ముందు లేకుండి తరువాత కలుగుట జన్మమని అందురు. ఉండి లేకపోవుట మరణమని అందురు. జన్మము సావయవ వస్తువులకే కాని విరవయవ వస్తువుకు కాదు! ఆత్మ నిరవయవం కదా! కనుక ఆత్మకు జన్మమెక్కడిది? అట్టి జన్మమే లేనిదానికి మరణము యెట్లు సంభవించును? అట్టి ఆత్మ యెవరిని చంపును? యెవరిని చంపించును? అది అజము, నిత్యము, శాశ్వతము, మలినమైన, జీర్ణమైన వస్త్రములను మనుజుడు విడిచి నూతన శుభ్రమైన వస్త్రములను యే రీతిగా ధరించునో అటులనే దేహి జీర్ణములైన దేహములను వీడి నూతన దేహములను ధరించుచున్నది. వస్త్రము దేహమున కెట్టిదో,దేహము దేహి కట్టిది. దేహములకు సా క్షియైన ఈ ఆత్మను తత్వతః తెలిసి కొనినచో నీవు ఈ రీతిగా శోకించి యుండెడి వాడవు కావు. నీ సర్వాయుధములు ఈ శరీరములను జడములను కొట్టగలవే గాని నిర్వకారమైన ఆత్మను యే రీతిగానూ సమీపించలేవు. ఈ సత్యమును తెలిసి కొని శరీరమందలి శోకమును త్యజించుము. .
(గీ. పు.32)||
ఆత్మకూ చావుకూ ఎట్టి సంబంధం లేదు. మరణము యొక్క అనుభవము దేహమువకే కానీ నిత్య, సత్య, నిర్మలమైన ఆత్మకు అంటడు. అందువలననే మరణమున్న యిష్టపడదు; ఇష్టపడనిది ఆత్మకాని దేహము కాదు. మరణమన్న యేది ఇష్టపడకుండా వున్నదో ఆ ఆత్మే నీవు. నీవు సత్, స్వరూపుడవు. దేహము పై ఆరోపించే అమరధర్మం అవివేకము. దేహము సత్ కానేకాదు. ఆ సత్ పేరున నున్న నీవే ఆత్మ కాని ఆత్మకు మరణము రాదు, లేదు. అట్టి మరణము లేని ఆత్మ, సర్వ ఉపాధులందూ వుండును. కనుక, ప్రతి దేహము లోనూ సత్ పదార్థశక్తి సార్థకమైయున్నదని తేట తెల్లమగుచున్నది. ఇక రెండవదైన చిత్ అన్నింటినీ తెలిసికొనవలెనను శక్తి, ప్రతి మానవుడు దేనిని చూచినను ఇది యేమి? అది యేమి? అని ప్రశ్నించి దాని స్థితిగతులను తెలిసికొనగోరుము. ఆవిధముగా ప్రయత్నించి దీనిని తెలుసుకొనువారు కొంతమంది ఉండవచ్చును. కేవలము తెలుసుకొనవలెనని మాత్రము ఆశించి, ప్రయత్నించి తెలుసుకొన లేకుండా పోవచ్చును. ఎటులయిన నేమి ప్రతివాడూ తెలిసికొన వలెనని ఆసక్తితో. ప్రయత్నము సలుపును.
స్వయముగా చైతన్యమైన చిత్ శక్తికి జడవస్తువులను కూడా చైతన్యవంతముగా ప్రకాశింపచేసే స్వభావము సహజముగ వున్నది. అందుకనే ఈ లక్షణము మానవునియందు మెరయుచున్నది, మెరిపించు చున్నది. మానవునియందు చిత్ శక్తి వున్నదనుటలో పై విషమయు విచారించిన స్పష్టమగుచున్నది.
మానవుడే కాక పశు పక్షి మృగాదులు కూడనూ తమంతట తాము సుఖముగా వుండవలెననియే కోరు చుండును. సుఖమునకై ప్రయత్నములుకూడనూ చేయుచుండును. దుఃఖమునుకాని కష్టమునుకాని అవి ఆశించవు. వచ్చిననూ తప్పించుకొనుటకు ప్రయత్నించును. ఇక మానవుల విషయము తెలుపనక్కరలేదు. నిరంతరము సర్వకర్మల యందు సర్వత్రా సుఖముగానే యుండవలెనని కోరుదురు కానీ ఒక సమయమందైనా, వేరొక స్థాన మందైనా, వేరొక కాలమందైనా దుఃఖమును ఆశించరు.
(గీ..పు. 127/129)
ఆత్మ అతి సూక్ష్మమయినది: దానిని తెలుసుకొనుట చాలా కష్టము. పంచభూతములను భూమి, జలము అగ్ని, వాయువు, ఆకాశము, ఇవి నీకు తెలియును కదా! ఇవి మొదటినుండియూ విచారించిన వకదానికంటే మరొకటి తేలిక ఆగుచున్నది. అనగా, భూమికంటే జలము, జలముకంటే అగ్ని, అగ్నికంటే వాయువు, వాయువు కంటే ఆకాశము తేలిక అగుటయే కాక విశాల మగుచున్నది కూడను, అనగా భూమియందున్న గుణములు శబ్దస్పర్శ రూప రస గంధములనబడు అయిదు గుణములు: రెండవదనబడు జలమునందు గంధము తగ్గిపోయినది; అగ్నియందు గంధము రసము తగ్గిపోయినవి: వాయువునందు రూప రస గంధములు తగ్గి పోయినవి. అందువలన భూమికంటెను. జలముకంటెను, అగ్నికంటెను మరింత తేలిక అయి వ్యాపకమయి సంచరించుచున్నది. ఇక అయిదవదయిన ఆకాశమున స్పర్శ, రూప, రస గంధములు లేక కేవలము ఒక శబ్దము మాత్రమే యున్నది. ఒక్క గుణముగల ఆకాశమే అంత సూక్ష్మమయి నపుడు నిర్గుణ మై న ఆత్మ మరెంత సూక్ష్మమో యోచించుకొనలేక పోవుచున్నావు. అంత సూక్ష్మమగుటచే బహిర్ముఖమున తెలిసికొన లేకపోవుచున్నారు. అది అంతర్ముఖులకు మాత్రమే అతి సమీపమున నుండును.
(గీ. పు. 217/218)
సూర్యుని వేడిమినుంచి ఏర్పడిన మేఘ సముదాయము. సూర్యుని కప్పివేసినట్టుగా, ఆత్మ నుండి పుట్టిన మానసిక మేఘసముదాయము ఆత్మనే కప్పివేస్తుంది.
(బృ,త్రపు ౧ ౩౫)
అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః
అహ మాదిశ్చ మధ్యంచ భూతానామంత ఏవచ.
అర్జునా! నేను ఆత్మను. సర్వభూతములయందుండిన వాడను నేను. ఆది మధ్య అంతము నేనే. ఈ చరాచర ప్రపంచమునందు గోచరించునదంతయు ఆత్మ తత్వమే. ఆధ్యాత్మిక క్షేత్రమునందు అడుగడునా వినిపించునది కనుపించునది. అనిపించునది మైమరపించునది ఆత్మనే. లోకమునందు ఆత్మ కానిది మరొకటి లేదు. ఈనాడు మానవుడు సాధించవలసినది ఆత్మనిష్టనే. స్వస్వరూపాను సంధానమే ఆత్మనిష్ఠ. తనను తాను గుర్తించుకోవటమే ఆత్మ జ్ఞానము. మానవత్వమునందు ప్రప్రథమముగా సాధించవలసినది ఆత్మానందమే. నిరంతరము జ్ఞప్తి యందుంచుకోవలసినది ఆత్మ తత్వమే. ఆత్మనే ఎరుక అని పిలువబడుతుంది.
(బృత్రపు౧౨౩ )
ఈ పాంచ భౌతికమైన దేహము బుడగవంటిది. ఈ దేహమునందు ఆత్మ అణుస్వరూపము ధరించుట చేత, దేహత్మ అన్నారు. ఈ సర్వ చైతన్యము, సమస్తములైన పదార్థములను కదిలిస్తుంది. దేహము, జీవుడు పరమాత్మ, అను 3 తత్వములున్నాయి. కాని దేహత్మ, జీవాత్మ, పరమాత్మ -ఆత్మ మూడింటి యందు ఒక్కటిగనే యున్నది.
(సా. పు. 287)
ఈగ అన్నింటిపైన వ్రాలుము. అగ్ని పై మాత్రము వ్రాలదు. వ్రాలిన జీవించదు. అటులనే మనసు అన్నింటిని చింతించును. ఆత్మను మాత్రము చింతించదు. ఆత్మను చింతించెనా లోక చింత ఉండదు. ఆత్మసాక్షాత్కారమునకు లోచూపే ప్రధానము. మౌనమే స్వభావము. ధ్యానమననములే దానికి సాధనలు. వశమందు లేని మనోశక్తి ఆత్మకు పరమ శత్రువు.
(ఆ.దీ.పు. 179)
కొంత లవణమును (ఉప్పును) పాత్రలోని జలములో వేస్తే, కొంత సేపటికి అది కరిగి సర్వత్రా వ్యాపిస్తుంది. లవణము సర్వత్రా వ్యాపించినప్పటికి, కంటికి కనబడదు. చేతికి చిక్కదు. అయితే లేదని చెప్పుటకు ఏమాత్రము వీలుకాదు. జిహ్వయందు వేసుకొనిన దాని రుచి తెలుస్తుంది. సర్వత్రా వ్యాపించిన రుచినే నీవు. అదే ఆత్మ, అదే సత్యము. అదే తత్త్వమసి.
(సా॥ పు 393)
చావు పుట్టుక లేని శాశ్వతుండు! ఆది మధ్యాంత రహితుడనాదివాడు!
తాను చావక చంపబడక అంతటను సర్వసాక్షియై ఆత్మయుండు -
(సా. పు 433)
కంటికి గ్రుడ్డును కాటుక నంటనట్టి
జిడ్డు ఏమాత్రము అంటక జిహ్వయుండు
బురదనంటక తామరపువ్వులుండు
ఏది అంటక యుండెడి అదియె ఆత్మ !
(సా. పు 439)
వాక్కు, మనస్సు, ప్రాణము. ఈ మూడింటి సమ్మిళిత స్వరూపము ఆత్మ. దీనికి మూడు అవస్థలు. జాగ్రత్, స్వప్న, సుషుప్తులు మేల్కొని యుండి, దృశ్య జగత్తులో అన్నిటిని చూడటం, వినటం మాట్లాడటం, అను భవించడం. ఇలాంటి పంచేంద్రియములతో కూడిన తత్త్వం జగత్తు. ఇది విశ్వతత్వానికి సూక్ష్మ రూపం కనక నిజానికి, విశ్వుడుఅనిమరియొకపేరు.విశ్వుడు24తత్వాలతోకూడివుంటాడు.5 కర్ణేంద్రియములు,5 జ్ఞానేంద్రియములు,5 కోశములు,5 పంచ ప్రాణములు,4అంతఃకరణములు-మనస్సు, అహంకారము, చిత్తము, బుద్ధి. ఈ 24 తత్వాలతో కూడినది బాహ్య జగత్తు లేక విశ్వుడు. ఇది జాగ్రదవస్థ రూపము. .
మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అను 4 గింటితోటి కూడుకొని స్వప్నావస్థ ఉంటుంది. బాహ్యమైన కర్మేంద్రియములతో దీనికి పనిలేదు. ఇటువంటి పరిస్థితులలో, తేజోమయ రూపాన్ని ధరిస్తుంది. కనుక స్వప్నావస్థకు, తైజసుడు అని పేరు. సుషుప్తి. ఇదే కారణావస్థ అనగా మంచి సుషుప్తి అనగా నిద్ర, మంచి గాఢనిద్రయని సుషుప్తి అర్ధము. గాఢనిద్రలో, కేవలము ప్రజ్ఞ మాత్రమే మిగిలి యుంటుంది. కనుక సుషుప్తిలో ఉన్నవానికి ప్రాఙ్ణుడని పేరు. విశ్వుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, యీ మూడు కూడా ఆత్మకు గల పేర్లు మాత్రమే.
(సా. పు. 290)
అణువు కంటెను సూక్ష్మమై అణువు ఉండు
ఘనము కంటెను ఘనమై కనిపించుచుండు
అణు ఘనముగా, ఘనమె అణువుగనుండు
అణువె, ఆత్మయై, ఆత్మయే అణువుగనుండు.
(శ్రీ ఏ. 1996 పు. 5)
(చూ|| అంతరాత్మ, అంతర్వాణి, ఆత్మజ్ఞానము. అజ్ఞానము యొక్క పరాకాష్ట ఆహారము, గౌణశ్చేన్నార్మశబ్దాత్.చదువు.చైతన్యము, జ్ఞానము, త్రిగుణములు, దివ్యప్రకటనలు. దేహము, బుద్ధి, బ్రహ్మ, భక్తి,, రాజబాట, శబ్దము. శరీరము. సాక్షాత్కారము, హిరణ్యగర్భ తత్త్యం)