ప్రకృతిని పరమాత్మభావంతో దర్శించాలి. అప్పుడే "సర్వం విష్ణుమయం జగత్" అనే సత్యం గోచరిస్తుంది. యోగి, భోగి, విరాగి, బైరాగి వీరందరియందున్న ఆత్మతత్త్వం ఒక్కటే. ఆస్తిక, నాస్తిక, యాస్తిక-నాస్తికులందు ఉన్నది కూడా దైవత్వమే. అన్ని జీవులయందు, అన్ని రూపములందు ఉన్న ఆత్మతత్త్యమే దైవత్వము. అట్టిదైవత్వాన్ని ఒక రూపానికి, ఒక నామానికి పరిమితం చేయడం భ్రాంతియే. మీరు చూసేది, వినేది, అనుభవించే దంతా దైవత్వంగానే విశ్వసించాలి. అయితే కష్టములు, దుఃఖములు, విచారములు కూడా దైవస్వరూపములేనా అని మీరు ప్రశ్నించవచ్చు. అవును, అవి కూడా దైవ స్వరూపములే. ఒక చిన్న ఉదాహరణ: శ్రీమన్నారాయణుడు హిరణ్యకశిపుని పాలిట యముడయ్యాడు. అతని కుమారుడైన ప్రహ్లాదుని పాలిట దేవుడయ్యాడు. యముడూ తానే, దేవుడు తానే. ఈ రెండూ దైవ స్వరూపములే.
(స.పా.డి.99పు.347/348)
ఒకే చైతన్యము భిన్నభిన్నముగా వివిధ రీతుల వ్యక్తమగుటచే వ్యష్టిగాను, వ్యష్టులసమూహమే సమిష్టిగాను ఎన్నబడును. బ్రహ్మచైతన్యమునందే వ్యష్టి కల్పనమగుటచే ఆ బ్రహ్మ చైతన్యమే, త్రాటియందు పాముతోచురీతి, ఎండమావుల యందు నీరు తోచురీతి. దేహత్రయయుముగా తోచునుగాని, ఆ దేహత్రయభావము బ్రహ్మవిదునకు మిధ్యయే. అజ్ఞాని, ఈ భ్రాంతిదశలో కన్పట్టు సంసారమే శాశ్వతమైనట్టును. సుఖప్రదమైనట్లును మోహము చెందును. దీని కాధారభూతమైన బ్రహ్మమునే మిథ్య అనును.
(ప్ర.వా.పు.78)
ఇది భ్రమ. త్రాడును చూచి పామను కోవటము. పామును చూచి త్రాడునుకోవటము. నిత్యమును చూచి అనిత్యముగా భావించటము. అనిత్యమును చూచి నిత్యముగా విశ్వసించటము. ఈ విధమైన భ్రమలో రెండవదోషము ప్రమాదము సంభవిస్తుండాది. త్రాడును కొని పామును పట్టుకొంటే ప్రమాదముకాక మరి ఏమవుతుంది? ఈనాటి మానవుడు దేహము సత్యమని విశ్వసిస్తున్నాడు. ఇది ఒక నీటి బుడగ వంటిది. ఎప్పుడో ఎక్కడో ఏరకముగానో పగిలిపోతుంది. దేహము సత్యమనుకొని ఆదేహమును సరైనరీతిలో వినియోగించే ఆసక్తి విస్మరిస్తున్నాము.
ఆదివ్యమైన శరీరములో ఉండినంతవరకును అనేక రకములైన పనులు ఆచరిస్తుంటాయి. ఈ శరీరము సత్యమని మనము భ్రమించి ప్రమాదమునకు గురియై పోతున్నాము. నమ్మదగినవారిని నమ్మకుండా నమ్మరాని వారిని నమ్ముతున్నాము. నాది, నావారు అనుకున్నవారంతా ఎంతకాలముండగలరు? ఎవరికి ఎవరు? మిధ్యను సత్యమనుకుంటున్నాము.
(బృత్ర, పు.87)
(చూ॥ అష్టాగయోగములు, దేహభ్రాంతి)