పూర్వకాలంలో ప్రజలు "పెద్ద ఇంటి వారి జ్యోతి మనింటికి తెచ్చుకుంటే, మనమూ పెద్ద ఇంటివారమౌతాము, పవిత్రులమౌతాము" అనే విశ్వాసము కలిగియుండిరి. ఇప్పటికి పల్లె ప్రజలు ఇంటి ముందు చిన్న గూడు అమర్చుకొని, ఒక దీపాన్ని వెలిగించుతారు. ఇట్టి ప్రాచీన సాంప్రదాయాన్ని పురస్కరించుకొని వ్రేపల్లెవాసులందరు యశోద ఇంటి నుండి దీపం వెలిగించి, తెచ్చుకొనే వారు. ఒకనాడు వ్రేపల్లెకు సుగుణ అనే ఒక క్రొత్తకోడలు వచ్చింది. ఆనాడు యశోద ఇంటికి పోయి దీపం వెలిగించుకొని రావలసిన వంతు ఆమెకు వచ్చింది. "ఎన్ని దినముల నుండియో కృష్ణుని చూడాలని అనుకుంటున్నాను. ఇప్పుడు యశోద ఇంటికి దీపం వెలిగించుకోవడానికి వెళ్ళుతున్నాను. అక్కడ కృష్ణుడు కనిపిస్తే బాగుండును కదా!" అని కృష్ణచింతన చేసుకుంటూ, యశోద ఇంటికి సుగుణ చేరుకున్నది. కృష్ణుడినే ధ్యానిస్తూ, తాను తీసుకొని వెళ్ళిన దీపమును వెలిగించడానికి యశోద ఇంట్లో ఉన్న దీపం ముందర పెట్టింది. కాని, పొరపాటున సుగుణ వ్రేలు కూడా ఆ దీపంలో పడి కాలిపోసాగింది. కాని, సుగుణకు ఎట్టి బాధ తెలియలేదు. "కృష్ణా! కృష్ణా!" అని స్మరిస్తూ, ఆనందంగా ఉండినది. ఈ దృశ్యాన్ని చూసిన యశోద పరుగెత్తి వచ్చింది. "ఏమిటమ్మా! నిద్రపోతున్నావా? శరీరం కాలిపోతుంటే ఏమిటీ నిద్ర" అంటూ సుగుణని వెనుకకు లాగింది. "అమ్మా! కృష్ణుని చూస్తూ మైమరచాను" అని పారవశ్యంతో అన్నది సుగుణ. ఆనాడు సుగుణకు దీపంలో కృష్ణుడు కనిపించినాడట. గోపిక లందరూ ఇట్టి దివ్యమైన భక్తి ప్రపత్తులను కలిగియుండినారు.
(స. సా. అ 91 పు.262/263)