"ఒకే భగవంతుడు సృష్టి తంత్రమును నడుపుటకు వీలగునట్లు తన శక్తిని, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను మూడు రూపములుగ విభజించెను. తత్వతః వీనిలో యే భేదమూలేదు. ఆ ప్రభువే సృష్టి చేయునప్పుడు బ్రహ్మ ఆనియు, పాలన చేయునప్పుడు విష్ణువనియు, సంహార సమయమున శివుడనియు, తన కార్యముల కొరకు దేవుడే విశేషావసరము లందు విశిష్ట రూపమునందునపుడు అవతారమని పిలువబడును. నిజముగా యోచించిన, మన్వాది ప్రజాపతులు సృష్టిని వృద్ధి చేయుటకై వచ్చిన బ్రహ్మ అవతారములనే చెప్పవచ్చును. భగవానుని సంకల్పముచేతనే సృష్టి జరిగెను. కనుక సృష్టిలోని మునులు, ఋషులు, మనుజులు, దానవులు, వీరందరూ విష్ణుని అవతారములని చెప్పుటలో తప్పేమియూ లేదు. జీవులెట్లు అనంతములో, అట్లే అవతారములు కూడనూ అనంతములు. అయితే, యుగావతారముల కధలే, పవిత్ర చరిత్రలు, మిగిలన వన్నియునూ జంజాటములే. సమస్త అవతారములకూ కారణము ధర్మస్థాపనమే.
(భా.వా. పు.160/161)
ధర్మాచరణ అభివృద్ధి అయిన అధర్మము తనంతటతానే నశించును. దానికి ప్రత్యేకించి ప్రయత్నము అవసరము లేదు. కనుక ఇప్పుడు, ధర్మాచరణము స్థాపించుటే ధర్మస్థాపన, సూర్యుడస్తమించినాడన్న యెంత అర్థమో, ధర్మము నశించినదన్ననూ అంతే అర్థము. సూర్యునకు ఆస్తమించుటనునది లేదు. కనుపించనంత మాత్రాన ఆస్తమించెనని తలంతురా? ధర్మము కూడనూ అట్టిదే. కనుపించకుండినంత మాత్రమున నశించినదని తలంతురు కానీ అది నశించునది కాదు. నశించునది సత్యమెట్లగును? ధర్మము సత్యముతో చేరినది కనుక అది నశించునది కాదు. అట్టి సత్యమైన ధర్మము మరుగునపడి కమపించక అదృశ్యమైన, దానిని దృశ్యమునకు తెప్పించుటే ధర్మస్థాపన.
(గీ.పు.56)
అవతార పరిసమాప్తి తరవాత ధర్మగ్లాని కలగడంవల్లనే కదా శ్రీకృష్ణావతారం రావడం జరిగింది. ద్వాపరం తరవాత కలియుగం ప్రారంభమై తిరిగి ధర్మం క్షీణిస్తోంది కదా, మరి అలాంటప్పుడు ధర్మస్థాపన ఎలా జరిగినట్లు? ఇదీ వారి సందేహం. అయితే చాలా సేపు వారిలో వారు తర్కించుకున్నా వారికి సంతృప్తికరమైన సమాధానం లభించలేదు. ఆ రోజు సాయంత్రం స్వామివారు ఈ సందేహాన్ని నివృత్తి చేస్తూ ఇలా అన్నారు, "శ్రీకృష్ణుడు ధర్మస్థాపన అన్నప్పుడు ఏ ధర్మాన్ని గురించి ప్రస్తావించాడు? ధర్మం అనేది దేహధర్మం, ఆత్మధర్మమని రెండు రూపాలలో ఉంటుంది. దైవానికి దేహధర్మంతో సంబంధం లేదు. యుగాలనుబట్టి ఈ దేహధర్మం మారుతూ ఉంటుంది. జీవుడికి, దేవుడికి ఉండే సంబంధమే ఆత్మధర్మం. ఎప్పుడు ఈ జీవ, దేవ సంబంధం క్షీణిస్తుందో అప్పుడు భగవంతుడు దానిని ఉద్దరించడానికి అవతరిస్తూ ఉంటాడు. దీనినే ప్రేమధర్మం అంటారు. (సనాతన సారథి, మే 2022 పు.35)