శాంతి

ఒక పర్యాయం ఏవరో ఒక భక్తుడు వచ్చి "స్వామీ! I want peace (నాకు శాంతి కావాలి?" అన్నాడు. నేను చెప్పాను. I, want రెండింటినీ త్యజిస్తే peace అక్కడే వుంటుంది." అనగా, అహంకారాన్ని, కోరికలను త్యజించినప్పుడే శాంతి లభిస్తుంది. ఆహంకారాన్ని త్యజించడం చాల కష్టమనిమీరు భావిస్తున్నారు. ఇది చాల పొరపాటు. అహంకారాన్ని త్యజించడం చాల సులభం. మొట్టమొదట I ( నేను ) అంటే ఏమిటో గుర్తించాలి. మీరు తల్లిదండ్రులు పెట్టిన పేరునే శాశ్వతంగా తీసుకొని పుట్టిన పేరును విస్మరిస్తున్నారు. I ("నేను") అనేదే పుట్టిన పేరు. దానినే మీరు శాశ్వతంగా తీసుకోవాలి. పెట్టిన పేరు ఏనాటికైనా మార్పు చెందుతుంది. దేహంతోపాటు ఆ పేరు కూడా పోతుంది.

(ఆ.భా.పు.33)

 

శాంతిమనయందే ఉంటున్నది. శాంతి ఏ స్వరూపమే. అట్టి శాంతిని పొందడానికి బయట ప్రపంచంలో వెదకనక్కరలేదు. బయట వెదికేవన్నీ కూడనూ ఆశాంతికి లక్షణాలే. ఈ ప్రాకృత జగత్తులో కనిపించేటటువంటి సమస్తములూ అనిత్యములే.. |

(శ్రీ ఆ2000 పు.9)

 

సైంటిస్టులు భౌతికమైన ఆనుకూలాలను ఏర్పరుస్తున్నారు. కానీ తాత్కాలికమైన ఆనందాన్ని అందిస్తున్నాయి. మనము తాత్కాలిక సుఖములను అనుభవిస్తన్నాం గాని శాంతికి దూరమై పోతున్నాము. తాత్కాలిక మైన అనుకూలాలు ఎంత సుఖాన్ని అందిస్తున్నాయో అంత కష్టాన్ని కూడా అందిస్తున్నాయి.

 

మనము ఏమి చేస్తున్నాం? ఎక్కడికి వెళ్ళుతున్నాం? Nuclear bombs, hydrogen bombs, atom bombs చేస్తున్నాం.

హస్తమున అణుబాంబు ఉంచుకొని " శాంతి శాంతి" అని పలుకుచుందురు.

చంద్రు చేరగలిగి కూడను, చెందజాలము శాంతి సుఖములు".

 

చంద్రుడు దేహానికి చల్లదనాన్ని అందిస్తున్నాడు గానీ, మెదడుకు చల్లదనాన్ని అందించడం లేదు. రోజంతా మెదడు వేడెక్కి వుంది. ఎప్పుడు ఆక్సిజన్ fail అవుతుందో, ఎప్పుడు హైడ్రోజిన్ fail అవుతుందో ఏమోనని భయముగా ఉంటుంది. Air Conditioned room లో కూర్చున్నాం. Body చల్ల బడుతుంది. శాంతిలేనివాని మెదడు వేడెక్కుతుంది. మనస్సు శాంతిగా ఉండినప్పుడు అడవిలో ఉన్నా picnic అని ఆనందిస్తాడు. కనుక, ఈనాడు Science మనను మానసిక శాంతి నుండి దూరముగా తీసికొని పోవుచున్నది. కృత్రిమమైన జీవితాన్ని ఈనాటి Scientist గడుపుతున్నాడు. నిరంతరమూ చింతనే చింతనే ఈ mind కు rest లేదు.

 

ఈనాడు మానవుల రోగాలకు మానసిక విశ్రాంతి లేకపోవటమే మూలకారణము. దీని వల్ల రోగాలు అధికమై పోతున్నాయి. ఎప్పుడు చూచినా thinking thinking! దానివలన mind శ్రమిస్తున్నది. జడమైన machine కు కూడా rest ఇస్తున్నాం . కానీ మెదడుకు rest: ఇవ్వనక్కర లేదా? ఎక్కువ తెలివి తేటలున్నవాని mind, devils workshop అన్నారు. ఈ devil s workshopకు ఏమిశాంతి ఉంటుంది? వ్యక్తిగతశాంతి, సామాజిక శాంతి, దేశ శాంతి మనకు ఒక్క ఆధ్యాత్మిక మార్గములో తప్ప అన్యమార్గములోరాదు. ఈ తత్వాన్ని మనము చక్కగా గుర్తించుకొని, భౌతికసుఖాల కోసం పోరాడకుండా, మానసిక శాంతికై మనము పాడుపడాలి.

భౌతిక సుఖాలు కొంతవరకు ఉండవలసినదే, కాని అవి natural సుఖాలుగా ఉండాలి. ఈ natural సుఖములోనే సరియైన ఆనందం మనకు లభిస్తుంది.

(స.సా.జూలై 1988పు 144/145)

 

చిత్తము యొక్క నిశ్చలత్వమునకే మరొక పేరు శాంతి. ఈ శాంతి ఆత్మ స్వరూపమే. శాంతిపవిత్రమైన సుగుణము. ఇది దివ్యమానవునకు ఆభరణము.

 

దుస్సంగమనేది దుష్టసంబంధమైనట్టి వ్యక్తులలో సంబంధించినది మాత్రమే కాదు, దుష్టభావములను చేర్చుకోవటం కూడా దుష్టసంగమే. అహంకారము, ఆడంబరము, అసూయ. అసత్యము యిత్యాది దుష్టభావములను హృదయములో చేర్చుకొనుటకు విద్యార్థులు ఏమాత్రమూ ప్రయత్నించ కూడదు. దుష్టభావములే మానవునికి ప్రధానమైన శత్రువులు. ఈశత్రుత్వమును పూర్తిగా నిర్మూలం గావించుకొన్నప్పుడే మానవత్వం రాణిస్తుంది. కనుకనే శత్రుశేషము,అగ్ని శేషము, ఋణశేషము, రోగిశేషము లేకుండా చూసుకోమని చెప్పింది వేదాంతము. ఋణమంతా తీరినప్పటికీ యింకా ఏ కొద్ది మాత్రమే వుండినప్పుడు క్రమక్రమేణా యిది వడ్డీ రూపమున పెరిగి తిరిగి స్వస్థానమును చేరుతుంది. కనుక, అప్పు తీర్చుకోనే సమయములో దానిని పూర్తిగా తీర్చుకోవాలి. ఏమాత్రమూ శేషముంచుకొనకూడదు. రోగ నివారణ కోసమై హాస్పిటలులో ఉండి ఔషదములు సేవించి గృహమునకు వచ్చిన తరువాత అపత్యము చేసి అలక్ష్యము చేస్తే తిరిగి రోగము ప్రారంభం కావచ్చు. పరిపూర్ణ ఆరోగ్యము పొందిన తరువాతనే గృహమును చేరాలి మానవుడు. ఆగ్ని అంతా చల్లారిన తరువాత ఏ కించిత్ మిగిలి ఉన్నప్పటికీ గాలివీచి అది మరల ప్రజ్వలింపవచ్చును. కనుక అగ్నిశేషము కూడను ఉండకూడదు. నాల్గవది శత్రుశేషము. ఈ శత్రుత్వమనేది పూర్తిగా నిర్మూలనము గావించబడినప్పుడే మానవునికి శాంతి చేకూరుతుంది.

 

శాంతి అనగా ఏమిటి? మూలాధారమైన సత్వరజస్తమో గుణములు అణిగినప్పుడే మనలో శాంతి ఆవిర్భవిస్తుంది. ఈ మూడుగుణముల పైన విరక్తి ఉపేక్ష, అనాసక్తి ఈ మూడింటిని మనము పెంచుకోవటానికి ప్రయత్నించాలి.

(స.ది.పు 93/95)

 

మనలో మానవతా విలువలను పెంచుకోవాలి.

Values for Education

Education for Life

Life for Love

Love for Man

Man for Service

Service for Society

Society for Science

Science for Nation

Nation for World

World for Peace

కనుక, మొట్టమొదట మానవతా విలువలనేవి పెట్టుకున్నప్పుడే మనకు శాంతి అనేది లభిస్తుంది.విలువలు లేకపోతే Peace (శాంతి) ఉండదు; అంతా Pieces (ముక్కలు)! ఈ మానవతా విలువలను విద్యార్థులు పెంచుకుని దేశాన్ని నిత్య కల్యాణం, పచ్చతోరణంగా తీర్చి దిద్దాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.

(స.పా.డి.95 పు.333)

 

ప్రేమ అను కట్టెలనుండి పుట్టే దివ్యజ్యోతే శాంతి, మానవ ఐకమత్యము, ఆధ్యాత్మిక తెలివి ఈ రెండు లోకశాంతికి ముఖ్యముగా ఉండవలెను. జీవితమునకు ఆత్మసాధన పునాది అయి వుండవలెను. అప్పుడే మానవుడు శాశ్వతమైన శాంతిని పొందగలడు. శాంతములేక సౌఖ్యము అనుభవించలేడు. శాంతి, ఇది ఆత్మ యొక్క స్వభావము. పేరాశగల మానవునియందు శాంతి ఉండనే ఉండదు. శాంతి పవిత్ర హృదయములోనే వుండును. శాంతి యోగీశ్వరులకు, ఋషులకు, సత్పురుషులకు ఆలంకారము. వాస్తవమైన అంతర్శాంతి బాహ్యస్థితి మీద ఆధారపడదు. ఇది స్వార్థపరుల దగ్గరనుండి, కామతృష్ణగలవారినుండి విడిచి పారిపోవును. వారిచెంత వుండ ఇష్టపడదు. అంతరాత్మ యొక్క అద్భుత కరమైన అచంచలమే వాస్తవమైన శాశ్వత ప్రశాంతి. అసమ్మతము లేని దానిని శాంతి అనుకొందురు. ఆధ్యాత్మిక ఔన్నత్యము, ఆనందము సహజమైన తెలివి కూడా శాంతిలో యిమిడి యున్నది. నిజశాంతి చిత్త వృత్తులను అరికట్టుటవల్ల లభించును. అదే ప్రశాంతి. ఆ ప్రశాంతి యొక్క అనుభవమే ప్రశాంత వాహినిగా పారుచుండును. పెద్ద అలలవలె పైకి క్రిందికి కదలించే మనోవికారమును వశపరచుకొంటే, ఎగిరి ఎగిరిపడే యిష్ట-అయిష్టము ప్రేమ-ద్వేషము, సుఖము-బాధ, ఉల్లాసము ఆధైర్యములను జయిస్తే శాంతి స్థిరముగా మీసొత్తుగానే నిల్చును. శాంతి ఆత్మ స్వరూపము. ఆత్మ ప్రతి వస్తువునందు ఉన్నది. శరీర మనసులు రెండును చచ్చేవే. ఈ రెండును మిశ్రమ పదార్థములు, ఆత్మ చిరంజీవి; సర్వత్రా వ్యాపించినది. అతి సూక్ష్మమైనది కాబట్టి ఆత్మ, తెలివిద్వారా తెలిసికొనేవస్తువుకాదు. ఆత్మ తెలివికి ఉత్పత్తి స్థానము. పరిపక్వము, స్వేచ్ఛ, చిరంజీవత్వము, శాశ్వత పరమానందము, శాశ్వత శాంతి వీటిని పొందుటకు ఏదైతే దారి చూపుచున్నదో, అదియే జ్ఞానము, ఇంద్రియలోలత్వము కలవాడు ఆత్మను పొందలేడు. మార్పుగల వస్తువులలో శాశ్వతమైన దేదో అదే బ్రహ్మము. బయట సంభవించే మార్పులవల్ల ఆత్మయొక్క తేజస్సు మలినముకాదు. శరీరము ఆత్మకాదు. ఆత్మ ఏదియూ కాదు. ఆత్మ-ఆత్మనే. బ్రహ్మనే సత్య ప్రేమ, వెలుతురు; మూర్తీభవించిన శాంతి జ్ఞానము, పరమానందము అయివున్నది. పైమార్గాలలో ఏ ఒకటియందు మీరు సాధించిన నూ బ్రహ్మను పొందవచ్చును, సత్యము.

(ప్ర.వా.పు.3/4)

 

శాంతితో ధర్మముతో ద్రౌపది ఎట్లు భగవద్రక్షణకు అర్హురాలాయ్యెనో సాధకులకు తెలిసిన విషయమే. తన భర్తలు శూరులు, వీరులు, ధర్మపరాయణులు. రాజాధి రాజులుగా వుండియు. అట్టి ఆపత్సమయమున యెవ్వరూ రక్షించలేరనియు, ఎందరుండి ఏమి ఉపయోగమనియు, కృష్ణా సర్వస్వము నీవే అని కృష్ణుని శరణువేడినది. కాని ప్రహ్లాదుడు అట్లు ఆపత్సమయమున శరణు వేడలేదు. పుట్టుకతో సర్వము పరమాత్మార్పితమనియు పరమాత్మ ఎల్లప్పుడు తనవెంటనే తాను పరమాత్మ వెంటనే ఉన్నానని తలంచుటవల్ల ఏ ఆపద సమయమందుకాని హరీ, రక్షింపు అని ప్రార్థించలేదు. శిక్షణే అతనికి తెలియనపుడు రక్షణ తానెట్లు కోరును?ఇట్లు సంపూర్ణ ప్రేమోన్మత్తులైన వారలకు, సంపూర్ణ శరణుజొచ్చినవారలకు ప్రార్థన అవసరముండదు. కాని ఆ స్థానమునకు వచ్చునంతవరకు సాధకులకు శాంతిపూర్వకమైన ప్రార్థన అవసరము. అట్టి శాంతి ప్రార్థనే సమరసమును సాధించును. ఇట్లు శాంతి అనేక విషయములందు అండగా నుండును. పరమాత్ముని కీర్తనలతో, జపములతో, ధ్యానములతో, భజనలతో ప్రార్థించవచ్చును. అన్నిటియందు పరమాత్మనామమే ప్రధానముగా నుండును. అందుకనే కృష్ణుడు కూడ గీతలోజపయజ్ఞము అనిరి. జపములు కేవలము మానసికమేకాక పైకికూడఉచ్చరించుట మరింత మంచిది. అట్టి రెండూ చేరిన జపమునే భజన అందురు. అట్టి భజనలవల్ల జనసమూహమునకు, ఆవేశము కలుగును. సంకీర్తనకూడా శ్రావ్యమైన ధ్వనులతో భక్తులు భజనలు సల్పిన, భగవంతునియందు ఒక విధమైన ప్రేమ ఉత్పత్తి అగుచున్నది. అపుడు తన అనుగ్రహము కూడా భక్తులపై ప్రసరించును. అంత వరకు వేచియుండవలెను. తొందరపడిన అనుగ్రహము సహితము చిక్కదు, రాదు. శాంతిఓపికే అట్టి ఫలసిద్ధికి కూడ ప్రధానగుణము. సాధకుడు ఈ బోధను దినవారీ క్రమశిక్షణలో, స్వస్తి శాంతిత మంత్రములలో చేర్చుకొనవలెను.

(ప్ర.వాపు. 18/19)

 

మానవుడు అశాంతి స్వరూపుడు. అసత్యస్వరూపుడనిమీరంతా అనుకుంటున్నారు. అటువంటి భ్రాంతిని పూర్తిగా వదలండి. మానవుడు శాంతి స్వరూపడని గ్రహించండి. ప్రేమయే వారి రక్తనాళాలలో ప్రవహించు చున్నది. మానవుని నిజస్వరూపం ఆనందము. దీనిని మీరంతా సాధన వలన, అనుభవమువలన తెలుసుకోవాలి. మానవుడు విచారముగా యుంటే, ఎందుకు అట్లావున్నావని ప్రశ్నిస్తాము. అతడు సంతోషముగా యుంటే, నీవు ఎందుకు బాధపడవు అని అడగము. ఎందుచేత?విచారము మానవునకు అన్యభావితము. నిజస్వరూపానికి వ్యతిరేకము కనుక మానవుడు దైవ స్వరూపుడని నే చెపుతున్నాము. వినండి మానవుడు ఈలోకానికి వచ్చింది ఒక పవిత్ర కార్యము చేసేటందులకే తన దైవత్వాన్ని తెలుసుకునేటందులకే. ఆజన్మహక్కును అనుభవించాలి. అదియే శాంతి. అశాంతి అతని స్వాభావిక విరుద్ధము. అతని స్వభావము కాదు. మానవుని నిజస్వరూపము శాంతి.

(సా.పు.327)

 

"స్వామీ! నాకు శాంతి కావా"లంటారు. I want peace అంటారు I = అహంకారము want - కోరిక. ఈ రెండు వదలి పెట్టితే మిగిలేది శాంతియే.

(సా.పు.78)

 

మనకు నమ్మక మున్నచోటనే ప్రేమ!

మనకు ప్రేమ వున్నచోటనే శాంతి!

ఎక్కడశాంతి యుండునో అక్కడ సత్యం!

ఎక్కడ సత్య ముండునో అక్కడ ఆనందము:

(సా.పు.83)

 

మనస్సులో ధార్మిక చింతన ఉంటే, శీలంలో సౌందర్యం ఉంటుంది. శీలంలో సౌందర్యం ఉంటే, గృహంలో అన్యోన్యత ఉంటుంది. ఇంటిలో అన్యోన్యత ఉంటే, దేశంలో క్రమశిక్షణ ఉంటుంది. దేశంలో క్రమశిక్షణ ఉంటే, ప్రపంచంలో శాంతి ఉంటుంది. (స.సా.న.2019పు.7)

 

(చూ|| అద్వైత దర్శనము, ఆలవర్చుకోవాలి. అష్టవిధ పుష్పములు, ఓటమి, తిరువళ్ళువారు, దర్శనము, దైవానుగ్రహము, ద్రౌపది, నరుడు, నియమబద్ధ జీవితం, నోరు, పానీయం, ప్రశాంతి. ప్రేమ, భక్తుని లక్షణము, లోకాస్సమాస్తాసుఖినో భవంతు, శాంతి,శాంతి పుష్పము)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage