అహంకారము

 

ఎరుకనే సర్వభూతములందు నేను నేను అనే స్ఫురణను కలిగిస్తుంది. ఈ స్పురణ శక్తియే అహం అహం అహం. అహం దేహముతో తాదాత్మ్యము పొందినప్పుడు అహంకారముగా రూపొందుతుంది. ఇదే మిథ్యా నేను. అది సత్యమైన నేను కాదు. (బ్బ.త్రపు ౧౨౩)

 

ఆత్మకూ, అహంకారమునకూ ఉన్న వ్యత్యాసము గుర్తించాలి. ఇది ఆత్మ నుండియే ఆవిర్భవించినది. ఆత్మ నుండియే తలంపు బయలు దేరింది. తలంపు నుండియే వాక్కువ వచ్చినది. ఏతావాతా వాక్కు, తలంపు, అహంకారము మూడు ఆత్మ సంబంధమైన కుటుంబమే. అహంకారము ఆత్మకు పుత్రుడు, అహంకారమునకు తలంపు పుత్రుడు, తలంపునకు వాక్కు పుత్రుడు, వాక్కు ఆత్మకు great grandson, grand son, son, father వీరంతా ఒక కుటుంబమునకు చెందినవారా కాదా? అహంకారము వస్తూ పోతూ వుంటుంది. రాకపోకలతో కూడిన అహంకారము: రాకపోకలు లేనట్టిది ఆత్మతత్వము. ఆత్మకు అహంకారమునకు వున్న వ్యత్యాసము గుర్తించాలి. అహంకారమును ఈగో అంటాము. ఇది తప్పు. అహంకారము అనగా శరీరమునకు సంబంధించిన అహంకారమని భావిస్తున్నారు. కాదు. దేహమే నేను అనే భ్రాంతియే నిజమైన అహంకారము. ధనమును బట్టి కులమునుబట్టి, గుణమునుబట్టి, విద్యను బట్టి వచ్చేది అహంకారము కాదు. అది వట్టి భ్రమ, ధనమును చూచి అహంకార పడుతున్నావా? అంటారు. ధనమును చూచి అహంకారము కాదు. భ్రమపడుతున్నారు. విద్యను చూచి నేను గొప్ప విద్యావంతుడను అనుకుంటున్నావు. అది వట్టి భ్రమ. వీటిని అహంకారమని చెప్పకూడదు. ఒకరికి విద్య ఉండి కూడాను. ఈ విధమైన భ్రమలేకుండా ఉండవచ్చు. ధనముండి కూడాను ఇట్టి భ్రమ లేకుండా ఉండవచ్చును. కాని, అందరియందు సమముగా అహంకార మనేది ఉంటుండాది. అహంకారము బుద్ధిని ఆవరించి దేహాన్ని పెడమార్గములు పట్టిస్తుంటుంది. కనుక ఈ బుద్ధికి శ్రద్ధను అలవర్చాలనుకుంటే మొట్టమొదట అహంకారాన్ని దూరం చేయాలి. (బృత్ర.పు. ౯౮/౯౯)

 

దోషాలకు అన్నిటికి మూలము అహంకారం. సేవ ద్వారా మొట్టమొదట అహంకారమును దూరం చేసుకోవాలి. అంతేకాదు బియ్యమునకు పై పొట్టు వున్నంతవరకు (ఊక), ఎక్కడ వేసినా, మొక్కలుగా, పెరిగి, ఒక్క గింజకు అనేక గింజలుగా తయారు అవుతాయి. మానవుని యందు ఏ కించిత్, అహంకారము వున్నా, అది అనేక మార్పులు చెందుతుంది. అనేక దోషాలను కూర్చి అనేక జన్మలను వృద్ధి చేస్తుంది. కావున మొదట అహంకారమును నిర్మూలన చేసుకోవాలి. చంద్రుడు దిన దినమును అభివృద్ధి చెంది పౌర్ణమి నాటికి, పరాకాష్టనందు కుంటాడు. "చంద్రమా మనసో జాత:" అదేవిధముగనే మానవుని మనస్సు కూడా, దినదినాభివృద్ధి గాంచి విశాలమైన దివ్య మార్గమును అనుసరించి పూర్ణముగా రూపొందాలి. పరిపూర్ణమైన మానవ జీవితమునందే పరిపూర్ణమైన దివ్యత్వము కూడా ప్రకాశిస్తుంది. మానవుని పూర్ణత్వమంటే ఏమిటి? విశాలమైన హృదయమే సంకుచిత భావములతో నింపుకున్న మనస్సు ఏనాటికి శాంతి సంతోషముల నందుకోలేదు. సర్వసాధనముల తత్త్వ శాస్త్రముల మూలము సమస్త ధర్మముల గమ్యము హృదయ విశాలత్వమే. కావున మానవుడు విశాల హృదయుడు కావాలి. అప్పుడే పరిపూర్ణత్వాన్ని అందుకోటానికి అర్హుడౌతాడు. (పా.పు 42/43)

 

అభిమానం - ఆడ పిశాచి. అహంకారము - మగపిశాచి. కోటీశ్వరుడు మొదలు కూటికి పేదవరకు ఇవి పట్టిపీడిస్తున్నాయి. అహంకార అభిమాన రహితులై, స్వామి సన్నిధినే పెన్నిధిగా భావించి చిక్కిన సమయాన్ని సార్థకం చేసుకోండి. (సా.పు 116)

 

అహంకారము మనస్సును వికలం చేస్తుంది. అంత: విచారణ లేకుండా చేస్తుంది. సాధకుడు తన సాధనలో జయం పొందాలంటే తాము చేసిన తప్పులు చెప్పే వారికి కృతజ్ఞుడైయుండాలి. ఉపయోగకరములైన వ్యాఖ్యానాలు,సలహాలు,సూచనలు,ఎక్కడనుండి వచ్చినా స్వీకరించాలి. అహంకారం తగ్గించుకోవడానికి యిదే దారి. (సా..పు 224)

 

నేను తక్కువ వాడను, నీచుడను, పనికిమాలిన వాడను,దరిద్రుడను,పాపిని,అధముడను-ఇత్యాది భావములును అహంకార లక్షణములే. ఆ అహంకారము పోవలె. అప్పుడె గొప్పవాడను, కొద్దివాడను ఆను భావములు నీకు పుట్టనే పుట్టవు. (స.వ.పు 29)

 

ఆత్మనిందకూడా అహంకార లక్షణమే. (స.వ.పు 30)

 

నీలోని అహంభావమును నరికి వేసి నీ యొక్క అహంకారమును శిలువపై మరణించేటట్లు చేసి నీవు అమరుడవుగా బయల్వెడలుము. (దై.మ. పు. 70)

 

అహంకారి దైవాన్ని ఏమాత్రము గుర్తించలేదు. దైవాను గ్రహమునకు పాత్రుడు కాలేదు. పైనున్న నీరు క్రిందికే ప్రవహిస్తుంది. అదేవిధంగా, అహంకారికి అథోగతి తప్పదు. మీరు భగవంతుణ్ణి ప్రేమిస్తున్నా మంటున్నారు. మంచిదే. కానీ, దానిని భగవంతుడు అంగీకరించాడా? చిన్న ఉదాహరణ: మీరు మీ స్నేహితునికి ఒక రిజిస్టర్డ్ లెటర్ వ్రాశారనుకోండి. అది అందినట్లుగా అతని నుండి మీకు ఎక్నాలెడ్జ్ మెంట్ రావాలి కదా. అదేవిధంగా, భగవంతుణ్ణి మీరు ప్రేమించినప్పుడు భగవంతుడు కూడా మిమ్మల్ని ప్రేమించాలి. మీలో ఆహంకారమున్నంత వరకు ఇది అసంభవం.

 

ఒకానొక సమయంలో అర్జునుడు అహంకారంతో తనను మించిన భక్తుడు లేడని భావించాడు. కృష్ణుడు అతనికి కనువిప్పు కలిగించాలని సంకల్పించుకున్నాడు. ఒక సాయంకాలం ఇరువురూ మారువేషంలో వాహ్యాళికి వెళ్ళి కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు. మార్గమధ్యంలో ఒక బ్రాహ్మణుడు కత్తిని పట్టుకొని సంచరించడం చూశారు. బ్రాహ్మణుడు కత్తిని పట్టుకున్నాడేమిటని ఆశ్యర్యపోయి, అతనిని సమీపించి కారణమడిగారు. ఆ బ్రాహ్మణుడు "నేను కత్తితో నల్గురిని చంపాలని నిశ్చయించుకున్నాను" అన్నాడు. "ఎవరా నల్లురు?" అని కృష్ణుడు ప్రశ్నించగా, ఆ బ్రాహ్మణుడు "మొట్టమొదట ఆ నారదుణ్ణి చంపాలి.ఎందుకంటే,త్రికాలములందు,త్రిలోకములందు నా భగవంతుని నామాన్ని స్మరిస్తూ నా స్వామికి విశ్రాంతి లేకుండా చేస్తున్నాడు. తరువాత ఆ ప్రహ్లాదుణ్ణి చంపాలి. ఎందుకంటే హిరణ్యకళిపుడు అతనిని అగ్నిలో పడవేసినప్పుడు, సముద్రంలోకి నెట్టినప్పుడు, పాములచేత కరిపించినప్పుడు, ఏనుగులచేత తొక్కించినప్పుడు, ప్రతి పర్యాయము నా స్వామి అతని ప్రార్థన విని తక్షణమే వెళ్ళి ఆతనిని రక్షించవలసి వచ్చింది. నా స్వామిని ఇంతగా శ్రమ పెట్టినందుకు అతనిని తప్పక చంపాలి. తరువాత ద్రౌపదిని చంపాలి. ఆమె నిండు సభలో కౌరవులు తనను అవమానిస్తున్నప్పుడు నా స్వామిని ఎలుగెత్తి పిలిచింది. తక్షణమే నా స్వామి తన చుట్టూ ఉన్న ఆష్ట భార్యలను, పరివారమును వదిలి పెట్టి ఎవ్వరకీ చెప్పకుండా ద్రౌపది మానసంరక్షణార్థం తన సౌధం నుండి పరుగెత్తుకుంటూ వచ్చేశాడు. ఈ రకంగా నా స్వామిని అకస్మాత్తుగా పిలిచి ఇబ్బంది పెట్టినందుకు ఆ ద్రౌపదిని చంపాలి. ఇంక, యుద్ధభూమిలో నాస్వామిని రథసారథి చేసి అనేక శ్రమలకు గురి చేసిన ఆ అర్జునుణ్ణి కూడా చంపాలి" అన్నాడు. కృష్ణుని ప్రక్కనే నిలబడి ఈ మాటలు వింటున్న అర్జునుడు ఆ బ్రాహ్మణుని యొక్క భక్తి ప్రపత్తులను గమనించి తన అహంకారమునకు సిగ్గు పడి తల దించుకున్నాడు. (,సా.సె. 99 పు.248)

 

మానవుడు పలువిధములైన అహంకారములతో శాంతిని తనకు తాను అభివృద్ధి చేసుకొనుచున్నాడు. దీనికి కారణము అస్థిరమయిన అధికార వ్యామోహములే. న్యాయముగా యోచించిన యేవిషయమందూ మానవునకు శాశ్వత, సంపూర్ణ అధికారములేదు.యెందుకన ప్రపంచ అధికారమునకు ఆది అంత్యము లున్ననూ, శాశ్వతాధికారికి ఆది అంత్యములే లేవు. శాశ్వతాధికారి సర్వేశ్వరుడే. లోకమున కొందరు విద్యాధికారియనియూ, మరి కొందరు ధనాధికారి యనియూ, శాస్త్రాధికారియనియూ తలంచవచ్చు. అయితే ఈ అధికారమునకు కొంతవరకు మాత్రమే హద్దు కలదు. పోనీ కొంతవరకైనా అధికార మున్నదికదా అని తలంచవచ్చును. ఈ విద్యలనూ ఈ ధనమునూ ప్రసాదించువా రొకరున్నారుకదా? అట్లు ప్రసాదించు వారికంటె వీరు అధికారులుకారు కదా? ఆ రీతిగా యోచించి చూడ ఒకరి కొకరు అధికులయి కడకు సర్వులకూ అనుగ్రహించు సర్వేశ్వరుడే సర్వాధికారి కాని క్షణకాలమునకు సంప్రాప్తమైన అధికారమునకే, నేనధికారి అన్న అదియేఅహంకారము.

 

నిజాధికారి స్వరూపములు,సత్యము,దయా,ప్రేమ,సహనము,కృతజ్ఞత,ఇత్యాదిస్వరూపములుకలవారికిఅహంకారమే రాదు. అట్టి వానిలో చోటే లేదు. అహంకారమే ఆత్మ ప్రకాశమును మరుగు పరచుచున్నది. అహంకారము నశించెనా అన్ని బాధలు తొలగిపోవును. ఆనందము ప్రాప్తించును. మబ్బు సూర్యుని ఆవరించిన రీతి అహంకారము ఆనందమును ఆవరించినది.

 

కన్నులు విప్పి ఆ కన్నులకు అడ్డుగా ఒక గుడ్డను లేక అట్టనో పట్టుకొనిన చెంతనే యున్న వస్తువులను కూడా చూడలేము. అట్లే భగవంతుడు మానవునకు అన్నింటికంటే సన్నిహితుడుగా వున్ననూ అహంకార తెరవలన మాధవుని చూడలేకున్నారు. యెంతోమంది సాధకులూ, సన్యాసులు కూడను ఇట్టి ఆహంకారమునకు చోటిచ్చి సాధించిన సద్భావములను కూడా కోల్పోపుచుందురు. వట్టి పాండిత్య మూలమున ప్రయోజనము లేదు. ప్రకృతి పేరు ప్రతిష్ఠలు పొందవచ్చును ఆత్మానందము లేని పేరు ప్రతిష్ఠలు పునాదిలేని గోడలు. (ప్రే.వా. 8/9)

 

ప్రతి కార్యంలో మానవుడికి అడ్డు వచ్చే పెనుభూతం అహంకారం. కనుక అహంకారాన్ని సమర్పణచేయాలి. అహంకారత్యాగం వలన కార్యం పవిత్రమవుతుంది. అహం కారం ఉన్నంతవరకు మానవు డికి ఆత్మ తత్త్వానికీ దివ్యత్వానికీ సన్నిహితసంభం ఏర్పడదు. అహంకారం ఉన్నవాడు ఆత్మతత్వం అర్ధం చేసుకోలేడు. ఆనందం అనుభవించ లే డు. ఏకార్యంలో ప్రవేశించినా మొదట అహంకారం వదులుకోవాలి. అహంకారం అష్టవిధాలైయినా అవేవీ శాశ్వతాలుకావు. మానవుడికి అహంకారం అజ్ఞాన స్వరూపం. అహంకారం నిర్మూలనం అయినప్పుడే సేవ లో మనకు నడుం వంగుతుంది. అహంకారం ఉంటే నడుం వంగదు. ఏనాడు నడుం వంచి తలవంచి పని చేస్తామో ఆనాడు అహంకారం దానంతటదే పారిపోతుంది. సేవలో పాల్గొనే వాడు ముందు అహంకారాన్ని త్యాగం చేయాలి. (స.సా న 2012 పు 437/438 )

 

అహంకారము. ఏ వైద్యమునకూ నివారణ కాదు. కనుక, ఈనాడు ప్రపంచమంతయు అనేక జబ్బులతో పీడింపబడే రోగిగా కనిపిస్తున్నది. అహంకారము అజ్ఞానముచేత ప్రారంభమౌతుంది. అజ్ఞానము పోవాలంటే అవిద్య పోవాలి. ఈ రెండూ పోయినప్పుడే అహంకారము నిర్మూలమవుతుంది. దేవిని  చూచి నీవు అహంకారపడుతున్నావు? (సనాతన సారథి, ఫిబ్రవరి 2023 పు36)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage