అశ్వత్థామ ఉపపాండవుల గొంతులు కోసి నప్పుడు అర్జునుడు అతనిని బంధించి తెచ్చి "ద్రౌపదీ! నీ కుమారులను చంపిన ఈ దుర్మార్గుని గొంతు కోస్తాను. వీని రక్తముతో తలంటుకొని స్నానం చేయి," అన్నాడు. అప్పుడు ద్రౌపది "అర్జునా! అశ్వత్థామ నా కుమారులను చంపి నందుకు నేనెంతగా దుఃఖిస్తున్నానో, నీవిప్పుడు అశ్వత్థామను చంపితే అతని తల్లి కూడా అంతగా దుఃఖిస్తుంది కదా! కాబట్టి, నీ వీ పనికి పూనుకోవద్దు." అని వేడుకున్నది. అంతేగాక, అశ్వత్థామ పాదాలపై పడి "నా కుమారులు పసిపిల్లలు, నీకెట్టి ద్రోహమూ తల పెట్టనివారు. అలాంటివారిని చంపటానికి నీకు చేతులెలా వచ్చినాయి. తండ్రీ ? " అన్నదేగాని, పరుషవాక్యము లాడలేదు. అట్టి శాంతము, సహనభావమే ఆమెను అన్ని విధాలుగా సంరక్షిస్తూ వచ్చింది. కష్టసమయములందు కూడా మానవుడు శాంతం వహించాలి. ద్రౌపదికి ఇంతటి క్షమాగుణం కృష్ణుని ప్రబోధవల్లనే చేకూరింది. ఎలాంటి పరిస్థితియందైనా ఆమె కృష్ణుని మాటను జవదాటేది కాదు. ఇలాంటి పరమ భక్తులు పతివ్ర తామతల్లులవల్లనే, భారతదేశం ఈ నాటికీ సుక్షేమాన్ని అనుభవిస్తోంది.
(స.సా.ఆ2000వు. 295)
భారతము, భాగవతము మున్నగు పవిత్రమైన భారతీయ గ్రంథములన్నీ ఆధ్యాత్మికమైన ప్రబోధలే అందిస్తూ వచ్చాయి. ద్రౌపది గొప్ప గుణవంతురాలు. ఆమెకు పాంచాలి అని పేరు. అనగా, ఐదు మందికి భార్య అని అనుకోరాదు; శబ్ద స్పర్శ రూప రస గంధాదులకు తాను సమన్వయమైనది. కోపము, అసూయ, డంబములతో కూడిన అర్జునుణ్ణి, భీముణ్ణి ద్రౌపదియే సరియైన మార్గంలో పెడుతూ వచ్చింది. నిండు సభలో తనకు పరాభవం జరిగినప్పటికీ శాంతమును వహించింది. తన కుమారులను అశ్వత్థామ చంపినప్పుడు ఆ దుఃఖంలో కూడా శాంతమునే వహించింది. అశ్వత్థామను చంపుతానని అర్జునుడు ముందుకు వచ్చినప్పుడు ద్రౌపదియే ఆతనిని శాంతపరచింది. వీరి అందరి మధ్య కృష్ణుడు కూర్చొని నవ్వుతూ ఉన్నాడు. అప్పుడు ద్రౌపది చెప్పింది –
వెరచినవాని దైన్యమున వేదన నొందినవాని నిద్రమై
మరచినవాని సౌఖ్యమున మద్యము ద్రావినవాని భగ్నుడై
పరచినవాని సాధుజన భావమువానిని కావుమం
చఱచినవాని కామినుల చంపుట ధర్మము కాదు అర్జునా!
"ఫల్గుణా! నీవు చాల ఆవేశంతో, ఉద్రేకంతో, క్రోధంలో ఈ పనికి పూనుకుంటున్నావు. క్రోధము మానవునికి చాల ప్రమాదకరమైనది".
కోపము కలిగినవానికి
ఏ పనియు ఫలింపకుండు ఎగ్గులు కలుగున్
పాపపు పనులను చేయుచు
ఛీ పొమ్మనిపించుకొనుట చేకురు సుమీ!
భీముడు కూడా చాల క్రోధంతో నున్నాడు.అప్పుడు అతనికి కూడా బోధించింది.
తన కలిమి భంగపుచ్చును
తనకుం గల గౌరవంబు దగ్ధము సేయున్
తన వారలకెడ సేయును
జనులకు కోపంబు వలన సర్వము చెడున్
ఆశ్వత్థామ ఉపపాండవుల గొంతు కోసినప్పుడు మాతృదేవి అయిన ద్రౌపది ఎంత కఠినమైన భావంలో ఉండాలి. కానీ, ఆమెకు అట్టి కఠిన భావమే లేదు. పరుగెత్తి పోయి ఆశ్వత్థామ పాదాలపై బడి.
ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనిన్ లేరు కిం
చిద్రోహంబును నీకు చేయరు బలో త్సేకంబుతో చీకటిన్
భద్రాకారుల పిన్నపాపల రణప్రౌఢ క్రియా హీనులన్
నిద్రాసక్తుల సంహరింప నకటా నీ చేతు లెట్లాడెనో?
ఆ పసికందులను చంప మీకు మనసెట్లా వచ్చిందని అన్నదేగాని, కఠినమైన వాక్కు ఉపయోగపెట్టలేదు. అంతటి కఠిన పరిస్థితియందు కూడా ఆమె మృదు మధురంగానే మాట్లాడింది. అట్లే, మీ వాక్కు కూడా మధురమైన వాక్కుగా ఉండాలి. అప్పుడే మీరు మానవులనిపించుకో గలరు. ఎప్పుడు ఈ మధురమైన వాక్కు వస్తుంది? దైవ చింతన చేసినప్పుడే మధురమైన వాక్కు వస్తుంది. ఐతే, అప్పుడప్పుడు దుర్బుద్దులతో, దుర్గుణములతో ప్రవర్తించే మానవులలో పరివర్తన తెప్పించడానికి కఠినమైన వాక్కులను ఉపయోగ పెట్ట వలసి వస్తుంది. ఐతే, ఆ వాక్కు కూడా ప్రేమతో కూడినది. పైకి కఠినంగా అనిపిస్తుందిగాని, అది ప్రేమమయమైనదే. వర్షము కురిసే సమయంలో కఠినమైన వడగళ్ళు కూడా పడుతుంటాయి. వర్షబిందువులచేత ప్రమాదం లేదుగాని, వడగళ్ళచేత చాల ప్రమాదముంది. కానీ, వడగళ్లలో ఉన్నది నీరే కదా. అదేవిధంగా, ప్రేమచేతనే కొన్ని సమయాలలో కఠినమైన మాటలను ఉపయోగించవలసి వస్తుంది.
(సా.శు.సా.99 పు.31-33)
ద్రౌపది ఆశ్వత్థామపాదాలపై పడి ఈ రీతిగా పలికింది :
పరగన్ మామగవారలందఱనుమున్
బాణ ప్రయోగోప సం
హరణాద్యా యుధవిద్యలన్నియును
ద్రోణాచార్యు చే నభ్యసిం
చిరి; పుత్రాకృతి నున్న ద్రోణుడవు:
నీ చిత్తంబులో లేశముం
గరుణాసంగము లేక శిష్యసుతులన్
ఖండింపగా బాడియే?
(సా.స.. జా.2001 పు. 167)