దీపం విశిష్టమైన శక్తి గలది. మరే పదార్థమునకు ఈ శక్తి లేదు. వెలుగునందించి చీకటిని దూరము చేస్తుంది దీపం. కనుకనే భారతీయులు ప్రాచీన కాలము నుండి దీపమునకు ప్రాధాన్యము యిస్తున్నారు. పుణ్య కార్యములకు మొదట దీపారాధన జరుపుతారు. దీపానికి సమస్కరిస్తారు. దీనికి మరొక గుణమున్నది. ఊర్థ్వగతేగాని అధోమార్గం లేదు. ఊర్థ్వ మార్గము బ్రహ్మ మార్గము. అధోగతి పాప మార్గము, అయితే ఈ వెలుగు బాహ్యమైన చీకటిని దూరము గావించగలదుగాని లోపలి చీకటిని దూరము గావించలేదు. ఎన్నో జన్మల నుండి మానవ హృదయమునందు కరుడు గట్టుకొని ఉన్న చీకటిని ఈ వెలుగు దూరము చేయలేదు. రాగద్వేషముల మలినమును కూడా ఈ వెలుగు తొలగించలేదు. మనస్సు తత్వాన్ని కూడా ఇది మార్చలేదు. హనుమంతుడు లంక నంతా కాల్చి వేసిన అర్థరాత్రి, అగ్నిజ్వాలలో లంకా పట్టణము పట్టపగలుగా కన్పిస్తున్నప్పటికీ, రావణుని హృదయము మాత్రం చీకటిగానే ఉన్నది. దుష్ట భావములు, దుష్ట గుణములు హృదయంలో దాగి ఉండటం చేతనే అతని యందెంతమాత్రము ప్రకాశము కన్పిOచలేదు. మానవుడు తన తత్వమును నిర్మలముగ, నిస్వార్థముగా రూపొందించు కోవాలి.
(స. సా.ఆ. 87 పు. 210 మరియు జ.పు.177)
(చూ॥ దారి)