"నా కొడుకు దేవాలయముల కట్టించుట నా కంగీకారము గాదు. ఇప్పుడుండు దేవాలయములనే జీర్ణోద్ధరణము గావించి, పూజాపునస్కారములతో వృద్ధి చేయవలెను మందిరములను కట్టించ వలయునని చందాల కొఱకు ప్రజలను పీడించుచుండుట మంచి పద్ధతి కాదు. ఇందువలన అసూయ ద్వేషములును, ఆశయును, గురువునకు నపకీర్తియు కలుగును. కావున భక్తులు జాగ్రత్తగా నడుచుకొనుట మంచిది. "జపధ్యానములకు ప్రత్యేక మందిరము లెందుకు? తమ తమ గృహములలోనే నొక గదిని పూజా గృహముగ నేర్పాటు జేసికొని, యందే హాయిగా బిడ్డలు మొదలగు కుటుంబీకులందలు కలసి ప్రార్థన, భజనలను చేసికొనవచ్చునుగదా? ప్రియమైన మాటల లోను, వినయ విధేయతలతోను. ప్రేమలోను, అచంచల విశ్వాసముతోను, సత్య సంధతతోను భక్తులు ప్రవర్తించుచుండిన నితరులు వీరిని చూచి నేర్చుకొనగలరు. వృద్ధికి రాగలరు. అంతియేగాని, కేవలము మాటలవలన లాభము తనకుగాని, యితరులకుగాని కలుగదని గ్రహింపవలెను.
(స.శి.సు.ద్వి.పు.186/187)
దేహానికి హృదయమెట్టిదో, గ్రామానికి లేక జన సమూహానికి దేవాలయం అట్టిది. దేవాలయాలు కట్టడం వాటిలో విగ్రహాలను ప్రతిష్టించడం, అక్కడి ఆరాధనకు సంబంధించిన అనేక ఉత్సవాలు చేయడం... మొదలైనవన్నీ సత్కర్మలు. అవి సేవలో శిక్షణ నిస్తాయి. త్యాగానికి, అనాసక్తికి అవకాశాలను కలిగిస్తాయి. అది ఒక విధమైన తపస్సు!
ఆత్మజ్ఞానమార్గం సంపూర్ణానందానికి మార్గమని ఉపదేశం ద్వారాను, ఆచరణ ద్వారానుమీరు నిరూపించాలి. కనుక మీపైన గొప్ప బాధ్యత ఉంది. మీరు చేస్తున్న సాధన మిమ్మల్ని మునుపటికంటె మంచిగా, సంతోషంగా, ఎక్కువ ఉపయోగకరమైన వ్యక్తిగా చేసిందని - మీ నిశ్చలం, శాంతం, నమ్రత, పవిత్రత,సౌశీల్యం , ధైర్యం, ఎట్టి పరిస్థితులలోనయినా చెక్కుచెదరని నమ్మకం ద్వారా నిరూపించవలసిన బాధ్యత ఉంది. ఆచరించి నిరూపించండి. అంతేకాని, కేవలం మాటలతో నొక్కి చెప్పి చేతలతో కాదనకండి.
(లో.పు.231)||
ఇది మానవులందరు అద్భుతమైన ప్రశాంతిని పొందే ఒక దేవాలయం. ఒక చర్చి, ఒక మసీదు, ఒక యూదుల ప్రార్థనా మందిరం. మానవ రూపంలో అవతరించిన భగవంతుని అపారమైన ప్రేమలో లీనమైఅత్యున్నత మైన ప్రశాంతిని ఇక్కడ అందరూ పొందవచ్చు. ప్రతి మానవుని హృదయం ప్రశాంతి నిలయంగా మార్చటమే నాలక్ష్యం. ఈ లక్ష్యం నెరవేర్చటం కోసమే నా ఈ అవతారం వచ్చింది.
(ఆ.పు.27)
(చూ॥అనాహతము. అయస్కాంత శక్తి, ఒక్కటే, గుడిగోపురాలు, దేవుడు, నిరాకారం, నీవే)