శాంతము

శాంతతుల్యం తపోనాస్తి న సంతోషాత్పరం సుఖమ్

నతృష్ణయా పరో వ్యాధి నచధర్మో దయాసమమ్

 

శాంతమునకు మించిన తపస్సు మరొకటిలేదు. తపస్సనగా ఏమిటి? నిర్జనారణ్యములో వెళ్లి నిర్మానుష్యమైన ప్రదేశములో ఏకాంతముగా దైవాన్ని ధ్యానించటము తపస్సు ని భావిస్తున్నారు. ఇది కాదు తపస్సు ఇది కేవలము లౌకికమైన, భౌతికమైన, ప్రాపంచికమైన వృత్తిగా దీన్ని భావిస్తున్నారు. మనోవాక్కాయములను ఏకపరచి, త్రికరణ శుద్ధితో భగవంతుని స్మరించి, ఏకత్వమును పొందటమే నిజమైన తపస్సు. మనోవాక్కాయములను ఏకపరచటమే దివ్యమైన భావములో భగవంతుని తపించటమే నిజమైన తపస్సు. ఈ తపస్సు శాంతి నిమిత్తమై చేస్తున్నారు. కానీ శాంతి మన హృదయ స్థాయి నుండి ఆవిర్భవించినప్పుడు ఇంక తపస్సు ఎందులకు? శాంతి మనయందే ఉన్నది గానీ బయటి ప్రపంచమందు లేదు. ప్రపంచములో శాంతి, శాంతి, శాంతి యని అరుస్తున్నారు. కానీ అట్టి శాంతి తన యందే ఉండి బయట ప్రపంచములో వెతకటము ఎంత అజ్ఞానము. బహిర్ దృష్టిని అంతర్ దృష్టిగా మార్చు కున్నప్పుడే ఈ శాంతి మనకు లభ్యమవుతుంది. ఇట్టి ఆంతర్ శాంతిని మనం అనుభవించిన తరువాత యింక తపస్సు ఎందుకు? ఈ శాంతికి మించిన తపస్సు మరొకటి లేదు.

 

నసంతోషాత్ పరంసుఖం - సంతోషము కంటే మించిన సుఖము మరొకటి లేదు. సర్వ సుఖములుండి సంతోషములేని వ్యక్తులు ఎంతమంది మనకు ఈ జగత్తులో కనిపించటం లేదు. ధృతరాష్ట్రుడు హంస తూలికాపాన్పు పైన పవళించి నూరుమంది పుత్రులు కలిగి, సకల సౌభాగ్యములతో తులతూగుచు ఎన్ని సుఖము లుండినప్పటికిని శాంతి ఏ మాత్రము కలుగలేదు. మనము సుఖమనేదే అనుకూల భావమని అనుకుంటున్నాము. సంతోషము భౌతిక జగత్తులో మనకు కానరాదు. ఒకవేళ సంతోషము తాత్కాలికముగా మనకు ప్రాప్తించినా యిది శాశ్వత సంతోషము కాదు. నిజమైన సంతోషము మన హృదయమునందే ఉంటున్నది. అట్టి సంతోషముపొందటము కంటె మరొక సుఖము మనకెందుకు. ఈ విధమైన సంతోషమును ప్రతి మానవుడు ఆశించాలి. ఈ సంతోషము ప్రతిమానవుని యందు శాశ్వతముగా ఉన్నది.

 

నతృష్ణయా పరోవ్యాధి: వాంఛలు, కోరికలు అభీష్టములు ఇవియే మానవునికి తీరని వ్యాధులు. తన అభీష్టములు నెరవేరెనా కొంత సుఖము పొందుతాడు. నెరవేరకపోయెనా మానసిక వ్యాధి పొందుతాడు. తృష్ణ కంటే మించిన రోగము ఈ జగత్తులో మరొకటి కనిపించటం లేదు. అన్ని రోగములకు ఔషదములు కని పెడుతున్నారుగానీ ఈ వాంఛలకు ఔషధము కనిపెట్టేవారు లేరు. మొట్టమొదట ఔషదము ఎక్కడ ఉంటున్నది? తృష్ణను తగ్గించుకున్నప్పుడే మనకు రోగము నివారణ కాగలదు.

 

మొన్న చెప్పినట్టుగా దేహ సంబంధమైన వ్యాధులకంటే మనస్సుతో వచ్చే వ్యాధులే అధికంగా ఉంటున్నాయి. నచ ధర్మోదయాసమం: దయకంటే మించిన ధర్మము ఎక్కడుంది? కారణమేమనగా "దయగల హృదయమే దైవ మందిరము". అట్టి హృదయము మనయందు పరిపూర్ణమైన దయగా ఉండినప్పుడు ఇంక దానధర్మములు ఏమిటి? అన్ని ధర్మములు దయను పెంపొందించుకునే నిమిత్తమై చేసే సత్కర్మలే. వీటిని దయా స్వరూపముగాభావించినప్పుడు ఇంక ధర్మము చేయవలసిన అవసరము ఏమిటి? కనుక మానవుడు ఆశించే సమస్త వాంఛలు, సమస్త సుఖములు, సమస్త తపస్సులు, సమస్త శాంతములు తనయందే ఉంటున్నవి. బయట ప్రపంచమందు లేవు.

(ద.స.. స. పు.80/82)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage