Good లోనుంచి ఒక జీరోని తీసివేయండి. ఆ జీరోనే ప్రకృతి. అది పోతే గుడ్ అనేది గాడ్ అవుతుంది. W అనే అక్షరాన్ని డబల్ యు (Double You) అని ఉచ్చరిస్తాము. అదే జీవాత్మ, పరమాత్మ, ఆ రెండింటి ఏకత్వానికి అడ్డు వచ్చేది మాయ. My(నాది) అనే పదాన్ని నాలుగైదు సార్లు ఉచ్చరించండి. అది మాయ అవుతుంది. "నాది" అన్నదే అన్ని దుఃఖాలకు మూలం. ప్రక్కవాని కారుకు ఏమైనా ఫరవాలేదుగాని, ని కారుకు కొద్దిగా దెబ్బ తగిలితే విలవిలలాడిపోతావు. ఎందుకు? "ఆ కారు నాది" అనుకోవడంచేత, ప్రక్కవాడు తన ఇంటిని అమ్మితే నీకేమీ బాధ అనిపించదు. కాని, ని ఇంటిని నీవు అమ్మవలసి వస్తే ఎంతో బాధ పడతావు, ఎందువల్ల? "ఆ ఇల్లు నాది" అనుకోవడంచేత. ఈ "నాది" అనేదే మాయ. అది పోయినప్పుడే ఏకత్వంలోని దివ్యత్వం అనుభవంలోకి వస్తుంది.
(స.సా.జూలై 99 పు.193)
మీకు శక్తి ఆహారం నుండి వస్తుంది. అది తగ్గిస్తే శక్తి తగ్గుతుంది. కానీ, స్వామికి శక్తి ఆహారం నుండి లభించేది కాదు. నేను ఉదయం ఏదీ తీసుకోను. ఒక గ్లాసు నీళ్లు. అంతే! ఉదయం 10 గంటలకు చాల కొద్ది ఆహారం తీసుకుంటాను. పెరుగు, నెయ్యి, స్వీట్లు, ఐస్ క్రీమ్స్, నూనెలు ఏవీ తీసుకోను, పేదవాని ఆహారమైన రాగిసంకటి కొద్దిగా తీసుకుంటాను. సంవత్సరం నుండి మీరు చూస్తూనే ఉన్నారు కదా, సాయంకాలం ఏమీ తీసుకోవడం లేదు. ఎంతో పని. అన్నీ నేనే చూసుకోవాలి. ఇన్ని విద్యాసంస్థలు, హాస్పిటల్స్, వాటర్ ప్రాజెక్ట్. లక్షలాది భక్తులు - అన్ని నేనే స్వయంగా చూసుకుంటాను. నాకు భక్తులకు మధ్య ఎవరూ లేరు. అంతా డైరెక్ట్ - లవ్ టు లవ్, హార్ట్ టు హార్ట్ - అంతే! నేను చేసే పనికి కనీసం 1500 కేలరీలు కూడా లేవు. మరి ఈ శక్తి ఎక్కడిది? ఇది ఆహారం నుండి వచ్చేది కాదు. I do not get energy. I am energy (నాకు శక్తి ఎక్కడి నుండో రాదు, నేనే శక్తిని) నాకు దేహరీత్యా 70 సంవత్సరాలు, చక్కగా చూడగలను. కానీ మీకు 40 సంవత్సరాలు దాటగానే చత్వారం, కళ్ళద్దాలు కావాలి. చాల దూరంగా ఉన్న వాటిని కూడా నేను స్పష్టంగా చూడగలను. చీమ చిటుక్కుమన్నా వినపడుతుంది నాకు. నా పళ్ళు చాల దృడంగా ఉన్నాయి. ఒక్క వెంట్రుక కూడా నెరిసింది లేదు. భక్తులకు అసౌకర్యంగాని, నాకు చాల నడవాలనిపిస్తుంది. నా పనులన్నీ నేను చేసుకుంటాను. భోజన సమయంలో మీరు చేసే ప్రార్థన ఏమిటి? "ఆహం వైశ్వానరో భూత్వా..." అంటారు కదా! మీరు భుజించే ఆహారాన్ని గ్రహించి, జీర్ణం చేసి సర్వాంగాలకు పంపే వైశ్వానరుడు దేవుడే కదా! కనుక, ఇంతమంది. మీరు తింటూండగా నేను ప్రత్యేకించి తీసుకోనక్కరలేదు. దేహరీత్యా ఆలోచిస్తే, మీ ఇంద్రియాలు బలహీన మవటానికి కారణ మేమిటి? ఇంద్రియ దుర్వినియోగం, స్వార్థ స్వప్రయోజన సంకుచితత్వం. నాకు ఆపాద మస్తకం నఖశిఖ పర్యంతం స్వార్థమనేది ఏనాడూ లేనే లేదు. లోక కల్యాణం, మీ ఆధ్యాత్మిక ప్రగతి - ఇవే నా ఆలోచనలో ఉన్నాయి. నాదంటూ ఏమీ లేదు. మీరే నావారు.
(స.సా.జూన్ 99 పు. 165)
విద్యార్థులారా! మీరు పవిత్రమైన భావాలను హృదయంలో నింపుకొని ఈ ప్రపంచంలో వీథి వీథిలోను, వాడ వాడలోను ఆధ్యాత్మిక తత్త్యమును వ్యాప్తి గావించాలి. ఈనాడు
ప్రపంచంలో నిండిన అశాంతిని, భయాన్ని దూరం చేయాలంటే దైవభక్తిని చాటుతూ పోవాలి. ఈనాడు ప్రతి ఒక్కరు డబ్బుకోసం, పేరు ప్రతిష్టలకోసం ప్రాకులాడుతున్నారు. ఇది మంచిది కాదు. Money comes and goes; Morality comes and grows. కనుక మీరు ఉద్యోగాలతోపాటు సమాజసేవ కూడా చేయండి. ఎవరికి సేవ చేసినా దైవానికే చేస్తున్నామని భావించండి. "పరులు పరులు కాదు పరమాత్ము డగునయా!" అందరూ పరమాత్మ స్వరూపాలే అని విశ్వసించాలి. ఎందుకంటే దైవత్వం లేని జీవిత్వం లేదు. అసలు దైవమే లేడని వాదించే నాస్తికులు కూడా ఒక్కొక్కసారి తమకు తెలియకుండానే, "మై గాడ్" అంటారు. ఒకానొక సమయంలో నెహ్రూ మధుర మీనాక్షి ఆలయానికి వెళ్ళాడు. అక్కడ మీనాక్షి విగ్రహం అతి పెద్ద విలువైన పచ్చతో అలంకరింపబడి ఉండినది. అతని వెంట వెళ్ళిన భక్తులంతా ఆ విగ్రహంలో దివ్యత్వాన్ని దర్శించారు. కాని దేవుడంటే నమ్మకంలేని నెహ్రూమాత్రం లౌకిక దృష్టితో, "ఆ పచ్చ విలువ ఎంత? అని అడిగాడు. "దీని విలువ చాల లక్షలుంటుంది" అని ఎవరో జవాబివ్వగా నెహ్రూ వెంటనే "ఒహ్ మై గాడ్" అన్నాడు. ఆసలు గాడ్ అంటేనే నమ్మకం లేని నెహ్రూ నోటి నుండి మైగాడ్ అనే పదం ఎలా వచ్చింది? అనగా అతనియందు కూడా గాడ్ ఉన్నాడు. అట్లే ప్రతి మానవునియందు దివ్యత్వం ఉంటున్నది. న
(స.పా.పి.98పు. 42)
దివ్యత్వము నుండి వచ్చినదే ఈ పవిత్రమైన మానవ జీవితము. ఈ లక్ష్యాన్ని కొంతమంది ఋషులు గుర్తించి దీక్షను బట్టి సాధిస్తూ వచ్చారు. "ఈ దివ్యమైన తేజస్సు మీరు చూడండి. " అని లోకానికి చాటినారు. "అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత:" అతడు ఎట్లా ఉన్నాడంటే, "వేదాహ మేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణ తమసః పరస్తాత్" అని అన్నారు.
అతడు ఎక్కడ ఉన్నాడంటే, తమస్సుకు ఆవల ఉంటున్నాడని, తమస్సు వదిలితేగాని ఈ తేజస్సు మనకు ప్రాప్తించదని, ఋషులు మనకు భోదించారు. తమస్సును దూరం చేయాలి. ఈ దేహము కేవలము తిండి, తీర్థాలకై వచ్చినది కాదు. ఆహార, విద్ర, భయములతో కూడి ఉంచేదే పశుత్వము. దీనికి అతీతమైన గుణము మరియొకటి యున్నది. అదే దివ్యమైన శక్తి, జ్ఞానము: తమస్సు పోతేనేగాని పవిత్రమైన జ్ఞానము కలుగదు, తమస్సు పోయిన తర్వాత రాజసము ఉంటుంది. ఈ రాజసమనేది అనేక కోరికలతో నిండియుంటుంది. ఈ రాజసమును దూరం చేయాలి. అప్పుడు సాత్వికము ఆవిర్భవిస్తుంది. ఈ సాత్వికము ఆవిర్భవించినప్పుడే తేజోమయమైన దివ్యత్వము మనకు కనిపిస్తుంది.
వేదము మహా అగాధమైనది, రహస్యమైనది. శ్రద్ధాభక్తులు కలిగిన వారికి ఇది చాలా సులభమార్గం. కన్నులు తెరచిన వానికి లక్షలమైళ్ళలో అంతరిక్షంలో ఉన్న నక్షత్రాలు కనిపిస్తాయి. కనుక, మనశ్రద్ధ భక్తి అనే నేత్రాలను విప్పాలి. విప్పవలసినవి చర్మచక్షువులు కావు; జ్ఞాన చక్షులు. వాటిని మనము తెరచినప్పుడు దివ్యత్వమైన ప్రకాశం సర్వత్రా మనకు గోచరిస్తుంది..
(శ్రీ భ.ఉ.పు.30/31)
మనము ఆశించేది ఫలపుష్పాలు. అవి వృక్షముపై ఉండు నట్టివి. కనిపించే ఫలపుష్పములు ఆశించే ఫలపుష్పములు కనిపించని వేర్ల పైన ఆధారపడి ఉంటున్నది. మనము వేర్లను పోషించినప్పుడే ఫలపుష్పములు మనకు ప్రాప్తిస్తాయి.
కనుక మనము నీరు ఎరువులు వేసి పోషించవలసినది. వేర్లను మాత్రమే కాని ఫలపుష్పములను కాదు. ఈ జగత్తనే వృక్షమునకు దివ్యత్వమనే ఆత్మతత్వమే. వేర్లు, దీనినే భగవద్గీతయందు "బీజం మాం సర్వ భూతానాం" అన్నాడు. ఎట్లు ఈ బీజము తానౌతాడు? తానే బీజమైన వాడు సర్వులయందు బీజరూపములో ఏ విధముగా ఉంటున్నాడు అనే విషయాన్ని విచారించాలి. ఒక విత్తనము నాటినాము. అది క్రమక్రమేణ మొలకై వృక్షమైంది. అనేక శాఖోపశాఖలు బయల్దేరాయి. ప్రతి శాఖయందు పుష్పములు వికసించాయి. పుష్పములన్నీ కాయలుగా రూపొందాయి. కాయలన్నీ ఫలములుగా మారినాయి. ఒక్కొక్క బీజము పోయి చేరి పోయింది. మనము నాటినది ఒక్క బీజమే, కొన్ని వందల ఫలముల లోపల వందల బీజములు బయల్దేరాయి. అనగా ఏ విత్తనము నాటినామో ఆవిత్తనము యొక్క జాతియే సర్వఫలములలో విత్తనముగా రూపొందిపోయింది. ఇది జగత్తు. ఈ జగత్తు కు బ్రహ్మ ఆత్మనే ఒక బీజము. ఈ విశ్వము ఒక పెద్ద వృక్షము. విశ్వమనే వృక్షమునకే ఒక్కొక్క దేశము ఒక్కొక్క కొమ్మ, ఒక్కొక్క కొమ్మ లోపల అనేక విధములైన జీవరాసులు ఫలములుగా బయల్దేరాయి. ఈ ఒక్కొక్క జీవరాశీయందు ఆత్మ అనే బీజము తిరిగి విత్తనంగా చేరిపోయింది. కనుక ఒక్కొక్క వ్యక్తియందు ఆత్మస్వరూపుడై తానుంటున్నాడు. "ఏకోవశీ సర్వభూతాంతరాత్మ" అందరి యందు ఉండనది నాటిన బీజమే.
(బ్బత్ర.పు. ౧౬౦ )
ఒకేజాతి - అదే మానవ జాతి
ఒకే కులము - అదే ఆధ్యాత్మిక కులము
ఒకే భాష - అదే హృదయ భాష
ఒకే దైవము - అదే నిజమైన దివ్యత్వము.
(భ.స.మ.పు.8)
(చూ:అమోఘుడు, ఆధారము.ఆధ్యాత్మికమార్గము. ఒక్కటే, కర్తవ్యము, గోళ్లస్టేన్, తెలివితేటలు, దైవగుణము, దైవము, ధీరుడు. భగవదన్వేషణ. మనుష్యత్వము, స్వాతంత్ర్యము, హిందువులు)