భగవదన్వేషణలో తొలి విజయం సాధించినట్టిది భారత దేశము. ఇట్టినైతిక ధార్మిక, ఆధ్యాత్మికముల యందు పవిత్రమైన ముందంజవేసి, దిగ్విజయము సాధించి, ఆదర్శమునందించి నట్టిది భారతదేశము. కనుకనే త్రిమూర్తి స్వరూపమైన దివ్యత్వమును గుర్తింపచేసే నిమిత్తమై త్రిరాత్రులు, నవరాత్రి, శివరాత్రి, సంక్రాంతి. అనే ఈ మూడు రాత్రులమ పవిత్రమైన పర్వదినములుగా చాలాకాలము నుండి ఆచరిస్తూ వచ్చారు భారతీయులు. కనుక పర్వదినములుగా ఏదో ఒక విధమైన ఆహార ఆనందములలో అనుభవించేవి కావనే సత్యాన్ని గుర్తించి, ఆరాధన నిమిత్తమై, ఆత్మాన్వేషణ నిమిత్తమై ఏర్పడినట్లు వంటివిగా సత్యస్వరూపములుగ గుర్తించుట అత్యవసరము.
ప్రేమతత్వమును విశాలపరుచుకొని సర్వత్రావ్యాపింప చేసేటువంటి సమత్వమును అనుభవింపచేయు మహాపర్వదినములుగా ఈ పర్వదినములను భావించి, మనలోని దుర్గుణములకు, దురహంకారములను, దుర్భావములను దుష్టుచేష్టలను, దూరము కావించుకొని, సద్భావములను సచ్చింతలను, సత్కర్మలు ఆచరించు టకు ఈదేహమును సమాజమునకు అంకితము కావించవలెనని ఈనాడు దృఢసంకల్పమునకు మనము పూనుకోవాలి.
(సా.ముందుమాట)