పసిపిల్లవానికి తన నాలుక తనకు వుంది. అలాగే తల్లికి, తల్లి తొడమీద కూర్చోపెట్టుకొని బిడ్డకు మాటలు ఉచ్చరిస్తూ, మాటలు నేర్పుతుంది. తల్లి నాలుక ఎంత తీరిక లేనిదైనా. బిడ్డ తన నాలుకతోనే మాట్లాడ్డం నేర్చుకోవాలి. బిడ్డ బదులు తల్లి మాట్లాడ లేదు. తన భాధ్యత నుండి తప్పించుకోలేదు! గురువు కూడా అటు వంటివాడే! తను పునరుచ్ఛారణ చేస్తూ, జ్ఞాపకం చేస్తూ, ఉత్తేజాన్ని కలిగిస్తూ, నచ్చజెపుతూ, బోదిస్తుంటాడు. కానిశిష్యుడే ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించాలి. అతడే ఆ ఘంటాన్ని చేపట్టాలి. ఆ విధి నిర్వహణలో ఇతరులెవరు తనని పై కెత్తలేరు.
(ప.స.పు. 149)
గురువు చెంత చేరినతోడనే అతని అవసరములను పట్టిజ్ఞానచింత సహితము మాని గురువు చిత్తమును రంజింపజేయు శుశ్రూష సలుపుతూ ఆజ్ఞలయందు మమకారమును వీడి శిరసావహించును. గురు కార్యము తప్ప మరే ఇతర చింతనలూ లేక సర్వమూ గురు కటాక్షమునకు వదలినవానికి జ్ఞానము త్వరగా లభించును. కానీ, అట్లుగాక గురువుపై ఆవిధేయుడై మమకార, అభిమాన, అహంకారములతో అలక్ష్యముతో, అవిశ్వాసముతో గురువునే పరీక్షింప చూచిన తత్త్వజ్ఞాన దేవత అనుగ్రహమునకు బదులు ఆగ్రహ ప్రసాదమును అందుకొనవలసి వచ్చును.
“దూడను చూచినతోడనే ఆవు చేపుచున్నట్లు శిష్యుణ్ణి చూచిన తక్షణమే గురువు యొక్క అనుగ్రహ మను క్షీరమును అందించునట్లు చేసుకొనవలెను. శిష్యుడు నువినీతుడై ఉండవలెను. అట్లుండిన శుభ్రమయిన ఇనుమును ఆయస్కాంతము ఆకర్షించినట్లు శిష్యుణ్ణి గురువు అనుగ్రహించుము.
(గీ.పు.87/88)
తన తప్పును తాను తెలిసి కొనుటే, శిష్యునికి ప్రథమ సుగుణము. మానవుని మూఢత్వము అన్నియూ తనకు తెలుసుననుఅహంకారమును పెంచును.
శిష్యుడు తనలోని మంచి గుణములను వెతుకుటకంటే తనలోని దోషాలను వెతికి తీసివేయుట చాలా మంచిది. అట్టివాడు త్వరలో ముందుకు రాగలడు. అట్టి స్థితి కలవాడే సర్వమూ భగవత్ శక్తిపై భారము వేసి నిర్భయముగా నుండగలడు. నిశ్చింతగా నిలువగలడు. అదే వాని ధన్యతకు తగిన గుర్తు.
(గీ.పు.17/18)
(చూ|| గురువులు, శంకరాచార్యులు)