మహాపతివ్రత. ఆమెకు ఒక్కరు కాదు. ఐదుమంది. పతులు. ఐదుమంది పతుల ఆజ్ఞలను శిరసావహించి, కాదు లేదు అనకుండా నడుచుకుంటూ వచ్చింది.
పతుల మాటలకెదురు చెప్పంగబోదు
వారిసేవల చేయగా తీరదనదు.
తనకు నున్నంతలో తృప్తిగనుచునుండు
ద్రౌపదికి సాటి ఏ పతివ్రతయు లేదు.
ద్రౌపది పతులు ఎవరు? ధర్మ అర్జున భీమ నకుల సహదేవులే. పంచ ప్రాణములు. ప్రతి మానవునియందు ఐదు పతులుంటున్నాయి. ప్రాణ ఆపాన వ్యాన ఉదాన సమాన - ఈ ఐదింటిని ద్రౌపది చక్కగా సమన్వయ పరుచుకొని అనుసరిస్తూ వచ్చింది. మనము వీటిని అనుసరిస్తున్నామా? ఒక్కొక్క సమయములో ఒక్కొక్కటి ఉద్రేకిస్తుంది. కనుకనే చెప్పినాడు. తనకు మున్నంతలో తృప్తి గనుచునుండు. ఆమెకు ఎంత ఉన్నదో అంతటిలో తృప్తి పడుతుంది. మనకున్న దానిలోనే మనము తృప్తిపడాలి. ద్రౌపది నిరంతరము తృప్తిగానే వుండేది. ఈనాటి అసంతృప్తికి కారణము ఉన్న దానిని త్యజించి, లేనిదానికై ఆరాటపడటమే. అందువల్లనే ఆశాంతికి గురై పోతున్నారు. ద్రౌపది లేని దానిని ఆశించటం లేదు. ఉన్న దానిని వదలటం లేదు. ఉన్న దానిని అనుభవిస్తుండాది.
(బృఁతపు. ౧౧౯)
‘ధర్మ — ధారణ’
‘ధర్మ మను పదము ధారణ కు సంబంధిచినది. రెంటికిని మూలమొకటే. ధారణ మనగా వస్త్రాదులను ధరించుట. ధర్మమే హిందూదేశము ధరించు వస్త్రము. భరతమాత, తన గౌరవమునకును, ఔన్నత్యమునకును, ఇచటి శీతోష్ణస్థితులకును తగినట్లు, ధర్మవస్త్రమును ధరించియున్నది. - దుర్మార్గులైన కౌరవులు, ద్రౌపది ధరించిన వస్త్రమును లాగివేసి, ఆమెను పరాభవింప పూనుకొన్నప్పుడు, ధర్మరాజు ధర్మబద్దుడై పలుకకుండెను; భీముడు, భార్య పరాభవము చూచి సహింపలేకయు అన్నను అతిక్రమింప జాలకయు, లోలోపల మండిపడెను. అర్జునుడును, నకుల సహదేవులును ధర్మజుడు శాంతి వహించియుండుట చూచి, తామును శాంతించియుండిరి. అప్పుడు ద్రౌపది గత్యంతరము లేక కృష్ణుని ప్రార్థించెను. వెంటనే భగవాను డామె నాదుకొని, పరాభవమును తప్పించెను. భగవంతుని దయ, ఆలస్య మన నెట్టిదో, అనుమాన మననేమో యెరుగదు.
ఆనాడు ద్రౌపదికి పట్టిన దురవస్థయే, యీనాడు భరతమాతకు పట్టినది. దురాత్ములు కొందరు ఆమె కట్టిన ధర్మ వస్త్రములు లాగివేసి, తమ నవనాగరకతకును, తమ యబిరుచులకును, తమ యున్మత్త భావములకును సరిపడిన వికృతవేషము వేసి, ఆమెను పరా భవింప పాలు పడ్డారు. ఆమె భగవంతునకు మొర పెట్టుకొన్నది. అందువలననే, కృష్ణుడు మరల రావలసివచ్చినది. ఆ ద్రౌపదికి వచ్చిన ఆపదను తప్పింప నశక్తులై చింతిలుచున్నవారికి తోడుపడి, ఆమె నవమానింప పూనుకొన్నవారి ప్రయత్నమును భంగము చేసి, కృష్ణు డామెను రక్షించినట్లే, నేనును, ధర్మమును రక్షించుకొనలేక బాధపడుచున్నవారికి తోడుపడి, ధర్మద్రోహుల యత్నమును తుదముట్టించి ధర్మమున రక్షింతును. ((శ్రీ సత్య సాయి వచనా మృ తము 1964 పు 260-261)