితే, ఈనాడు మలినాహారము వలన, మలిన మనస్సులు అభివృద్ధియగుచున్నవి! కాలము యొక్క మహాత్మ్యమేమిటో కానీ, శౌచాదులను వర్జించి మాలిన్యమును భుజించి, మలిన మనస్సులతో తాము బాధపడి, ఇతరులకు బాధనందించుచున్నారు; దంత ధావనము స్నానము వీటిని కూడ విసర్జించినారు. దేహము యొక్క సింహద్వారమే నోరు! ఆ సింహద్వారమే మలినముగానుండిన అచ్చట నివసించే వారి గతి ఏమిటి? ఇట్టివారలను విద్యావిహీనులనే చెప్పవలెను. మలిన భాష, మలిన అభ్యాసములు, మలిన చర్యలు, మలిన చింతనలు వీటిలో పడినవారి సాంగత్యము చేయక, వారినుండి దూరముగా వుండుటయే మంచిది. వారు ధనములో కోటీశ్వరులుగా వుండినన గుణమున కూటికి పేదలతో సమానమే, వారిని సమీపించినచో, మీ ఆరోగ్యము చెడును, మీ బుద్ధులు పాడగును.
ఆరోగ్యమునకు ఆహారమెంత ప్రధానమో, దేహ పరిశుభ్రత కూడ అంత ప్రధానము. పూర్వ కాలమందు ఋషులు యోగులు మహా పరిత్యాగులుగా వుండి, దేహ బుద్ధి లేక ఇంద్రియ నిగ్రహముతో తపము నాచరించుట వలన వారి ఆరోగ్యము ఆయువు అభివృద్ధి చెందినవని తెలుసుకొనలేక, వారిని అనుకరించి దేహముయొక్క పరిశుభ్రతను గమనించక కొందరు సాధకులు మెలగుచున్నారు. అయితే అనుకరణమునకు కూడ అధికారముండవలెను. బలహీన హృదయులకు అనుకరణ అపాయము కలిగించును. శాశ్వతమైన సమచిత్తమును సంపాదించి తదుపరి ఋషులను అనుసరించుటకు పూనుకొనిన మంచిది. కానీ స్వార్థమును అభిలషించి, నేను చేయుటలో తప్పేమియున్నది? వారు చేయలేదా? వీరు చేయలేదా? అనుటలో వెర్రి తనమే కనబడుచున్నది. మీ బుద్ధియొక్క తప్పొప్పులను పరీక్షించుకొనక, ఈశ్వరుడు విషము త్రాగినాడని మీరు కూడ త్రాగితే ఫలితము తెలిసియేయున్నది. సామాన్య జనులు ధ్యాన సాధనల వలననే విజయమును సాధించవలసియున్నది. దేహమును నిర్లక్ష్యపరచుట కూడ పొరపాటు, ఏరు దాటిన పిమ్మట తెప్పను తగులవేయవచ్చు. కానీ, గట్టు చేరు వరకు దానికి తగిన విలువనిచ్చే తీరవలెను. జీవుడు వచ్చినది దేవుని కొరికే కాని డాక్టర్ల కొరకు కాదు! డాక్టర్లకు దాసుడై వారి నాశ్రయించక, ఆరోగ్యవంతుడై ఆనందము ననుభవించుటకు పట్టుదల ఉండవలెను. దేహమనునది పండుపై నున్న తోలు: దానిలోని గుజ్జు మనస్సు: మాలిన్యము తిను టకు వీలులేక పారవేసే విత్తనము;ఆనందమే పండులోని రసము! బాహ్యము కూడ ఆకర్షణీయముగా నుండవలెను. వర్ణము చూచి ఫలమును ఆశించుచున్నాము. రుచిని భావించి తరువాత ఆశించుచున్నాము: దేహమును సత్ భావములు సత్ చింతనలనే అందముగా వుంచుకొనవలెను. విశ్వమందు కర్మ: విశ్వేశ్వరునియందు భావములు, ఈ రీతిగా మానవుడు నిత్య జీవన యాత్రను సాగించుచున్నాడా అని పరమాత్ముడు వేయి కన్నులతో చూచుచుంటాడు. పూర్వము మనుష్యులు ప్రకృతి సంబంధమైన మందులు, చికిత్స, ఉపశాంతి, వీటితోనే ఆరోగ్యమును రక్షించుకొనువారు! ఈ నాడు మందులూ మాత్రలు ఇంజక్షన్లు ఆపరేషన్లు యెక్కువ అయినాయి. అయితే, వీటివలననే రోగము కుదిరి జబ్బు నయమయినది అని భావించిన అది పిచ్చి భ్రాంతి! డాక్టర్ల వలన, మందుల వలన, ఆరోగ్యము సిద్దించును అనువది నిజమయినచో, గతించిన వారందరూ జీవించియే యుందురు! పోని, ఎదురు, వారలకు ఈ డాక్టర్లు వుపదేశించు రీతిగానైనా వారు ఆచరించుచున్నారా: లేదు! దేనివలన ఆరోగ్యము చెడనని వారు ఇతరులకు బోధించుచున్నారో, ఆ దురభ్యాసములన్ని వారిలోనే ప్రబలముగా పెరిగి, వారి చర్యలు హాస్యాస్పదముగా తయారైనవి. మత్తు పదార్థము సేవించిన అతి త్వరగా మనోలము దేహబలము చెడును అని బోధించు వారూ డాక్టర్లే! కాని, వాటిని వుపయోగించు వారిలో వారే యెక్కువ! ఆహార విహార పద్ధతులలో డాక్టర్లే పెడమార్గమును పట్డము వలన, వారు సరైన మార్గదర్శకులు కారనే నిందలకు పాత్రులగుచున్నారు! ఈనాడు దైవిక క్షేత్రములో, ఆధ్యాత్మిక క్షేత్రములో, లౌకిక క్షేత్రములో కూడ, మార్గదర్శకులైన నాయకులు లేరు; దేశము యొక్క శోచనీయ పరిస్థితికి ఇదియే మూలకారణము. చెప్పునదొకటి. చేయునది యొక్కటి. అన్నట్లు మాట్లాడే వారు యెక్కువైనారు కానీ ఆచరణలో శూన్యముగా నున్నది:
దివ్యాత్మ స్వరూపులారా! భగవద్దత్తమైన మన జీవితమును, జన్మాంతర పుణ్యవిశేషము వలన దొరికిన ఈ దేహమును. భోగభాగ్యముల నిమిత్తమని తలంచి వ్యర్థము చేయక, యోగత్యాగములకే వినియోగించి సార్థకతమ పొందండి, పరుల మెప్పుకొరకు పని చేయకూడదు; ఆత్మ తృప్తికై ప్రాకులాడాలి! ఇతరుల కర్పణము కాదు. ముఖ్యము: ఆత్మార్పణము గావించుకోవలెను. ఆత్మతృప్తి అనునది ప్రారంభ స్థితిలో లక్ష్యము కావచ్చు. అయితే, గమ్యస్థానము మాత్రము ఆత్మదర్శనము అని జ్ఞప్తియందుంచుకొనవలెను. మధ్య మధ్య వచ్చి అడ్డు పడుచున్న కష్టనష్టములు నిందానిష్టూరుములు కేవలము ప్రధానము. ఆత్మను కోరి నా తనను పరమాత్ముని కోరినట్లే. కాబట్టి కోరటమే అనవసరము. కావలసినదానినంతా, భగవంతుడే అందించును.
(స.సా. డి74 పు. 298/300)
(చూ|| ఆహారము, దివ్య ప్రకటనలు, వసంత ఋతువు, రోగము, సీలింగ్ ఆన్. డిజైర్స్)