మానవత్యంలో దు:ఖానికి మూలకారణ మేమిటో మనం విచారించాలి. ఒక ఇంటిలో ఒకరి మృత్యువు సంభవించింది. ఇంటిలోని వారందరూ బాధపడుతున్నారు. కాని, ఈ బాధకు మృత్యువా కారణం? కాదు, కాదు. ఆ మరణించిన వ్యక్తిపై నుండిన అభిమానమే బాధకు మూలకారణం. అంతేకాదు ఏ ఇంటిలో మరణం సంభవించిందో ఆ ఇంటివారే దు:ఖిస్తారు కాని, మరెవ్వరూ దుఃఖించరే! మరణమే దుఃఖమునకు మూలకారణమైతే అందరూ దుఃఖించాలి కదా! కనుక, దుఃఖానికి కారణం మరణించిన వ్యక్తిపైనున్న అభిమానమే కాని, మరణం కాదు. అనగా, అభిమానమే దుఃఖమునకు మూలకారణం కనుక, ఈ అభిమానమును క్రమక్రమేణ తగ్గించుకొంటూ రావాలి. ఈ బాధ్యతల నుండి క్రమక్రమేణ తప్పిచు కొంటూ రావాలి. దీనినే వేదాంత పరిభాష యందు "వైరాగ్యము" అని చెపుతూ వచ్చారు. Less luggage, more comfort make travel a pleasure అన్నారు. కనుక,మన జీవిత ప్రయాణంలో వాంఛలనే లగేజిని తగ్గించుకొంటూ రావాలి. ఐతే, వీటిని ఏవిధంగా తగ్గించుకోవాలి? వాంఛలు లేక మానవుడు జీవించుటకు వీలుకాదే! కనుక, వాంఛలను తగ్గించుకోవడమంటే వాంఛలలోని మమత్వాన్ని తగ్గించుకోవడమని అర్థం.
(స. సా.పి.95 పు.30/31)
(చూ||జన్మమృత్యుజరవ్యాధిదుఃఖదోషానుదర్శనం, దౌర్బల్యము, మనోబలం, మమకారము, ముఖ్యకారణము, లోభము, సుఖము)