రక్తము మాంసశల్యముల రాశియు దేహము. మీరు కాదు సువ్యక్తము కాని కోరికలు వ్యక్త మనస్సును మీరు కాదు ఆ ముక్తికి భంగకారియగు మోహపు బ్రాంతియు మీరు కారు. మీ
శక్తిని మీరెరుంగగల శాశ్వతుడే పరమాత్మ మీరెగా.
దేహము ఇంద్రియములు మనస్సు బుద్ది యీ నాలుగు మానవుడు ధరించిన ఉపాధులు మాత్రమే. ధరించిన పదార్థముల రహస్యమును గుర్తించినప్పుడే ఆ పదార్ధములను సరియైన స్థితిలో మనము ఉపయోగించుకోవచ్చును..... –
ఏ విధముగా దీనిని అనుభవించాలి? ఏ విధముగా దీనిని వినియోగించాలి? అనే విషయమును మొట్టమొదట గుర్తించినప్పుడే యీ దేహము సద్వినియోగమవుతుంది. “దహ్యతే ఇతి దేహ:" అని దీని వుత్పత్తి, అనగా దహింపబడేది యీ దేహము అని. మరణించిన తరువాత దహింపబడుటము అందరికి తెలుసు.అట్లు కాక జీవిత సమయమునందే యిది దహింప బడుతున్నది. చింతలచేత యీ దేహము దహింప బడుతున్నది. ఇది జడస్వరూపమైనట్టిది. మాలిన్యముతో కూడినట్టిది.
మలినపు కొంప రోగముల మ్రగ్గెడు సేవకగంప జాతసం
చలనము పొందు దుంప భవసాగరమీదగలేని కంప అం
బుల పొది లెమ్ము చూడ మనమెప్పు దలంపగ దేహ మింకని
శ్చలమని నమ్మబోకు మనసా హరిపాదము లాశ్రయింపవే.
"దేహము పాంచ భౌతికము దేహము కూలక తప్పదెప్పుడున్
దేహి నిరామయుండు గణుతింపగ దేహికి చావుపుట్టుకల్
మోహనిబంధనల ముద్రలు లేవు నిజంబు జూడ నా
దేహియె దేవదేవుడుమదిన్ దలపోయగ నాత్మరూపుడౌ! ||
ఆదేవ దేవుడైన మీరు ధరించినదేయీ దేహము ధరించిన దేహము వరించ వచ్చు. అనుభవించవచ్చు కాని ఏ విధముగా వరించాలి? ఏ విధముగా అనుభవించాలి అనే విచక్షణజ్ఞానముతో దీనిని పొందాలి. దీనికి మరొక పేరు శరీరము అని. దీని వుత్పత్తి శీర్యతే ఇతి శరీరః" అనగా జీర్ణించునది, క్షీణించునది యీ శరీరము. ఇది పుట్టినప్పుడు రక్తపు ముద్దగా ఉంటుంది. కోమలత్వముతొ ఆకర్షింపచేస్తుంది. క్రమక్రమేణా యిది యౌవనములో ప్రవేశిస్తుంది. అందానందములచేత అహంకారమును ప్రకటిస్తుంది. తదుపరి వృద్ధాప్యములో ప్రవేశిస్తుంది. వికారత్వాన్ని పొందుతుంది.
ఈ శరీరమునకు మూడవ పేరు మందిరము అని.ఈ మందిరము దేని నిమిత్తమై ఏర్పడినది? ”దేహోదేవాలయ ప్రోక్తో జీవోదేవ స్సనాతనః" దేవుడైన జీవునకు ఈ దేహము ఒక మందిరముగా నిర్మించబడినది. మందిరమును ఏ విధముగా ఉపయోగించాలి? ఇది పవిత్రమైన దివ్యమైన భగవంతుని నిలయము. భగవంతుని నిలయమైన దేహమును దుర్వినియోగపరచుటకు ఏ మాత్రము వీలుకాదు. సక్రమమైన మార్గములో పవిత్రమైన మార్గములో వినియోగించాలి. సత్కర్మలు, సదాచారములు సచ్చింతనలు సలిపే నిమిత్తమై ఏర్పడినదే యీ దేహము. "శరీర మాద్యం ఖలు ధర్మసాధనం", ధర్మాచరణ నిమిత్తమై ఏర్పడినదే యీ దేహము. ఈ దేహమును సరియైన స్థితిలో ఉంచుకోవాలి. ఈ దేహము ఒక పని ముట్టు వంటిది. పని ముట్టు సరియైన స్థితిలో వుండినప్పుడే మనము సంకల్పించుకున్న పనిలో సరియైన రీతిగా ఉపయోగించుకోవచ్చును..... దీనిని వినియోగించుకోవాలంటే సరియైన స్థితిలో పెట్టుకోవాలి. ఈ దేహమును ఏయే కార్యములయందు సద్వినియోగము గావించుకోవాలో విచక్షణాజ్ఞానముతో వినియోగించు కోవాలి. ఏ కార్యము చేయటానికి పూనుకున్నా అక్కడ ఒక ప్రశ్న వేసుకోవాలి.
ఆత్మ స్వరూపుడైన బ్రహ్మను నేను. ఈ కాయములో నివసిస్తున్నాను. కనుక ఆత్మ స్వరూపుడైన నేను బ్రహ్మస్వరూపుడైన నేను ఈ కాయముతో ఈ కర్మలు ఆచరించవచ్చునా ఆచరించకూడదా? అని విచారణ చేసుకోవాలి.
ధర్మాచరణ నిమిత్తమై ఏర్పడినదీ దేహము దైవమందిరముగా నిర్ణయించ బడినదీ దేహము. దీనికి మరొక పేరు క్షేత్రము. “క్షేత్రక్షేత్రజ్ఞయో: జ్ఞానమ్" అనగా క్షేత్రమనే దేహము దీనిని గుర్తించేవాడు క్షేత్రజ్ఞుడు. నీవు క్షేత్రాన్ని గుర్తించే వాడవేకాని గుర్తింపబడేది దేహమే..... పవిత్రమైన స్థితిలో దీనిని ఉంచుకోవాలి. కాశీని క్షేత్రము అంటారు. బదరీని క్షేత్రము అంటారు. తిరుపతిని క్షేత్రము అంటారు. పవిత్ర స్థానము కనుక క్షేత్రమనే సార్ధక నామము. ఆ క్షేత్రములో నిరంతరము పూజలు సత్కర్మలు మంత్రములు దీక్షలు జరుగుతుంటాయి. అదే విధముగా యీదేహమనే క్షేత్రము నుంచి సత్కర్మలు, సదాచారములు, సచ్చింతనలు ఇలాంటి సేవలు చేసుకోవాలి. సత్కర్మల యందు ప్రవేశింపచేయుటమే క్షేత్రము యొక్క అంతరార్థము. క్షేత్రము అంటే పొలము అని రెండవ అర్థము. పొలములో మనము ఎట్టి విత్తనములు నాటుదుమో అట్టి ఫలమే మనకు లభిస్తుంది. సత్సంకల్పములనే విత్తనములు నాటినప్పుడు సత్పలము లభ్యమవుతుంది. దుస్సంకల్పములు అనే విత్తనములు నాటినప్పుడు దుష్ఫలములే లభిస్తుంటాయి.
పాపపుణ్యములనే బీజములు నాటుకొనే ప్రదేశమే యీ దేహమనే క్షేత్రము... ఫలాని ఋతువునందు ఫలాని విత్తనములు నాటాలి అనే పద్ధతి వుంటుండాది. ఏ క్షేత్రమునందు ఏ పంటను పెట్టాలి అనే నియమం ఉంటుండాది. ఎప్పుడు పడితే అప్పుడంతా పొలములో విత్తనములు చల్లటానికి వీలుకాదు. ఒక నిర్ణీత కాలముంటున్నది. కానీ యీ శరీరమనే పొలములోపల నిర్ణీతమైన కాలములేదు. సర్వకాల సర్వావస్థల యందు దీనిని సాగుచేసే అనుకూలమున్నది.
రాత్రింబవలు దీనిని సాగు చేసుకోవచ్చును. పొలములో విత్తనములు నాటినప్పుడు పంటలు పండవచ్చు లేకపోతే ఎండవచ్చును. ఆశించిన ఫలములు మనము పొందలేకపోవచ్చును. కానీ ఈ శరీరమనే క్షేత్రమందు నాటుకున్న సత్సంకల్పములు, దుస్సంకల్పములు అవి ఏమి చేసినా తప్పేది కాదు. ఆ ఫలము తప్పక అనుభవించవలసి వస్తుంది. నూటికి నూరుపాళ్ళు పంట పండుతుంది. ఏ మాత్రము తక్కువ కాదు.
ఇది చేతు అది చేతు యింకెన్నియో చేతు
ననుచు ఊహలు ఆల్లి అలసి పోకు
ఏ విత్తులను నాటి యిచ్చోటనుంటిరో
ఆఫలములే మీకు అందుచుండు
విత్తనం బొకటైన వేరైన ఫలములు
సమకూరుటది ఎట్లు సాధ్యమగును?
కనుక యీ దేహమనే పొలమందు యేవిత్తనములునాటుతున్నామోఅదే పంట మనము అనుభవించ వలసి వస్తుంది. పంట మన సంకల్పముల పైన ఆధారపడి ఉంటున్నది. మనకర్మల పైన ఆధారపడి వుంటున్నది ..... దేహమును ఏ విధముగా వినియోగించుకోవాలి అనే విచారణ అత్యవసరము. సద్వినియోగము గావించాలని ఆశించేవారు. సద్భావములు అభివృద్ధి గావించుకోవాలని ఆశించేవారు సత్పలములు పొందాలని ఆశించేవారు, రెండు విధములైన మార్గములను తూ.చ తప్పకుండా అనుసరించాలి. ఆహార విహారములు సరియైన మార్గములో అనుభవించాలి...
(బృత్ర, పు. 12-16)
ఈ దేహము అనిత్యము అశాశ్వతము అయినప్పటికిని నిత్యసత్యాన్ని గుర్తించేవరకు యీ దేహమును అధారముగా తీసుకోవాలి. అనేకమంది దేహపోషణలో లక్ష్యము చేస్తున్నారు. కనుకనే అనేక రోగములకు గురౌతున్నారు. దివ్యమైన ఆనందమును అందుకోలేక పోతున్నారు. "ధర్మార్థకామమోక్షాణాం ఆరోగ్యం మూలముత్తమం”. చతుర్విధ పురుషార్ధములైన ధర్మార్థకామమోక్షములను ఆశించవలెనన్నను అనుభవించవలెనన్నను ఈ దేహమునకు ఆరోగ్యము అవసరము. దీనికి ఏ విధమైన మార్గాన్ని అనుసరించాలి? సరైన విచారణచేత ప్రవర్తనలో మార్పులు తెప్పించుకోవాలి. ఆహారములో కలిగే ఆనారోగ్యముకంటే మానసిక సంబంధమైన అనారోగ్యమే యీనాడు అభివృద్ధి అవుతుండాది. మానవుడు నిరంతము యోచించటము చేస్తున్నాడు. ఈ యోచనకు రూపము ఏమిటి? ఈ విచారమునకు రూపము ఏమిటి? What is the shape of worry? it is only mentally created fear. మానసిక సంబంధమైన ఆలోచనల చేతనే అనారోగ్యమునకు గురౌతున్నాము. మనము ఏ మాత్రము ఆలోచన చేయకూడదు. ఈ ఆలోచన ఒక్కొక్క సమయములో హద్దు మీరి పోతుంటాది. ఇది హద్దు మీరి పోయినప్పుడు అస్తవ్యముగా మారిపోతుంది. తద్వార మానసిక వ్యాధులు సంభవిస్తాయి. అనేకమందికి మతి భ్రమణము కలగటానికి కారణం ఇదియే. ఎంత వరకో అంతవరకు చింతించాలి.
మితిమీరిన చింతన చేయపడదు. గడిచిపోయిన దానిని, రాబోయే దానిని అన వసరముగా చింతించి అనారోగ్యమునకు గురి అవుతున్నాము. ఈ నాటి యువకులు ఈ విధమైన వ్యాధులకే గురి అయిపోతున్నారు. ఒకొక్క యూనివర్శిటీలో ఫలపరీక్ష చేసి చూచినప్పుడు 80%, 90% మానసిక సంబంధమైన భ్రాంతులచేతనే ఆనారోగ్యము పొందుతున్నట్లు తేలింది. పవిత్రమైన ఈ వయస్సునందు ఏ మాత్రం అనారోగ్యమునకు గురికాకూడదు. సాధ్యమైనంతవరకు మానసిక సంబంధమైన విచారణలు తగ్గించుకోవటానికి చూచుకోవాలి. అధికముగా చదవటముగాని, అధికముగా ఆడటముగాని, అధికముగా పాడటం గాని అధికముగా నిద్రించటముగాని శరీరమునకు హాని కలిగిస్తుంది..
(బృత్రపు. 33/5)
మలమూత్ర దుర్గంధ మాంసరక్తములతో కూడిన యీ దేహమునందే దివ్యభవ్యవవ్యమైన ఆత్మ తత్వము రాణిస్తూ వుంటున్నది. ఇది దేహ బలహీనము చేత తరగదు, దేహ బలము చేత పెరగదు. పెరిగి తరగని తత్వమే ఆత్మతత్వము. ఇది నిరంతరము పవిత్రమైనది, విలువైనది, బలమైనది. ఎట్టి పరిస్థితుల యందు దీని విలువ యేమాత్రము తగ్గదు.
పెద్ద వజ్రమొకటి పెంటలో దొరికిన
విలువ మారబోదు వెలుగు పోదు
మంచి గుమ్మడి పండు కంచెలో వేసిన
రుచియు పోదు రూపు పోదు
గొప్ప నెమలి గ్రుడ్డు కోడితా పొడిగిన
పన్నె పోదు దాని చిన్నె పోదు.
దేహము అనేక మాలిన్యములతో కూడినదైనప్పటికిని యిందులో నిశ్చలము, నిర్మలము, నిస్వార్థమైన ఆత్మ తత్వము నిరంతరము ప్రకాశిస్తూనే వుంటుంది. అన్ని మతములవారు యీ దేహములో వుండిన పుష్టిని, సంతుష్టిని కోరటంలో అర్థము ఏమిటి? “దేహో దేవాలయ ప్రోక్తో" దేహమనేది భగవంతుని దేవాలయము అనే విశ్వాసమే దీనికి మూలకారణము. కనుక ఈ పవిత్ర దేహమును అలక్షము చేయక, అశ్రద్ధ పూనక, తగిన శ్రద్ధతో దీనిని సరియైన మార్గములో ప్రవేశపెట్టి కర్తవ్యకర్మలు ఆచరించటము మానవుని ప్రధానధర్మము. ఇట్టి సత్యమును గుర్తించలేని వ్యక్తులు ప్రతములని, నోములని, ఉపవాసములని దేహమును కృశింప చేసుకొంటున్నారు. తద్వారా నిత్యసత్యమైన ఆత్మతత్వము గుర్తించలేము.
(బ్బత్ర.పు. ఏ2/30)
"దేవుడనగ వేరు దేశమందున లేడు
దేవుడనగ తనదు దేహమందె
పాపమనగ వేరు పరదేశమున లేదు
తాను చేయు పనుల తగిలి యుండు"
(స.పా.డి. 96 పు 326)
ఈ దేహము భగవంతుని నివాసమని విశ్వసించాలి "దేహోదేవాలయ ప్రోక్తో జీవోదేవస్సనాతనః "ఈ దేహము నూతన మైన మందిరము ఇందులో సనాతనుడైన భగవంతుడు నివసిస్తున్నాడు. ఈ దేహము ఎలాంటిది? పవిత్రమైనది కాదు. అయితే దేహం లోపల ఉన్నంత వరకు ఇది పవిత్రమే కాని దేహి ఈ దేహాన్ని వదలి పోతే?
"మలినపు కొంప రోగముల మగెడు సేవక గంప జాత సం
చలనము పొందుదుంప భగసాగర మీదగ లేని కంప అం
బుల పాది లెమ్ము చూడమన మెప్పుదలంపగ దేహమింకని
శ్చలమని నమ్మ బోకు మనసా హరిపాదము లాశ్రయింపవే" ,
కనుక హరి పాదముల నాశ్రయించండి. అది సుఖము, ఇది దఃఖము వీడు శత్రువు. వాడు మిత్రుడు అనే భేద భావాలకు అవకాశమివ్వకండి మిమ్మల్ని ఎవరైనా దూషిస్తే ఆరూపములో భగవంతుడు నన్న విధంగా దూషిస్తున్నాడని అనుకోండి. అరూపము, మీరూపము రెండూ అస్థిరములే ఆ రూపములో నున్నదీ మీ రూపములో నున్నదీ రెండూ స్థిరములే ఇట్టి ఆత్మ భావాన్ని పెంచుకోండి. అదే మీరు చేయవలసిన తపస్సు. అప్పుడే మీకు శాంతి చేకూరుతుంది. దేహాన్ని చక్కగా పోషించుకోండి, దేహశక్తిని దైవానికి అంకితం చేయండి.
(స.సా.డి.96 పు. 328)
మానవ జీవితం చాల దుర్లభమైనది, చాల పవిత్రమైనది, సాజన్యమైనది. సౌశీల్యమౌనది. కమక, శరీరమును ఎన్ని శ్రమలకోర్చియైనా కాపాడుకోవడం మీ కర్తవ్యం. ధన, కనక, వస్తు, వాహనాదులకంటే శరీరమే చాల విలువైనది. ఈ శరీరమును సరియైన మార్గంలో ప్రవేశపెట్టి సార్థకం గావించుకోవాలి. గడచిన రాత్రి తిరిగి రాదు; సముద్రంలో పరిపూర్ణంగా లీనమైన గంగ ఎంత పిలిచినా వెనుకకు రాదు: బాగా నమిలి మింగిన ఫలము ఎంత ప్రయత్నించినా తిరిగి రాదు. అదేరీతిగా, గడచిపోయిన జీవితాన్ని ఎంత ప్రయత్నించినా తిరిగి సాధించలేము. Men are more valuable than all the wealth of the world, (ప్రపంచములోని సమస్త సంపదల కంటే మానవుడే అత్యంత విలువైనవాడు). ధనానికి, డైమండ్స్ కి, బంగారానికి భూమికి ఎవరు విలువనిస్తున్నారు? మానవుడే కదా! అప్పటికీ తాను విలువ చేస్తున్నాడుగాని, తన విలువను తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
విలువ లేని ఇనుప పెట్టె ఈ దేహము
పెట్టెలోన నగలు పెట్టినట్లు
దేహమందు ఆత్మదేవుడుండెను సుమా!
సత్యమైనట్టి మాట ఈ సాయిమాట.
ఈ దేహమునందు విలువైన గుణములను దాచుకొని యున్నాము. దయ, ప్రేమ, సహనము, సానుభూతి, త్యాగము ఇత్యాది మానవతా గుణములు ఉండటంచేతనే మానవత్వానికి గొప్ప విలువ ఏర్పడింది. కానీ, ఈ నాటి మానవుడు ఈ మానవతా విలువలంటే ఏమిటో అర్థం చేసుకోలేకపోతున్నాడు. కాలమనే గడియారమునందు సంవత్సరములనే గంటల ముల్లు, నెలలనే నిమిషముల ముల్లు, దినములనే సెకన్ల ముల్లు తిరుగుతూనే ఉన్నది. ఏ క్షణంలో ఇది "ఘన్, ఘన్ మని గంటలు కొడుతుందో, ఎప్పుడీ దేహమును వీడవలసి వస్తుందో ఎవ్వరూ గుర్తించుకోలేరు. కనుక, దేహాన్ని సరియైన మార్గంలో వినియోగించుకోవాలి. జీవిత ప్రయాణమునకు దేహమే ప్రధానమైన పనిముట్టు. దీనిని సక్రమంగా ఉపయోగించ కున్న. మార్గమధ్యంలో అనేక అవస్థలకు గురి కావలసి వస్తుంది.
ఈనాటి మానవుడు మానవతా గుణములంటే ఏమిటో, దివ్యత్వమంటే ఏమిటో విచారణ చేయకుండా విలువైన తన శరీరాన్ని స్వార్థ స్వప్రయోజనాలకై దుర్వినియోగ పర్చుకున్నాడు. భగవంతుడు మీకు శరీరాన్ని అందించినది మీ స్వార్థ, స్వప్రయోజన నిమిత్తం కాదు. "పరోపకారార్థ మిదం శరీరం", కాబట్టి, మిమ్మల్ని మీరు రక్షించుకోవడం తో పాటు తోటి మానవులను కూడా రక్షించడానికి కంకణం కట్టుకోవాలి. పరోపకార నిమిత్తం ప్రాకులాడినప్పుడే మీ స్వార్థం కూడా నెరవేరుతుంది. వ్యాసుడు పద్దెనిమిది పురాణాల సారాన్ని రెండు వాక్యాలలో ఇమిడ్చాడు - "పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం." కాని, ఈనాటి మానవుడు స్వార్థం చేతిలో కీలుబొమ్మగా జీవిస్తున్నాడు. స్వార్థం చేతిలో కీలుబొమ్మగా ఉన్న మానవుడు స్వతంత్రు డెట్లవుతాడు? స్వార్థాన్ని త్యజించాలి. ప రా ర్థాన్ని వరించాలి. అప్పుడే శరీరం సార్థకమవుతుంది.
(స. సా.. జూలై 2000 పు.206/207)
"దహ్యతే ఇతి దేహః” దహింపబడేది దేహము. మరణించిన తరువాత దహింపబడేది. ఇట్టి దేహతత్వమును మనము నిత్యజీవితంలో అనుభవించే నిత్యకర్మలందు చక్కగా గుర్తించవచ్చు. దేహమనగా ఆకారముని మీరు భావించవచ్చు. కేవలం ఆకారము మాత్రమే కాదు ఇది
మలినపుకొంప రోగమున మ్రగ్గెడు సేవక గంప జాతసం
చలనము పొందు దుంప భవసాగరమీదగ లేని కంప
అంబుల పాది లెమ్ముచూడ మన మెప్పు దలంపగ దేహమింక ని
శ్చలమని నమ్మబోకు మనసా! హరిపాదము లాశ్రయింపవే!
ఈ దేహమునకు మరొకపేరు కూడా ఉన్నది; శరీరము. జీర్ణింపబడేది శరీరము.
(ద.య.స. పు.1/2)
భగవంతుని నివాసము ఈ దేహము. ఇలాంటి పవిత్రమైన దేహమును ఈనాడు అపవిత్రమైన, విచిత్రమైన మార్గములందు ప్రవేశ పెట్టి, తాత్కాలికమైన సుఖములు అనుభవింపగోరి అనిత్యము, ఆశాశ్వతము, అసత్యమైన జీవితాన్ని గడుపుతున్నారు మానవులు.
విలువ లేని ఇనుప పెట్టె ఈ దేహంబు
పెట్టెలోన నగలు పెట్టినట్లు
దేహమందు ఆత్మదేవుడుండెను సుమీ!
సత్యమైన బాట పాయిమాట.
ఏవిధంగానైతే విలువలేని ఇనుప పెట్టెయందు విలువైన రత్నమును దాచుకుందురో అదే విధముగా ఈ విలువలేని దేహమందు విలువైన. ప్రకాశవంతమైన ఆత్మ అనే రత్నమును దాచుకున్నారు. ఈ ఆత్మ అనే రత్నము నిమిత్తమై దేహాన్ని మనం ఆశించి, ఆరాధించి దాన్ని సరైన మార్గములో వినియోగించుకోవాలి. రత్నములు మట్టిలోనే చిక్కునుగాని మ్రానులో చిక్కవు. రత్నములు కావలెనన్న మట్టిలో వెతకాలిగాని మ్రానులో వెతికితే రావు. కనుక ఈ మృణ్మయమైన దేహమునందే ఆత్మ అనే రత్నమును వెతకాలి.
(ద.స.98.పు. 4)
"ద" అను పదమునందే "దేహ"ము పుట్టినది. “ద " అనగా దహింపబడునదని అర్థము. సామాన్యముగా మరణాంతరము దహింప బడుచున్నది. కానీ, జ్ఞానియందు కారణ సూక్ష్మ శరీరములు మూడు విధములందు హృదయ కష్టము నందు దహింపబడును. అనగా ఆధ్యాత్మికము ఆధిదైవికము, ఆదిభౌతికము, అనెడి మూడు హృదయ కాష్టములు. ఇవి సూక్ష్మ కారణ శరీరములను అగ్నికన్న త్వరలో నశింపజేయగలవు. తలంపు ఎట్టుండునో మనిషి అట్లె మారును. దేహధ్యాస కలవారు పామరులుగనే యుందురు.
(ఉ. వా. పు. 87)
ఈ దేహము తనంత తనైన ఒక ప్రత్యేకమైన ప్రపంచము. దేహమనగా కేవలము ఒక ఆకారము మాత్రమే కాదు. అనేక అంగములతో కూడిన సమిష్టి స్వరూపము. ఏ ఆంగమునకు ఆ ఆంగము లావణ్యమైనది. అన్ని ఆంగముల సౌందర్యమును మనము కాపాడుకోవలసిన కర్తవ్యము. అనారోగ్యమునకు గురియైన, బలహీనలకు - గురియైన దేహము ధృఢమైన సంకల్పమును చేయలేదు. పవిత్రమైన, దివ్యమైన, భవ్యమైన భావములు మానవుని నుండి ఆవిర్భవించవలెనన్న శరీరము దృఢమైనదిగను, ఆరోగ్యమైనదిగను ఉండాలి. అన్ని మతములవారు దేహము యొక్క పోషణను అంగీకరించినవారే. ఇది అనిత్యము అశాశ్వతము అయినప్పటికిని సత్యనిత్యమైన దివ్యత్వము యిందునివాసముగా ఉండటం చేత ఈ దేహము పైన ప్రత్యేకమైన శ్రద్ధను చూపాలి. (బృత్ర.పు. 27)