దేహ భ్రాంతిని వదలటం ఎట్లా? దేహభ్రాంతి అంటే అన్న పానాదులు విసర్జించి, శుష్కించి, అస్థిపంజరంగా మరణించటం కాదు. దేహమే నేననే భావము విసర్జించు. నేను దేహము కాదు. ఇది నా ఉపాధి. దేహేంద్రియ మనోబుద్ధులన్నియు నా ఉపాధులు, నేను ధరించిన డ్రస్సులు, డ్రస్పుల్ని ఏ విధంగా మార్చుకుంటున్నామో, ఏ విధంగా విసర్జిస్తున్నామో అదే విధంగానే ఈ దేహ భ్రాంతిని విసర్జించాలి. ఆకలిదప్పులకు సంబంధించిన ఆహార నియమములు పాటించాలి.
(బృత్ర.పు. 161)
ఆనందమనే నిధికి ఒక భద్రత ఏర్పడింది. దీనిని అహంకారమనే సర్పము సర్వత్రా సంచరిస్తూ నిర్విరామంగా తిరుగుతూ కాపాడుతుంది. దాని దగ్గరకి ఎవ్వరూ పోలేకపోతున్నారు. ఎవడు ఈ ఆహంకారమనే సర్వమును నిర్మూలము గావించునో వానికే ఈ ఆనందమనే నిధి లభ్యమౌతుంది. అహంకారము అజ్ఞానము చేత ఆవరించినట్టిదే. ఈ అహంకారమునకు కారణమేమిటి? ధనమా? బలమా? స్థానమా? అధికారమా? విద్యనా? ఇవి ఏవీ కారణం కాదు. ఇవన్నీ అల్పమైన శక్తులు. దేహ భ్రాంతియే దీనికి మూలకారణము. ఇవన్నీ ఎంత కాలము? అందుకోసమే శంకరాచార్యులు "మాకురుధన జన యౌవనగర్వం హరతిని మేషాత్కాల స్పర్వం" అన్నారు. ఇవి క్షణములో మార్పు చెందుతాయి. ఇవన్ని అనుభవించిన వ్యక్తులు స్థిరంగా ఎక్కడున్నారు? గొప్ప గొప్ప పదవులనంగా ఏలి సిరిసంపదలను అనుభవించి ప్రఖ్యాతిని పొంది, రారాజులుగా చక్రవర్తులుగా ఉండిన వ్యక్తులంతా ఎక్కడున్నారిప్పుడు? వారున్నారా? లేక వారి స్థానము లున్నాయా? వారి ధనముందా? ఏదీ లేదు. ప్రాచీన కాలము నుండి భారత దేశమునందు అనేక మంది అనేక రకములైన సాధనలు సలిపి ఇవన్నియును అనిత్యమని లోకానికి చాటుతూ వచ్చారు. అదే భగవద్గీత కూడను "అనిత్యం అసుఖం లోకం" అని చాటింది.
(బృత్ర.పు. ౧౬౪)
అమితముగా దేహభ్రాంతి పెంచుకోరాదు. ఇదినాది అనే మమత్వము నేను అనే అహంకారము ఈ రెండే సమస్త అనర్థములకు మూలకారణము.
(బ్బ. త్ర..పు. ౪౦)
దేహ భ్రాంతి ఉన్నంతవరకు దైవ భ్రాంతి అభివృద్ధికాదు. ఇదీ భ్రాంతే ఆదీ భ్రాంతే. దేహ భ్రాంతి ఉన్నంతవరకు బ్రహ్మ ప్రాప్తించదు. దేహ భ్రాంతిని క్రమ క్రమేణా తగ్గించుకొంటూ రావాలి. దైవముపై వ్యామోహం పెంచుకొంటూ పోవాలి. సమస్త ప్రేమను భగవంతునికే అంకితము చేయాలి.
త్వమేవ మాతా చ పితా త్వమేవ
త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ
త్వమేవ సర్వం మను దేవ దేవ.
ఎప్పుడు ఈ తత్వాన్ని అభివృద్ధి గావించుకొని దృఢమైన నిర్ణయము చేసుకొంటామో అప్పుడే అనుకున్న ఆనందము లభ్యమవుతంది. మనసు నిండా ఏవో సందేహాలు పెట్టుకొని జీవితాన్ని వ్యర్థము చేసుకొంటూ చిక్కిన దానిని కూడా దక్కించుకోలేక పోతున్నారు. చిక్కిన దానిని అనుభవించడానికి తగిన కృషి చేయాలి. విరోధులను కూడా ప్రేమించిన తగిన మార్గములలో వారిని మార్చుకోవటానికి వీలవుతుంది. ప్రేమ సమత్వాన్ని సమైక్యతనూ సాధిస్తుంది.
(స. సా.. జ.87 పు 29/30)
(చూ ఆత్మభ్రాంతి)