నారదుడు నాల్గు వేదాలను, ఆరు శాస్త్రాలను పఠించాడు; ఉపనిషత్తులను కంఠస్థం చేశాడు. బ్రహ్మసూత్రాలను వల్లించాడు. కానీ, అతనికి శాంతి కలుగలేదు, భ్రమ తొలగలేదు. తన అశాంతిని దూరం చేసుకునే నిమిత్తమై అతడు సనక సనందన సనత్కుమారులను ఆశ్రయించాడు. సనత్కుమారుడు "నారదా! శాంతిని పొందడానికి నీకున్న అర్హత ఏమిటి? అని అడిగాడు. నారదుడు, "సనత్కుమారా! నేను నాల్గు వేదాలను, ఆరు శాస్త్రాలను పఠించాను. సమస్త ఉపనిషత్తులను కంఠస్థం చేశాను" అన్నాడు.
"అంధకారం బెల్ల హతమారునే జూడ వసుధలో దీపపు వార్తవలన?
రోగ పీడితుని బెల్ల రోగంబు తీరునా ఔషధ మహిమంబు అంత విన్న ?
నిరు పేదవాని పేదరికము పోవునా విత్త ప్రభావంబు విన్నయంత?"
ఆకలి తీరాలంటే ఆహారాన్ని చేతితో తీసికొని, నోటిలో పెట్టుకుని భూజించాలిగాని. ప్లేటులో ఉన్న ఆహార పదార్థముల పేర్లు వెయ్యి పర్యాయముల వల్లించినా పొట్ట నిండుతుందా అచరణలో ప్రవేశించినప్పుడే ఆకలి తీరుతుంది.
సనత్కుమారుడు "నారదా! నీవు వేదములను వల్లించావు శాస్త్రములను పఠించావుగాని, వాటిని ఆచరణలో పెట్టావా?
మొట్టమొదటి ఉపనిషత్తులోని మొట్టమొదటి వాక్యం "ఈశావాస్య మిదం సర్వం." ఈ ఒక్క దాన్నైనా అనుభూతిలోకి తెచ్చుకున్నావా?
అన్నింటియందు ఈశ్వరత్వమున్నదనే సత్యాన్ని గుర్తించావా? కేవలం గ్రంథ పరిచయంచేత శాంతిగాని, ఆనందముగాని లభించుననుకోవటం చాల పొరపాటు. “ఆచరణలోనే ఆనందమున్నది" అన్నాడు. ఈనాటి సాధకులు కేవలం గ్రంథ పరిచయాన్ని పెంచుకుంటూ కాలమును వ్యర్థం చేసుకుంటున్నారేగాని, ఆచరణలో ప్రవేవించి జీవితాన్ని సార్థకం గావించుకునే ప్రయత్నం చేయటం లేదు.
"శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మనివేదనం"
ఇందులో ఏ ఒక్కటైనా నిత్యజీవితంలో ఆచరణలో పెట్టి అనుభవించడానికి ప్రయత్నించాలి. ఈ నాటి మానవుడు మంచిని వింటున్నాడు. మంచిని చెపుతున్నాడుగాని, మంచిని చేసి చూపించటం లేదు. మానవునిలో త్రికరణ శుద్ధి లోపించింది. అయితే, మంచివారు కూడా లేకపోలేదు. "జగతియందు పుణ్యపురుషులు లేకున్న జగము లెట్లు వెలుగు పగలుగాను?" కనుక, మంచివారు కూడా ఉన్నారు. కానీ, ఈనాడు సమాజంలో మంచివారికి విలువ లేకుండాపోయింది.
(స.సా..మే 99 పు. 128/129)
తెలుసుకొనుట అనగా జ్ఞానమును సంపాదించుకొనుట. మానవుడు తన నిజస్వరూపమును మరచి, దేహేంద్రియాదులనే తానని భావించి వాటికి కావలసిన విషయ భోగములు తనకు కావలసిన వాటిని సంపాదించుకొంటే ఆనందము కలగదు. ఆనందానికి బదులు అనర్థములే కలుగుచుండును. విషయభోగములు దుఃఖ పర్యవసానములుగనే ఫలించుచున్నవి. ఇట్టి మానవునకు సరియైన ఆనందమార్గము కావలసియున్నది. ఆనందము ఎచట లభించును? ఇది బయట వస్తువులలో లేదు. బయిట వస్తువుల యందలి ఆనందము విపరీత ఫలము నిచ్చును. ఆనందము నీ స్వరూపమే అన్న సత్యమును తెలుపుచున్నవి. బ్రహ్మసూత్రములు,ఉపనిషత్తులు,గీత,జ్ఞానప్రాప్తికిప్రస్థాన త్రయములు. త్రిమూర్తి స్వరూపముల బ్రహ్మసూత్రములను అర్థము చేసుకొనుట కఠినమైన విషయము. ఇది అధికార పురుషులకు తప్ప అన్యులకందునది కాదు. అధికార పురుషులనగా సాధన చతుష్టయ సంపన్నులు. అట్టి వారి కిది కరతలామలకము. మానవుడు తనను తాను ఉద్ధరించుకొనవలెనన్న మొదట సాధన చతుష్టయమును సాధించి తీరవలెను.
ఈ బ్రహ్మసూత్రము శారీరక శాస్త్రమనియు, వేదాంత దర్శన మనియు చెప్పబడుచున్నది. అంటే శరీర సంబంధితమైన ఆత్మ, జీవుడు, ఇంద్రియాది భూతాలను గూర్చిన శ్రేష్టమైన పరిశీలన జరుపుట. అనగా బ్రహ్మమే శరీర ఇంద్రియాలకు ఆధారమని గుర్తించుట. ఏతావాతా ఆనంద ఘనమే నీ స్వరూపమని తెలుపుకొనుట.
(సూ.వా.పు.2,3)
మానవుని స్వభావము స్వరూపము ఆనందమే. అతను సుఖ స్వరూపుడు. తన స్వభావమైన ఆనందమును సుఖమును ఆశించుటకు అతని అధికారమున్నది.
(బృత్రపు౧౧౪ )
స్వాతంత్ర్యమునకు సంబంధించినది ఆనందమే. ఆనందము ఏవిధముగా లభిస్తుంది? దేహముచేత, మనసుచేత లభిస్తుందా? కాదు. ఈ దేహ మనస్సులచేత లభించే ఆనందము తాత్కాలికమైనట్టిది. ఇలాంటి ఆనందము నిమిత్తమై మానవుడు సృష్టింపబడలేదు. శాశ్వతానందమును అనుభవించే నిమిత్తమై మానవుడు తానే తన రూపాన్ని ధరించుకున్నాడు. ఇది అంతయు దైవ సంకల్పమే. నీకు నీవు ఏకార్యమును ప్రయత్నముతో సాధింపలేవు. మానవుని ప్రయత్నముచేత సాధింపబడని కార్యములు ఎన్ని లేవు? ఏ ప్రయత్నము చేయక పోయినప్పటికిని ఫలించే కార్యములు ఎన్ని లేవు? ఇది నేను సాధించాననే కర్తృత్యభోక్తృత్వానికి మూలకారణము అహంకారము. ఆనందము నీ స్వరూపము. నీవే ఆనంద స్వరూపుడవు. ఐతే నీ ఆనందాన్ని నీవు గుర్తించలేక పోతున్నావు, రాగద్వేషములచేత అహంకార, మమకారములచేత అనుమాన ఆహ్లాదములచేత, ఈ ఆనందము కప్పబడి వుంటుండాది. రాగద్వేషములు దట్టమైన బట్టలు. ఇవియే మన ఆనందాన్ని అడ్డుపరుస్తున్నాయి. ఈ రాగద్వేషములను దూరం గావించుకున్నప్పుడు మన స్వస్వరూపాన్ని మనం దర్శించగలము. మనమే ఆనందమై తిరిగి ఆనందాన్ని తెలుసుకొనుటకై ప్రయత్నిస్తున్నాము. ఇది ఎంత వెట్టితనము. తనయందే సర్వము ఉండినప్పటికిని విషయ వాంఛలచేత దృశ్య కల్పిత జగత్తునందు అనేక రకములైన వాంఛలను అనుభవించటానికి ప్రయత్నిస్తున్నాము.
“కోరిన ఫలమిచ్చు కల్పవృక్షంబుండ
పెరటి పుష్పమునకై ప్రీతియేల.
అడిగిన పాలిచ్చు కామధేనువే వుండ
ధనమిచ్చి ఆవును కొనగనేల,
మెండగు కాంతితో మేరు పర్వతముండ
వెండి బంగారుకై వెతకనేల"
సర్వము తానై యుండగ ఈ అల్పమైన విషయాలకు మనం ఎందుకు ఆరాటపడుతున్నాము. తానే ఆనంద స్వరూపుడనే సత్యాన్ని తెలియకపోవటం చేతనే.
(బృత్రపు ౧౬౨)
The secret of happiness is not in doing what one likes; but in liking what one has to do.
ఆనందము పొందుటకు మార్గము. తాను చేయవలసిన పనిని ప్రేమతో చేయుటగాని, తన కిష్టమైన పనిని ప్రేమతో చేయుటకాదు. ఆవిధమైన ప్రేమను ఆధారముగా చేసుకొని, తన ప్రభువైన రామచంద్రుని ఆజ్ఞలను శిరసావహించినవాడు హనుమంతుడు.
(ఆ.రా.పు.209)
యోగియైన మరిభోగియైన సంసారియైన సన్యాసియైననూ శాంతము సత్యము ననుభవించితే ఆనందమె ఆనందమానందము.
(భ.ప్ర.పు. 42)
ఆనందము లౌకికంగా కూడా ప్రతి జీవి యొక్క స్వభావము కనుకనే ఆనందమును ప్రతి మానవుడూ కోరుచున్నాడు. ఇట్టి ఆనంద నిమిత్తమై జీవులు యెన్నింటినో త్యాగము చేయుచున్నారు. అయితే ఆనందమును బాహ్యవస్తువుల యందు వెదుకుట ఒక అజ్ఞానము. "సర్వం పరవశం దుఃఖం, సర్వ ఆత్మవశం సుఖం" సూక్తి ననుసరించి బాహ్యవస్తువులపై తన సుఖము ఆధారపడియున్నదని భావించినపుడు ఆ జీవుడు పరవశమై వుండును. తన సుఖమునకు దృశ్యవస్తువులు ప్రధానమని తలంచి, తాను వస్తువులకు వశుడై, లేని దుఃఖమును అనుభవిస్తాడు. అనేక అశాంతులకు గురి అవుతాడు. కనుక ఆనంద ప్రాప్తికై బాహ్య వస్తువులను బాహ్యక్రియలను ఆశ్రయించుట సరియైన మార్గము కాదు. ఇది దుఃఖమునకు దారి. నిజమైన ఆనందమును కోరువాడు తన వాంఛలను ఆత్మవశం చేయాలి. కావాలి. బాహ్య వస్తువులచే ఆనందమును వెదుకుట యెండమావులను ఆశ్రయించి, కడకు దాహము తీరక, ప్రాణమును కోల్పోవుట జరుగును.
(సూ.వా. పు. 47/48)
(చూ|| ఆజ్ఞానము యొక్క తత్త్వము. అద్వైత దర్శనము,అసూయ,ఆత్మవిశ్వాసము,ఆత్మస్వరూప స్వభావము,ఆశలు,ఉపకారము,ఏకత్వము. కర్తృత్వము,గమ్యస్థానము,గౌణశ్చేన్నాత్మశబ్దాత్. చిత్తశుద్ధి,దివ్యప్రకటనలు,దేహభ్రాంతి.దైవము,పండితుడు. పర్వదినము,బొమ్మలాట, భగవత్ప్రేమ, మమకారము.మానుష్యత్వము, లైబ్రరీ, వసంతఋతువు, శాంతి,సంపూర్ణ జీవనము)