ఉపనిషత్ అంటే ఏమిటి అర్థం? ఉప అంటే సమీపంగా, వి అంటే క్రింద, షత్ అంటే కూర్చో. ఆదియే ఉపనిషత్సారము. అనేకమంది ఉపవాసం చేస్తున్నామంటారు. ఉపవాసమంటే తిండి మాని ఫలములు తినడమా? కాదు, కాదు. భగవంతునికి దగ్గరగా ఉండడమే ఉపవాసము. భగవంతునికి దగ్గరగా ఉన్నప్పుడే దైవత్వం మీలో ప్రవేశిస్తుంది. ఎయిర్ కండిషన్డ్ గదిలో కూర్చుంటే ఏమౌతుంది? వేడి దూరమై చల్లదనం వస్తుంది. అదేరీతిగా, దైవానికి సమీపంగా పోవటంవలన మీ ప్రాకృతమైన దుఃఖములు మాయమై పోతాయి? భగవత్ప్రేమచేత చల్లగా హాయిగా శాంతిని పొందగల్గుతారు. కనుక, భగవంతునికి సమీపంగా వెళ్ళాలి. అదియే ఉపవాసము. ఐతే, “నియర్నెస్ తోపాటు డియర్నెస్కూడా ఉండాలి. బొగ్గు ఒక చోట, అగ్ని మరొక చోట ఉంటే అగ్ని బొగ్గులో చేరుతుందా? చేరదు. అగ్ని బొగ్గులో ప్రవేశించాలంటే రెండింటినీ ఒకదానికొకటి సమీపంగా చేర్చాలి. ఇదే "నియర్ నెస్ సమీపంగా చేరటంవల్ల బొగ్గు అగ్నికి ఎంత తగిలిందో అంత మాత్రమే అది అగ్నిగా మారుతుంది. కానీ, పైన ఫ్యాను విసిరితే బొగ్గు పూర్తి అగ్నిగా మారిపోతుంది. అదేవిధంగా, భగవంతునికి మీరు నియర్ గాను, డియర్ గాను ఉన్నప్పుడు మీరు కూడా దైవంగా మారిపోతారు. దీనిని పురస్కరించుకొనియే "బ్రహ్మత్ బ్రహ్మైవ భవతి" అన్నారు. మీకు, దేవునికి భేదం లేదు. మీరు అంశము కాదు, ప్రత్యేకమైనవారు కాదు. మీరే దైవం.YOU ARE GOD.ఇట్టి ఆనందమును మనం పొందే నిమిత్తమై మీరు ఏ సాధనలు చేయనక్కర్లేదు గాని అందరిని ప్రేమించాలి. ప్రేమకు ఎట్టి నష్టమూ లేదు, ఎట్టి కష్టమూ లేదు. ప్రేమ పెరిగే కొద్దీ మీ ఆనందం కూడా పెరిగిపోతుంది. మీరు భగవంతుణ్ణి ఎంత అధికంగా ప్రేమిస్తారో మీరు అంత అధికంగా ఆనందాన్ని పొందుతారు. భగవంతుణ్ణి ఎంత తక్కువగా ప్రేమిస్తారో మీ ఆనందం కూడా అంత తగ్గిపోతుంది.. కనుక, ఎక్కువ ఆనందముపొందాలనుకుంటే ప్రేమించాలి. అధికంగా ప్రేమించాలి. ప్రేమచేతనే మీ జీవితం ధన్యమవుతుంది.
(సా.శు.పు.85/86)
ప్రేమస్వరూపులారా! మంచినే చూడండి, మంచినే - వినండి, మంచినే మాట్లాడండి, మంచినే తలచండి, మంచినే చేయండి. ఇదే దైవత్వానికి సులభమైన మార్గం. ఇలాంటి సులభమైన మార్గమును వదలి పెట్టి ఏదో జపము, ధ్యానము, యోగమువంటి కసరత్తులు చేయుట ఎందుకు? మోసెస్ అనేవాడు నిరంతరము దైవాన్ని స్మరించేవాడు. క్రమక్రమేణా అతని ముఖంలో దైవ తేజస్సు ఉట్టిపడింది. అదేవిధంగా, దారులు కొట్టే దొంగ రత్నాకరుడు మహర్షుల ప్రబోధలననుసరించి నిరంతరం రామనామ స్మరణ చేయటంవల్ల కొంత కాలానికి అతని ముఖంలో రామ తేజస్సు ఉట్టిపడింది. రాముడు లోకదాత అయితే అతడు - శ్లోకదాత అయినాడు. లోకదాతకు, శ్లోకదాతకు ఎట్టి భేదమూ లేకుండాపోయింది. “బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి”, ఏ రూపాన్ని చింతించాడో ఆ రూపాన్ని - పొందాడు. కనుక, మీరు మంచినే చింతించాలి, మంచినే మాట్లాడాలి. మంచి మాటలే వినాలి. మంచి పనులేచేయాలి. అప్పుడే మీరు మంచివారవుతారు. మంచివాడే - మానవుడు. దుర్మార్గుడు మానవుడు కానేరడు. (శ్రీ వాణి ఏ ప్రియల్ 2022 పు 5-6)