నరకాసురుడు స్త్రీలను ఎక్కువగా హింసిస్తూ వచ్చాడు. ఇది రాక్షసత్వమునకు మొదటి గుణం. కనుకనే నరకాసుర వధ జరిగినప్పుడు స్త్రీలందరూ చాల ఆనందించారు; తమ ఇళ్ళలో దీపాలను వెలిగించుకొన్నారు. అంతకు పూర్వం వారి ఇళ్ళలో దీపాలను వెలిగించుకోనేవారు కాదు. ఎందుకంటే ఆ జ్యోతుల వెలుగులో నరకాసురుడు తమను గుర్తించి ఎత్తుకుపోతాడేమోనని వారికి భయం! ఏనాడైతే నరకాసురవధ జరిగిందో ఆనాటి నుండి అన్ని ఇళ్ళలోను జ్యోతులు వెలుగుతూ వచ్చాయి. అంతేకాదు, ప్రజలు సత్యభామకు కృతజ్ఞతలు తెల్పుతూ ఆనందముతో నృత్యం చేశారు. మతాబులను కాల్చారు. శ్రీరాముడు రావణ సంహారం చేసి ఆయోధ్యలో ప్రవేశించిన దినము కూడా దీపావళి దినమేనని ఇంతకు ముందు మన వైస్-చాన్స్ లర్ తన ప్రసంగంలో పేర్కొన్నాడు. నరకాసుర వధ జరిదగినది ద్వాపర యుగంలోనైతే త్రేతాయుగంలో దీపావళి ఎక్కడి నుండి వచ్చింది?! కనక దీపావళి అనగా కేవలం ఈ నరక చతుర్దశి మాత్రమే కాదు, ఎప్పుడు దుఃఖవివృత్తి అయి ఆనంద ప్రాప్తి కల్గుతుందో అదే నిజమైన దీపావళి. బాహ్యంగా దీపాలను వెలిగించినంత మాత్రమున అది దీపావళి కాదు, మనలో నిరంతరము వెలుగుతున్న అత్యజ్యోతిని మరువకుండా ఉండాలి. ఆత్మజ్యోతిని మరచినవాడే నరకాసురుడు, దానిని నిరంతరము స్మరించేవాడే నరుడు.
(స.సా. జ. 98 పు.17)
(చూ॥ నరకచతుర్దశి)